Previous Page Next Page 
వేప పువ్వులు పేజి 6


    "ఏమిటి నీవు మాట్లాడదలుచుకున్న విషయం?' రంగం లోకి దిగింది శాంత.
    ధైర్యం అవలంబించటం సుమిత్ర వంతు అయింది. "విశాలి కి పెళ్లి కుదిరింది. నేను విదేశాలకి పోయేలోగా ,దాని పెళ్లి జరిపించివేయ్యాలని పట్టు పడుతున్నాను."
    మొదట 'ఎవరో ఫలానా వారి అమ్మాయి పెళ్లిట!" అని విన్నంత తేలిగ్గా విన్న శాంత అసలు విషయం మనస్సు లో దూరి తేలుకోండిలా పొడిచే సరికి "నువ్వు అసలు ఎవరి విషయం మాట్లాడుతున్నావ్? మరి నీ పెళ్లి మాట?' అని ఆత్రంగా ప్రశ్నించింది.
    "నాది నేను తిరిగి వచ్చిన తరవాత జరుగుతుంది లే!" అన్నీ కలిసి ఒకేసారి చెప్పడం ఇష్టం లేక కాబోలు , ఒక్కొక్కటిగా చెబుతుంది!
    "ఒకమూల కుదిరిన గోపాలాన్ని నిన్ను అట్టే పెట్టి, ముందు విశాలి పెళ్ళేమిటే! నీకేమైనా మతి గాని పోయిందా?" సుమిత్ర కి మతి స్థిరం లేదని తేల్చింది శాంత.
    అది అయితే నిజమే కాని, అందుకు కారణం కొంత అనుకుంటున్నది ఏమాత్రం కాదు ! మనస్సు ను మరుగు పరిచి మాట్లాడితే మతి చెడిన వారితోనే లెక్క!
    'ఆ....అదే ఆ గోపాలం తోటి విశాలి పెళ్లి జరుగుతుందిట!" నిండిన కళ్ళు దూరం కేసి తిప్పి అన్యమనస్కంగా చెబుతుంది సుమిత్ర.
    "ఏమిటే?!" మూడు నిమిషాలు దొర్లిపోయాయి నిశ్చేష్టులైన వాళ్ళిద్దరి ని చూస్తూ! నాలుగో నిమిషం నవ్వుతూండే సరికి ఒళ్ళు తెలిసి వచ్చింది సుమిత్ర కి ముందు.
    "యేమిటంటావేమిటే ఏదో కొంప ములిగి పోయినట్లు? ఆ మధ్య నన్ను చేసుకుంటానన్న గోపాలానికి, మన చిన్నారి చెల్లెలు విశాలి కి త్వరలోనే పెళ్లి.......అర్ధమయిందా?" ముందు అడుగు ప్రతి విషయం లొను సుమిత్రదే!
    "వేళాకొళానికి హద్దు పద్దు ఉండాలి! ఏమిటా తెలివి తక్కువ వాగుడు? అతని మీద నీవు పెంచుకున్న ఆశలన్ని ఎమయినట్లు? అతను అంత త్వరగా విశాలిని చేసుకోవడానికి ఎల్లా ఒప్పుగున్నాడుట?" తెల్లబోవడం వంతు దాటిపోయి చివరికి విషయం లోకి దిగింది శాంత, కొంచెం వేనక ముందులు ఆలస్యం అయినా.
    "అతని మీద నేనే కాదు, విశాలి కూడా చాలా ఆశలు పెంచుకున్నట్లు నాకు ఈ మధ్య గాని తెలియలేదు! ఎటొచ్చి నేను పెంచుకున్న పరిస్థితులు వేరు. అది పెంచుకున్న పరిస్థితులు వేరు. అమ్మ, నాన్న గోపాలం తల్లి తండ్రులతో మాట్లాడి, తాంబూలాలు పుచ్చుకుని అన్ని నిర్ణయాలూ జరిగిపోయాక, నేను పెంచుకుంటే, ఏమి లేకుండా అది పెంచుకుంది! చిన్నపిల్లకి జీవితంలో ఎదురు దెబ్బలు తెలియనిది. కాబట్టి ఈ దెబ్బకి ఎదురుగా నేను నిలబడదలుచు కున్నాను. అదీ పరిస్థితి." చెమట తో నుదుటి మీద అంటుకు పోయిన జుట్టు, వెనక్కి నెట్టుకుంటూ 'చెప్పింది సుమిత్ర.
    అడ్డంగా చతికిలబడిపోయింది శాంత. నీళ్ళు తుళ్ళి ఒలికి పోయాయి. పక్కనే తను చతికిల బడింది చేసేదేమీ లేక సుమిత్ర.
    "అమ్మకి , నాన్న కి తెలుసునా?" చివరికి ప్రశ్నించింది శాంత.
    "తెలియ జెప్పాను. అంతకు మించి నేను ఏమి చెయ్యలేక పోయాను. జరగడమైతే నా సమక్షం లోనే జరిగింది! గాంధీ గారి కోతి బొమ్మల లాంటివి -- అనకు! కనకు! వినకు! - టేబిలు మీద ఉంటాయి. అలాగే చివరికి నేను ఎవర్ని అనకుండానే నష్ట పోయాను! నేను నా కంటితో చూడలేదు. నా చెవులతో వినలేదు. అందుకనే విశాలిని గాని, గోపాలాన్ని గాని ఏనాడు అనుమానించలేకపోయాను. చివరికి నేను బాధపడాలి. అంతేగా! నా బాధ వల్లనైనా విశాలి సంతోషంగా ఉంటె అంతకంటే నాకింకేం కావాలి?' అంది సుమిత్ర.
    "నేను తెలివి తక్కువగా ప్రశ్నిస్తున్నాననుకోకు! గోపాలాన్ని త్వరగా మరిచి పోగలవా నువ్వు?" కన్నీటి చారలు ఒత్తుకుంటూ ప్రశ్నించింది.
    ఆ మాత్రం స్వతంత్రించి ప్రశ్నించిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పటి వరకు. ఇక దుఃఖాన్ని దిగమింగు కోవడం తన వల్ల కాలేదు సుమిత్రకి. శాంత ఒడిలో తల ఉంచి వెక్కి వెక్కి ఏడ్చింది మనస్సులోని బాధ తీరేవరకు!
    "అది ఒక్కటే మిగిలిపోయింది! అంతకుముందు ప్రతి విషయం లోను గుర్తుకు తెచ్చుకున్న గోపాలాన్ని ఈ క్షణం నుండి నేను మదిలో మెదలనివ్వకూడదు! అది మహా దోషం కింద లెక్క! అందుకనే వేరొకరికి అన్యాయం చెయ్యలేక ఇల్లాగే ఉండిపోదామని నిర్ణయించు కున్నాను.
    సాయంత్రం పిల్లగాలి మృదువుగా చెంపల కు తాకితే ఏమిటో ఒక అనుభూతి.
    విరగబూసిన విరజాజి నవ్వితే ఒక విధమైన జ్ఞాపకం.
    విచ్చుకుంటూన్న మల్లెలు సిగ్గుగా రేకులు విప్పు కుంటుంటే అదో విధం.
    వీటన్నిటిని నేను చాలా త్వరలో మరిచి పోవాలి! అందుకే నా ఈ బాధ డానికి తెలియకుండా ఉండేటందుకే విదేశాలకి వెళ్ళిపోతున్నాను ఒంటిగా. అక్కడే ఉండి కొన్నాళ్ళు బాధ జీర్ణించు కోవడం నేర్చుకుని నిలదొక్కు కోవడం చేతనయిన తరవాత ఇక్కడికి వస్తాను. అదీ విదేశయాత్ర ప్లానులోని అంతరార్ధం.
    నీ సంసారిక జీవితమే వాళ్లకి ఒక తీరని సమస్య అయిపొయింది.
    నాది మరో అఘాతం!
    ఇక మనిద్దరిని మరిపించి వెయ్య గలగాలి విశాలి జీవితం!
    రాజుని, చిట్టి తమ్ముణ్ణి అభివృద్ధి లోకి తీసుకుని వచ్చే పూచీ నాది.
    ఇది నా నిర్ణయం. " ముగింపు లోని నిట్టుర్పు గుప్పెడు విచారాన్ని వెదజల్లింది.
    సిగ్గుతెర తొలగించి మేలిముసుగు లోంచి యామినీ దేవి పలకరిస్తుంది వెళ్ళిపోతున్న వెలుగును.
    లేచి నిలబడ్డారు అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఒకేసారి. తరవాత ఎలా సంభాషణ మలచాలో ఎవరికి అర్ధం కాలేదు.
    "చిట్టి తమ్ముడి తో పాటుగా దీన్నీ చదివిస్తాను. మీ చిట్టి తల్లిని పంప కూడదు?" సుమిత్ర అడిగింది శాంతని.
    తల అడ్డంగా ఊపింది ముందు. ఆ తరవాత ......."అటు పిమ్మట వీళ్ళ సాధింపులు నేను భరించగలనా/ చివరికి అమ్మ కన్న సంతానానికి అదృష్టం తక్కువేమో!" అంది శాంత .
    "అదేమిటి, అక్కయ్యా , అల్లా అంటావు? ఎంత ఇంటి పనుల్లో నియోగించినా, ఎంతగా చెప్పుడు మాటలకి లొంగి పోతున్నా బావలో ఒక గొప్ప సుగుణం ఉంది. ఆ నిమిషంలో మరిచిపోయినా మంచి చెడ్డల నిర్ణయాల వివక్షలు తెలుసుకున్నాక ఎంత మారిపోతాడు! నీకు దిగులు పనికి రాదక్కా! ఎటొచ్చి మంచికాలం కాదు! అప్పటి వరకు ఆగాలి! ఓర్పుతో ఎదురు చూడు! పడ్డవాళ్ళు ఎన్నటికి చెడ్డవాళ్ళు కారు!" చెల్లెలు అక్కని ఓదారుస్తుంది తన బాధలు మరిచిపోయి.  
    "తోటకూర విత్తనం చాలా చిన్నదే కావచ్చు. విత్తనాలు గా చల్లేటప్పుడు నీకు అనిపించదు అది ఎంత పెద్ద మొక్కలా తయారవు తుందని. నీవు ఏ విత్తు నాటావో దాని ఫలం అనుభవించి తీరాలి! గింజ ని చూసి తప్పు అనుకుంటే అది నాటిన వాళ్ళ దోషం కాని, విత్తు దోష మెందుకవుతుంది? నీకు మీ విశాలి చాలా ఒప్పుగానే కనిపించవచ్చు. అది చేసే ప్రతీ పనీ దాని మీద నీకున్న ప్రేమ వల్ల ఒప్పుగానే కనిపించవచ్చు. కాని నీ కళ్ళద్దాలకున్న పవరే ప్రపంచానికి ఉంటుందని అనుకోవడం నీ వెర్రి! మొక్కగా వంగనిది మానై వంగదు. అందుకే తీగె లేతగా ఉన్నప్పుడే గడలు పాతి పందిరి వేసేస్తారు. తీగె ముదిరితే దానికి పాకే గుణం పోతుంది. లొంగదు. దాని తీగె డానికి. ఆలోచించుకో. ఏదో మనిద్దరి మధ్యన ఉన్న స్నేహాన్ని పురస్కరించుకుని ఇలా చెబుతున్నా." దీర్ఘోపన్యసాన్ని హ్రస్యం చేసింది శారద. లేకపోతె ఆమెకి ఇంకా మాట్లాదవలిసింది చాలా ఉంది. సుమిత్ర ని చూస్తూ ఆమె విచారాన్ని భరించలేదని ఆపి వేసింది!
    శారదంటే సుమిత్ర కి ఆరో ప్రాణం.
    దేన్నీ అయినా ఆమె పోగొట్టుకుని ఇంకా నిలబడగలిగిందంటే దానికి కారణం శారదే. ఆ చనువు పురస్కరించుకునే చెప్పింది శారద.
    "నాకు తెలుసును , శారదా! తెలిసే వదిలేశాను. చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అందుకే భరించదలుచుకున్నాను ఆ నస్జ్తాన్ని! " తల వంచుకునే చెప్పింది సుమిత్ర.
    శారద తెల్లబోయింది!
    "నిన్ను ఎప్పటికప్పుడు అర్ధం చేసుకున్నాను అనుకుంటూనే ఉన్నాను కాని నా ఆలోచన శక్తి కి అందని దానివై పోతున్నావు. కాని, నీ నిర్ణయం మీ విశాలి కి తెలుసునా?"
    "తెలిసే లాగే చెప్పాను. అది అర్ధం చేసుకోలేదో, నమ్మలేదో నాకు తెలియదు. కాని మొత్తానికి వెనకటి లానే ఉంది. " నిర్లిప్తతగా చెప్పింది ఎవరి విషయమో మాట్లాడుతున్నట్లు, తనకి పట్టనట్లు!
    శారదని చూస్తుంటే సుమిత్ర దుఃఖం ఆగదు.
    తన దుఃఖం చూస్తుంటే శారద అగలేదనీ తెలుసును.
    అందుకనే ఎక్కడ లేని నిర్లిప్తత ప్రదర్శిస్తుంది సుమిత్ర.
    మరింక సంభాషణ పొడిగించే ఓపిక శారద కే లేదు.
    వేరే పుంత తొక్కింది సంభాషణ.
    ఆ వేళ శారద తో మాట్లాడిన తరవాత మరింక ఉత్సాహంగా ఉండలేక పోయింది. విడిపోయారు స్నేహితులు పైకి నవ్వుతూన్నా లోలోపల దిగులుతో.

                         *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS