'కొంతమందికి సూటిగా మాట్లాడే అలవాటు వుండదు. ప్రతిదానికీ సాధిస్తూ వుంటారు --' అన్నది సుమిత్ర.
'నేనేం నీలాగా చదువు కున్నానా సూటిగా , షోకు గా మాట్లాడడానికి! నాకు చదువు లేకుండా చేసి పెళ్లి చేసి అవతలకి పంపించి చేతులు దులుపుకున్నారు-- పదేళ్ళయింది -- ఓ పురుడూ లేదూ-- పుణ్యమూ లేదు-- చీరే లేదు సారే లేదు--' అక్కసుగా అన్నది విమల.
'దీని కంతకీ కారణం నువ్వేనేమో!' అన్నది సుమిత్ర.
'మేం రేపు వెళ్ళాలనుకుంటున్నాం అన్నయ్యా!' అన్నాడు రఘుపతి ప్రక్క గదిలో నుంచీ వస్తూ , అప్పుడే --
'అదేమిటి మరిదీ! పరాయి వాళ్ళల్లాగా నువ్వు కూడా అప్పుడే వెళ్ళడం ఏమిటి! పది రోజులుండ కూడదా! అమ్మ వెళ్ళిపోయింది కదా! ఇక మనలో మనకి పట్టింపు లేమిటి!' అన్నది ఇందుమతి నిష్టూరంగా--
"ఆఫీసులో పనులున్నాయి వదినా! పిల్లల పరీక్షలవగానే మీరు రండి అక్కడికి!' అన్నాడు రఘుపతి సౌమ్యంగా.
'అవును-- తగుదునమ్మా అని మీరు వెళ్ళండి అక్కడికి!' అన్నది విమల.
రఘుపతి తెల్లబోతూ , "ఏం, ఎందుకు రాకూడదక్కయ్యా! నేను నిన్ను కూడా పిలవాలను కున్నాను!' అన్నాడు.
"మేము రావాలనుకున్నవాడివైతే ఈ పెళ్ళెందుకు చెసుకుంటావ్! ఏవో మాట పట్టింపు లొచ్చి అన్నయ్య పిలవడం చాలించుకున్నాడు. నువ్వయినా యింత పసుపు కుంకుమ పెడతావనుకుంటే ఇలా చేశావు -- ఇంక నాకెవరున్నారు! తిట్టినా, పెట్టినా ఆయనే కదా! ఈ పదేళ్లుగా నేను పడ్డ పాట్లు పరమాత్ముడికెరుక!' కళ్ళ నీళ్ళు తుడుచుకుంది విమల.
'మన తప్పులు కూడా ఎదుటి వాడి నెత్తిన రుద్దడం మంచిది కాదమ్మడూ! మాట పట్టింపు లెందు కొచ్చాయో ఇక్కడ అందరికీ తెలుసు. మీ ఆయనకే తొందర అనుకుంటే ఆయన్ని మించిపోయావు నువ్వు! ఉన్నంతలో నీకు జరిగినంత గారాభం సుమిత్ర కేం జరిగింది పాపం! తృప్తి లేని వాళ్ళు సుఖ పడలేరు!' అన్నాడు మాధవరావు.
'అల్లుడన్న తరువాత అత్తవారింట మర్యాదలు జరగాలనీ, కట్నాలూ కానుకాలూ పొందాలనీ ప్రతివాడికీ ఉంటుంది-- ఎన్నేళ్ళు వచ్చినా అల్లుడు, అల్లుడే!' అన్నది విమల.
'అల్లుడు, అల్లుడు కాదని ఎలా అంటాం! కానీ ప్రతిదానికీ ఓ హద్దంటూ వుంటుంది. అది ఎవరికి వారు గ్రహించు కోవాలి! నా పెళ్ళైన కొత్తలో నా భార్యకి నేను ఏ ముచ్చటా తీర్చలేక పోయాను. కానీ నిన్ను ప్రతి పండక్కి తీసుకొచ్చాను. బట్టలు పెట్టాను. నాలుగు పురుళ్ళు నీకు అమ్మ పోసింది. నువ్వు వచ్చి వెళ్లినప్పుడల్లా నేను చేసిన అప్పులు తీర్చడానికి ఎంత అవస్థ పడేవాడినో ఎవరో గ్రహించలేరు. ఐదో పురుడు కి ఆహ్వానించ లేదని అలగడం ఎంత సమంజసమో, రోజులెంత గడ్డుగా వున్నాయో, మా పరిస్థితులెలా వున్నాయో ఆలోచించలేని నీ మూర్ఖత్వాన్ని ఏమనాలి! పుట్టింటి వాళ్ళంటే పెట్టె వాళ్ళే ననే మనస్తత్వం వుండకూడదు అమ్మడూ! నువ్వూ పెద్దదాని వయ్యావ్! ఏడుగురు పిల్లల తల్లివి-- రేపు నీకూ అల్లుళ్ళు వస్తారు! హృదయం కాస్త విశాలం చేసుకో!' అన్నాడు మాధవరావు సిగరెట్టు నుసి దులుపుకుంటూ గంబీరంగా --
'అందుకేగా పదేళ్ళ నుంచీ రావడమే మానుకున్నాను-- చెల్లెల్ని చదివించడానికి వందలకి వందలు వుంటాయి గానీ, నన్ను ఏడాది కో మాటు పిలిచి చీరే పెట్టడాని కుండవు కాబోలు!' ముక్కు చీదుతూ లేచింది విమల.
విమల పెద్ద కొడుకు కృష్ణమూర్తి విశ్వం ఈడు వాడు, విశ్వంతో మాట్లాడుతూ వరండాలో కూర్చున్నవాడు లేచి వచ్చి, "ఏమిటమ్మా గొడవ! అందుకే నీ వెంట నేను రానన్నాను--' అన్నాడు.
'నాదంతా గొడవే నాయనా!' అన్నది విమల.
'అక్కయ్యా! నేను చిన్నన్నయ్య సాయంతో చదువు కుంటున్నాను. అదీ పెళ్లి కుదరక చదువు కుంటున్నాను. చీరెలు కావాలంటే నీకు అన్నయ్య లు పెట్టనన్నారా! వాళ్ళు పెట్టేవి నీకు చాలవు గాని!' అన్నది సుమిత్ర.
"అందరూ నన్నే అనండి! చదువూ సంధ్యా లేని దాన్ని ఎవరైనా అంటారు!'
'ఊరుకో వదినా! అవతల రాధ వింటే బావుండదు -- పద కాఫీ త్రాగుడువు గాని!' అన్నది ఇందుమతి.
"ఏం ఆవిడ అంత గొప్ప మనిషా!' అంటూ లేచిపోయింది విమల.
'ప్చ్! దీనికి చెప్పగల వాళ్ళు ఈ భూమి మీదే లేరు!' అని నిట్టూర్చాడు రఘుపతి.
కొంచెం సేపు అయ్యాక "సుమిత్రా! పరీక్షలు కాగానే నువ్వు అక్కడికి రాకూడదూ!" అన్నాడు చెల్లెల్ని చూసి.
"అలాగే వస్తాం లే అన్నయ్యా! పిల్లలూ నేనూ!'
'అది కాదమ్మాయ్! అక్కడ కాలేజీలో చేరకూడదా అని!'
'అత్తగారు వెళ్ళనే వెళ్లారు! మాకు తోడుగా ఆ అమ్మాయి నైనా వుండనివ్వయ్యా! ఆ అమ్మాయి పిల్లలకి బాగా అలవాటు-- బెంగ పెట్టుకుంటారు!' అన్నది ఇందుమతి.
సుమిత్ర వెనక నిలబడి పమిట కొంగు మెలి పెడుతున్న చిట్టి, 'అవును చిన్నత్త మాకు కావాలి' అన్నది.
"మీరే వుంచుకోండి!' అని నవ్వింది సుమిత్ర.
'నువ్వు చాలా మంచిదానివి సుమిత్రా! నీలాంటి వ్యక్తిని నేనెక్కడా చూడలేదు-- నువ్వు తప్పకుండా మా దగ్గరకు రావాలి!' అన్నది రాధ సుమిత్ర చెయ్యి పట్టుకుని.
"నిర్వచించలేని ఆత్మీయత యిద్దరి హృదయాలలో నూ వెల్లివిరిసింది.
'తప్పకుండా వస్తాను వదినా! నీకిక్కడ జరిగిన అవమానాలన్నింటి నీ మరిచిపో! ఇందు వదిన చాలా మంచిది నీలాగా! ఆమె కూడా వాళ్ళమ్మ ప్రవర్తనకి నోచ్చుకున్నది' అన్నది సుమిత్ర.
'అవును-- నాకు తెలుసు! ఇలాంటి వన్నీ జరుగుతాయని ముందే ఊహించాను-- మన జీవితాన్ని మనకి మనంగా తీర్చి దిద్దుకోవాలన్నప్పుడు యిలాంటి వన్నీ ఎదుర్కొనక తప్పదు--' అన్నది రాధ.
'అవును వదినా!' అన్నది సుమిత్ర . ఏదో చెప్పాలనే ఉద్వేగం వున్నది. కానీ మాటలు పెగలడం లేదు.
కళ్ళ నిండా నీళ్ళు తిరిగాయి.
'వెడతాం సుమీ! ఉత్తరాలు వ్రాస్తుండు! అంటూ రిక్షా ఎక్కేశాడు రఘుపతి. తను చాలా మనస్సు పడి కొనుక్కున్న దంతపు బొమ్మ ఒకటి రాధ కిచ్చి 'నా జ్ఞాపకంగా యిది వుంచుకో వదినా! ఇంతకన్నా నీకు నేనేం యివ్వలేను!' అన్నది సుమిత్ర.
రిక్షా కదిలి కనుమరుగై పోయింది.
బారెడు ఎండ ఇంట్లోకే వచ్చేసింది అప్పుడే. ఇందుమతి ఇంటి పనుల్లో లీనమై పోయింది. వాలు కుర్చీకి చేరబడి ఆలోచనల్లో మునిగిపోయాడు మాధవరావు --
ప్రక్కనే వున్న స్టూలు మీద కూలబడింది సుమిత్ర.
'నీ ప్రియమైన అన్నా, వదినే వెళ్ళారా?' అంటూ చేతిలో దువ్వెనతో ప్రవేశించింది విమల.
'వయస్సుతో పాటు మనస్సు ఎదగక పొతే లాభం లేదక్కా! ఈసారి నీతో చాలా మాట్లాడాలని వుంది నాకు!' అన్నది సుమిత్ర కటువుగా.
'దానికేం! మాట్లాడూ! మాటలకేం దబ్బా! ఏమన్నానా?' అన్నది విమల కూతురికి జడ అల్లుతూ.
మాధవరావు లేచి పోయాడు.
'నువ్వూ, నీ పిల్లలూ, డబ్బు చాలక యిబ్బంది పడుతున్న మాట నిజమే! కాదని ఎవరంటారు! నీలాగే అన్నయ్యా, చాలా ఇబ్బంది పడుతున్నాడు; వదిన తెలివి గలది కనుక సంసారం ఎలాగో నేట్టుకోస్తుంది అలాగే నువ్వూ నీ యింటిని పొదుపుగా దిద్దుకో కూడదూ? ఎవరో పెట్టలేదనే కంటే!'
'గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట పొడుపు పాఠాలు నాకు నువ్వు నేర్పు తావుటే!' అని కళ్ళెర్ర చేసింది విమల.
'అత్తయ్యా నాకీ పాఠం చెప్పావూ!' అని వచ్చిన సావిత్రిని తీసుకుని డాబా మీదకు వెళ్ళిపోయింది సుమిత్ర విసుగ్గా.
ఆ మర్నాడు విమల వెళ్ళిపోయింది. సుమిత్ర పెట్టేంటా తనిఖీ చేసి రెండు, మూడు మంచి చీరెలు తీసి పెట్టుకుని, 'ఇలాంటి చీరేలంటే నాకు చాలా యిష్టం -- మీ బావ తేరు సుమిత్రా , నువ్వు ఎల్లాగా కొనుక్కుంటావు -- అన్నది.
'తీసుకు పో! అక్కయ్యా! చీరెల కేం! అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాయి. నీ పుట్టింటి పర్తిస్తితులు మీ ఆయనతో చెప్పి ఆయనకు మన మీద కోపం తగ్గేలాగు చెయ్యాలి గానీ, ఆయనతో కలిసి నువ్వూ అలిగి కూర్చోడం బావుండదు! బాగా ఆలోచించు --' అని సలహా చెప్పి పంపింది సుమిత్ర.
పరీక్షలు బాగా దగ్గర కొచ్చేశాయి. ఈ పదిహేను రోజులుగా పుస్తకం ముట్టడానికే పడలేదు. తన భవిష్యత్తంతా చదువు మీదనే ఆధార పడి వున్నదని తనకు తెలిసీ, అశ్రద్ధ చెయ్యకూడదు.
అలమారంతా ఒక్క మాటు సర్దుకుని చదువుకోడానికి టైం టేబిల్ తయారు చేసుకుంది సుమిత్ర.
ఇంట్లో అమ్మ లేకపోవడం పెద్ద లోటుగా వున్నా అది అలవాటై పోయింది క్రమంగా. సావిత్రీ, విశ్వం కూడా శ్రద్దగా చదువు కుంటున్నారు, తనతో పాటే.
