"సుజాత నవ్వుతో......"
"వృత్తి లయ్యరు. అనగా వకీలు. పూర్వాశ్రమంలో నా క్లాసు మేటు. ఇప్పుడు రెండు చేతులా ఆర్జిస్తూన్న ఒకానొక........"
"చాలు" అన్నాడు రాంబాబు.
"పోతే.....నువ్వు శంకరంగారితో మాటాడుతూండు. నీకు కాఫీ పట్టుకొస్తాను" అని వెళ్ళిపోయింది. మళ్ళీ అంతలోకే వచ్చి-
"తలనొప్పిగా ఉందని చెప్పారుగదూ. ఈ అమృతాంజనం వాడండి" అని ఆ డబ్బీ శంకరానికిచ్చి వెళ్ళింది.
రాంబాబుతో ఎలా మాతడలో అర్ధం కావడం లేదు. తన అవస్థ గ్రహించో ఏమో రాంబాబె మాటలు ప్రారంభించారు.
"హేవ్ ఏ సిగరెట్ ప్లీజ్" అన్నాడు సిగరెట్టు పెట్టి శంకరానికి అందిస్తూ.
"థాంక్స్" సిగరెట్టు తీసుకున్నాడు శంకరం.
ఇద్దరూ సిగరెట్లు ముట్టించుకున్నారు.
"మీరిక్కడ కొచ్చి ఎన్నాళ్ళయిందన్నారూ" అడిగాడు రాంబాబు.
జవాబు చెప్పాడు శంకరం.
"రంగారావ్ మీ కెలా తెలుసు?"
"చిన్నప్పట్నుంచీ కలిసి తిరిగాం. మంచి స్నేహితుడు."
"ఐ.సి." అన్నాడు రాంబాబు తలూపుతూ.
వాళ్ళిద్దరి మధ్యా అంతటితో మాట లాగిపోయాయి.
సుజాత కాఫీ పట్టుకొచ్సింది.
"నువ్వింత తొందరగా వస్తావనుకోలేదు రాం" అన్నది సుజాత.
"బలే దానివేలే.......వెళ్ళిన పనైనా గూడా ఆ శ్రీకాకుళంలో కాలు కాలిన పిల్లిలా తిరగమంటావా? మనసంత యిక్కడే పచారు చేస్తుంటే అక్కడేంతోచి చస్తుంది చెప్దూ. అద్సరే........ఇవ్వాళ ప్రోగ్రాం-"
"అది తేలకే ఇందాకనుంచి తలలు బద్దలు కొట్టుకుని ఆలోచిస్తున్నాం. "అన్నది సుజాత.
"ఏదైనా పిక్చర్ కి పోతే పొలా?" అన్నాడు రాంబాబు.
"ఎందుకూ పోదూ కానీ రాత్రే వెళ్ళాం."
"పోనీ......నా కోసం రాకూడదా ఏమిటి?" అన్నాడు రాంబాబు. కాళీ కప్పు టీపాయ్ మీద ఉంచుతూ.
సుజాత కాసేపు ఆలోచించి శంకరాన్ని అడిగింది.
"ఏమంటారు శంకరం?"
"సారి........నే నెక్కడికీ రాలేను"
"మీ పద్దతేం బాగోలేదు" నొచ్చుకుంటూ అన్నది సుజాత.
"తలనొప్పని చెప్పా గదండీ!"
"దట్సాల్ రైట్. మీకేమీ అభ్యంతరం లేకపోతే సుజాతా నేనూ వెడతాం" అన్నాడు రాంబాబు.
"తప్పకుండాను" అన్నాడు శంకరం.
రాంబాబు సుజాత వైపు చూసేడు. ఆవిడ ఏమీ మాటాడక పోవడంతో అడిగాడు.
"నువ్వేమంటావ్ సుజాత! చెప్పు త్వరగా అవతల వేళవుతుంది మరి."
"నే నాలోచించేది ఈ పూట భోజనం గురించి మనం సినిమాకి వెళ్ళిపోతే ఇక్కడ వంట చేసే దెవరూ?"
"నాకేం ఫర్వాలేదు. ఆకలైనప్పుడు, అలా హోటల్ కి వెళ్ళి భోంచేసి వస్తాను" అన్నాడు శంకరం.
"మా ఇంటి కొచ్చి గూడా హోటల్ భోజనమా?"
"ఫర్వాలేదు లేండి"
"బై ది బై-ఇవ్వాళ మనం గూడా ఏదైనా హోటల్లో చెయ్యి కడుక్కుందాం. ఇద్ధారం కలిసి భోజనంచేసి చాలా రోజులయ్యింది" అన్నాడు రాంబాబు ఉత్సాహంగా.
"ఇప్పుడు మన ముచ్చట్లే కావల్సొచ్చాయి" సుజాత కాస్త కటువుగా అన్నది. ఆ మాటతో రాంబాబు ఉత్సాహం నీరుకారిపోయింది. కొంత సేపు మవునంగా జరిగిన తర్వాత రాంబాబు లేచి నిలబడి-
"ఆల్ రైట్.....వెళ్ళొస్తా. అవతల మంచి ఇంగ్లీషు పిక్చరు ఇవ్వాళతో మారిపోతంది గూడాను మళ్ళా చూడటం పడుతుందో పడదో" అని రెండడుగులు వేశాడు.
"ఆగవయ్యా దేవుడా? నాకు మాత్రం రావాలని లేదూ?" అన్నది సుజాత. ఇంటి తాళం శంకరం చేతికిస్తూ, "మీ రెక్కడికైనా వెళ్ళదలుస్తే ఇంటికి తాళంవేసి వెళ్ళండి. మళ్ళా పదింటికి వచ్చేస్తాం. వెళ్ళొచ్చేదా మరి" అనేసి రాంబాబుతో కలిసి బయటికి వెళ్ళిపోయింది సుజాత.
కారు కదిలింది. శంకరం నిట్టూర్చాడు.
శంకరానికి ముళ్ళకంపమీద ఉన్నట్టుంది. ఉద్యోగం సంగతి దేవుడెరుగు-ఇక్కడ్నుంచి తక్షణం వెళ్ళిపోదామనిపించింది. సుజాత గురించి ఆలోచిస్తూంటే, అతని క్కాస్త కోపం కలిగిన మాటా వాస్తవమే! ఇలాంటి స్త్రీని తనను మునుపెన్నడూ చూడలేదు.
వాళ్ళు వెళ్ళి గంటయ్యింది. ఈ గంటా వాళ్ళ గురించి ఆలోచించడమూ, ఇష్టం లేకపోయినా 'రేజర్స్ ఎడ్జి' లో పేజీలు తిప్పడమూ చేశాడు శంకరం.
తనూ పట్టభద్రుడే. తనతోపాటు చదువు కున్న అమ్మాయిలూ ఉన్నారు. ఇద్దరి ముగ్గుర్తో మంచి పరిచయమూ ఉంది. అవుతే-అంత మాత్రాన.......
అంత మాత్రాన?........
తర్వాత 'భాగం' ఆలోచించడానికి సభ్యత అడ్డుపడింది. ఏమో........తనూహిస్తుందీ, ఆలోచిస్తుందీ పొరపాటేనేమో? నవ నాగరికతా, దాని తాలూకు డెవలప్ మెంట్సూ గురించి తనకు బాగా తెలీదేమో.
అయినా సరే......తను రాతి యుగం నాటి మానవుడైనా, అతని ఆలోచనలు ఆ యుగం నాటి వైనా, ఇది కేవలం తన మూర్కమే అయినా. ఈ రకమైన కలుపుగోలుతనం తన కిష్టంలేదు.
ఎనిమిది గంటలకి ఇంటికి తాళంవేసి హోటలుకి వెడుతూండగా ఎవరో ఇద్దరు యువకులు ఆ ఇంటి ముందు నుంచి వెడుతూ, తనని చూచి ఏదో మాటాడుకుని ఫక్కున నవ్వేశారు.
వాళ్ళు నవ్వుకున్న మాట వాస్తవమేగానీ, అది 'తనని చూచి' అనేది అతను అనుకున్నదీ, అతను అనుమానించిందీను.
హోటల్లో భోంచేసి కాసేపు గాంధీనగరంవంతెనమీద కూర్చుని తల వేడెక్కేంతవరకూ అదీ ఇదీ ఆలోచించి ఇల్లు చేరుకున్నాడు. తలుపు తీసి ఇంట్లోకి వెడుతూండగా వాళ్ళు వచ్చేశారు. కార్లోంచి సుజాత దిగింది. కార్లోంచే అతను చెయ్యూ పాడు వొస్తానంటూ కారు కదిలింది. సుజాత ఇంట్లోకి వచ్చింది. తనని చూస్తూ -
"మీరూ ఇప్పుడే వచ్చారులాగుంది"
"అవును"
"సినిమాకని బయలు దేరామా, కొంతదూరం వెళ్ళిన తర్వాతా దారి మార్చి ఇంజనీరింగ్ కాలేక రోడ్ వైపు కారు పోనిచ్చాడు. ఇదేమిటయ్యా మహానుభావా అని అడుగుతే, 'సినిమాకి వెళ్ళాలని లేదూ, నీతో కబుర్లు చెప్పాలని ఉందీ" అన్నాడు. సరే నీ ఇష్టం అన్నాను. కాసేపు ఆ రోడ్డు చివర కూర్చుని, కబుర్లు చెప్పుకుని, టవున్లో భోంచేసి ఇంటికి ఇప్పుడు చేరుకున్నాం. రాంబాబు చాలా చిత్రమైన మనిషి-ఇప్పుడున్నమాట మరో క్షణానికి ఉండదు"
రాంబాబు గురించి తనకి వినాలనిపించలేదు. అది తెలియజేయటానికే అతను పుస్తకంలో తలదూర్చి, సీరియస్ గా చదవడం నటించాడు. దాంతో ఆవిడ ఇంకా చెప్పబోయే ఉపన్యాసానికి బ్రేక్ పడింది.
ఎంతకీ ఆవిడమాట వినిపించకపోవడంతో, శంకరం పుస్తకంలోంచి తల తిప్పి ఆవిడ నుంచున్న వైపు చూశాడు. ఆవిడ అక్కడలేదు.
ఇంత గాలి పీల్చుకున్నాడు. బట్టలు మార్చుకుని హోల్డాలు సర్ది నడుం వాల్చాడు. ఇందాక అశ్రద్దగా వదిలేసిన 'రేజర్స్ ఎడ్జి' పేజీలు ఇప్పుడు శ్రద్దగా చదవడం ప్రారంభించాడు. పావుగంటలో సుజాత తన గదికి వచ్చింది వీధి తలుపులేసి.
గది గుమ్మం మీద ఆవిడ కూర్చోడంతో శంకరం తప్పనిసరిగా పుస్తకం మూసేయవలసి వచ్చింది. లోలోన విసుక్కుని లేచి కూర్చున్నాడు.
"మిమ్మల్ని యిబ్బంది చేస్తున్నాను కాబోలు-యినా రాంబాబు గురించి మీకు కొంత చెప్పాలని నా ఉద్దేశ్యం." అన్నది సుజాత.
"మల్లా రాంబాబు గురించి వినాలి కాబోలు ఖర్మ" అనుకున్నాడు రాంబాబు.
"అతని మాటలు చాలా మందిని నొప్పించవచ్చు. కానీ-అతని హృదయం చాలా మంచిది" అన్నది సుజాత.
"ఇప్పుడు కాదని ఎవరన్నారు చెప్పండి"
"మీ మాటకాదు నే చెప్తూంట. రాంబాబుని చాలామంది అపార్ధం చేసుకున్నారు. కుంటున్నారు. చివరికి మా వారిగ్గూడా అతనిపైన సదభిప్రాయం లేనేలేదు. రాంబాబూ నేనూ కలిసి చదువుకున్న మాట, అప్పట్లోనే పెళ్ళి చేసుకుందామనుకున్న మాటా రెండూ నిజమే. కాని పెద్దవాళ్ళు కాదనడం వల్ల, వాళ్ళమీద మాకు గౌరవం చావనందువల్ల మా పెళ్ళి జరగలేదు. ఈ విషయం పూర్తిగా తెలిసే వారు నన్ను పెళ్ళాడారు. ఇప్పుడు రాంబాబు మా ఇంటికి నన్ను చూచి పోదామని వస్తూంటే సహించలేక పోతున్నారు. ఐతే - అంతమాత్రాన బాధ పడిపోయి మా స్నేహం మామకునేంత ఫూల్స్ కాము? నెల రోజులక్రితం రాంబాబు భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అతను నాతో మాటాడటం ఆమెకీ బొత్తిగా నచ్చలేదుట. అలా అని చెప్పి చూచిందిట గూడాను. అతను నవ్వి వూరుకున్నాడు. దాంతో ఆవిడగారు పెద్ద రగడ చేసి, మరీ పుట్టింటికి వెళ్ళి పోయింది. పాపం-అప్పట్నుండీ రాంబాబు మనసు పాడై పోయింది. హు.....ఆవిడకి ఎంత చదువూ, ఎంత అంతస్థూ ఉండిమాత్రం లాభం ఏమిటి చెప్పండి. సంస్కారమంటూ లేకపోతే తర్వాత" అన్నదామె నిష్ఠూరంగా.
ఆవిడ చదువూ, సంస్కారమూ గురించి పాఠాలు చెప్పడం అతని కిష్టంలేదు. అయినా వినక తప్పడం లేదు.
ఆ తర్వాత రాంబాబుకీ, తనకూగల స్నేహాన్ని చూచి ఎవరెవరు ఎన్ని నిందలు వేస్తున్నారో తాము వాటి నెలా ఎదుర్కొంటున్నారో సవివరంగా చెప్పుకున్నది. ఈ భాగం కూడా శంకరానికి నచ్చలేదు.
కానీ- ఆమె తన ఉపన్యాసానికి కొస మెరుపు అన్నట్టు ఒక మాట చెప్పడంతో శంకరం ఉలిక్కిపడక తప్పిందికాదు.
"ఆయనంటారూ-'నువ్వూ రాంబాబూ కలిసి నన్ను అన్యాయంచేసే రోజు దగ్గర పడుతుంది సుజీ" అని" అని ఫకాలున నవ్వేసింది సుజాత.
ఈ మాట చెప్పి నవ్వటంతో ఆవిడ ఉద్దేశ్యం తనకి అర్ధం కాలేదు. పై పెచ్చు ఆవిడమీద కోపమూ కలిగింది. మళ్ళా సుజాతే అన్నది.
"అలా అనుకుంటే మా శ్రీవారి మీద నాకెంత అనుమానం ఉండాలి చెప్పండి? శ్రీవారి శృంగార లీలలు నాకు తెలీక పోలేదు. ఆయనకి వాళ్ళ ఆఫీసరుగారి శ్రీమతితోగల చనువు నా కళ్ళని మూసి, నన్నూ అన్యాయం చేయవచ్చుగా. నిన్న మనతో కేంప్ కెడుతున్నానని చెప్పారేగాని, నాకు నమ్మకం చాలడం లేదు."
ఈ ముక్కతో శంకరం బుర్ర గిర్రున తిరిగింది.
ఈ దంపతుల మధ్య ఇంత ఇరుకు వాతావరణం. అతను కలలోనైనా వూహించలేదు. ఇప్పుడు అసహ్యమనిపించింది. రంగారావ్ సుజాతల పట్ల విపరీతమైన కోపమూ కలిగింది.
ఆవిడ రంగారావ్ గురించి ఇంకా చాలా వివరాలు తెలియచేసి, చివరికి వస్తానంటూ సెలవు తీసుకుని తన గదికి వెళ్ళిపోయింది.
అప్పుడు శంకరాని కనిపించింది-తాను వచ్చిందీ ఆతిథ్యం పొందుతున్నదీ రెండు మహా భయం కరమైన మనస్త్తత్వాలు కాపురం చేస్తూన్న ఇంట్లో ననీ, వాళ్ళు తానూహించినంత అన్యోన్యానురాగాల్లో తేలిపోవడం లేదనీ, అనుక్షణం ఒకరిమీద ఒకరు ద్వేషం, పగ, ఈర్ష్యల్తో సతమతమై పోతూన్నారనీను.
అతని మనసు కలత చెందింది. ఆ ఇంట్లో మరో క్షణమైనా ఉండ బుద్ధి పుట్టలేదు. ఆ రాత్రికి రాత్రే పెట్టే బేడా తీసుకుని బయట పడ్డాడు.
రైలెక్కుతూ అనుకున్నాడు.
'నే చేసింది తప్పా?'
జవాబూ చెప్పుకున్నాడు.
'నా మనసు కిష్టంలేని వని ప్రతిదీ తప్పే దాన్నుండి తప్పించుకుని బయట పడటం ఒప్పే'.
* * *
ఇంట్లోంచి బయటకి రావడం ఆలస్యం పగ పట్టినట్టు ఈ ఎండ తన ప్రాణం తీస్తోంది.
జానకిరామయ్యగారు విసుక్కున్నారు. ఆయనకీ రోజంతా చికాగ్గా ఉంది. ఉదయం ఆ సంబంధం గురించి మాటాడిన లగాయతూ ఇప్పటి వరకూ చిరాగ్గానే ఉంది మనసు.
పిల్లాడి స్వగ్రామం వాన పాములు. అతను బి.ఏ. వరకూ చదువుకున్నాట్టగానీ పొరపాటున పరీక్ష కాలేక అదృష్టం పండి రైల్వేలో ఉద్యోగం సంపాయించుకున్నాట్ట. అందమైన మనిషి ట గూడాను. వెనక ఆస్థీ ఉందిట. దానికి తగ్గట్టు భాగస్థులూ ఉనారుట. మంచి సాంప్రదాయం.
అవుతే వచ్చిన చిక్కల్లా కట్నం దగ్గరే!
వాళ్ళు పదివేలకి దమ్మిడీ తగ్గరట. లాంఛనాలన్నీ సక్రమంగా ఉండాలిట. పిల్లకి మాత్రం నాలుగు నవర్సుల బంగారం పెడతారుట.
జానకి రామయ్య గారు జవాబు చెప్పలేదు.
పదివేల రూపాయలంటే మాట్లా? ఈ మిగిలున్న అయిదెకరాలూ సుశీల పెళ్లికే అయిపోతే ముందెలా జరుగుతుంది? అసలు ఆ భూమిని చూచే తాను ధైర్యంగా ఉంటుంది. ఆ ఉన్నది కరిగిపోతే ఎవడినో ఒకడిని ఆశ్రయించి బ్రతకాల్సి వస్తుంది. కొడుకు లిద్దరూ రత్నాలే-,అయినా ఏమిటో ఆశ్రయించడమనే మాట తలుచుకుంటే ఆయనకి చిన్నతనంగా ఉంది.
సుశీల అదృష్టం బాగుండాలేగాని ఈ సంబంధం కాపోతే దీని తల తన్నిన జేజెమ్మలాంటి సంబంధం మరొకటి వస్తుంది. ఆ పిల్లని ఒక గొప్పింట్లో వేసే బాధ్యత తనకుంది. సుశీల అదృష్టంపట్ల తనకి నమ్మకమూ ఉంది.
పెళ్ళి వందేళ్ళ పంటన్నారు. బాగా ఆలోచించి కాని ఒక నిర్ణయానికి రాకూడదన్నారు. పోనీ-ఈ అయిదెకరాలూ అమ్మి సుశీలకి ఆ వానపాముల సంబంధమే నిశ్చయిస్తే రేపు సుశీల అ ఇంట్లో సుఖ పడుతుందని గ్యారంటీ ఏమిటి? ఆ ఇల్లు పెద్ద ధర్మ సత్రం లాటిదని వచ్చిన పెద్ధ మనిషి చెప్పనే చెప్పాడు. ఆ మ్ట్లో అంతమంది జనాభాకీ చాకిరీ చెయ్యలేక పిచ్చితల్లి కుమిలిపోతే?.........వీల్లేదు. సుశీల కంట తడిపెడితే తాను చూడలేరు. ఆ పిల్లని తన గుండెలమీద పెట్టుకుని పెంచారు.
ఆలస్యమైనా సరే అన్ని విధాలా యోగ్యమైన సంబంధాన్నే తీసుకు రావాలి. సుశీల ఈ తరం పిల్ల కాదు. గర్వం, అహం మచ్చుకైనా లేవు. తనేవిటో తన ఇల్లేమిటోగాని మరో విషయం ఆలోచించదు. ఇరుగింటి ఎల్లమ్మా, పొరుగింటి పుల్లమ్మల్తో బాతాఖానీ సుశీలకు ఇష్టం లేదు. ఇంటావిడ కూడా సరిగ్గా ఇలాగే ఉండేది. తన పిచ్చి గాని ఆ తల్లి కూతురిగా ఈ పిల్ల!
తన మాటకిగాని, అన్నయ్యల మాటకిగాని నీవాడు - ఎదురు చెప్పి ఎరుగదు. కోపం కొద్దీ తామెధైనా అంటే తఃనలో తనే బాధపడి పోయి చాటుగా ఏడుస్తుందేగాని మాటకి మాట చెప్పే పద్దతి లేనె లేదు.
