మొన్న తను బస్సు దిగి యీ వూరోస్తున్నప్పుడు యిదే త్రోవనోచ్చేడు. ఆ విషయమే తాతతో చెప్పాడు. తాత ఒకచోట రోడ్డు దిగి ప్రక్క త్రోవని నడవడం ప్రారంభించాడు. అది బీభత్సకరంగా ఉన్న తుమ్మ చెట్ల మధ్య నుంచి పోవాల్సి వున్నది. మనిషి నడవడానికి వీలుగా చిన్న కాలిబాట మాత్రం ఉంది. అటూ యిటూ తుమ్మ తుప్పలూ, కొంచెం దూరంలో సరుగుడు చెట్లూను. తాత అన్నాడు.
"ఉత్త రోజుల్లోనే యీ ప్రాంతాల జనసంచారం అట్టే ఉండేది కాదు. మావయ్య గారు పోయిన దగ్గర్నుంచీ యీ పక్కకి రావడానికి పగలే భయపడుతున్నారు వూరి వాళ్ళు."
"మొన్ననే నీవూరోస్తున్నప్పుడు కూడా భయపడుతూనే వచ్చాను, అప్పటికి రాత్రి తొమ్మిదైనా కాలేదు" అన్నాడు రాజారావు బెరుగ్గా.
మరి కొంతదూరం వెళ్లి, అక్కడ ఆగిపోయాడు తాత. వాళ్లకి కొంచెం దూరంలో మోకాలు దాటి పచ్చ గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. ఆ కాస్త మేరా భయంకరంగా వుంది. సరుగుడి చెట్ల గుంపు మీదుగా ప్రయాణం చేసే ఈదురు గాలి తాలూకు శబ్దం కూడా, ఆ నిశ్శబ్దం లో భయం పుట్టిస్తుంది.
తాత తనేదురుగా ఉన్న స్థలం వైపు చెయ్యెత్తి చూపుతూ "అక్కడే మావయ్య గారి శవం పడున్నది. అయన పక్కనే రక్తసిక్తమైన కొడవలి ఉన్నది." అన్నాడు.
రాజారావు సిగరెట్టు పారేశాడు. మరో కొత్త సిగరెట్టు వెలిగించాడు. అగ్గి పెట్టేపైన రేపర్ చించుతూ ఏదో ఆలోచనలో మునిగి పోయేడు. తాత రాజారావుతో వాళ్ళ మావయ్య గారి హత్య తాలుకూ వివరాలేవో చెప్తూనే ఉన్నాడు. అయన చెప్తున్న వన్నీ వింటూ రాజారావు చుట్టూ పక్కలన్నీ శ్రద్దగా గాలించి వెదకడం ప్రారంభించేడు. అతని మస్తిష్కంలో ఏవేవో ఆలోచనలు, బుర్ర వేడెక్కి పోతోంది. అయినా అతను పిచ్చి కుక్కలా ఆ ప్రదేశ మంతా తిరిగేస్తున్నాడు.
తాతకిదేమీ అర్ధం కాలేదు. రాజారావు మరో సిగరెట్టు ముట్టించెడు. ఖాళీ అగ్గి పెట్టె ను పారేశాడు. ఒకచోట నించుండి పోయాడు. చేత్తో మొహాన్ని రుద్దుకున్నాడు. అకస్మాత్తుగా అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి. కళ్ళు వత్తుకుంటూ అన్నాడు.
'అంత గొప్పగా బ్రతికిన మనిషి చివర్కి వూరికి దూరంగా, యీ దిక్కుమాలిన చోట నిర్ధాక్షిణ్యంగా హత్యచేయబడ్డాడు. విధి నేమనాలి తాతా?' అతని గొంతు గాద్గదికమయ్యింది.
"అదే నాయనాలీల ! నీకూ నాకూ అంతుపట్టని లీల." అన్నాడు తాత రాజారావు భుజాల్ని తట్టుతూ.
-- మరో పది నిముషాల్లో ఇద్దరూ యింటి దోవ పట్టారు. వూళ్ళో కి వచ్చే వేళకి వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎక్కడా ఏవిధమైన అలికిడీ లేదు. అసరికి అందరూ గాడమైన నిద్రకి లొంగిపోయి ఉంటారు.
తాత దగ్గర సెలవు పుచ్చుకుని యింటి వైపు కదిలాడు రాజారావు.
-- రామదాసు తాతకి నిద్ర పట్టలేదు. పాత ట్రంకు లో ఉన్న టార్చి తీసుకున్నాడు. తలకి టవలు చుట్టుకున్నాడు, ఆ రాత్రి చలిలో ఒంటరిగా ఆ హత్యా ప్రదేశం వైపు నడక సాగించాడు.

3
నిర్మానుష్యంగా ఉన్న వీధి వెంట గబగబ అడుగు లేసుకుంటూ ఇల్లు చేరుకున్నాడు రాజారావు. ఆవరణ లోకి అడుగు పెడుతూ టైము చూసుకున్నాడు. తొమ్మిది గంటలు దాటింది.
"పాపం వీళ్ళని భోజనానికి ఆలస్యం చేశాను. ఏమను కుంటున్నారో ఏమో!" అనుకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చిన అతనికి సుభద్రమ్మ గారు ఎదురయింది.
"వచ్చావా నాయనా! నీ కోసం ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను" అంది ఆవిడ - మీద నుంచి పెద్ద బరువు తీసినట్లుగా.
సిగ్గుపడి పోయాడు రాజారావు.
"లేదత్తయ్యా , అలా రామదాసు తాత-- అదే అ ముసిలాయానతో వెళ్లాను. రావడం చాలా ఆలస్యం అయిపొయింది. పాపం నీకిబ్బంది కలగ చేశాను."
"సరేలే!! ఆ సంగతి ఇప్పుడసలు ఆలోచించిందేవరుట? ప్రొద్దు క్రుంకేసరికి అందరూ కొంపలకి చేరుకుంటారు. ఈ పల్లెటూళ్ళ లో, అటు వంటిది నువ్వు తొమ్మిదేసినా రాకపోవడం, అందునా ఇక్కడికి కొత్త వాడివి కావడం, అన్నిటి కన్నా మించి..." ఆమె గొంతు రుద్దమయి పోయింది.
కాని ఆమె చెప్పబోయేదేమిటో రాజారావు వూహించుకున్నాడు.
హాల్లోకి రాగానే అంతవరకూ ఆత్రంగా గుమ్మనికేసి చూస్తున్న వరలక్ష్మీ చంగున లోపలికి వెళ్లి పోవడం అతని కంట పడింది.
నవ్వుకున్నాడు.
భోజనం చేస్తూ తను చూసిన విషయాలు, విన్న మాటలు చేబుతుండడం అతనికి అలవాటు. అయినా తనీ రోజున చూసినది హత్యా ప్రదేశం కావడాన ఆ ప్రసక్తి తేవడానికి అతనికి ఒక పట్టాన ధైర్యం చాలింది కాదు.
అతను చెప్పక పోవడం వలన ఆవిడే అడిగింది? "ఎక్కడికి వెళ్ళవు ఇంత ఆలస్య మయింది?" అని....
కొంచెం సేపు తటపటాయించి అన్నాడు రాజారావు "మావయ్య ని -- మావయ్య హత్య చేయబడిన చోటుకి " అని.
కాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు.
గుమ్మం కి ఆవలగా నిలబడి వరలక్ష్మీ అడిగింది "ఎందుకట?' అని.
"ఎందుకు అని అడుగుతే సూటిగా సమాదానం చెప్పలేను గాని అది ఏమయినా సాయపడుతుందేమోనని! రామదాసు తాతని తీసుకు, వెళ్ళమంటే చూపించాడు.
"ఆ ప్రదేశం అంతా చాలా నిర్మానుష్యంగా గాను, భయం కలిగించేది గాను ఉందత్తయ్య! చుట్టూ తుమ్మ చెట్లు, కింద మోకాలు లోతున పచ్చగడ్డి, పిచ్చి మొక్కలు....కాసేపు అక్కడ నిలబడితే మనస్సులో తెలియని దిగులు, బాధ కలుగుతాయనుకో! నేనిక అక్కడ ఉండలేక పోయాను."
సుభద్రమ్మ గారు నిశ్శబ్దంగా కళ్ళు ఒత్తుకుంది.
'అయినా మావయ్య కి పిచ్చి గాని ఈ రోజుల్లో వైద్యానికి అంత కష్టపడాలా-- చేతికి అందింది వాళ్ళ ముఖాన కొట్టి అదే మందు అంటే వెళ్లి పోతున్నారు. ఆ ఇచ్చిన మనిషి మీద నమ్మకం ఉంటె టక్కున నయమయి పోతున్నాయి కూడా. లేకపోతె "వైద్యుడు ' అని బోర్డు పెట్టిన ప్రతి వాడికి కుటుంబాలు ఎలా గడిచి పోతున్నాయని........"
అతనింకా ఏదో అనబోతుంటే వరలక్ష్మీ "మరీ అంత తేలిగ్గా మాట్లాడబోకు బావా, ఎవరో కొందరు ఉన్నారని అందరినీ అలా అంటే ఎలా-- మా నాన్నగారి లాగా దాని మీద పరిశోధన చేసేవాళ్ళు బోలెడు మంది" అంది కొంచెం నిష్టూరంగా.
రాజారావు ఖంగారు పడ్డాడు.
"నా ఉద్దేశం అది కాదు వరం!" అన్నాడు నవ్వటానికి ప్రయత్నిస్తూ.
కాని వినేందుకు వరలక్ష్మీ అక్కడ లేదు!
'అయినా మన ఖర్మ గాని నాయనా, అయన అంతక్రితం అలా ఎన్నిసార్లు వెళ్లారు కారు. అక్కడికీ నేనూ నీలానే చెబుతుండే దాన్ని -- "ఎందుకు అంతగా శ్రమ పడతాను, మీ శరీరం కూడా మంచిది కాదు. పోనీ, ఆ వెళ్ళే దేమిటో పగటి పూట వెళ్ళరాదా -- అర్ధరాత్రీ, ఆపరాత్రీ పోకపోతే' అని, అయన నవ్వేశేవారు-- "ఈ వూళ్ళో పుట్టి పెరిగిన వాడిని, ప్రతి అంగుళం నేలా నాకూ పరిచయ మయినదేనే పిచ్చిదానా" అని....ఇందాక నువ్వు రావడం ఆలస్యం అయితే నా మనస్సు ఎన్ని విధాలయిపోయిందో తెలుసా? పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా వచ్చాయి. ఎంతగా అపుగుందామన్నా ఆగలేదు. దెబ్బతిని ఉండటాన్న మనస్సు ఎప్పుడూ కీడునే శంకిస్తుంది.... అవ్వాళ కూడా ఇంకా వస్తారు . ఇంకా వస్తారు అని చూస్తూ కూర్చున్నా. వరలక్ష్మీ భయపడినా నేనే ఇంకా డానికి ధైర్యం చెప్పాను. "మీ నాన్నని నా పదహారవ ఏట నించి ఎరుగున్న దాన్ని, అయన కిలా రావడం అలవాటే" అని. కబురు విన్నాక కూడా తప్పేమో అనిపించింది చూసే దాకా...."
రాజారావు ఈ మాటలను వినిపించుకునే స్థితిలో లేడు. వరలక్ష్మీ అలా వెళ్లి పోవడం అతన్ని కలవర పెట్టింది. గబగబ భోజనం ముగించుకుని గదిలోకి వెళ్ళాడు. కొద్ది సేపటికి వక్కపొడి తీసుకొచ్చింది వరలక్ష్మీ.
"కోపం వచ్చిందా వరం నా మాటకి" అనడిగాడు నేరస్థుడి లా.
"ఏ మాటకి బావా?"
"అదే-- వైద్యం చేసే వారంతా ....అని నేను అన్న డానికి."
ఫక్కున నవ్వేసింది వరలక్ష్మీ. "ఓ అదా కోపం దేనికి? నీకు మాత్రం తెలియదూ నాన్న గారంటే నీకెంత గౌరవం వుందో?"
"భయపడి పోయాను సుమీ నీకు కోపం వచ్చిందని....ఇవ్వాళ ఆలస్యంగా వచ్చి అత్తయ్య ని ఖంగారు పెట్టేశాను."
"అవును బాబూ , భలే భయపడి పోయాం" అంది బుంగమూతి పెట్టి వరలక్ష్మీ.
"పోయాం ' అంటున్నారు తమరు కూడా....!"
"పో! బావా!"
ఇదరూ ఫక్కున నవ్వేశారు. నవ్వుతున్న వరలక్ష్మీ ని చూసి ముగ్దుడయి పోయాడు రాజారావు. అంతలోనే సీరియస్ గా-----
"పల్లెటూళ్ళ ను గురించి నాకున్న కొన్ని సదభిప్రాయాలు పటాపంచలయి పోయాయి వరం! ఇక్కడి జనాభా యావత్తు అమాయకులని, వాళ్ళ పనులు, వాళ్ళ గోలే కాకుండా పొరుగు వారి సౌభాగ్యానికి కూడా పాటు పడతారని , వాళ్ళ కేమయినా కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది తమకి జరిగినట్లుగానే బాధ పడిపోతారని అనుకునే వాడిని. ఇప్పుడు నేను కొద్దిగా పోరాపడ్డానని తెలిసి వస్తోంది. పోరుగువారిని గురించి పల్లెటూళ్ళ లో పట్టించు కున్నంతగా ఇంకెక్కడా పట్టించుకోరు. అయితే అది వారి మంచి గురించి కాదు -- వారిలో ఏదయినా తప్పుంటే దాన్ని భూతద్దంలోంచి చూస్తారు. చూపిస్తారు. కొత్త వాళ్ళెవరయినా......."
"ఇంతకీ ఇప్పుడేమయిందంటావు బావా?"
"నాకీ వూరి వాతావరణం నచ్చడం లేదు వరం. ఎవరిని చూసినా మరోడి మీద కధలు చెప్పేవాడే! ఎవరు మంచో , ఎవరు చెడో తెలిసి చావదు."
పకపక నవ్వింది వరలక్ష్మీ. తెల్లబోయాడు రాజారావు......
"ఇదా నీ బాధ. వాళ్ళని గురించి అంతగా పట్టించు కో కూడదు బావా! మనం అడిగితె చెబుతారా అడక్కుండానే చెబుతారా? చిన్నప్పటి నుంచి బస్తీ లో పెరిగిన వాడివి పాపం-- ఇక్కడి వారితో ఎలా మెసులు కోవాలో తెలియదు నీకింతే!....హాయిగా కలలు కంటూ పడుకో-- వస్తాను."
అతను మాట్లాడలేదు.
"కోపమా?"
"ఎందుకటా?"
"ఏదయినా పుస్తకం కావాలా?"
"కలలు కనమన్నావుగా-- నాతొ మాట్లాడేవి కలలే!"
"పోనీ నేను కలలో కనబడతాగా-- గుడ్ నైట్!"
