4
నృత్యం పూర్తయింది. ప్రేక్షకులు ఆనందంతో అభినందించారామె నెంత గానో. మేనేజరు దగ్గర సెలవు దీసికొని శారద వున్న చోటికి వచ్చింది అనూరాధ.
ఆమె యింకా కూర్చున్న చోటు నుంచి కదలనే లేదు. అనూరాధ ఎదురుగా నిల్చున్నా అలాగే బొమ్మలా చూస్తుండి పోయిందామే.
'అక్కా! వెళ్దామా?' అన్నది అనూరాధ.
'అమ్మా! మీ అమ్మ ఎన్ని నోములు నోచి కన్నది నిన్ను? కళ నిన్ను వరించిందా? నువ్వే కళను వరించావా? నాకింత కళామూర్తి చెల్లాయి గా లభిస్తుందని ఏనాడూ అనుకోలేదమ్మా! బావ చెప్పినపుడు ఏదో అనుకున్నాను. కానీ నిజంగా నీలో రాధ వుంది. ' పవరవశంతో మధురంగా వినదించిందామె కంఠం.
'నీ నుంచి పొగడ్తలు ఆశించలేదక్కా!'
'పొగడ్తలు కాదు అనూ!'
'కాదని తెలుసు. కానీ నన్నింతగా అభినదించకు. గర్వంతో యెగిరి పోతానేమో!' అన్నది అనూరాధ చిన్నగా నవ్వుతూ.
'అలా జరగదు లే! ఎగిరి ఎక్కడ వాలినా పట్టుకోడానికి బావ వున్నాడని తెలుసుకో అనూ!'
'అది నీ భ్రమే! అలా జరుగదు!'
తన పరిహాసోక్తి ఆమెకు నచ్చలేదని గ్రహించింది శారద. అందుకే మరో మాట మాట్లాడకుండా కారు దగ్గరకు నడిచింది.
హరికృష్ణ నోరు విప్పనే లేదు. ఆశ్చర్య పోయారా అక్కా చెల్లెళ్ళు. అనూరాధ కా విచిత్ర వ్యక్తీ అర్ధంగావడం లేదెంత ఆలోచించినా.
మనస్సున దాగిన ప్రతి అక్షరాన్ని విన్పించుతాడో క్షణం లో.
కనుబొమ కూడా కదిలించనంత నిర్వికారత కన్పించుతుంది మరో క్షణం లో.
నవ్వుల పువ్వులు జల్లడమే నా ధ్యేయం అంటాడోసారి.
నవ్వడమన్నమాటే విననట్లు యోగిలా వుండి పోతాడు మరోసారి. 'ఆ అక్కాచెల్లెళ్లను యింటి దగ్గర దింపి వస్తాను. గుడ్ నైట్', అని సెలవు దీసికొన్నాడు.
'ఇతని జీవితాన దొర్లిన శాపం ఎంత ఘోరమైనదో!' అనుకున్నది అనూరాధ.
ఉదయాన లేవగానే తల స్నానం చేసింది అనూరాధ. శారద జడ అల్లి మల్లె లుంచింది . తానూ కూడా మల్లెల్ని తురుముకుంటూ అన్నది.
'బావకో చెల్లెలుంది. చూస్తావా?' ఏదో భావం మెరుపులా మెరిసి మాయమైనది ఆమె కనులలో.
ఆశ్చర్యం తొంగి చూసింది అనూరాధ నేత్రాలలో. ఎక్కడ అని అడుగుతుండగా శారదే అన్నది--
'దగ్గర లోనే వుంది. వో పల్లెటూరు నీరజ అక్కడే వుంది,'
'నీరజా! అ అమ్మాయి పేరు! బావుంది! పెళ్ళయిందా?' ప్రశ్నించింది అనూరాధ.
'వూహూ ! కాలేదు. ఎలా...ఆ....! వోసారి వెళ్దామా నీరజ దగ్గరికి. బావ వస్తానన్నాడు!' అన్నది శారద ఏదో చెప్పబోయి మధ్యలో ఆపి.

అనూరాధ తానా రోజునే వెళ్ళి పోవాలి, అమ్మ ఎదురు చూస్తుంటుంది , అని చెప్పింది. కానీ శారద నాలుగు రోజులు వుండి పొమ్మని కోరింది.
'ఈ అక్కయ్య కు నువ్వు తప్ప మరో చెల్లాయి లేదింతవరకు . ఆ సంతోషాన్ని కొన్నాళ్ళైనా అనుభవించ నివ్వు.' అన్నది శారద.
అనూరాగ పూర్ణమైన ఆమె కోరికను నిరాకరించ లేక పోయింది అనూరాధ. హరికృష్ణే అడగమన్నట్లు తోచిందామెకు అ కోరిక వెనక ఏదో అర్ధం దాగివున్నట్లన్పించుతోంది. అతడు రాగానే ప్రయాణ మయ్యారు మువ్వురూ. నీరజ కూడా ఎంతో అందంగా వుంటుందేమో అన్నగారి లాగే అనుకుంది అనూరాధ. కానీ అన్నను విడిచి ఎందుకా పల్లెటూరు లో వుంటుందో అర్ధం గాలేదామె కెంతగా ఆలోచించినా.
వో గంటలోనే ఆ వూరు సమీపించింది వో పెంకు టిల్లు కన్పించుతోంది దేవాలయం ప్రక్కనే. అక్కడే ఆగిపోయింది కారు.
హరికృష్ణ ముందు నడిచాడు. శారద అనూరాధ ను 'లోనికి వెళ్దాం పద' అంటూ తోడుగా నడిచింది.
'ఎవరది? అన్నయ్యా! నువ్వేననుకున్నానులే!' అంతుంది వో కంఠం.
'పడుకున్నావేమిటమ్మా! తల నొప్పిగా వుందా!' ఆప్యాయత వెల్లువలై దూకిందా కంఠనా.
అనూరాధ 'అది అతని గొంతేనా? ఎంత అనురాగం విరిసిందో!' అని ఆశ్చర్య పడింది.
'శారదా! లోపలికి రండి!' అన్నాడు హరికృష్ణ.
ఎందుకో అతిధి మర్యాదలతో ఆహ్వానించలేదక్కడ . ఆ గదిలో కాలు పెట్టగానే శిలా విగ్రహం లా నిల్చుండి పోయింది అనూరాధ.
ఎదురుగా కన్పించిన దృశ్యం మన స్సును రంపపు కోసివేస్తోంది నిర్ధాక్షిణ్యంగా.
సుమారు పదహారేళ్ళున్న అమ్మాయి నిర్జీవ ప్రతిమలా పడుకుని వుంది మంచం మీద. ప్రక్కనే మంచానికి కొంచెం దూరంగా వో చక్రాల బండి వుంది.
ఆ అమ్మాయి సజీవంగా నే వున్నది అని చెప్పడానికి మాత్రం ముఖం కాంతి వంతంగా వుంది. కాళ్ళూ, చేతులు సన్నని పుల్లల్లా వున్నాయి. ఒక్క అడుగైనా వేయలేదని గ్రహించింది. అంగుళం కదలడానికి కూడా మరో మనిషి సాయం కావలసిందే.
'ఇదే రకపు వ్యాధి? ఇంత భయంకర మైన జబ్బు వుందా యీ లోకంలో?' అనూరాధ మనస్సు వణికి పోతోంది . బాధతో మెలి దిరిగి పోతోంది.
శారదే పరిచయం జేసింది అనూరాధ ని. నమస్కరించడానికి కూడా పనికిరాని తన చేతుల వంక చూసిందో సారి. విరక్తి గా నవ్వింది. ఆ నవ్వులో ఆనంతమైన వ్యధ ఘోష పెడుతున్నట్లనిపించింది.
అనూరాధ మనస్సు నెవరో ముక్కలు ముక్కలుగా ఖండించు తున్నట్లు బాధపడుతోంది. ప్రక్కనే కూర్చున్న హరికృష్ణ ని చూడగానే ఆమె కనులలో అశ్రు బిందువులు నిండు కొచ్చాయి.
జీవితాన విరిసిన వెన్నెలంతా ఆకస్మికంగా అంధకారం గా మారిపోయినట్లు ఏమీ తెలియని మూడు డిలా కూర్చున్నాడు చెల్లెలి దగ్గర.
ఆ వ్యాధి ఆ అనురాగ మూర్తికి కూడా లొంగదని గ్రహించింది అనూరాధ. అంతా నిశ్శబ్దమే అక్కడ. ఎవ్వరూ పెదవి కదపలేక పోతున్నా రెంత సేపటికి.
నిర్దాక్షిణ్యంగా ఆ భయంకరమైన వ్యాధితో శిక్షించబడిన ఆ శాపగ్రస్తురాలే నోరు విప్పింది.
'కూర్చోండి , అన్నాయ్! పనిమనిషి తో చెప్పు వంట చేయమని.' ఆ కంఠనా మాధుర్యమే లేదు.
హరికృష్ణ లేచి వెళ్ళాడు. శారద కూడా వంట గదిలోకి వెళ్ళింది.
'చందమామ లాంటి అన్నయ్య కీ నీరజ రావుహు గా ఉందనుకొండి! భగవంతుడు కూడా పిచ్చి వాడయ్యాడేమో నన్పించుతుంది అనూరాధ గారూ! ఆ పిచ్చితో ఏమీ తోచక నన్నిలా సృష్టించి వుంటాడు.' అన్నది నీరజ.
యేమని ఆ బాధమయిని ఊరడించాలో తోచకుండా పోయిందామెకు 'నాకోసం అన్నయ్య తన ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాడు. ఈ రోగం నన్ను చంపదు. తాను చావదు. ఎదుటి వాళ్ళని మాత్రం మరింతగా బాధిస్తుంది. ఇప్పటికీ ఆరేళ్ళ నుంచి అన్నయ్య ఈ మొండి ఘటం కోసం తపస్సు చేస్తున్నాడనుకోండి.
కడుపు నిండా తినలేడు. క్షణమైనా హాయిగా కన్ను మూయడు. నవ్వలేడు నవ్వుల్నీ విన్నా పెదవి విప్పడు. ఏం చేయను? చెప్పండి! వో గుక్కెడు విషం తాగుదామను కుంటాను . అమ్మో!....'
ఆమె గొంతు బొంగురు పోయింది. కనులలో అశ్రు బిందువులు మెరిశాయి. తల ప్రక్కకు త్రిప్పి తలగడ లో కళ్ళు వత్తుకుంది.
'ఈ ఆస్థి పంజరం కన్పించక పొతే తానూ ఈ లోకం లో ఎవరికీ కంపించనంటాడు. ఎంత చెప్పినా వినడు. అందుకే మరీ అనుక్షణమూ ఎదురుగా వుంటే బాధతో ఎముకల గూడు లా మారిపోతాడేమో నన్న భయంతో ఈ వూళ్ళో వుండి పోతానన్నాను. పల్లెటూరి గాలి నా ఆరోగ్యానికి మంచిది. నాటు వైద్యం చూద్దాం! అన్నాను. అన్నయ్య ను మోసగించడమే అది. కానీ నా కోసం జీవితాంతం కుమిలి పోవడం చూడలేక పోతున్నాను. ఏం? నే చేసింది తప్పంటారా?' బాధ తరంగాలై దూకుతోందామె హృదయాన. కాదన్నట్టు తలూపింది అనూరాధ. పెదవి కదిపితే లోన దాగి వున్న దుఃఖం కట్టలు త్రెంచుకుంటుందేమో నన్పించుతోందామెకు.
ఆ డాక్టర్ పైన అంతులేని జాలి కలిగిందా క్షణం లో. అతని వోర్పు కి ఆశ్చర్య పడిందేంత గానో . త్యాగం తప్ప ఏదీ మిగలని ఆ యువకుని జీవనవీణియ అందుకే మూగబోయిందని గ్రహించింది.
శారద, వంట పూర్తయిందంటూ అనూరాధ ను పిలిచింది. ఆమెకు ఒక్క ముద్ద కూడా మింగుడు పడటం లేదు. పనిమనిషి ముద్దలు చేసి నీరజ నోటికి అందించుతోంది ప్రక్కన నిలబడి ఆ దృశ్యాన్ని చూడలేక పోతోంది అనూరాధ. నవ్వుతూ, నవ్వించుతూ , సెలయేరులా పరువులు పెట్టవలసిన వయస్సు. కానీ పాపం! కాళ్ళూ చేతులు అన్నవి లేనట్లు విరిగిన బొమ్మలా పడుంది. అందుకే ఆమె హృదయం దహించుకు పోతోంది.
హరికృష్ణ ఏదో నాలుగు మెతుకులు మర్యాదకన్నట్లు విషంలా మ్రింగాడు. అందరి కన్నా ముందే లేచి వెళ్లిపోయాడు. అతని నేత్రాలు అనుక్షణమూ అశ్రు సిక్తాలయి వుండడం గమనించింది అనూరాధ. చెల్లెలి బాధను చూడలేక ఆవిధంగా లేచి వెళ్లిపోయాడని గ్రహించింది.
'ఏమీ గాని తననే అంతగా దుఃఖం పెనవేసుకు పోతోంది. ఇక మనస్సున మనసైన ఆ అన్న బ్రతుకు నిండుగా బండెడు దుఃఖం తప్ప ఏం వుంటుంది?' అనుకున్నది.
ఆ బాధను కొంతసేపైనా మరిచి పోవడానికి వీలు లేదామెకు. వో పుస్తకం చదవలేదు -- చేతుల్లో పుస్తకం నిలిచెంత వోపిక కూడా లేదు. పోనీ కూర్చుని ఏ వినోదాన్ని చూద్దామన్నా నడుం నిలవదు.
'భగవాన్! ఇంత నిర్దయుడవని ఏనాడూ అనుకోలేదే! ఎందుకింత కక్ష నీకు? నీ బిడ్డలని నువ్వే శపించుతున్నావా తండ్రీ! ఇదేం చిత్రం! ఇదో ఆటా నీకు? ఇందులోనూ ఆనందం లభిస్తోందా! ఉహూ! నేను నమ్మను. నమ్మలేను. మరి...మరి...ఏమిటీ ఘోరం!!' అనూరాధ హృదయాన ఆవేదన ఘోష పెడుతోంది.
తిరిగి బయల్దేరే ముందు అన్నది నీరజ.
'మిమ్మల్ని చూస్తోంటే నాలో ఎందుకో అంతు లేనంత ఉత్సాహం వూడలు వేస్తోంది. మీతో కలిసి మెలిసి వుండాలన్పించుతోంది. కానీ....ఆ!.... ఏం లేదు లెండి! వెళ్ళండి! ఉహూ! వెళ్లి రండి! ఈ నీరజను మరిచి పోకండి! ఎప్పుడైనా గుర్తుకు వస్తే వో రెండు మాటలు వ్రాయండి. ఎవరో ఒకరు చదివి విన్పించుతారు, ఎలా మరిచి పోతారసలు?! పీడకల ఎన్నాళ్లయినా గుర్తే వుంటుంది చూడండి, అంతే నేను కూడా! చూసినవాళ్ళు బ్రహ్మ ప్రయత్నం చేసినా మరిచిపోలేరు. అవునా!....' నవ్వింది నీరజ. ఆ నవ్వు వింటుంటే హృదయం తరుక్కు పోతోంది. ఆ మాటలు వింటుంటే నిలువెల్లా బాధ జరజరా పాకిపోతోంది విద్యుత్తులా.
'లేదమ్మా! నీరజా! నేను నీ దగ్గరే వుంటా నెప్పుడూ! నవ్వించుతూ, నవ్వుతూ కధలు చెబుతాను. కబుర్లు విన్పించుతాను. పువ్వులా పెంచుకుంటాను. గుండెల్లో దాచుకుంటాను.' అని చెప్పాలన్నంత ఆవేశం, అనురాగం వూపి వేశాయామేను. కానీ ఒక్క అక్షరం కూడా వెలికి రానేలేదేంత ప్రయత్నించినా.
మౌనంగా సెలవు దీసి కొన్నారందరూ. హరికృష్ణ నుంచి వుండి వుండి నిట్టూర్పులు వినవస్తున్నాయి. అతడు కారు నడుపుతున్నాడన్న మాటే గానీ ఎదురుగా వస్తూన్న దేనీని చూడడం లేదు. వో లారీ డీ కొన్నంత పనైంది. హటాత్తుగా బ్రేక్ పడింది యాంత్రికంగా.
ఎగిరి పడ్డారు శారదా, అనూరాధ లు. వెనుదిరిగైనా చూడలేదు హరికృష్ణ. కారులో మరో యిద్దరూ ఉన్నారన్న మాటే మరిచిపోయినట్టు చక్రం తిప్పుతున్నాడు.
అతని మనస్సు వికలమై పోయిందని గ్రహించింది అనూరాధ. శారద కారు దిగుతుండగా అన్నాడు మద్రాసు వచ్చిన తర్వాత --
'హిందీ పిక్చరోకటి కొత్తది వచ్చింది అజంతా మహాల్లో కి వెళ్దాం! కూర్చో!'
శారద అతని ముఖం వంక చూసి కారులో కూర్చుండి పోయింది మౌనంగా. టిక్కెట్లు తెచ్చి హాల్లోకి నడిచాడు సినిమా మొదలైండప్పటికి.
కధ రసవత్తరం గానే నడుస్తోంది. నటీనటుల నటన కూడా ముచ్చట గోల్పుతోంది. పాటలు మధురంగా వున్నాయి. కధలో లీనమై పోయిన అనూరాధ ముందున్న మనిషి తల అడ్డం వచ్చి ప్రక్కకు జరిగింది. శారద 'కన్పించడం లేదా!' అన్న ప్రశ్నకు సమాధాన మిస్తూ హరికృష్ణ వంక చూసింది.
అతడు వెనక్కు వాలి కళ్ళు మూసుకుని కణతలు నొక్కు కుంటున్నాడు.
ఒంటరిగా బాధను భరించలేక అలా సినిమాకు వచ్చాడని గ్రహించింది అనూరాధ. ఎంతో జాలి వేసిందతని పైన. ఆమె కూడా సరిగా చూడలేక పోయిందా పైన. సినిమా పూర్తీ కాగానే వెళ్ళే ముందు 'డ్రింక్స్' తెప్పించాడతడు.
రాను మాత్రం తెప్పించుకోలేదు.
'మీరు తీసుకోరా! కాస్త చల్లగా వుంటుంది!' అన్నది అనూరాధ.
'ఇదిగో! ఈ గ్లాసు మీరు తీసుకోండి! అక్కా! మరో డ్రింక్ తెప్పించు!' అన్నదామె తిరిగి.
ఆప్యాయంగా చేతి కందించిన గ్లాసును నిరాకరించ లేక పోయాడతను. తాగిన తరవాత కొంచెం తేట పడిందతని ముఖం.
తర్వాత బయలుదేరారందరూ. శారద యింటికి వచ్చేసరికి ఓ జాబు వచ్చి వుంది. ఆమె భర్తా, సతీశ్ బాబు మరో నాలుగు రోజుల వరకూ రాలేనని వ్రాశాడు.
'అనూరాధ తోడుందిగా!' అన్నాడు హరికృష్ణ.
ఆ మాటల్లో ధనించిన ఆత్మీయత అనూరాధ నాశ్చర్యపరచింది. ఎప్పటిలా! 'అనూరాధ గారూ!' అనలేదతడీ సారి. ' అనూరాధ' అని చెప్పడమే బావుందన్పించిందామెకు. తల్లికి మరో నాలుగు రోజుల వరకు రాలేనని వ్రాసింది.
తమ్ముడు రాజుకీ, తల్లికీ మంచి బట్టలు తీసికొందా రోజున. 'పెన్' కొని దాచింది సూట్ కేస్ అడుగున రాజుకని. తనకు మాత్రం ఏమీ తీసుకొలేదామే.
ఆ రోజంతా మద్రాసు తిరగడమే సరిపోయింది. సముద్రం, నౌకలు అన్నీ ఎంతో అందంగా అగుపించాయి. ఇంకా మిగిలిన చిత్రాలన్నింటినీ చూసింది. శారద అనుక్షణం ప్రక్కనే వుండి చూపించింది. హరికృష్ణ ఆ రోజంతా కన్పించనే లేదు. ఫోను చేసింది శారద. 'బాబుగారు పడుకున్నారమ్మా! ఒంట్లో కులాసా లేనట్టుంది.' అన్నది పనిమనిషి.
