"ఇవన్నీ చెప్పాలా ఏమిటి? చౌదరయ్య తల్లికి చెప్పేను. పాలు తోడెటించే. దూడకు...."
ఫక్కున నవ్వేడు. వెళ్ళేది పెళ్ళికాయిరి మరి.
"శాంతా, ఇల్లు జాగ్రత్త" అంటూనే బండి ఎక్కేరు. రోడ్డు మలుపు తిరిగేవరకూ చూచి వాకిటి తలుపు వేసుకుంది. ఇటువంటి ఇంటి కాపలాలు శాంతకు అలవాటే. రాత్రిళ్ళు మాత్రం చౌదరయ్య తల్లి వెంకటమ్మ సాయానికి వచ్చేది. ఇతర దైవచరిత్రల మాటెల్లా ఉన్నా. వెంకటమ్మ కాశీ మజిలీలంటే చెవి కోసుకుంటుంది. అందులో ఉన్న కథలన్నీ నోటికి వచ్చు. చెప్పడంలోకూడా అంత మెలకువా ఉంది. మహ బిగువు, పట్టుగా చెప్పడంలో జాణ.
శాంతకు ఏదో రెండు మెతుకులు కొరకడం, ఇక వెంకటమ్మ కథ చెపుతూంటే వింటూ ఉండడమే. మధ్యలోమాత్రం కాస్సేపు దొడ్లోకి వెళ్ళి వచ్చేది. దగ్గు, ఆయాసం మూలాన్ని కాస్త చుట్ట కాల్చడం అలవాటు. అది తనకు వింతగా ఉన్నా వయస్సులోని దిగతీతకు గౌరవంగానే చూచి ఊరుకునేది శాంత. ఎక్కడ వాసన తగులుతుందో అని పుక్కిలించి మరీ వచ్చేది.
వెంకటమ్మ వయస్సు డెబ్బై అంటే ఎవరూ నమ్మరు. ఆ జార్జి చక్రవర్తి వచ్చేసరికి తను చౌదరయ్యను మోస్తూందట.జమాజట్టి. కావలిస్తే నడుంకట్టి పదిమందిలోనూ చొరబడి నెగ్గుకు వచ్చే ధైర్యం.
"ఇంత ధైర్యం నీకెల్లా వచ్చింది?" అమాయి కంగానే శాంత అడిగేది.
"చచ్చి ఏలోకంలో ఉన్నాడో, ఆయన అల్లా మెరుగుపెట్టేరు. మనిషంటే ఉక్కుతునక. కోటి రామ్మూర్తిలావుండే వారు....." అని ప్రారంభించి తన ఇంట్లో దొంగలు కన్నం తవ్వడం, తలదూర్చేసరికి రోకలి పుచ్చుకుని చితక బొడిచి, కారం చల్లడం చెప్పేది.
ఇది శాంతకు పదోమాటో, ఇరవయ్యో మాటో వినడం అయినా వినాలనే ఉండేది. అది ఒప్పుకోవాలంటే వెంకటమ్మ లోని వాగ్ధాటి, అందులో ఉన్న సౌందర్యమున్నూ.
నోట్లోకి బెల్లం ముక్క ఇచ్చి కూర్చన్నప్పుడే "ఏం శాంతమ్మా! మీమావ మారుమనువు చెయ్యాలనుకుంటున్నాడుట నీకు. నిజమేనా?" అంది.
తెల్లబోయింది శాంత- ఇంట్లో జరిగిన విషయం వెంకటమ్మకు ఎల్లా తెలిసిందా అని. అత్తయ్య చెప్పిందా?
"ఏం, అల్లా కళ్ళప్పగించేవు? మావాడే అన్నాట్ట, అపనిచేస్తే మంచిదని, పైగా రామశాస్త్రిగారి కొడుకును దత్తత తెచ్చుకుంటే నిండు అవుతుంది."
తనే తప్పు అర్ధం తీసుకుని సందేహించింది.
"ఆ బుల్లి బాపనాడిని నేనోసారి చూచే. బాగానే వుంటాడు. ఏదో చదువుకున్నాడుట విజయనగరంలో, పెళ్ళిళ్ళు చేయిస్తాడుట కూడాను."
కోపం వచ్చినా దిగమ్రింగుకుంటూనే, "చేసుకోమన్నానా?" అంది.
"అదేమిటల్లా అంటావు?"
"నీ ఉద్దేశ్యం ఏమిటి?"
"పడుచు పిల్లల్తో నేనేం చెప్పగలనూ?"
"అయితే ఒక్కటి అడుగుతా చెపుతావూ? సూరయ్యపోయి ఎన్నేళ్ళయ్యింది?"
"బందరు ఉప్పెనకి."
"ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాడా?"
"ఎందుకుండడు?"
"ఉన్నాడు కాబట్టే నువ్వు మారుమనువు చేసుకోలేదు. మరిచిపోయే వుంటే......"
కొరడాతో కొట్టినట్లయ్యింది వెంకటమ్మకు. ఎంత తెలివిగా చురకవేసింది! కమ్ముకున్నట్లు గానే.
"అయితే అతను నీలో అంతగానూ ఉండి పోయేడా?"
తలవంచి పైకి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంది.
"వెంకటమ్మా, నా బ్రతుకు నన్నెందుకు బ్రతకనివ్వరు?" అనేసింది.
దగ్గరగా వచ్చి, కళ్ళు తుడిచింది. అనునయంగా కాశీమజిలీ కథల్లో రాజకుమార్తెల ఎడబాటు గుర్తుకు వచ్చినా, నోరు పెగలలేదు. శాంతలో ఏ మహత్తో ఉంది. ఇంత మిసమిస లాడే వయస్సులో ఉన్నా ఒంటరిగానే భరించు కోవడానికి ఎల్లా దిటవు అయ్యింది అన్నది అర్ధంకాలేదు.
తర్వాత ఆ విషయం మాట్లాడలేదు. మాగన్నుపడేవరకూ మౌనంగానే ఉండి పోయేరు. ఊరుమాటుమణిగినట్లు దూరంగా వినిపించే కుక్కల అరుపు, రెపరెపల పక్షుల శబ్దం వినపడుతూనే ఉంది.
"పడుకో, శాంతమ్మా" అంటూనే లేచి తన ప్రక్క సర్దుకుంది. నడుం వాల్చేవేళకే వీధి తలుపు బడబడా బాదుతూనే, "అవధాన్లు గారూ! తలుపు తెరవండి. నేను లక్ష్మయ్యని" అని కేక.
"ఎవరది?" పాలికేకలా వెంకటమ్మ.
"ఎవరూ? అత్తయ్యా! నువ్వా? నేను లక్ష్మయ్యని."
కర్ర ఊతంతోనే లాంతరు పట్టుకు వీధి తలుపు తీసింది.
"ఏం? ఏళాపాళాలే..." ఆగిపోయింది.
"చేనుగట్టుకాడ శోషకొట్టి పడి ఉండడు. మెళ్ళో జంజం ఉంది. ఏ వూరు బాపనాయనో అని భుజాన్న వేసుకొని వచ్చే." ప్రవర చెవుతూనే కవాచీ బల్లమీద పడుకోబెట్టేడు.
లాంతరు వత్తి పెద్దది చేసి, ముఖం చూచింది. "ఊ" అంది. "అమ్మాయీ. కాసిన్ని మెతుకులు, చల్లలో పిసికి పడితే మంచిదే" అని ఊరుకుంది.
ఎవరో అన్న జాలి, శోష తప్పేడన్న భయంలో మారు జవాబు చెప్పలేకనే బుడ్డి పుచ్చుకు వంటింట్లోకి పరుగెత్తింది. అన్న సారం పిప్పి తీస్తున్నప్పుడే 'ఆయన బ్రాహ్మడు. వెంకటమ్మకి ఇచ్చి ఎల్లా త్రాగిస్తాను' అనుకుంది. అంతవరకూ తను మరో మనిషికి విస్తరి వెయ్యలేదు తన చేతులతో. అవన్నీ అత్తగారే చేసేది.
ఈ సమయంలో అత్తయ్యకాని, మావయ్య కాని లేకపోవడం తనకు పరీక్షే అయ్యింది.
"వెతుక్కుంటున్నా వెతుక్కుంటున్నా!" అతని కలవరింపు. గుండెలు ఝల్లుమన్నాయి. లక్ష్మయ్య నుదుట మీద చెయ్యివేసి చూచేడు.
"అత్తమ్మా! ఒళ్ళు తాటరేగిపోతోంది" అన్నాడు.
"శాంతమ్మా! ఆ గిన్నేది?"
తటపటాయించింది. అత్తగారే ఉంటే ఈ పని జరగకపోయేది. ఆవిడే కంచీ పుచ్చు
కున్నట్లే తను నడిచి కవాచీ బల్లదగ్గరకు వచ్చేసింది. అర్ధం గ్రహించి వాళ్ళు ప్రక్కకు ఓపరిల్లేరు.
ఏటవాలుల్లో పడిన లైటు వెలుతురు, పెరిగిన గడ్డం, లోతుబడ్డ కళ్ళు, డోక్కు పోయిన దవడలు మరుగ్గానే చూపెట్టేయి. 'ఎవరో స్వకులస్తుడు. అతిధి' అన్న అన్నపూర్ణ హస్తంలోనే, చెంచాతో నోటికి అందించ బోయింది. కాని స్ప్రుహలేని శరీరం. క్రిందనే పోసినట్లయ్యితే? లాంతరు దగ్గరగా ఈడ్చింది.
మెరుపు కొట్టినట్లు, ఎక్కడో తుప్పు ఎక్కిన తంత్రి గమకంతో లాగినట్లు అయి, ఆ గిన్నె అక్కడే పెట్టి ఇంట్లోకి పరుగెత్తింది. ఆ ఉదుట దేవి మందిరంలోకే వెళ్ళింది. సాష్టాంగ పడుతూనే, "అమ్మా! ఏమిటిది? ఏమిటిది?" అని గగ్గోలే పెట్టేసింది. శరీర స్మృతే లేనట్లు ఆవేశం ఆవురించింది.
ఫక్కున నవ్వుతూనే "భయపడింది" అని తమ గిన్నె తీసుకుంది. దగ్గరగానే వచ్చింది. లాంతరు ఎత్తి ముఖంలోకి లక్ష్మయ్య చూపించేడు. యధాకృతుగానే చెంచా ముంచింది. బుగ్గల అంకెలు నొక్కిపడుతూనే రెండు మూడుసార్లు గుటక వేయించింది.
"అమ్మా!" అతను మూలిగేడు.
"ఫరవాలేదు, లక్ష్మయ్యా!" అంటూనే గిన్నె ఖాళీ చేయించింది.
అన్నసారం రెండు మూడు గుటకలు పడేసరికి కాస్త తెప్పరిల్లినట్లయినా, జ్వరం మగతమాత్రం పోనట్లుగానే కవరింతలు వచ్చేయి. ఫరవాలేదు అనుకునే "ఈ రాత్రికి ఈడ పడుకో" అని ఈతాకు చాపచుట్ట ఇస్తూనే లోపలికి వచ్చింది. శాంత మంచం మీద లేదు. కంగారుగా పడమటింటివరకూ వెళ్ళింది.
బాహ్య స్మృతి లేనట్లు, రోదిస్తున్న శాంతను చూచేసరికి ముచ్చెమటలూ పట్టినట్లయ్యింది. ఒక్క అంగలో వెళ్ళి ఒళ్ళోకి తీసుకుని, "భయపడ్డావా, ఏమిటమ్మా? ఉండు, ఆంజనేయ దండకం చదువుతా" అని ప్రారంభించింది.
తెలివి రానీయకే అన్నమైకం వదిలి, వింది. గుండెలకు చేతులు వ్రాస్తూనే "ఇంత పిరికి దానికి, అంత గుండెదిట్టం ఎల్లా ఇచ్చేడో" అంది.
"వెంకటమ్మా!" అని అక్కున చేరిపో యింది శాంత. పాలు చేపొచ్చినట్లయ్యింది వెంకటమ్మకు.
"అది త్రాగించే. జ్వరం ముమ్మరంగా ఉంది. పలవరిస్తున్నాడు. అంతే."
"ఆయన!" ముఖం రొమ్ముల్లో దాచుకుంది.
వెన్ను చరిచినట్లే అయితే "ఎవరు?" అంది.
"ఆయనే!"
రెండు చేతుల్లోనూ ముఖాన్ని తీసుకుంటూనే "ఏమిటిది?" అంది ఖరాఖండీగా.
"ఆయన వచ్చేరు, వెంకటమ్మా! ఓ రోజు వచ్చి నన్ను పిలుచుకువెళతారని తెలుసు."
"ఏమిటా పిచ్చివాగుడు!"
నెమ్మదిగా చెయ్యి పుచ్చుకుని సావిట్లోకి నడిపించింది. కవాచీ బల్లదగ్గరగా వచ్చి, దీపం దగ్గరగా పెట్టి "చూడు" అంది శాంత.
పద్దెనిమిది వత్సరాల గతం అవధానులు కొడుకు రామం అదే రూపుతో, అదే ఛాయతో, ఆఖరుగా అదే కవాచీ బల్లమీద ప్రాణం వదిలేడు. ఈనాడు మళ్ళీ అదే తూచా తప్పకుండా ఆకృతి, ఛాయ, రూపం, పోలిక, ఎత్తు, పొడవుతో. తనకు దృష్టిమాంద్యం ఏర్పడలేదు కదా? మనస్సు చెదరలేదు కదా?
"లక్ష్మయ్యా!" పొడారిపోయిన పిలుపు.
"వద్దు. ఈ సంఘటన మనిద్దరిమధ్యే ఉండాలి."
అంకెళ్ళు నొక్కుకున్నాయి. కళ్ళు నులుము కుంటూనే పునః చూచింది. ఆ రోజు, తనూ వెళ్ళింది శ్మశానానికి. మట్టిచేసి, స్నానం చేసి ఇంటికి వచ్చింది. ఆ కడుపు తరుక్కుపోయి నట్లు ఏడుస్తున్నవాళ్ళను చూచి గుండె చెరువైంది. శోభనం ముహూర్తం వారం రోజులే ఉంది. ఉండి ఉండి ఫెళ్ళున జ్వరం, సంధి వచ్చేయి. వంద కరుకులుపోసి బెజవాడ నుండి డాక్టర్ను సూది ఇప్పించడానికి పిలిపించేరు. కాని దక్కలేదు.
ఆరోజు గురువారం. రాత్రి ఒంటి ఘంటకు కాబోలు ప్రాణంపోయింది. ఠక్కున. ఈరోజూ గురువారం. లక్ష్మయ్య దరిదాపు అదే వేళకు తీసుకువచ్చేడు. తెల్లబోయింది. మతిపోయి నట్లే అయ్యింది. తన ఇన్నేళ్ళ వయస్సులోనూ ఇటువంటిది చూడలేదు.
అతను ఇటూ అటూ కదిలేడు. జ్వరంకాదు, వడదెబ్బ.
'ఎల్లా ఉంటుంది?' కళ్ళతో శాంత అడిగింది.
నుదుటి మీద చెయ్యివేసి, కడుపు వేడిచూసి, "తగ్గుతోంది. ఎండదెబ్బ కొట్టినట్లుంది" అని గొణిగింది.
