4
చిట్టి తీసుకున్న ఇల్లు ఊరికి ఒక పెడగా ఉంది. ఈ మధ్య ఆర్ధిక పరిస్థితులు అట్టే బాగుండక ఆ రెండు గదుల్లో ఒక గది ఒక పంతులమ్మ కు అద్దె కిచ్చింది చిట్టి. మురళీ వస్తూ పోతూనే ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే చిట్టి తన చెవుల పోగులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. పదిహేను రోజుల నుంచీ జయప్రదరావు జ్వరం తో జగననాధం అటు కేసి వెళ్ళటమే లేదు. తీరా ఈ సాయంత్రం వెళ్లేసరికి తను రావటం ఎంత మంచి పనో అతనికి తెలిసింది.
అతను వెళ్లేసరికి చిట్టి ఒక్కతే కుంపటి ముందు కూర్చుని విసురుతున్నది. జగన్నాధాన్ని చూసి చిరునవ్వు నవ్వి పీట ఒకటి ముందుకు తోసింది. ఆమె చిరునవ్వు చాటున ఉన్న వేదన ఎంత దాచుకుందామన్న దాగటం లేదు. ముఖం ఎండిపోయి నీరసంగా ఉంది. దువ్వుకోక పోవటం వలన జుట్టు మరింత గజిబిజిగా ఉంది.
"జగ్గూ, నువ్వు రావేమో అని భయపడ్డాను" అన్నది చిట్టి.
"ఎందుకని ? ఏమయినా పనుందా?"
చిట్టి కొన్ని క్షణాలు సమాధానం ఇవ్వలేదు. తరవాత సిగ్గుపడుతూ --
"మురళీ కోసం మూడు రోజుల నుంచీ చూస్తున్నాను. యింతవరకూ అయిపు లేదు. ఇప్పుడు నా గతెమిటో అర్ధం కావటం లేదు" అన్నది.
అక్కడ ఉన్నది జగన్నధం కాకుండా ఉంటె ఆ మాటలకు ఎన్ని దెప్పులు తినాల్సి వచ్చేదో ఆమె. జగన్నాధం మాట్లాడలేదు.
"బహుశా వీరవాసరం వాసంతి తో కాలక్షేపం చేస్తూ ఉంటాడు." అని చిట్టే తిరిగి అంది.
"అయితే ఇక్కడికిహా రాడా?"
"వస్తాడు...కాని జగ్గూ , ఇహ ఇక్కడ ఉండడం నావల్ల కాదు" అంది గంబీరంగా చిట్టి.
"కొంపతీసి కీచులాడు కోలేదు గదా" అన్నాడు జగన్నాధం. చిట్టి ప్రతిదీ గోరంతలు కొండంతలు చేస్తుందన్నది అతనికి అనుభవమే.
"లేదు. కాని నావల్ల అతని భవిష్యత్ నాశనమై పోతున్నది. అటు వెంకట్రాయుడు గారికీ, ఇటు నాకూ మధ్య పడి నల్లెరులా నలిగిపోతున్నాడు . నన్ను సాహిసించి పెళ్లి చేసుకోడు. వాళ్ళ నాన్నకు ఎదురూ చెప్పలేడు. ఆపైన ఆర్ధిక స్వాతంత్ర్యమూ లేదు. అతన్ని బాధపెట్టడం నా కిష్టం లేదు జగ్గూ. అదీగాక వాసంతి కూడా అతన్ని ప్రేమిస్తున్నది. ఇద్దరూ భాగ్యవంతులు. సుఖపడటానికి కావాల్సిన వన్నీ వాళ్లకు ఉన్నాయి."
"నువ్వు చాలా పొరపాటు చేశావు చిట్టీ. ఆనాడే నా మాట వినుండాల్సింది" అని సంకోచిస్తూనే అన్నాడు జగన్నాధం.
'అందుకు నేను పశ్చాత్తాప పడటం లేదు. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు?' అన్నది చిట్టి పంచదార డబ్బా మూత పెడుతూ.
"ఆ ప్రశ్నకు సమాధానం నువ్వు భరించలేవు."
"ఎందుకని?"
"ఈ వయస్సులో ఆస్తి పోవటం, వ్యాజ్యాల గోల, ఎవరి మీద ప్రాణం పెట్టుకు బ్రతుకు తున్నారో ఆ కూతురు శత్రువు కొడుకు తో వెళ్ళటం; పరువు ప్రతిష్ట లు గంగ పాలు కావటం -- ఎవరికయినా ఒక్కసారిగా సంభవిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉన్నారు."
చిట్టి మాట్లాడకుండా కళ్ళ నీళ్ళు తుడుచు కుంది. కుంపటి అర్పి ఎక్కడి సామాను అక్కడ సర్ది జగన్నాధానికి వక్కపొడి సీసా అందిస్తూ -----
"మీరెవరూ కూడా క్షమించటం నేర్చుకోలేదు జగ్గూ" అన్నదామె. చిక్కిపోయిన నడుం వల్ల ఆమె రొమ్ములు మరింత స్పుటంగా కనిపిస్తున్నాయి. వాడిపోయిన చెక్కిళ్ళ వలన ఆమె కళ్ళు మరింత విశాలంగా అగుపిస్తున్నాయ్. బీదతనం వలనా, దుఃఖం వలనా ఆమె సౌందర్యం మరింత హెచ్చిందే గాని తగ్గలేదు.
ఆపవిత్రులు లోకంలోని తప్పుల్ని క్షమించాలను కుంటారు. అదే విజయ లాటి వారైతే తప్పులకు శిక్ష అనుభవించే తీరాలంటారు. వారి వారి పరిస్థితుల్ని బట్టి భావాలు కూడా ఉంటాయి కాబోలు.
"నేను క్షమిస్తాను. మీనాన్న క్షమించడు. లోకం అంతకంటే క్షమించదు. మా అక్కగారి లాటి వారయితే శపిస్తారు కూడా" అన్నాడు అతను.
"ఎవరా అక్కగారు?" కుతూహలంతో ప్రశ్నించింది చిట్టి.
"ఒక మహా ఇల్లాలు. ధర్మపధం తప్పని ఉత్తమురాలు" అని విజయ కధంతా చెప్పాడు జగన్నాధం.
అంతా అయినాక చిట్టి నవ్వి "ఇందులో ప్రత్యేకత ఏముంది?" అన్నది.
"ప్రవిత్రతే ప్రత్యేకత."
"ఇప్పుడు ఆమెకూ, నాకూ భేదం ఉన్నదంటావా నువ్వు?"
చిట్టి ప్రశ్నకు జగన్నాధం బిత్తరపోయి చూశాడు.
"చెప్పు జగ్గూ......వివాహం అవటం కాకపోవటం తప్ప భేదం ఎక్కడ ఉన్నదో! ఇద్దరం విపరీతంగా ప్రేమిస్తున్నాం. ఇద్దరం సమానంగా దుఃఖిస్తున్నాం."
"కాని నీలాగా ఆమె అతన్ని విడిచి పెట్టాలను కోటం లేదు."
"అది పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. అంత మాత్రం చేతనే కళంకం ఆపాదించటం అధర్మం. అనివార్యమైన కొన్ని పరిస్థితులలో ఆడవాళ్ళు తప్పులు చేస్తారు. అందుకే వాళ్ళ బ్రతుకంతా మసి పారుతుంది. నిజమే. కాని, జగ్గూ , ఆ తప్పు వల్లనే వాళ్ళను కులటలనడం గాని, రాళ్ళు విసరటం గాని మానవత్వం అనిపించుకుంటుందా , చెప్పు?"
"అక్కగారు తప్పు చేస్తే శిక్ష పొంది తీరాలంటుంది."
"ఆ మాట ఆవిడ ఇంతవరకూ తప్పు చెయ్యలేదు గనుక అనగలుగుతుంది. అంతే. అంతకన్న మరేం లేదు."
"తెలిసి కూడా తప్పు లెందుకు చేస్తారు మీ ఆడవాళ్ళు?"
"అది వాళ్లకు ఒక శాపం జగ్గూ" అన్నది చిట్టి.
సరిగ్గా ఆ సమయంలోనే వీరవాసరం వాసంతి సన్నిధానం లో నుంచి హటాత్తుగా ఊడి పడ్డాడు మురళీ. వస్తూనే తను మూడు నాలుగు రోజుల నుంచీ రానందుకు సంజాయిషీ చెప్పటానికి ప్రయత్నించాడు. చిట్టి అతన్ని వారించి --
"నువ్వేం చెప్పనక్కర్లేదు లే, కాఫీ తాగు " అని గ్లాసు అందించింది.
"ఉండు చిట్టీ ....మరేం........"
"అబ్బ ఊరుకుందూ. నాలుగు రోజులకు కళ్ళ బడిన వాడివి అలా ఉండు" అని అతని కళ్ళలోకి అతి ప్రేమగా చూసింది ఆమె. ఆనందం, వలన ఆమె చెక్కిళ్ళు కొద్దిగా కందినాయ్. మురళీ అప్పుడు చూశాడు జగన్నాధాన్ని.
"మీరు ఇక్కడే ఉన్నారా? చాలా సంతోషం" అని పలకరించాడు.
చిట్టి తల యెత్తి మురళీ కళ్ళల్లో కి చూసింది. వాళ్ళిద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. ఆ క్షణం లో అతన్ని నమ్మకుండా ఎవరూ ఉండలేరు. ప్రపంచపు నైర్మల్యం అంతా అతని కళ్ళల్లో తళుక్కు మంటున్నది.
"నిన్న మా నాన్నతో నిన్ను పెళ్లి చేసుకుంటా నని తెగేసి చెప్పాను" అని గర్వంగా పీట లాక్కుని కూర్చున్నాడు అతను.
జగన్నాధానికి వాళ్ళ నాన్న ఏమన్నాడో తెలుసుకోవాలనే కుతూహలం ఆగింది కాదు. ప్రశ్నార్ధకంగా మురళీ వంక చూశాడు.
"సరేనని డబ్బిచ్చాడు . రెండు రోజులయింది ఇది జరిగి. అప్పటి నుంచీ వద్దా మనుకుంటూనే ఉన్నాను. కానీ వాసంతి పిక్నిక్ కి రమ్మంటే .........."

అతని సమాధానానికి చిట్టి చిన్న పుచ్చుకుంది. ఆమెకు అదివరకే తెలుసు-- అతని మీద వాసంతి ఆకర్షణ ప్రబలంగా ఉందని. అయినా గాని ఇప్పుడు జగన్నాధం ఎదుట అతనా మాటలంటుంటే ఎందుకో సిగ్గనిపించింది.
"సరే,పోనీలే . నిన్నిప్పుడెవరు చెప్పమన్నారు? ఈ సంజాయిషీ అంతా" అని గద్దించి మురళీ ని ఊరుకో బెట్టింది ఆమె. అలా గర్జించక పొతే పిక్నిక్ కబుర్లు వసంతీ తనూ మాట్లాడుకున్న ప్రేమ మాటలూ-- అన్ని ఏకరవు పెట్టేస్తాడతను. జగన్నాధం దృష్టి లో తన పరిస్థితి మరింత దిగజారుతుంది. మొగుడు కొట్టినందుకు కాదు గాని తోడి కోడలు నవ్వినందుకు కన్నట్లుంది ఆమె పరిస్థితి.
అతను తనను పెళ్లి చేసుకుంటూన్నానని అన్నాడు గాని, అదెంత అసంభవమైన విషయమో ఆమెకు మొదటి నుంచీ తెలుసు. వెంకట్రాయుడు గారు సామాన్యులెం గాదు. తన కొడుకు మనస్తత్వం ఆయనకు తెలిసినట్లు మరెవరికీ తెలియదు. కొడుకు మాటలకు సరేనంటే పోతుంది. అది అయేది కాదు, పెట్టేది కాదు. అప్పటికే వాసంతి ఆకర్షణ లో పడ్డాడు మురళీ.
ఆర్ధికంగా తనమీద ఆధారపడిన ఏ ఆడదాని మీద అయినా మగవాడి మోజు అట్టే కాలం నిలవదు. అందుకోసమే సమాజం వివాహ విషయంలో ముందు జాగ్రత్తలు బోలెడు తీసుకుంది. అనుభావజ్జునుడు జిత్తుల మారీ అయిన వెంకట్రాయుడు గారు కొడుకు విషయంలో అనుసరిస్తున్న పద్దతి చాలా తెలివయినది. గట్టిగా కాదంటే ఏ రిజిష్ట్రారాఫీసు లోనో పెళ్లి చేసుకుని వస్తాడు. అవునంటే తనదే ననే ధైర్యంతో ఆలస్యం చేస్తాడు. ఈలోగా ఆ మోజు కాస్తా తీరిపోతుంది. అదీ అయన పధకం.
ఈ విషయం చిట్టి క్షుణ్ణంగా గ్రహించింది. కాని , అశక్తురాలు. అదృష్టం మీదా, విధి మీదా ఆధారపడి నంతగా తెలివి తేటల మీద అధారపడలేని ఆడది. అందుకే మురళీ మాటలకు లోలోపలనే విచారపడి మెదలకుండా ఊరుకుంది. ఒక్కో వ్యక్తికీ తన జీవితంలో అనుకోని పరిణామాలు ఏర్పడి జీవన మార్గాన్ని పూర్తిగా మరో మలుపు మలుపుతాయి. చిట్టి ఆశించింది వేరు. ఇప్పుడు అనుభవిస్తున్నది వేరు. ప్రేమ ఉంటె చాలు. పెళ్లి లేకపోయినా ఫరవాలేదను కుంది. కాని అదీ లభించలేదు.
ప్రాణంతో ఉన్న ప్రతి మనిషీ తను ఊపిరి పీల్చి జీవిస్తున్నంత కాలమూ ఏదో సుఖానుభూతి కోసం అన్వేషిస్తూ ఉంటాడు. కొన్ని నిర్ణీతమైన ఆశయాలతో అంతర్యాన్ని నింపు కుంటాడు. కాని బ్రతుకు ప్రారంభం లోనే అవన్నీ గాలి మేడలు కావటం నిజంగా ఒక పెద్ద శాపం.
చిట్టి లాటి ఆడవాళ్ళు ఈ దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్లకు అనంతమైన తెలివి తేటలుంటాయి. ఆసాధారణమైన విచక్షణా జ్ఞానం ఉంటుంది. కాని అన్నీ కూడా వృధా అయిపోతాయి. వాళ్ళ బలహీనతలను వాళ్ళు తెలుసుకోగలిగి కూడా అంతరాత్మకు వ్యతిరేకంగా సంచరించి చివరకు సర్వనాశనం అవుతారు. అలా అవుతామని వాళ్లకు ముందే తెలుసు. అయితేనేం? వాళ్ళు ఆ దోవలోనే ముందుకు సాగిపోతారు-- గమ్యం ఎంత భయంకరంగా ఉన్నా సరే.
వాళ్ళిద్దరి దగ్గరా సెలవు తీసుకుని జగన్నాధం బయటికి వచ్చాడు. నడుస్తున్న మార్గం మీద అతని దృష్టి లేదు. ఆలోచలన్నీ చిట్టి మీదనే ఉన్నాయి.
చిట్టిని తను చిన్నప్పటి నుంచీ ఎరుగును. అమెదొక చిత్రమైన ప్రకృతి. పైకి ఎంత ధైర్యంగా ఉన్నట్లు నటిస్తున్నా అంతర్యంలో ఆమె పిరికిది. అంత స్నేహ శీలి. తన పిరికితనం లోకానికి తెలియకుండా ఉండాలని ధైర్య వంతురాలిగా నాటకం ఆడుతుంది. ఈరోజు మాత్రం తన భయాన్నీ, బాధలను మడతలు విప్పి తన ముందు పరిచింది. అలాపరుస్తున్నంత సేపూ సిగ్గుతోనూ, అభిమానంతో నూ ఆమె అంతర్యం గిలగిల లాడిపోయింది.
జరుగబోతున్నదేమిటో తనకూ తెలుసు. ఆమెకూ తెలుసు. బ్రతుకులో దగాపడి సుఖాలకూ, మర్యాదకూ దూరమై పోయి, కన్న వాళ్ళ ను కాదనుకుని, కట్టుకున్న వాడంటూ లేక, వ్యామోహం చేత వంచితురాలైన చిట్టి కధ లాటి కధలు ఇంకా ఉండవచ్చును. ఉన్నాయి కూడా. లోకానికి కనిపించకుండా చాటుగా ప్రదర్శింప బడే అనంతమైన విషాద జీవన గాధల్లో ఇదీ ఒకటి. నిరామయగగనం తాలుకూ నీలి నీడల్లో , ఈ నూజివీటి సందుల చీకటి మూలల్లో,మ్ స్వార్ధం, మోసం, సంఘర్షణ, శక్తీ హీనత -- వీటితో కుళ్ళి చిత చిత లాడిపోతున్న ఒక విషాద జీవిత గాధ ఇది. ఇలాటి వెన్నో.....
సగం దూరం నడిచేసరికి జయప్రదరావు కు మందు తేవాలన్న సంగతి గుర్తు కొచ్చి డాక్టరు ఇంటి వేపు నడిచాడు జగన్నాధం. డాక్టరు గారిల్లు దగ్గర్లోనే ఉంది. మందు కలిపి సీసా చేతి కిస్తూ --
"ఎలా ఉంది ఈ పూట జ్వరం ?' అన్నాడు డాక్టరు.
"ఎవరికి?' ఆ ప్రశ్న వచ్చిన తరవాత గాని ఆ కన్సల్టింగ్ రూములో మరొక రున్నట్లు గమనించలేదు జగన్నాధం. తలెత్తి చూశాడు. ఆ ప్రశ్న వేసిన వ్యక్తీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు. భాగ్యవంతుల లక్షణాలన్నీ అతనిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
"ఒక డిగ్రీ తగ్గింది" అని డాక్టరు కు సమాధానం ఇచ్చి బయటికి వచ్చాడు అతను. గుమ్మం దాటుతుండగా డాక్టర్ సమాధానం వినిపించింది అతనికి.
"మీ అన్నగారికి" అని. జగన్నాధం ఆశ్చర్య పడ్డాడు.
జయప్రదరావు ఇతనికి అన్నగా రేలా అవుతాడు? నాలుగు అడుగులు నడిచేసరికి తన సందేహాన్ని కూడా మర్చిపొయినాడు అతను.
ఇంటి ముందు మినుకు మినుకు మంటున్న వీధి దీపం కాంతిలో విజయ తన కోసం ఎదురు చూస్తూ ఉండటం చూసి గబగబా నడిచి మందు ఆమెకు అందజేశాడు.
సీసా అందుకుని కృతజ్ఞతా భావంతో అతని వంక చూస్తూ "నిన్ను చాలా కష్టపెడుతున్నాను తమ్ముడూ. నువ్వంటూ లేకపోతె నా గతి ఏమయ్యేదో తల్చుకుంటే వణుకు పుడుతూ ఉంది" అన్నది విజయ.
"సరేలెండి. మీరివ్వాళ భోజనం చేశారా అసలు?' అని ఎదురు ప్రశ్న వేశాడు జగన్నాధం-- చెయ్యలేదని తెలిస్తే తను చేసేదేమీ లేకపోయినా.
