Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 6

 

    "నాన్నగారు ఆదివారం మిమ్మల్ని రమ్మనమని మరీ మరీ చెప్పమన్నారు...." అంటూ ఉష ప్రభాకర్ కు కాస్త దూరం లో బెంచీ శుభ్రం చేసుకుని కూర్చున్నది.
    "ఎందుకు?"
    "అయ్యో రాతా! మర్చిపోయారా? నాన్నగారి చెయ్యి చూడ్డానికి...."
    'అయన చేతికేం వచ్చింది? కొంపతీసి పడి పోలేదు కదా?" అన్నాడు ప్రభాకర్ ఆశ్చర్యపోతూ.
    :అయన  చెయ్యి విరగనూ లేదు. మీరు వైద్యం చెయ్యనూ అక్కర్లేదు.... మీరేం బెంగపెట్టుకోకండి-- అది చూసి మీరు ముందు జరగబోయేవన్నీ చెప్పాలి."
    "నాకు చేతులు చూడ్డం రాదు. మొహాలు చూడ్డం మటుకే వచ్చు. అది మీ నాన్నగారి మొహం మటుకు కాదు--"
    ఉష నవ్వింది.
    "పోనీయండి కాని ఆదివారం మాత్రం మీరు రాక తప్పదు. అయన మీకోసం పలవరిస్తున్నారనుకొండి! మీరు పెద్ద సాముద్రికు లైపోయారు అయన దృష్టిలో !...."
    "ఆడవాళ్ళు అబద్దం అడిగితె గోడ కట్టినట్టు ఉంటుందని ఇందుకే అన్నారు ....! నాకు సాముద్రికం వచ్చని ఎంత పచ్చి అబద్దం ఆడారు?"
    ఉష నవ్వుతూ ఉంటె చేపుకున్న రింగుల తళుక్కు తళుక్కుమంటూ వూగులాడాయి.
    "కాకపొతే మీరు ఉషారాణి అంటూ ఖుషీగా పిలిస్తే నాన్నగారు మిమ్మల్ని ఖూనీ చేయకుండా వూరుకుంటారనుకున్నావా?"
    ప్రభాకర్ హడలుకున్నాడు.
    "మైగాడ్! ఖూనీ? మీ నాన్నగారు కత్తులు కూడా వెంట పెట్టుకుని తిరుగుతారా?"
    "ఖూనీ అంటే ఖూనీ కాదు లెండి. మిమ్మల్ని అమాంతం మింగి పారేసేవారు....మా నాన్నగారి కంత కోపం!"
    "అందుకే అయన ఎదుట పడాలంటే నాకు అదురు!"
    "ఇంకా అదురెందుకు? ఇప్పుడాయన మిమ్మల్ని కలుసుకోవాలని ఆదుర్దాగా ఉంటె....ఇంతకీ ఆదివారం నాడు మీరు వస్తారా, రారా?"
    "రాను!'అని ఖండితంగా చెప్పాడు ప్రభాకర్.
    "రానంటే వదిలి పెడతాననుకోకండి!" అని ఉష బుంగ మూతి పెడుతూ.
    "సాముద్రికం చూస్తానని ఎందుకు చెప్పారు? జాతకం చూస్తానని చెప్పక పోయారు? అయన చక్రం తీసుకొచ్చి పడేస్తే ఏ జ్యోతిష్కుడికో పదో, పరకో ఇచ్చి జాతకం రాయించుకొచ్చేవాడిని. చెయ్యి చూడ్డం అంటే అలా ఎలా వీలవుతుంది? మీ నాన్నగారి చెయ్యి పట్టుకుని నాడి ఎలా ఉన్నదో చూడమంటే చూస్తాను కాని జోస్యం చెప్పమంటే నా తరం కాదు నన్నెందుకు తిప్పలు పెడతారు?"
    ప్రభాకర్ తల పట్టుకోవటం చూసి ఉష బాధపడింది.
    "నాన్నగారికి జాతకం గురించి కొంచెం  తెలుసు. మీకు వచ్చంటే లక్ష ప్రశ్నలతో మిమ్మల్ని ముంచెత్తుతారు.... సాముద్రీకం నాన్నగారికి బొత్తిగా తెలియదు. మీరు సులభంగా ఒప్పించుకోవాలని ఈ ఎత్తు వేస్తె తిప్పలంటారేం?"
    "మరి ఆదివారం మీ ఇంటి కొచ్చి మీ నాన్నగారి చేతిని ఒక మాటు ముట్టుకుని చూడమంటారా?"
    "వూరికే ముట్టుకుని మీ దారిని మీరు పోవాలనుకుంటే మాత్రం అయన వూరుకోరు. మీకో మొట్టికాయిచ్చి కూర్చో పెడతారు ఫలితం చెప్పేదాకా --"
    ప్రభాకర్ ఉష పాదాల మీద పడినంత పని చేశాడు.
    "శరణు! శరణు! నిన్న మీ నాన్నగారు మింగెయ్యకుండా ప్రాణాలు రక్షించారు. ఆదివారం నాడు మొట్టికాయ పెట్టకుండా ఏ ఉపాయమన్నా అలోచిద్దురూ?"
    "తిన్నగా లైబ్రరీ కెళ్ళి షీరో పుస్తకం తీసుకుని ఈ కొస నుంచి ఆ కొస వరకు బట్టి పట్టండి!"
    "బట్టీ?" అని తల పట్టుకున్నాడు ప్రభాకర్.
    "మరి అదే మార్గం. ఈరోజు సోమవారం ఆదివారం వరకు షీరో పుస్తకాన్ని వదలకండి...."
    ప్రభాకర్ మాట్లాడకుండా ఉష కేసి చూస్తూ కూర్చున్నాడు. ప్రభాకర్ కళ్ళు హటాత్తుగా ఉష జాకెట్టు మీద వ్రాలాయి. ఆకుపచ్చ, ఎరుపు రంగుల కలయిగా తమాషాగా అనిపించింది.
    "మీరు వేసుకున్నది టెక్నికలర్ బ్లౌజా?" అంటూ ప్రభాకర్ ముందుకు వంగాడు.
    "మీరు మరీనండి! గుడ్డ కత్తిరించేటప్పుడు మర్చిపోయి మెడ వెనకా, ముందు ఒకేలా కత్తిరించేశాను....."
    "అయితే ఏం....?"
    "ముందు మెడ పెద్దదిగా, వెనక మెడ చిన్నదిగా కత్తిరించుకో వద్దటండీ?"
    "అలాగే ఉంచుకోలేక పోయారు? ముందూ వెనకా లేకపోతె మరీ మంచిది. ఎటు కావాలంటే ఆటే తొడుక్కోవచ్చు--"
    ఉష కిలకిలా నవ్వింది.
    "మీసలహ మీదగ్గరే ఉంచుకోండి...! మెడ పాడై పోయిందని చాలా కంగారు పడ్డాను... ఇంట్లో ఎర్ర గుడ్డ ఒకటి ఉంటె దాన్ని అతుకేసి మిస్సమ్మ మెడ తయారుచేశాను. అక్కయ్య అందరికీ చాలా నచ్చింది కూడా...."
    "లేండి  లేడీ ఫేషను!"
    "షీరో సంగతి మర్చిపోకండి.... అమ్మ చూస్తూ ఉంటుంది..." అంటూ ఉష లేచింది.
    ఉష వెళ్ళేసరికి జానకమ్మ నిజంగానే ఉష రాకకోసం ఎదురు తెన్నులు చూస్తూ నించున్నది.
    "ఎక్కడి కెళ్ళావే ? నీకోసం గంట సేపై చూస్తున్నాను." అన్నది జానకమ్మ.
    "ఇక్కడికే లేవే.... మా స్నేహితురాలు కనిపించి రమ్మంటే అలా పార్కులో కాస్సేపు కూర్చుని వచ్చాను....' అంటూ ఉష శకుంతల తల్లితో చెప్పేసి జానికమ్మ తో పాటు బస్సు స్టాపుకు బయల్దేరింది.
    సుధాకర్ మనస్సు బాగుండక మోహన్ గదికి వచ్చాడు. దిగులుగా కనబడుతున్న సుధాకర్ భుజం తడుతూ "ఎందుకురా అంత దిగులు?' అని మోహన్ పరామర్శించాడు.
    ఫర్నిచర్ లేని చిన్న గది-- అదే మోహన్ కు దేవేంద్ర భవనం. రెండు పూటల హోటల్ కెళ్ళి భోం చేసి వస్తాడు. రాత్రి నిద్ర పోయేలోగా వూళ్ళో ఎన్ని స్టూడియోలున్నాయో వాటన్నిటి చుట్టూ తిరిగొస్తాడు. సినిమాల్లో చేరాలని మోహన్ ఉబలాటం. తల్లి తండ్రులకి మాత్రం అది నచ్చలేదు. అందుకని తప్పనిసరిగా మోహన్ ఇంట్లో నుంచి కొంత డబ్బు పట్టుకుని రెండో  కంటికి తెలియకుండా మెడ్రాస్ చేరుకోవలసి వచ్చింది....
    ఒకనాటి తన క్లాస్ మేటు అంత దిగులుగా ఉండటం చూసి మోహన్ మనస్సు అదోలా అయి పోయింది. సుధాకర్ విచారం పోగొట్టటానికి ఎన్ని కష్టాలైనా పడాలని నిశ్చయించుకున్నాడు.
    మోహన్ పరామర్శ తో సుధాకర్ మరీ క్రుంగి పోయాడు.
    "దిగులు కాకపొతే మరేమిటి? ఆవిడ మాట్లాడటం మానేసింది...."
    "ఎవర్రా ఆవిడ?"
    'అదే .....క....ళ....!
    "కళ కోసమా ఈ కంగారు? ఏ మూగ నోమై నా పట్టిందేమో! లేకపోతె హటాత్తుగా మాట లెందుకు మానేస్తుంది?"
    "ఏడ్చినట్టే ఉంది నీ తెలివి! నోమూ గట్రా  అయితే ఇంట్లో హడావిడి లేకుండా ఉంటుందా?'
    "మరెందుకనంటావ్?"
    "అదే నాకు తెలియటం లేదు!" అన్నాడు సుధాకర్.
    మోహన్ కాస్సేపు మౌనంగా వుండి "నువ్వు ఇంకో అమ్మాయితో పరాచికాలేమైనా ఆదావా? బహుశా అది ఆవిడ కంటబడి ఉంటుంది-" అన్నాడు.
    'అలాంటిదేమీ లేదు... కానీ ఈ మధ్య గీత సరదా పడుతుంటే నా ట్రాన్సి స్టర్ వాడుకోమని ఇచ్చాను....అంతే!"
    మోహన్ సుధాకర్ భుజాల మీద గట్టిగా చరుస్తూ "ఓరినీ! ప్రణయ కలహామట్రా? ఇంకా ఏమిటో అనుకున్నాను? వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుక్కున్నావంటే మీ కలహం ఇట్టే గాలి కేగిరి పోతుంది...."
    "ప్రణయ కలహమా? ప్రళయ కలహంలా ఉంటేను? ఆవిడా అసలు నా కంట పడటమే మానేసింది. ఇంక నేను ఆవిడ కాళ్ళెం పట్టుకోను?"
    "పోనీ, ఇంకో పని చేస్తేనో? ముందు గీతను ట్రాన్సి స్టర్ అడిగి పుచ్చుకో! ఆ తర్వాత ఆవిడకే సంగతంతా బోధపడుతుంది. నిన్ను ఆనవసరంగా బాధపెట్టి నందుకు క్షమార్పణ కోరుకుంటుంది చూడు!"
    "గీతనేలా అడగ మంటున్నావ్? ఆవిడ్ని అడిగినా ఇచ్చేలా లేదు. అదీగాక నా సంగతి పసి కట్టిందంటే అసలే ఇవ్వదు-- అందులో వాళ్ళిద్దరికి ఒక్క క్షణం పడదు కూడా!"
    మోహన్ నవ్వాడు.
    " నీది నువ్వడిగి తీసుకోవడానికి కూడా హదలలేనా? భేష్! గట్టి పిల్లలానే ఉన్నది!"
    అదే నేననేది! నువ్వకసారి ఇంటి కొచ్చి చూశావంటే నేను చెప్పే మాట నిజమో కాదో నీకే తెలుస్తుంది!"
    "గీతకు తెలియకుండా నీ గదిలోకి తెచ్చి పెట్టేసుకుందూ?" అంటూ మోహన్ సలహా ఇచ్చాడు.
    "మరే! గీత అంత అజాగ్రత్త మనిషి కాదు.... ఆవిడ కస్టడీ లో ఉన్న వస్తువేదీ బైటికి రావటం కష్టం!"
    "అయితే నీ వస్తువు నువ్వు దొంగతనం చేయటానికి కూడా వీల్లెదన్నమాట.....!"
    "వీలుంటే దిగులేమిటి...?" నిన్ను బ్రతిమి లాడుకుంటాను....నువ్వకసారి ఇంటి కొచ్చి ఆ ట్రాన్సి స్టర్ గీత దగ్గర్నించి ఎలా రాబట్టాలో చూసి పెడుదూ?"
    "మరేం బెంగ పెట్టుకోకు! నీది నీ చేతిలో పెడతాగా!" అని ధైర్యం చెప్పాడు మోహన్.
    "ఏం చేస్తున్నావురా మోహన్?"
    మోహన్ తలెత్తి చూసి గుమ్మం లో నించున్న ప్రభాకర్ ను చూసి "అరె! అదేమిటిరా? గుమ్మం లోనే నిలబడి పోయావ్? లోపలి కొచ్చి కూర్చో!" అన్నాడు.
    "అబ్బే! నాకు పనుంది రా.... కన్నె మారాకు వెళ్ళాలి....బస్సు స్టాపు కు వెళ్తూ నీ రూం తలుపులు తీసుంటే చూసి పోదామని వచ్చాను... మీ ఫ్రెండేవరో వచ్చినట్టున్నారే?"
    "సుధాకర్ నీకు తెలీదూ? గుంటూరు లో కాలేజీ లెక్చరర్ గా ఉన్నాడు.... వాడు, నేను బి.ఏ లో క్లాసు మేటులం....అది సరే కాని నువ్వు కన్నెమరాకు వెళ్ళట మేమిటి? ఈసాహిత్యభిలష ఎప్పటి నుంచి?"
    'అంత పెద్ద మాట ఎందుకు వాడ్తావు కాని, ఇది ప్రేయసి కోసం వేస్తున్న వేషం...."
    'డొంక తిరుగుడు మాటలు కట్టిపెట్టి అసలు విషయమేమిటో తిన్నగా చెప్పు!"
    "ఏమీ లేదు! షీరో కోసం!"
    "ఐసీ! చీరియో!"
    ప్రభాకర్ వెళ్ళిపోయాక మోహన్ "ప్రేమ కోసం వలలో పడెనే అయ్యో పాపం పసివాడు!' అని పాడాడు.
    "ప్రభాకర్ మెడిసిన్ చదువుతున్నాడు.... అమ్మాయిల వెంట పడి మతి పోగొట్టు కుంటున్నాడు....!" అన్నాడు మోహన్ నవ్వుతూ సుధాకర్ తో. కాస్సేపు కూర్చున్నాక సుధాకర్ పనుందంటూ లేచాడు.
    మోహన్ కిష్టమైన బొమ్మల చొక్కా వేసుకుని బాగా ముస్తాబై రూం కి తాళం వేసి ఇవతలకి వచ్చాడు. టి.నగర్ కెళ్ళే బస్సులో ఎక్కి కూర్చున్నాడు. బస్సు కిటకిట లాడుతూ ఉన్నది. కాస్సేపటికి తన పక్కనున్నాయన దిగిపోయాడు. అదేమీ గమనించకుండా పొట్టిగా లావుగా ఉన్న ఒక ముసలాయన రాడ్ అందక , పడిపోకుండా నిలబడలేక అవస్థ పడుతున్నాడు. మోహన్ తన పక్క ఖాళీగా ఉన్న జాగాను చూపించి ముసలాయన్ని కూర్చోమన్నాడు. ముసలాయన మాట్లాడకుండా మోహన్ వంక చూసి తర్వాత సీట్లో కూర్చున్నాడు. మోహన్ "ఎక్కడ కెళ్తున్నారండీ?" అని పలకరించాడు అరవం లో.
    ముసలాయన మళ్ళా ఒకమాటు మోహన్ కేసి చూపులు పారేసి మాట్లాడకుండా వూరుకున్నాడు. మోహన్ కు అనుమానం వేసింది అరవం రాదేమోనని. అందుకని ఈసారి స్వచ్చమైన తెలుగులొ పలకరించాడు. "ఎంత దాకా?' అని    ముసలాయనకి గొంతు దాకా కోపం వచ్చింది.
    "ఎక్కడో అక్కడ దిగుతాను. నీ కెందుకయ్యా?' అని విసుక్కున్నాడు.
    మోహన్ కు ఆశ్చర్యం వేసింది. ముసలాయనకు మంచీ మర్యాద తెలియనట్టున్నదే అనుకుని మరి మాట్లాడించకుండా కిటికీ లో నుంచి చూస్తూ కూర్చున్నాడు. కొంత సేపయ్యాక భుజం మీద చెయ్యి పడేసరికి మోహన్ ఇటు తిరిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS