Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 6


                                     8


    అలా జరిగిపోతూన్నాయి రోజులు.
    మనందరి లోనూ ఒక నమ్మకం ఉంది. ఎంత ఆలోచించినా, 'జరిగిపోయిన రోజులే సుఖదాయకంగా ఉండేవి' అన్న అభిప్రాయాన్ని మన మనసులో నుంచి పారదోలుకోలెం. ప్రపంచం లోని పరిస్థితులు కూడా ప్రజల కష్టాలను ఇనుమడింప చెయ్య పూనుకుంటున్నాయే గానీ శాంతినీ, సుఖ సంతోషాల్నీ జన బాహుళ్యానికి అందించే వైపు అని మొగ్గడం లేదు. అది అలా ఉంచండి.
    పరిస్థితులు ఎంత తారుమారయినా , తన ఇంటి లోని గొడవలు తనను ఎంత విసిగించినా, శంకర నారాయణ గారు విజ్జులు కాబట్టి, అట్టే బాధపడేవారు కాదు. పైగా, అరుణ కు ఎన్ని తడవ లో చెప్పారాయన ఈ విషయాన్ని గురించే.
    "అరుణా! ప్రపంచం లో మానవుడు సాధించవలసినదంతా రెండక్షరాలు ఉన్న ఒక్క పదంలో ఇమిడి ఉంది. 'తృప్తి' ఆ పదం. తృప్తి సాధించిననాడు మానవుడికి అరిషడ్వర్గాలు -- అంటే..........."
    "కామ క్రోద లోభ మోహ మద మాత్సర్యాలండి , నాన్నగారూ."
    "అవునమ్మా! అవి ఎంతో దూరంలో ఉండి పోతాయి. ఆ తరవాత ఇకనేముంది? అంతా శాంతే! అంతటా ఆనందమే!" అంటూ బోధించే వారాయన. చిన్న కన్నె అయినా అరుణ, అందులోని స్వారస్యాన్నంతటినీ అవగాహన చేసుకోడానికి ప్రయత్నించేది.
    ఇలా ఉండగా ఆ మధ్యన ఒకనాడు ఒక గొడవ జరిగింది.
    అరుణ ధర్డు ఫారం , సీతామహాలక్ష్మీ ఫస్టు ఫారం , సరస్వతి నాల్గవ తరగతీ చదువుతున్న రోజులవి. ఆనాడు అందరూ ప్రోగ్రెస్ రిపోర్టు లు తెచ్చి శంకరనారాయణ గారికి ఇచ్చారు. అరుణ కేమో ఏ సబ్జెక్టు లోనూ ఎనభై మార్కులకు తక్కువ రాలేదు. సీతకూ, సరస్వతి కి దేనిలోనూ ఇరవై అయిదు దాటలేదు. తండ్రి కాబట్టి, శంకర నారాయణ గారు విసుక్కున్నారు. అరుణను చూచి బుద్ది తెచ్చు కొండని తన బిడ్డల్ని మందలించారు.
    అంతే, కనకదుర్గ కడుపు తరుక్కు పోయింది! తన ఆరాటాన్నీ , అసూయ నూ, అసహనాన్ని ఇక తనలోనే ఉంచుకోలేక, కొండంతటి నిండు మేఘం విచ్చుకు పోయినట్టు , వచ్చి పడింది! ఆ పడ్డం ఎవరి మీద? తన బిడ్డల మీదే!
    "పాడు పీనుగల్లారా! నా కడుపు చేడబుట్టారే! మీకేం పొయ్యే కాలం? ఎవడికి పుట్టిందో , ఎక్కడ పుట్టిందో ఆ కుల గోత్రాలు లేని దరిద్రు రాలి కున్న జ్ఞానం మీకు లేదూ? ఆమాత్రం తెలివి తేటలు మీకు లేవూ?" అంటూ అప్పటికే బిక్కుబిక్కు మంటూన్న ఆ ఇద్దరినీ చావబాదడం మొదలు పెట్టింది.   
    "అమ్మా, అమ్మా! చెల్లాయిల్ని కొట్టోద్దే. అమ్మా నీ కాళ్ళు పట్టు కుంటానే!" అరుణ బ్రతిమాలింది; ప్రాధేయపడింది. దుర్గ పాదాల మీద పడింది.
    పాదాల మీద పడిన ఆ పాపను అలానే కాలితో తోసి వేసింది కనకదుర్గ. ఆ తోపిడి కి అరుణ పెద్ద పాటే పడింది. తలకు గాయమూ తగిలింది.
    "అమ్మా!" అంది అరుణ ఆవేదనతో.
    "అయ్యో , పశువా!" అన్నారు శంకర నారాయణ గారు. ఏం చెయ్యడానికీ అసమర్దులాయన. అయినా, లేని బలం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ లేచి నిలుచున్నారు. నిప్పులు కక్కుతూ, భార్యను నిలువునా నరికేయాలన్నంత అక్కస్సుతో ముందుకు దూకారు!
    "నాన్నా! అమ్మ మీద చెయ్యి చేసుకుంటే నామీద ఒట్టు!" అంది అరుణ. అంతే! మంత్రముగ్దుడిలా నిలుచుని పోయారు శంకర నారాయణ.
    "ధూ! నీ బ్రతుకు తగలడ!" అని, అరుణ వైపు నడిచి, కట్టుకున్న పంచె తోనే రక్తాన్ని తుడిచారు. ఆ పంచె అంచునే చించి, కట్టు గట్టారు. కనకదుర్గ వాగుతూనే ఉంది.
    "నా బ్రతుకు ఈనాడు తగలబడ్డ మేమిటీ? ఈ దరిద్రురాలి కి ఏనాడయితే నా ఇంటిలో ఆశ్రయం ఇచ్చానో ఆనాడే నా జీవిత నాశనానికి సకల కారణాలూ అయిన దరిద్ర దేవతను నా నెత్తి నేక్కించుకున్నాను. ఎందరన్నారు-- 'మనిషి వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ' అని? వారి మాటలే పాటించి, ఈ గ్రహాన్ని ఆనాడే ఏ అనాధ శరణాలయా నీకో తోలి ఉంటె, ఆ జరిగే అనర్ధ మేదో అక్కడే జరిగేది! నా సంసారం పచ్చగా ఉండేది! దారిని పోయే దరిద్రాన్ని పేరంటం పిలిచినట్టు నా ఇంటికి తెచ్చుకున్నాను. నేను సర్వ నాశన మయ్యాను!" ఇక ఆడవారి ఆ ధోరణి కి హద్దూ, పద్దూ ఎక్కడ?
    వినలేక, వినీ తాను చేయగలిగినది లేక శంకర నారాయణ తన చేతి కర్ర నూ, అరుణ నూ ఊతగా తీసుకుని ఆసుపత్రి కి బయలుదేరారు అరుణకు కట్టు కట్టిద్డా మన్న ఉద్దేశంతో.
    వండిన వంట వండినట్టుగానే ఉంది.
    సీతామహాలక్ష్మీ, సరస్వతు లు ఏదో యెంగిలి పడ్డారు. అంతే. మిగిలిన వారెవ్వరూ ఆనాడు మెతుకు ముట్టలేదు.    
    చీకటి పడింది. రాత్రి అర్ధరాత్రి అయింది. బాధతోనూ, ఆకలి బాధతో నూ అందరూ ఎక్కడి వారక్కడ పడి నిద్ర పోయారు. ఒక్క అరుణ మాత్రం రెప్ప ఆర్పకుండా అలాగే ఆ చీకట్ల నే చూస్తూ, ఆలోచనా నిమగ్నురాలై ఉంది. అమ్మ అన్న మాటలన్నీ శరపరం పరల్లా వచ్చి ఆ చిన్నారి మనస్సు ను చొచ్చుకుని పోతున్నాయి.
    "ఎక్కడ పుట్టిందో, ఎవరికి పుట్టిందో ఆ దరిద్రురాలు........
    "ఈ దరిద్రరాలికి ఏనాడైతే నా ఇంట ఆశ్రయ మిచ్చానో, ఆనాడే నా జీవితనాశనానికి సకలకారణాలూ అయిన దరిద్ర దేవత.......
    "దారిని పోయే దారిద్రాన్ని పేరంటం పిలిచినట్టు నా ఇంటికి తెచ్చుకున్నాను. నేను సర్వ నాశన మయ్యాను!"
    మూగగా అరుణ కళ్ళు ఏడుస్తున్నాయి. ప్రపంచం లోని బాధ అంతా ఆ చిన్నారి హృదయం లో గూడు కట్టుకుని, నివాస స్తానం ఏర్పరుచుకుని అక్కడే అల్లరిగా బ్రతుకుతుంది.
    ఏమనుకుందో ఏమో అరుణ నెమ్మదిగా లేచింది. శంకర నారాయణ గారి పాదాలకు  మొక్కింది. కనకదుర్గ కు అల్లంత దూరాన్నుంచే నమస్కరించింది. చెల్లెళ్ళ నిద్దరినీ కళ్ళల్లో నింపుకుని కన్నీరు కార్చింది. ఇక ఈ దయామయుల కూ, తనకూ ఋణం తీరిపోయిందనుకుంది. కరిగి, నీరై పోయిన తన గుండెను కాఠిన్యం పాలు చేసింది. అందరినీ మరొకసారి తేరిపార జూచి , ఆ చిన్ని ప్రాణాన్ని కబళించడానికే కాచుకుని ఉన్నట్టున్న కటిక చీకట్ల లోకే తెగించి నడక సాగించింది. అందుబాటు లో ఉన్న మేక పిల్లను , ఆకలి గొన్న బెబ్బులి ఆహుతి గోన్నట్టు, అరుణ నూ ఆ గాడాంధకారం ఆకళించుకుంది.
    అరుణ ఆ ఇంటి నుంచి దోచుకు పొయిందేమిటి? తన పుస్తకాలు మాత్రం! మరి అరుణ అలా పోవడం వల్ల ఆ ఇంటిలోని వారు పోగొట్టు కున్న దేమిటి? కాలమే నిర్ణయించాలి!

 

                                       9


    తెల్లవారింది ,. అరుణ కిరణాలు అంతటా వ్యాపించినా, అరుణ మాత్రం ఎక్కడా అగుపించలేదు. శంకర నారాయణ గారి ఇంట అరుణ లేకపోతె ఎలా?
    అయన నిద్ర లేచిందే తడవుగా అరుణ అగుపించాలి. ఇద్దరూ కలిసి, "భజ గోవిందం భజ గోవిందం భజగోవిందం మూడమతే" అన్న గీతాన్ని పాడుకోవాలి. పన్ను తోము పుల్ల తెచ్చి ఇవ్వడం దగ్గిర నించీ, శంకర నారాయణ గారు స్నానాదులు పూర్తీ చేసుకునే దాకా కూడా ఆరుణే. ఆయనగారికి కాళ్ళూ చేతులూ . మరి, అరుణ ఏదీ?
    మళ్ళీ కాళ్ళూ, చేతులూ పోగొట్టు కున్న వాడిలా శంకర నారాయణ సంకట పడ్డారు. "అరుణా, అరుణా!" అంటూ అలాటించిపోయారు. సీతామహాలక్ష్మీ, సరస్వతీ ని , తన వద్ద ట్యూషన్ చెప్పించు కుంటున్న ఇరుగు పొరుగు పిల్లల్నీ అరుణ కోసం పంపించారు. ఎక్కడికి వెళ్లిందని వెళతారూ వాళ్ళు మాత్రం? అలా,  ఇలా తిరిగారు; అంబేద ముఖాలతో తిరిగి వచ్చారు.
    అంత చదువుకున్నవారూ , అంతటి అనుభవజ్ఞులూ, సంసార సాగరం లోని లోతుపాతులు తెలిసిన వారూ పాపం, శంకర నారాయణ ఆనాడు పసిపాపలా ఏడ్చారు. కనకదుర్గ ఏమని సముదాయిస్తుంది ఆయన్ని?
    "అయ్యో! నేను మాత్రం ఆ పిల్లని అనరాని మాట లేమన్నాను? నా బిడ్డల్ని నేను కోప పడడమా? పసిపిల్లలన్న తరవాత పెద్దవారూ పెంచి, పోషించే వారూ ఆ మాత్రం భయం చెప్పుకోరూ?" అంటూ వంట ఇంటినుంచి శంకర నారాయణ గారికి వినిపించేలా ఆపసోపాలు పడింది.
    ఇక ఆమెను ఏమీ అనకూడదనుకున్నారు శంకర నారాయణ. ఏమని ఏం లాభం? ఏది ఏమైనా అరుణ జాడ కనిపెట్టాలి. తన అరుణ ను తన ఇంటికి తెచ్చుకోవాలి. అ ఉద్దేశంతోనే శంకర నారాయణ గారు తన బాధ తాను పడి బయలుదేరడానికి సిద్దమయ్యారు.
    "అయ్యో! ఈ పరిస్థితుల్లో మీరు వెళ్లడమేమిటండీ? తప్పిదం చేసింది నేనూ, తగిన శిక్ష అనుభవించేది మీరూనా? నేనే వెళతాను లెండి. అరుణ ఎక్కడున్నా సరే, వెదికి, మళ్ళీ మీకు అప్ప జెప్పే భారం నాది. ఏమండీ .......ణా మాట వినండీ! ఈ ణా ఒక్క కోరికా మన్నించండి!" అంటూ మొర పెట్టుకుంది దుర్గ.    
    శంకరనారాయణ గారు మాట్లాడలేదు. అసలు మాట్లాడ దలుచు కోలేదు అయన. తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ని అబల ఇంకేం చెయ్యగలుగుతుంది? బావురుమని ఏడుస్తూ అయన పాదాల మీద పడింది దుర్గ.
    "నన్ను క్షమించండి! ఈ కార్య భారాన్ని నెత్తిన వేసుకునే ఓపిక మీలో లేదు. నా కర్మ కాలి ఆ శక్తి మీకు లేకుండా పోయింది. ఈ ఒక్క తప్పిదాన్ని మన్నించండి! నన్నిలా శిక్షించవద్దండీ! ఒప్పుకుంటూన్నాను. నేనొక పశువులా ప్రవర్తించాను. అరుణ మనసును మాయని విధంగా గాయపరిచాను! నన్ను క్షమించండి!"
    "దుర్గా, లే! తప్పు నీది కాదు, పరిస్తితులది! వాటి ధాటికి తట్టుకోగల శక్తి నీలో లేకపోయింది, అంతే!  అందుకనే నీలో రాను రాను అల్ప బుద్ది ప్రబలిపోయింది. అందుకని నేనేమీ బాధపడ్డం లేదుగా? లే. నిన్ను హృదయ పూర్వకంగా క్షమిస్తున్నాను. నీవు ఇంటి పనులు చూచుకో. నేను వారినీ, వీరినీ కలుసుకుని అరుణ జాడ కనిపెట్టే భారాన్ని వారికి అప్పజెప్పి వస్తాను. ఆమాత్రం సహాయం చేసే సహృదయులైన స్నేహితులు ఇంకా ఉన్నారనే నా నమ్మకం!"
    బారువ బరున్న సీసపు గుండును తన గుండె మీది నుంచి తీసి వేసినట్ట నిపించింది దుర్గకు. అవసరపరంగా వెళ్లి, పెట్టె లో ఏ చీర మడత కిందో దాచి ఉంచుకున్న ఒక అయిదు రూపాయల కాగితాన్ని తెచ్చి శంకర నారాయణ గారికి ఇచ్చింది.
    "ఉండండి. పిల్లల్ని పంపి, రిక్షా పిలిపిస్తాను" అంటూ వెళ్ళిపోయింది దుర్గ.
    గోడ ఊతగా తీసుకుని నిల్చున్న శంకర నారాయణ గారు నిలుచున్నట్టే ఉన్నారు. అవ్యక్తమైన ఎన్నెన్నో కారణాల వల్ల అయన మనసు సుడి గాలిలోని ఎండు టాకులా అల్లాలాడిపోయింది. రిక్షా వచ్చింది. శంకర నారాయణ గారిని స్వయంగా తీసుకెళ్ళి రిక్షాలో కూర్చో బెట్టింది దుర్గ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS