Previous Page Next Page 
వేప పువ్వులు పేజి 7

    ఇంటికి వెళ్లేసరికి తలుపులు మూసే ఉన్నాయి. ప్రిపరేషను కని సెలవులు ఇచ్చేశారు. అయినా విశాలి ప్రిపేరు కావడం లేదు సరి గదా .....ఏమిటిది? కంగారు పడింది. పరీక్షలు ముంచుకుని వస్తుంటే , ఏమిటీ తిరుగుళ్ళు? తెలుసుకునే నిప్పు ముట్టుకునేవాళ్లకి నచ్చ చెప్పడం చాలా కష్టం. బాధగా అనుకుంది. ఇక దినచర్య లోకి దిగక తప్పదు.
    కాళ్ళూ, చేతులూ కడుక్కుని, స్టౌ మీద అన్నానికి నీళ్ళు ఉంచి బియ్యం ఏరుతూ కూర్చుంది. కళ్ళు బెద్ద చూపిస్తుంటే చేతులు యాంత్రికంగా ఏరి పడవెస్తున్నాయి! మనస్సు మాత్రం ఏదో తెలియని విషయం కోసం బాధపడి పోతుంది!
    గుమ్మంలో అడుగుల చప్పుడు విని తల ఎత్తింది సుమిత్ర.
    పక్కింటి పిన్నిగారు నవ్వుతూ లోపలికి వచ్చింది పరీక్షగా చూస్తూ.
    ఆవిణ్ణి చూస్తుంటే ఎందుకో సుమిత్రకి భయం.
    "రండి, కూర్చోండి.' మర్యాద చేసింది!
    కూర్చుంటూనే , "మీ విశాలి ఇంకా రానట్లుందే?" అంది. గొంతుక లో వేగటూ, హేళన ధ్వనించింది.
    "అవును, ఆఖరి రోజులు కాదూ? ఏవో ప్రాక్టికల్సు అవీ చేసుకోవడం లో లేటు అయి ఉంటుంది ." సర్ది చెప్పింది విశాలి తరపున.
    "అవునవును . అయినా మీ విశాలి బాడ్మింటన్ చాలా బాగా ఆడుతుందటగా? నాకు మొన్న చెప్పాడు మా అబ్బాయి. రోజూ సాయంకాలం అడుతుందిట." చెప్పదలుచుకున్నది నేరం చెప్పే విధంగా ధ్వనించ నీయకుండా నానా అవస్థ పడిపోతుంది పాపం, వయస్సు లో సుమిత్ర కన్న రెండురెట్లు పెద్దదైనా పక్కింటి పిన్ని గారు!
    "అవును. అదిగో , ఆ కప్పులన్నీ అది తెచ్చుకున్నవే." గర్వంగా చూపించింది సుమిత్ర.
    "మొన్న మీ ఊరు వెళ్లి వచ్చావుగా. మీ వాళ్ళంతా కులాసాయే నా? ఎప్పుడు వస్తారు ఈ వైపు?" అప్యాయం ఒలకబోయాలని తాపత్రయం . లేనిది బోర్లించినంత మాత్రాన ఒలుకుతుందా?
    "ఆ కులాసే . అయినా, మాకు పొలాలూ, ఇళ్ళూ, పశువులూ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ వదులుకుని ఇక్కడకు ఎందుకు వస్తారు? ఏదో మా చదువులు అయిపోయాక మేము మళ్ళీ వెళ్లి పోవలసిందే గానీ." నవ్వింది సుమిత్ర. లీలగా మదిలో మెదిలింది, ఆవిడ ఎందుకు వచ్చిందో . భయంతో కుంచించుకు పోయింది.
    'అతను ఎవరను కున్నావ్? మీ విశాలి చెప్పింది లే నీకు నిశ్చయించిన అతనని. అతనూ ఈ మధ్య తరచుగా ఇక్కడే ఉంటున్నాడు. వాళ్ళ ఇంట్లో కూడా కులాసేనా అంతా?' రంగం లోకి దిగింది నడుం బిగించి ఆవిడ!
    ఉలిక్కిపడి తెలియనివ్వకుండా , "ఆహా....అంతా కులసే. అయినా ఏమిటీ వేళ ఇలా దయ చేశారు. నేను వచ్చి వారం రోజులు దాటి పోతుంటే?' సూటిగా ప్రశ్నించింది. శత్రువు మీద వెనక దెబ్బలు వెయ్యడం సుమిత్రకు చేతకాదు.
    'అబ్బే . మీ విశాలి చాలా చిన్నపిల్లలే నువ్వన్నట్లు. ఏదో తెలియక ........."
    సుమిత్ర మధ్యలోనే అందుకుని, "నేను అన్నా అనకపోయినా విశాలి  ఎలాగూ చిన్నపిల్లే. ఇక తెలియనిదల్లా మీకే! ఒకవేళ చెప్పడానికి సిగ్గుపడి 'మా బావ' అంటే నాకు కాబోయే భర్త గా ఊహించారేమో. అతనికి మాకు బాగా దగ్గర చుట్టరికం ఉంది. అతనే విశాలిని చేసుకోబోతుంట."
    ఖండిస్తున్న సుమిత్ర వాక్యాలు మధ్యలో ఉండగానే చీత్కరించు కుంటూ లోపలికి ప్రవేశించింది విశాలి. ఆమె ఆఖరి రెండు వాక్యాలూ వింది. తనకెవరో బంధువులతో నిశ్చయమై నట్లు దాని సారాంశం! అందుకనే గట్టిగా విసుక్కుంటూ ఎత్తు మడమల బూటుతో నేల తన్నుతూ ప్రవేశించింది!
    పక్కింటి పిన్నిగారు హడలి పోయి పారిపోయింది!
    భూదేవి కున్నంత ఓర్పు సుమిత్రకే ఉంది. ఎన్ని తన్నినా భూదేవి పడుతున్నట్లే ----ఎన్నెన్ని మాటలు అంటున్నా సుమిత్రా సహిస్తుంది.
    అర్భకుల మీద అసూయ పడడం అధముల లక్షణం!
    వాళ్ళని కష్ట పెట్టడం కఠినుల లక్షణం!!
    ఎగతాళి చెయ్యడం అహంకారుల లక్షణం!
    బాధపెట్టడం బలహీనుల లక్షణం!
    అన్ని లక్షణాలు కలిసి పోసిన రాశివి. ' గోపాలం అసహ్యం ఒక అవధికి వెళ్ళిపోయింది.
    "మంచిది. అన్ని దుర్లక్షణాలు మాకే ఉన్నాయి. నీకేం లోపం? మేము చదువు కుంటున్న చదువు మారుస్తుంది లే మా లక్షణాలన్నీ. వీటికి నీ ప్రమేయం అనవసరం!" తెల్లబోయినా మాటలు మాత్రం విసిరేస్తుంది విశాలి.
    "ఆ లక్షణాలు పుట్టుకతో ఉండకుండా ఉండాలి.....ఆ అదృష్టం సుమిత్రది. నీవు లక్ష జన్మ లెత్తినా నీ లక్షణాలు మారవు !

                          *    *    *    *
    దిగులు మనస్సంతా ఆవరించి వేసింది.
    "ఆసలు ఈవేళ అనుకోకుండా శారదా వాళ్ళూ రాబట్టి గానీ, లేకపోతె సంభాషణ ఎంతవరకు పోయేదో....
    గోపాలం కడుపులోని కుళ్ళంతా తెలిసిపోయింది. ఇంకా తెలిసేది. ఛీ! దరిద్రుడు! ఇతనిని వెనక వేసుకుని వచ్చి అనవసరంగా ఇంత రభస చేశాను. నా దగ్గిర నా మాటలే మాట్లాడడం, అక్క సమక్షం లో అక్క మాటలు మాట్లాడడం....ఛీ!
    నేను ఆ రాక్షసి సుమిత్ర పక్కింటి పిన్ని గారితో చెబుతుంటే విన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతె నా కెల్లా తెలిసేది? కానీ ముంచుకుని వస్తున్నాయి చెడు రోజులు.....
    "మాకూ అతనికీ చుట్టరికం ఉంది. అతనికే మా విశాలి ని ఇస్తూంట." బంగారు చిలకలా పలుకుతుంది.
    పైగా ఆ నటనా? నాకు జీవితంలో తోడు నీడగా ఉంటుందిట! విజయం నాదేనట ! అంటే నా వెనకాలే ఉంటుందిట!
    ఛీ! మనుష్యులు ముఖం ముందు ఒక విధంగాను, చాటున ఒక విధంగాను ఎందుకు నటిస్తారో?
    నా పెళ్లి ఎలానూ కుదురి పోయిందని చెప్పిందిగా.
    బహుశః అమ్మ దగ్గిరికి పోయి చెప్పి ఉంటుంది.
    "చూడమ్మా! నాకు నిర్ణయించిన వరుణ్ణి విశాలి ఎగరేసుకుని పోతుంది. నన్ను రక్షించండి. డానికి త్వరగా పెళ్లి నిర్ణయించండి." అని దేవిరించిందేమో!
    నా స్వంత విషయాల్లో అంతిమ నిర్ణయాదికారం వాళ్ళకే ఉంది అనుకుని నిర్ణయించేశారుట!
    అసలు అందుకనే అంత త్వరగా వెళ్ళింది. ధీసిస్ సబ్మిట్ చేసేశాక నాతొ పాటే సెలవుల్లో రాకుండా ముందు పరిగెత్తి ఇది చేసిన నిర్వాకం ఇది!!
    అసలు వీళ్ళని నా విషయం లో చొచ్చుకుని పోయేందుకు సంపాదించుకున్న అధికారానికి తిట్టాలి గాని!
    కానీయ్, ప్రతీ విషయమూ నేనేం ముందు ఒక విధంగాను, వెనక ఒక విధం గాను చెయ్యడం లేదు, ఏదో ఈ ఒక్క గోపాలం విషయం లో తప్ప! అదైనా నన్ను ఊరికే వెంటాడి నా అందాన్ని ప్రశంసించడం మొదలు పెట్టినప్పుడు కూడా నా కర్ధం కానేలేదు. ఆ తరవాత అతని వికారపు చేష్టలే తెలిశాయి. అతని మనస్సు లోని స్వభావాన్ని. అందుకనే చివరికి నేనే నిర్ణయించుకున్నాను , నాకేం? పోనీ, నాన్నా వాళ్ళూ కుదిర్చిన సంబంద చేసేసుకుంటే?
    దెబ్బకి నా విలవ తెలిసి వస్తుంది గోపాలానికి!
    చేతులు కాలాక ఏడుస్తాడు. అప్పుడు ఇంకా ఎడ్పించాలి."
    కసిగా వ్రాసుకున్న విశాలి ఒక్క నిమిషం ఆలోచించేసరికి తల్ల కిందులై పోయింది.
    తిరిగి తల వంచుకుని, 'అమ్మో, అతను లేకుండా నేను ఎలా?
    ఎంతో నిర్మించు కున్నానే, ఉండగలనా, అసలు?
    పోనీ, నేను ఉండలేక పోయినా అతను ఉండగలడు గా!
    మనుష్యులతో ఆటలాడుకుంటున్నాడు. కానీ, బొమ్మలాట అంత తేలికగా ఉంది సుమిత్ర అక్కయ్య కి కూడా. ఈ పూట నేను తినకపోతే పెద్ద గిలగిలలాదినట్లు నటించింది! శారద రాక మరికొంచెం ఆలస్యం అయి ఉంటె ఎంత బాగుండేది....?"
    పరీక్ష చదువేమో, ఎందుకులే అనుకుని ముందర సుమిత్ర ను పడుకో బెట్టి, విశాలిని సమీపించిన విద్రాదేవత కి ఆమె వ్రాస్తున్నది చూసేసరికి ఆమె ఆలోచనా విధానానికి ఒళ్ళు మండుకు వచ్చి మంత్ర దండంతో విశాలిని చితకగొట్టాలని అనుకుంది!
    "సహజంగా మంచిదే దురదృష్టం పొర కమ్మేసి అలా చెడ్డగా ఆలోచిస్తోంది. కాని, విశాలి , నేను చిన్నప్పుడు ఎంత కలివిడిగా ఉండేవాళ్ళమని " అని నిద్ర రాక సుమిత్ర గొణుక్కున్న వాక్యాలు గుర్తుకువచ్చి, "పోనీ, ఎవరేల్లా పొతే నాకేం? ఇది  మెలకువగా ఉంటె అదే ధోరణి లో చెడ్డగా తప్ప మంచిగా ఆలోచించ లేదు కాబట్టి ఈవేళ నిద్ర పోవడమే మంచి మందు" అనుకుని విశాలిని ఆవహించింది!
    ఆకలి వేసి వంట ఇంట్లోకి పోయిన నిద్రా దేవత కి వండిన అన్నం అంతా వందినట్లుంటే ఆశ్చర్యం వేసింది.
    "అయితే వీళ్ళిద్దరూ తిండి తినకుండా నిద్రపోయారన్న మాట" అనుకుని సుమిత్రని చూసి జాలిగా నిట్టూర్చింది.
    నిద్ర లో కూడా సుమిత్ర ఏడుస్తుంటే, నిద్ర లో కూడా పళ్ళు పటపటా కోరుక్కుంటుంది విశాలి.
    నవ్వు ఆపుకోలేక పోయింది నిద్రాదేవి.
    తన వికటాట్ట హాసానికి మళ్ళీ లేచి కూర్చుంటారని భయపడి, నిశ్శబ్దంగా నవ్వుకోలేక, వస్తున్న నవ్వు అపుగోలేక వెనువెంటనే వెళ్ళిపోయింది అక్కడ నుండి.

                           *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS