'ఇంతే అనూ! నీరజ కోసం అహర్ణిశలూ బాధపడుతూంటాడు. వో హాస్పిటలైనా ప్రారంభించ మంటారాయన. ఊహూ విన్పించుకొడా మాట. ' నీరజకు ఆరోగ్యం చేకూర్చలేని నేను డాక్టరు గా పనికి రాను' అంటాడు. అబ్బ! ఎంత విరక్తి గా మాట్లాడుతాడని చెప్పను?!' శారద కంఠన ఆవేదన పెల్లు బికింది.
'మరీ సున్నిత హృదయం అక్కా! ఆయనది. ప్రతిదాన్ని కొండంత చేసి భయంతో, బాధతో ముడుచుకు పోతారను కుంటాను,' అన్నది అనురాధ.
అనూరాధ నంత ఆప్యాయంగా చూసిన ఆ డాక్టరు ఆమె వెళ్తున్నానని ఫోను చేసినా 'రాలేను. క్షమించు. అనూరాధా!' అన్నాడు.
శారదా, సతీశ్ బాబు స్టేషన్ కి వచ్చారు మంజుల తో పాటు. రైలు కదులుతుండగా వచ్చాడు హరికృష్ణ. అతను రాకుండా వుండలేడని అనూరాధ అనుకుంటూనే వుంది. ఆమె వూహ నిజమైంది.
'ఈ డాక్టర్ని మర్చిపోకు? ఎప్పుడైనా ఏదైనా కావాలని అర్ధించుతానెమో! లేదని మాత్రం అనకు అనూ!' అన్నాడు బాధ, అనురాగం మేళవించిన స్వరంతో. 'అనూ!' అని ఆత్మీయంగా సంబోధించాడు.
అలాగేనని తలూపింది. శారద జాబు వ్రాయమని చెప్పింది. అనూరాధ మనస్సున్న అనురాగ బంధం అల్లుకున్న ఆత్మీయత విదిపోతున్నందు కెంత గానో విలవిలలాడిపోయింది.
ఆమె మనస్సున , హరికృష్ణ, నీరజ నిలిచిపోయారు. ఆలోచన ఎటు సాగినా చివరికి శాప గ్రస్తులైన ఆ అన్నా చెల్లెళ్ళ దగ్గరే ఆగిపోతోంది.
* * * *
ప్రయాణం మూలాన అలసిపోయింది అనూరాధ. ఆ రోజంతా బద్దకంగానే వుంది. వచ్చి వారం రోజులయింది. మద్రాసు వాళ్ళిచ్చిన వేయి రూపాయలతో సంసారానికి అవసరమైన సామాగ్రి ని కొన్నది అన్నపూర్ణమ్మ గారు. మిగిలిన అయిదు వందలు బ్యాంకు లో వుంచింది.
శారద కు జాబు వ్రాద్దామని కూర్చున్నది అనూరాధ. అంతలో 'పోస్టు' అన్న కేక విన్పించి వరండా లోకి వెళ్ళింది. ;పోస్టు మాన్,' బరువైన కవరోకటి అందించాడు.
'ఎవరు వ్రాశారు?! శారదక్కయ్యేమో!' అనుకుంటూ లోనికి వెళ్లి మంచం మీద కూర్చుని కవరు లోని కాగితాల్ని తెరిచింది . హరికృష్ణ వ్రాశాడు. వ్రాస్తాడనే అనుకున్నదామె. ఈసారి ఎంతో ఆత్మీయత వెల్లి విరిసిందా జాబులో. సంబోధన అందంగా వుందన్పించింది.
'మల్లియలా తెల్లనైనా మనస్సున్న అనూరాధా!
అందమైన కలలా, వరమీయ వచ్చిన దేవతలా నిలిచి పోయవీ డాక్టర్ జీవితం లో.
నువ్వు తప్ప నాకెవ్వరూ లేరన్పించుతోంది. ఎందుకని ప్రశ్నించకు? నీతో మనసు విప్పి చెప్పుకోవా లన్పించుతోంది. ఇదేమిటని దూరంగా జరిగి పోతావా?!
అన్నీ వున్నా అనుభవించలేని వారుంటారు. ఆ కోవలో వాడినే నేను కూడా. ఎవరి ముందూ ఏనాడూ చెప్పుకో లేదింత వరకు నా గురించి. కానీ నిన్ను చూసిన క్షణం నుంచీ నాలో అనంతమైన ధైర్యం కలలు గంటోంది. నా జీవితంలో నేననుకున్నదేనాడూ జరగలేదు.
అమ్మను లక్షల కాశపడి మామయ్య అరవై సంవత్సరాలు దాటిన మనిషితో వివాహం చేయించాడు. అపుడు అమ్మకు ఎన్నేళ్ళనుకున్నావ్? పద్దెనిమిదేనట! ఎంత ఘోరమో చూశావా! తల్లీ తండ్రి లేని అమ్మ, తన అన్న పన్నిన వలలో చిక్కుకుని విలవిలా తన్నుకుంది. వీలున్నంత వరకు డబ్బు సంగ్రహించిన మామయ్య మళ్ళీ అమ్మ ఏమైందీ అని కూడా చూడలేదంటే నమ్మగలవా అనూ! కానీ నిజంగా అంతే జరిగింది.
నేను నాన్నగారిని 'తాతా' అని పిలిచేనట ఆ మెరిసిన మీసాల్నీ, గడ్డాన్ని చూసి, అమ్మ మనస్సు ఎంత అక్రోశించిందో అపుడు?!
చెల్లాయి పుట్టగానే అమ్మ కన్ను మూసింది. నాన్నకు వృద్ధాప్యం తో బాటు, మనోవ్యధ కూడా తోడైంది. మంచం మీద దగ్గుతూ, ఆయాస పడుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ 'జానకీ! నీకు అన్యాయం చేశాను. నీ బ్రతుకు బండలు చేశాను' అని గొణుక్కుంటుండేవాడు వాడేపుడూ.
ఆయాల చేతుల్లో పెరిగింది నీరజ. అంతవరకూ దూరంగా ఉన్న మావయ్యా ఆప్త బంధువులా , ప్రాణ స్నేహితుడిలా ఆదుకుంటానంటూ ఊడి పడ్డాడు.
విరక్తి తో కృంగి కృశించి పోతూన్న నాన్నగారు ఆస్తీ ని, కన్న బిడ్డలనీ ఆ కిరతాకుని చేతుల్లో వుంచి కన్ను మూశారో పుణ్య క్షణాన.
మామయ్య మా ఆస్థి నంతా తన యిష్టం వచ్చినట్లు వ్రాయించాడు. మాకు మైనారిటీ తీరేవరకూ తానే సాయంగా ఉంటానన్నాడు. నీరజా, నేనూ హాస్టల్ ల్లో వుండే వాళ్ళం. సెలవులకి అందరూ యిళ్ళకు వెళ్తుంటే ఈ అన్నా చెల్లెళ్ళు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నా ఆశల్ని చంపుకునే వాళ్ళు.
అత్తయ్య అరుపులు విని మనస్సు తునకలై పోతుందన్న భయంతో నీరజ వేసవి కూడా ఒంటరి గా హాస్టల్లో నే గడిపి వేసేది. చెల్లాయికి అపుడు ఎన్నేళ్ళనుకున్నావు ? ఆరేళ్లు! కాన్వెంటు చెల్లాయి కి అమ్మా, నాన్నా!
నా గుండెల్లో దుఃఖం గూడు కట్టుకు పోయి వుండేది. ప్రతి అదివారమూ నీరజను వెంట బెట్టుకుని మద్రాసంతా తిరిగేవాణ్ణి. ఆ పాటి ఆనందాన్ని కూడా అందనీయలేదు విధి. నీరజ కపుడు పదో సంవత్సరం.
వాళ్ళ వార్డెన్ నాకు కబురం పిందా రోజున. భయపడుతూనే వెళ్లాను. నీరజ స్పృహ లేకుండా పడి వుంది. వారం రోజుల నుంచి అనారోగ్యంగా ఉంటోందని ఆనాడు అలా ఉదయమే పడిపోయిందని చెప్పింది వార్డెన్.
హాస్పిటల్ లో జాయిన్ చేశాను. కానీ తిరిగి నీరజ మనుషుల్లో కలవలేక పోయింది. కాళ్ళూ, చేతులు రాను రాను సన్నగా పుల్లల్లా మారిపోయాయి. నడుం లో రవ్వంత కూడా పట్టు వుండ కుండా పోయింది.
ఎంత బలమైన ఆహారం యిచ్చినా ఆ పరిస్థితి మారలేదు. ఎందరో డాక్టర్లు పరీక్షించారు. వ్యాధి యిది అని కూడా చెప్పలేకపోయారొక్కరైనా. నాకెందుకో వైద్య వ్రుత్తి మీద వున్న ఆసక్తి క్షీణించి పోయిందా రోజుల్లోనే.
డాక్టరీ పాసయ్యాను. కానీ ప్రాక్టీసు పెట్టాలన్పించ లేదు. నీరజ అలా జీవం లేని బొమ్మలా పడి వుండే దెప్పుడూ మమ్మల్ని వోదార్చడానికి ఎవ్వరూ లేరు. మా బాధను పంచుకోడానికోక్కరూ రాలేదు.
మామయ్య నన్ను పెళ్లి చేసుకోమన్నాడా పరిస్థితుల్లో . నీరజను పూవులా చూడగలిగిన మృదు హృదయం ఎదురైతే తప్పక చేసుకుంటానన్నాను. అందుకే నేనూ చూస్తున్నాను అన్నాడు మామయ్య. కానీ అయన గోముఖ వ్యాఘ్రం అని తెలుసుకున్నా నేప్పటికో.
వచ్చిన వాళ్ల మనసుల్ని విరిచే వాడు . 'నీరజ కుంటి పిల్ల . డాక్టర్ అయినా పైసా సంపాదించ లేడు వాడు. ఎంత ఆస్థి వుంటే మాత్రం ఏమండీ! కూర్చుని తింటే కొండలైనా తరిగి పోవూ! పైగా మీకెందుకండి ఈ బెడద? జీవితాంతం మీ అమ్మాయి, విసుగూ విరామం లేకుండా ఆ నీరజకు సేవ జేస్తూనే వుండాలి. ఎందుకంత బాధ! మరో మాట! నాకూ పిల్లలున్నారు గనుక చెబుతున్నానండోయ్!
ఈ హరికృష్ణ -- తండ్రి వంశం లో పుట్టిన ప్రతి ఆడపిల్లా అలా కాళ్ళూ చేతులూ లేనివాళ్ళు గానే అయ్యేవారు. ఏమో! ఎవరికి తెలుసు చెప్పండి! మగ పిల్లలు కూడా అలాగే కుంటి వాళ్ళు అయిపోతారేమో! లక్షణంగా మరో అబ్బాయి కిచ్చి పెళ్ళి చెయ్యండి' అంటూ నా గురించి, మా వంశం గురించి లేని పోని అబద్దాల నెన్నింటినో సృష్టించి , వచ్చిన ప్రతి మనిషినీ సాగనంపే వాడు.
నాకే విసుగూ కలిగింది. అందుకే పెళ్ళే చేసుకోనని చెప్పోనా పైనా. మామయ్యా మనస్సులో ఎంతగా దీవించాడో నన్ను! నీరజకా పెళ్లి లేదు. నాకూ, ఆ యోగం లేకుండా చేశాడా మహానుభావుడు! ఉన్న ఆస్థి అంతా తన కొడుకులకే రాకపోతుందా అని అయన ఆశ. అందుకే కొన్నిసార్లు అందమైన వలలు పన్ని వుంచేవాడు నా చుట్టూరా.
వాళ్ళ పెద్ద అబ్బాయి పెళ్లి ఖర్చు అంతా నేనే భరించాలట. 'ఎంతో లేదురా! వో అయిదు వేలే!' అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. అసహ్యతా కలిగింది. ఇవ్వననడానికి వీల్లేదు. 'ఏం చేస్తావోయ్! హరీ! ఎవరు తింటారీ సంపదంతా! నువ్వో భీష్ముడివి. నీరజ! పాపం! ఏ సుఖానికి నోచు కోలేదయ్యే! ఆ! ఏదో! ఈ మామయ్యను కాస్త వో కంట కనిపెడుతూ వుండు --' అనేవాడు . ఇవ్వక తప్పేది గాదు.
శారద నాకు దూరపు బంధువు. మనసు నిండుగా అనురాగ మధువు నింపుకున్న కళామయి. మెడిసిన్ నాతొ పాటే చదివింది. నా హృదయాన సందడి చెలరేగిండా అనురాగమయి రాకతో.
నీరజ సంగతి విన్నది. మనసు విప్పి చెప్పానంతా. వెన్నెల పండించు ఈ హరి జీవితంలో -- అని కోరాను. నవ్వులు నిండించు నా బ్రతుకున -- అని అర్ధించాను.
పువ్వులా నవ్వింది. మందారాలు విరిశాయి నా మనసున. ఆశలన్నీ కలబోసుకుని అందాలు చిందే మందారాన్ని మలచు కున్నాను. మధురోహాల పల్లకి లో , షాహయి పాటల్లో తెలిపోయాను.
