"ఈ మధ్య మీ విశాలి లో చాలా మార్పు , వచ్చిందోయ్! " అయాచితంగా ఇంటికి వచ్చిన సుమిత్ర స్నేహితురాలు నళిని అంది సుమిత్రతో.
అసలే ఈ మధ్య జరుగుతున్న కలతలతో విసిగిపోతూన్న సుమిత్ర 'ఇదేం గొడవరా , నాయనా/ ఇదేం కలతలు రేపుతుందో!' అనుకుని గాభరా పడిపోయింది.
సుమిత్ర దగ్గిరి నించి జవాబు రాకపోవడంతో అలుసుగా భావించి, మరొక మెట్టు ఎక్కింది నళిని. తను ఎక్కేది సుమిత్ర మెట్లు అని తెలిసినా కూడా అనుమతి తీసుకోకుండా అంత చొరవగా ఎలా యెక్కగలిగిందో?
"పెళ్లి కళ కూడా మొహాన్ని ఉట్టి పడుతుంది' అంది తను జరపబోయే సంభాషణ కి నాందిగా.
"నీకూ వచ్చింది పెళ్లి కళ!" విశాలి హటాత్తుగా వచ్చి నీకు పెళ్లి చేసేస్తుందిలే అనే అర్ధం స్పురించేలా అని, నేను కూడా తోడు పెళ్లి కూతుర్ని కావలిసి వస్తుంది కాబోలని అనుకుంది లోలోన సుమిత్ర!
"అతనితో , మీ గోపాలం తో నేను చాలాసార్లే చూశాను. ఈ మధ్యనే సినిమా హల్లో కూడా చూశాను." సుమిత్ర అనుకున్నట్లు నళిని కాలం మూడిపోయింది.
విశాలి ధుమధూమ లాడుతూ ప్రవేశించి, "నీవు ఆ రౌడీ బాచి గాడితో తిరగడం నేనూ చూశాను. మొన్న నువ్వు కొంగున ముడి వేసుకుని నీ పక్కనే తీసుకు వెళ్ళిన ఆ దౌర్భాగ్యుడు బాచిగాడేనా?' అని రెట్టించింది!
ఆకాశం మేఘావృతం కాకుండానే పిడుగులు పడిపోసాగాయి. నేలకి అంటుకు పోయింది సుమిత్ర.
ఎటూ పారిపోలేని స్థితిలో కన్నంలో తేలు కుట్టిన దొంగే అయింది నళిని.
పడే అక్షింతలు విసురులో సుమిత్ర తల మీద కూడా నాలుగు పడ్డాయి.
"నీకేం పని లేదీ మధ్య. నేను చూస్తున్నా, ఎవరు ఈ స్నేహితులంతా? మొన్ననేమో ఆ పక్కింటి పిన్ని గారూ! ఈ వేళ ఈవిడ! రేపు మరొకళ్ళు! ఏమిటీ చండాలం అంతా ఇంట్లోకి తెస్తున్నావు? నాకు పబ్లిక్ పరీక్షలనీ, నేను కాస్తంత శ్రద్దగా చదివి చావాలనీ తెలుసునా నీకు? ఆ ధీసిస్ అయిపోయినప్పటి నుండి ఈ చవటరికాన్నీ, నాసి రకాన్ని, ఊరికే వెంట వేసుకుని తిరుగుతున్నావు! ఆ ధీసిస్ వ్రాసుకున్నన్నాళ్ళూ నా పని ప్రశాంతంగా ఉండేది. అందులో ములిగిపోయి ఈ చచ్చు రకాలతో నీ కాలం వెచ్చించకుండా ఉండేదానివి...."
కోపంలో నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తుంది విశాలి. కోపంలో మనిషి ఊగులాడి పోతుంది.
ఒకే వైపు నుండి కెరటం ఎగిరి పడితే నష్టం అట్టే ఉండదు కాని, రెండు వైపుల నుండి చెరో కెరటము ఎగిరి పడి కలిస్తే జల ప్రళయమే తీసుకు వస్తాయి.
ఇంతవరకూ రాయి లాంటి సుమిత్ర మీద ఎగిరి పడేది కాబట్టి విశాలి రౌద్ర కెరటం తో జల ప్రళయం ఏనాడూ జరగలేదు.
కాని ఈనాడు.......
రెండు పొట్టేళ్ళు ఎదురెదురుగా నిలుచున్నాయి.
లేచి నిలబడుతూ అంది నళిని. "అవును, పాపం. ఇన్నాళ్ళూ ఆ ధీసిస్ లో ములిగి పోయి ఉండడం వల్ల, ఆ ప్రపంచం లోనే గడుపుతూండడం వల్ల నీవు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగిపోయింది. పాపం, ఈనాడు బయట ప్రపంచం లో ఈవిడ మసలడం నీకు అడ్డు గదూ."
"షటప్! బయటికి నడు ముందు. గెటవుట్." కోపంలో పిచ్చిగా అరుస్తున్న విశాలి ని చూసింది నళిని.
"నీ మొహం చూసి ఈ గుమ్మం తొక్కలేదు నేను అసలు!"
"గెటవుట్ ఫస్ట్ ఐసే!" సహనం పూర్తిగా నశించి పోయింది విశాలిలో.
"అవును నీ గుమ్మం తోక్కడమే నా బుద్ది తక్కువ. పోతున్నా." విసురుగా నిష్క్రమించింది నళిని, పాపం!
'అదొక్కటే కాదు. నీలో బుద్ది ఒక్కటే కాదు తక్కువ. అన్నీ తక్కువే. పచ్చగా ఉండే మనుష్యుల్ని చూస్తె కళ్ళలో నిప్పులు పోసుకుంటావ్. ఫో. అవతలికి పో. శీలమూ తక్కువే. గుణమూ తక్కువే. నేనేం నీలాగా రోజుకి ఒకడితో తిరగడం లేదు." వెళ్ళిపోతున్న నళిని కి వినిపించేలా గొంతుక హెచ్చిస్తూ అరవసాగింది విశాలి.
అదును చూసుకుని సుమిత్ర లోపలికి జారుకుంది.
నవ్వుతూ లోపలికి ప్రవేశిస్తూన్న గోపాలం విశాలి అరుపులకు తెల్లబోయాడు.
"ఎవరి మీదనో దేవి గారికి కోపంగా ఉన్నట్లుందే? తమరి కోపాగ్ని కి ఆహుతి అయిపోయిన ఆ మిడతం బొట్లును కాస్త చూపిస్తారా?' చిన్నగా అన్నాడు నవ్వుకుంటూన్న గోపాలం!
అతను అంటున్న మాటలే, వంట గదిలో సుమిత్ర కి వినపడేలా గొంతుకని చించుకుని అని, "ఆ గాడిద కి బుద్ది లేకపోతె పోనీ, ఈవిడ సంస్కారం ఏమయిందిట? అలగాజనాన్ని పోగుజేసుకుని నన్ను గురించి వాకబు చెయ్యడం మొదలు పెడుతుందా? ఎంత చదువు కుంటే ఏం లాభం?' అంది.
తెల్లబోయి నవ్వుతూ సంభాషణ మళ్ళించి వెయ్యదలిచాడు గోపాలం.
"ఆ....పోవోయ్. ఈ గొడవలన్నీ ఆలోచిస్తుంటే పరీక్ష చదువు మంట కలిసి పోతుంది! చదువు ముఖ్యమా, వీళ్ళ ఛండాలపు పుకార్లు ముఖ్యమా?" తోసి వేస్తూన్నట్లు అంటున్నా అందులో ఒక్క రవ్వ కూడా సుమిత్రను విసుక్కుంటూన్నట్లు లేదు!
వంటింటి గోడ అనుకుని నిలుచుండి పోయిన సుమిత్ర గోపాలం వాక్యాలు విని మదిలోనే అతనిని అభినందించుకుంది. భ్రమరం లాంటిది అయినా అతని మనస్సు , పాపం కాస్త నిజానిజాలు కనిపెట్టగలదు. ఎదటి వాళ్ళ మనస్సుల్ని అపార్ధం చేసుకోకు. భగవంతుడా! వీళ్ళిద్దరిని సుఖంగా కాపరం చేసుకునేలా దీవించు!" మనస్సు లోనే భగవంతుడి కి వెయ్యి వేల నమస్కారాలర్పించుకుంది!
"ఆ.....నా పరీక్షలెం ముఖ్యం కాదు, ఆవిడికి ముఖ్యమైనవి వేరే ఉన్నాయిలే. నేనూ, నా పరీక్ష లూ సర్వనాశన మయినా ఫర్వాలేదు. వాళ్ళు హాయిగా రిసెర్చి చేసుకుంటే చాలు" ఉడుకు మోతుతనం లోకి దిగజారి పోయింది విశాలి.
"ఛీ, ఏమిటా మనస్తత్వం? చక్కగా మన ఆలోచనలు తిన్నగా ఉండాలి గాని, వక్రపుటాలోచనలు మంచివి కావు. లే భోజనానికి, ఏదో నీ చేత్తో తినిపిస్తావేమో అని ఎంతో ఆకలి తో వచ్చాను. లే త్వరగా."
నిజంగా చూసి వెళ్లి పోదామని వచ్చిన గోపాలం వెనక ఒకసారి తను కూడా వాళ్ళ సంభాషణ లలో పాల్గొన్న రోజున వాళ్ళు ఇద్దరూ తిండి మానేసి పడుకున్న విషయం గుర్తుకు వచ్చి తను కూడా భోజనం చేస్తానంటే గాని ఆ రాత్రి ఇంటి లో వాళ్లకి తిళ్ళు ఉండవని అలా అనేశాడు.
అంతవరకు వాళ్ళ సంభాషణ జాగ్రత్తగా వింటున్న సుమిత్ర ఉలిక్కిపడింది. ఇందాకా హడావిడి లో అన్నం మాడి ముక్కలయింది. కూరా నారా ఏమీ చెయ్యనే లేదు. గోపాలం తింటానంటున్నాడు అనుకుని కంగారు పడింది కూర వండాలని!
కూరల బుట్ట విశాలి గదిలో ఉండిపోయింది.
అలా వెళదామంటే భయం!
వెళ్ళక పొతే కూరలు ఉండవు.
తికమక పడిపోతుంది.
అన్నింట్లో నూ అపర్భందవుడే గోపాలం, ఏవో కొన్ని కొన్ని విషయాల్లో తప్ప!
విశాలిని నవ్వించి కొంటెగా ఆమె బుగ్గ మీద చిటిక వేసి, వంట గదిలోకి వెళ్ళాడు. అతని అడుగుల చప్పుడు వింటూ మరీ అంటుకు పోయింది సిగ్గులో పాపం!
వయస్సు లో సుమిత్ర పెద్దది విశాలి కంటే.
కాని విశాలి నోరు పెద్దది సుమిత్ర నోటి కంటే!
బిక్క చచ్చిపోయిన సుమిత్ర ని చూస్తూ, సుమిత్ర మనస్సు మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు క్షుణ్ణం గా చదివిన గోపాలం మనస్సు లో విలవిలలాడి పోయాడు.
అంతలో తేరుకుని, "కొంచెం సావిట్లో కూరల బుట్ట ఇయ్యరూ?' అంది సుమిత్ర. దీనత్వం వేలాడుతుంది ఆమె గొంతులో.
జాలితో మాటలు పెగలలేదు అతనికి!
"ఒక్క పది నిమిషాలు ఉండండి. చక్కగా చిప్స్ వేగించేస్తా'. కూరల బుట్ట తెచ్చి పడేస్తారా?' తిరిగి రెట్టించింది, అతను అక్కడే భోజనం చేస్తానని విశాలి తో అంటున్నది తను విన్నట్లు అతనికి తెలియాలని.
తేరుకున్నాడు గోపాలం తుదకు.
అన్నింటి లోనూ సుమిత్రదే ముందంజ మరి!
"అబ్బే, కూరలేం అక్కర్లేదు. ఏదో కాస్త పచ్చడి వేసుకుని తింటే సరిపోయే." ఏమనాలో తెలియక అల్లా అన్నాడు చివరికి!ఇక్కడ గోపాలం మరో రెండు నిమిషాలు ఉన్నాడంటే మరి ఇంకో గాలివాన వస్తుందని భయపడి కూరల బుట్ట కోసం సావిట్లో కి వెళ్ళిపోయింది గబగబా సుమిత్ర!
ఏం మాట్లాడు కుంటున్నారో విందామని చెవుల ఎక్కబోడుచుకుని నిలబడి ఉన్న విశాలి కంగారు పడింది సుమిత్రను చూసి.
అసలు విశాలిని చూడనే లేదు సుమిత్ర!
ఆమెకు చాటున ఉండి మాటలు వినడం అంటేనే తెలియదు. అల్లాంటప్పుడు ఎందుకని విశాలిని పరీక్షిస్తుంది?
ఆ సమయంలో సుమిత్రని చూసిన విశాలి పేగు ముందుకు వచ్చింది. కన్నీటి చారికలూ, ముందు భాగం అంతా చెదిరి పోయి నుదుటి మీద అంటుకు పోయిన జుట్టూ, కళ్ళల్లో దిగులూ చూసి బాధపడి పోయింది.
"ఇప్పుడు కూరలతో పనేమిటి? వద్దు. పచ్చడి తో తినేద్దాం లే." సర్దింది. జాలిపడినందుకు అదే పెద్ద నిదర్శనం!
సంతోష పడిపోయింది సుమిత్ర మనస్సు.
వినీలాకాశం లో విహరించే విహంగాన్ని మించి ఎగిరింది ఆమె ఆనందం!
"నువ్వొక్క పది నిమిషాలు అతనితో మాట్లాడుతూ ఉండు, ఇట్టే చేసేస్తా' అంది సమాధానంగా! ఆనందం ప్రతి అక్షరం లోనూ ఉరకలు వేస్తుంది.
ఒక్క నిమిషంలో మంచిగా నిర్ణయించుకున్నా గోపాలం విషయం వచ్చేసరికి కొంచెం గా ముఖం మారింది! ఆనందం మధ్యలో ఊయలలూగుతున్న సుమిత్ర కి తాడు తెగి కింద పడినట్లయింది విశాలి ముఖ భావాలు పరిశీలించగానే. దీర్ఘంగా నిట్టూర్చి వెళ్ళిపోయింది.
తనకి పూర్తీ సంతోషం ఏ నిముషం లో ఉంది అసలు?
ఏదో సుఖ దుఃఖాల కలయికే నా జీవితం కానీ అందరి జీవితం కన్నా వింత ఏమిటి?
ఒక్క అరక్షణం లో వెలిగే మెరుపు లాంటి సంతోషం కోసం కొన్ని గంటలు కారు మేఘాలు కాచుకుని ఉండవలసిందే!
తల వంచుకుని మౌనంగా వెళ్ళిపోయింది.
ఒక్క క్షణం లో మారిపోయిన సుమిత్ర ముఖ భావాలకు తనను తానె నిందించుకుని గోపాలాన్ని పిలిచింది, కాస్సేపాగితే మంచి భోజనం అందుతుంది రమ్మనమని!
అనుకున్నట్లుగానే పది నిమిషాలలో పిలిచింది సుమిత్ర!
వంట గదిలో విశాలి కీ గోపాలానికి కంచాలలో వడ్డించి ఉంది!
గోడను అనుకోని నిలబడిన సుమిత్ర తీరు చెప్పకనే చెబుతుంది 'తాను తరవాత తింటామా' అని!
మొదట తెల్లబోయినా , తమాయించు కుంది విశాలి 'ఇందులో ఏం అంతరార్ధం ఉందొ!' అని. అయినా మాట వరస కి, "నీవూ పెట్టుకో" అంది. కాళ్ళ దగ్గిర పడి ఉండే కుక్కని ఆప్యాయంగా నిమిరినట్లు!
"మీరు తినండి. మీరు తినేశాక నేను తింటాను." అన్నం గిన్నె దూరంలో ఉంచి నెయ్యి వడ్డిస్తూ అంది సుమిత్ర!
అంటూనే దిగులుగా వాలిపోయిన గోపాలం కళ్ళు చూసి బరువుగా తల వంచేసుకుంది!
గోపాలాన్ని ఓరకంటి తో చూసిన విశాలి కి ఒళ్ళు మండింది.
కసిగా నమల బోయిన మొదటి ముద్దలోనే రాయి వచ్చింది. "ధూ!" అని ఉమ్మేసింది. తన కసి నంతా సుమిత్ర మీద చూపిస్తూ.
పంటి కింది కరకర శబ్దం వింటూనే ఉలిక్కిపడిన సుమిత్ర ఆ తరవాత రాగానికి తల వంచి వేసింది ఏదో మాట్లాడుదామని తెరిచిన నోరు మూసేస్తూ.
"ఛీ....అన్నం అంతా మాడు వాసన!" చీత్కారించుకుంది విశాలి.
విశాలి ఎందుకు విసుక్కుంటుందో గోపాలం గ్రహించాడు. సుమిత్ర కూడా పసి కట్టింది!
విశాలి కి పాపం, ప్రేమ ముంచుకు వచ్చిన క్షణం లో వేరే సంఘటనలు జరిగి రెచ్చ గొట్టడం వల్ల సుమిత్ర నలిగి పోతుంది అనుక్షణ మూ.
సుమిత్రకి విశాలి చేస్తూన్న సన్మానం చూస్తుంటే గోపాలానికి ప్రేమ నశిస్తుంది కొద్ది కొద్దిగా విశాలి మీద.
"అవును, మాడిపోయింది." భయం భయంగా అంది సుమిత్ర. జవాబు రాకపోతే ఇంకా కోపగిస్తుందనా? లేక తను ఒప్పుకోవడం వల్ల విశాలి కోపం త్వరత్వరగా దిగిపోతుందనా? ఏమో, మరి!
