Previous Page Next Page 
మనిషి పేజి 6


                                      5
    స్వామి వారు అప్పటికే ఊళ్ళో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారం గురించి విన్నారట. భక్తులు తన దర్శనానికి రావటం ఆకస్మికంగా ఎందుకు మాని వేశారో గ్రహించారట. ఊరి ప్రజల సందేహాలు తీర్చటానికి పెద్ద లందరినీ పిలిపించి ఆరోజు సమావేశం ఏర్పాటు చేయించారు.
    పంచాయితీ ప్రెసిడెంటు చౌదరయ్య , మునసబు గారు, ముకుందరావు, అవధాని గారు, తక్కిన కుల పెద్దలు వచ్చారు స్వామి ఆదేశాన్ని తృణీకరించే సాహసం లేక. ఎవరికీ రావాలని లేదు. అందరూ వచ్చారు. సత్రంలో రత్తమ్మ గారు స్వామి వారికి విసన కర్రతో విసురుతున్నారు. అయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటా అమిత శ్రద్దా శక్తులతో వింటూ పరవశత్వం అనుభవిస్తుందా మోక్ష కామిని. చీమ చిటుక్కు మనటం లేదు. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుని అనంత జాహ్నవి తరంగాల్లా వెలువడుతున్నదా వాగ్ధార.
    "ప్రారబ్ధ కర్మానికి ఎవరూ అతీతులు కారు. సమస్త ప్రాణి కోటి ఆ ప్రారబ్ధ కర్మానికి లొంగి జీవన యాత్ర సాగిస్తున్నది. కర్త స్వతంత్రుడని కొందరు తత్త్వవేత్తలు చెప్పి ఉన్నారు. అది కేవలం అసత్యం. కాగా ఈ అనుల్లంఘనీయమైన ప్రారబ్ధ కర్మానికి అతీతంగా ఉండేవారు మూడు విధాలుగా ఉంటారు.
    ఒకటి : భగవంతుడే ఒకానొక కారణాన్ని పురస్కరించుకొని ఈ లోకంలో అవతరిస్తాడు. అయన ఆద్యంతరహితుడు కనక, పాప పుణ్యాల వంటి ద్వంద్వాలకు ఆ మహానుభావుడు అతీతుడు కనక, ఆయనకు ప్రారబ్ధ కర్మతో సంబంధం ఉండదు. ఆ ఆదివిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు. అధర్మం పెచ్చు పెరిగి పోయినప్పుడు "సంభవామి యుగేయుగే"-- ప్రతి యుగంలోనూ నేను అవతరించి ధర్మాన్ని తిరిగి ఉద్దరిస్తాను-- అన్నాడు గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ. అలాంటి మహానుభావులకు ప్రారబ్ధ కర్మ లేదు. ద్వంద్వాలు లేవు.
    రెండు : భగవంతుడు భూలోకంలో అవతరిస్తూ, తనతో పాటు తన లోకంలో ఉన్న కొందరు భ్రుత్యుల్ని తోడు తెచ్చుకుంటాడు. తాను సాధించటానికి తలపెట్టిన ఒక పని కోసం వారు కేవలం నటుల వలె ఈ నాటక రంగం మీద ప్రవేశించి, ఎవరి పాత్రలు వారు ధరించి, భగవంతుని అజ్ఞ అవగానే తిరిగి తమ తమ లోకాలకు తిరిగి పోతారు. వీరికీ ప్రారబ్ధ కర్మం ఉండదు.
    మూడు: అనంత కోటి జీవకోటి లో లక్షలాది జన్మల నదిగమించి పుణ్యం పండి, పరిపక్వమై , మోక్షానికి అర్హత పొందిన జీవుడు ఎప్పుడో ఎక్కడో ఉంటాడు. భగవంతుడు ఆ జీవుణ్ణి తన దూతగా భూలోకంలోకి పంపవచ్చు. అతన్ని మనం కారణ జన్ముడు అంటాం. అనగా, ఒకానొక మహార్దాన్ని సాధించటానికి లోకంలో ఉద్భవించిన జీవిడు అని అర్ధం.
    నేను ఈ మూడో మార్గానికి చెందిన వాణ్ణి. నాకు ప్రారబ్ధ కర్మ లేదు. ద్వంద్వాలు లేవు. స్త్రీ పురుష భేదం లేదు. కష్ట సుఖాల వ్యత్యాసం లేదు. వెన్నెలకూ మండు టండకు , అమృతానికి, హాలాహలానికి , యౌవనానికి, వృద్దాప్యానికి నాకు తేడా లేదు.
    "మీరంతా మూర్కులు. పామరులు, అపండితులు. పాపులు. ఈ భ్రమ జనితమైన జగత్ప్వరూపమే యదార్ధమని భావించే అంధులు. మీకు వెలుగు చూపటం నా ధర్మం. మీకు మార్గాన్ని చూపి, గమ్యానికి చేర్చాలని బ్రతుకుతున్నాను. మీలో అంధకారం పోనంత వరకూ నేనీ లోకం విడిచి పోలేను.
    నన్ను మీరంతా అనుమానిస్తున్నారు. అవమానిస్తున్నారు. అసహ్యించు కుంటున్నారు. ద్వేషిస్తున్నారు. నేను క్షుద్ర శక్తుల్ని ఉపసిస్తున్నానని నాపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.
    దురదృష్టవంతులైన అందులారా!
    ప్రపంచాన్ని, ఈ అనంత విశ్వాన్నీ సృష్టించేది , శాసించేది , పాలించేది ఒకే ఒక శక్తి. రెండు రకాల శక్తిలీ విశ్వం లో లేవు. అన్ని శక్తుల కూ మూల శక్తి ఒక్కటే. అది పురుషుడోక్కడే. ఆ శక్తి వనుపునే నేనిక్కడికి వచ్చాను. నేను తలుచుకుంటే సముద్రాలలో నీరంతా నెత్తురు చేయగలను. గడ్డి పోచను కాలసర్పం చేయగలను. కొండలను పిండి చేయగలను. చుక్కల్ని నేల రాల్చగలను. వృద్దుల్ని యువకులుగా మార్చగలను. యువకుల్ని వ్రుద్దులుగా శపించగలను. నా శక్తికి తిరుగు లేదు. నాకు తెలుసు. మీరు నా మాటల్ని నమ్మటం లేదు. నా శక్తి సంపదను విశ్వసించటం లేదు. నిరూపిస్తాను ఇప్పుడే. నా నిజస్వరూపం మీరే తెలుసుకుంటారు." అంటూ ఒక గడ్డి పోచను తెమ్మని వీరయ్య గారిని అజ్ఞాపించాడు.
    వీరయ్య గారు మారు మాట్లాడకుండా ఒక గడ్డి పోచ తెచ్చి స్వామి వారి పాదాల ముందుంచారు. స్వామి వారు కమండలం లోని మంత్రజలం దాని మీద చల్లారు. అందరూ ఊపిరి బిగబట్టి, సర్వశక్తులూ దృష్టి లో కేంద్రీకరించి చూస్తున్నారు.
    ఆశ్చర్యం!
    అద్బుతం!!
    ఇది యదార్ధమా? స్వప్నమా? లేక గారడీయా? కనికట్టా? గడ్డి పోచ నల్ల త్రాచయింది! ఆరడుగుల విషనాగు బుసలు కొడుతూ, మృత్యువాయువులు చిమ్ముతూ, జరజరమని ప్రాకుతూ జనం లోంచి బైటకు పోయి, బెల్లపు వీరయ్య గడ్డి వాములోకి దూరింది.
    జన సందోహం నివ్వెర పోయింది.
    స్వామి వారు మందహాసం చేస్తూ , ఒక్కసారి ఆగ్రహావేశాలు విజ్రుంభించగా, "మూర్ఖులారా! ఇప్పటి కైనా తెలిసిందా నా శక్తి? మీలో ఎవరు నా గురించి నిందాగర్బితంగా మాట్లాడినా, నాకు అపకారం చేయాలని ఎవరు తలపెట్టినా ఆ నల్ల త్రాచు పసి కడుతుంది. మీ ప్రాణాల్ని అది తోడి వేస్తుంది . జాగ్రత్త!" అంటూ గర్జించాడు.
    ఇంకా స్వామి వారు ఏదో చెప్పబోతున్నారు. పార్ధసారధి నా పక్కన కూర్చున్న వాడల్లా ఒక్కసారి లేచి, ఒక్క దూకులో స్వామి మీద దూకి, బలంగా పది గుద్దులు  గుద్ది , కమండలం తో నెత్తి పగల గొట్టాడు.
    స్వామి మూర్చ పోయాడు.
    మరణించ లేదు.
    గాయం బాగా తగిలింది. అతను కాసేపట్లో మళ్ళీ మేలుకోవచ్చు. పగపట్టి ఊరిని నాశనం చేయవచ్చు! ఈ ఉపద్రవం నుంచి బైట పడట మెలాగని ఊరి పెద్దలంతా తర్జన భర్జనలు ప్రారంభించారు.
    ఈ సమయంలో తరతరాలుగా పోట్లాడుకు చస్తున్న రెండు పార్టీలూ ఒకటయ్యాయి. ఊరంతా ఏకమైనది. అతన్ని చంపాలన్నారు కొందరు. చంపితే కేసై ఊరందరికీ ఉరి శిక్షలు వేస్తారని కొందరు వెనక్కి లాగారు.
    చివరికి పరబ్రహ్మం ఒక ఉపాయం చెప్పాడు. "క్షుద్ర శక్తుల్ని ఉపాసించే వారి పళ్ళు పీకితే, వాళ్ళకా మంత్రాలు పనిచెయ్యవు. ఇతగాడి పళ్లన్నీ పీకి వేద్దాం."
    అదొకటే మార్గంగా కనిపించింది. అందరు పరబ్రహ్మం అభిప్రాయం తో ఏకీభవించారు. కాని, పళ్ళు ఎవరు పీకుతారనే సరికి , ఎవరికీ వారే వెనక్కి తగ్గారు. చివరకు రంగదాసు ముందుకి వచ్చాడు. అతను ప్రేమించిన మునసబు గారి కూతురు సుబ్బుల్ని గూడా స్వామి వశం చేసుకున్నాడు. ఇన్నాళ్ళు సుబ్బులు తన్ని చూసి నవ్వేది. కళ్ళు చిట్లించేది. ఒకనాడు దొడ్డి దోవన పిలిచి ఇంట్లో వండుకున్న జున్ను పెట్టి, అరచెయ్యి గిల్లింది. అలాటి సుబ్బులు ఇప్పుడు తన్ని చూసి ముఖం చిట్లించుకు పోతుంది. పలకరించినా పలకటం లేదు. ఇంక సుబ్బులు దక్కదని నిరాశ చేసుకున్నాడు రంగదాసు. అతనికి జీవితం మీద విరక్తి కలిగింది. రంగదాసు బీదవాడయ్యాడు. తండ్రి పోయాక తన వాటాకు వచ్చిన అయిదేకరాలు అమ్మి ఇరవై జతలు బట్టలు కొనుక్కుని, కసరత్తులు చేసి, టానిక్కులు తాగి, సినిమాల్లో చేరాలని మద్రాసు వెళ్ళాడు. సినిమాల్లో రాణిస్తానని గాడంగా నమ్మి వెళ్ళాడు. తారాపధం అందగానే పొడుగాటి స్వంత కారులో స్వగ్రామం వచ్చి, మునసబు గారిని మెప్పించి, సుబ్బుల్ని చేపట్టి, తిరిగి మద్రాసు భార్య సమేతంగా వెళ్లాలని కలలు కన్నాడు.    
    కాని, కాలం కలిసి రాలేదు. కారణాలు ఏమైనా, రెండేళ్ళ లో రంగదాసు ఆస్తి, అందము , ఆశలు హరించి పోయాయి. మనిషి చిక్కి శల్య మయాడు. మెడ సాగింది. శరీరం నల్లబడింది. కళ్ళు లోతుకు పోయాయి. శరీరంలో నలత ప్రవేశించింది. విధి లేక తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. రెండెకరాలు కౌలుకి తీసుకుని చేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు.
    మునసబు గారికీ ఒక్కర్తే కూతురు. ఆమెకు పెళ్లీడు  వచ్చి ఎనిమిదేళ్ళయింది. ఇంకా పెళ్లి కాలేదు. కలెక్టరి కన్నా, డాక్టరు కన్నా ఇవ్వాలని ప్రయత్నం. రంగదాసు ఒకరిద్దరితో మునసబు గారి కి కబురంపాడు. అయన భగ్గున మండి పిడుగులు కురిపించాడుట.
    రంగదాసు కుంగి పోయాడు. పార్ధసారధి ఎన్నోసార్లు రంగదాసుని ప్రోత్సహించాడు. "మీ ఇద్దరికీ నే పెళ్లి చేస్తాను, రంగదాసూ మీరు ఊ అంటే" అనేవాడు.
    "నీ కిష్టమయింది. పిల్లకీ ఇష్టమైంది. మధ్య మునసుబెవడురా వద్దంటానికి? ముక్కు మీద నాలుగు గుద్ది లాక్కు పోరా, వాజమ్మా!" అనేవాడు పార్ధ సారధి.
    రంగదాసు కా ధైర్యం లేకపోయింది. స్వామి వారి ఉచ్చులో సుబ్బులు చిక్కుకున్నాక మునసబు గారు ఎవరితోనో అన్నాట్ట. "ఆ రంగదాసు కిచ్చి అతన్ని ఇంట్లో పెట్టుకున్నా పోయేది. ఇంతకీ అల్లరయ్యే యోగముంది దాని బ్రతుకులో" అని.
    ఈ మాట రంగదాసు చెవిన పడింది. మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి. అందుకే ఎవరికీ లేని ధైర్యం రంగదాసు కి వచ్చింది.
    మునసబు గారు స్వయంగా రంగదాసు ని కౌగలించుకుని, "ఊరిని రక్షించు బాబూ! ఇదెంత ప్రమాదమో మాకు తెలియక పోలేదు నాయనా" అని ఆశీర్వదించి ప్రోత్సహించారు.
    అందరి దీవెనలూ ఒక ఎత్తు, మునసబు గారి ఆశీస్సు ఒక ఎత్తాయే! రంగదాసు కు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. పరబ్రహ్మం పటకార్లు, సుత్తులు తెప్పించాడు. ముకుందరావు మాట వినకుండా పార్ధసారధి కూడా రంగదాసు తో చెయ్యి కలిపాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS