Previous Page Next Page 
ఋతుపవనాలు పేజి 6


    'తధాస్తు . అట్లయిన నిట్లగుగాక!' సరస్వతి గోదాదేవి చేయందుకుంది.
    భాగీరధమ్మ వారిస్తూ ' ఎండకు నువ్వెందుకమ్మా!' అంది.
    "ఎండేముందమ్మా! నువ్వు పాదతావే, అదేం పాటమ్మా...కార్తీక మాసపు టెండ, కాసేటి రేయెండ --అంటూ?'
    'సరేలే చమత్కారం! ఇదంతా నీ పురమాయింపే!'
    ఇద్దరూ నవ్వుకుంటూ బైటి కడుగేశారు. వీళ్ళను చూస్తూనే కాడి నిలబెట్టి , వాళ్ళు ముగ్గురూ వచ్చేశారు. చేను గట్టు కు రెండు పగ్గాల దూరం లో కోనేరుంది. కోనేటి గట్టున పడమటి వేపున చిన్న గుడి ఉంది. ఆ గుడిలో అంకాళమ్మ! గుడి పక్కన వేపచెట్టు. గుడి వెనకాల ఊళ్ళో కి బాట.
    'ఏమమ్మా! పొలం చూడాలనోచ్చావా?' పలకారించాడనంతయ్య.
    'మన దయ్యముందిగా....లాక్కుని వచ్చి ఉంటుంది.' వాసవి.
    'ఏయ్! దయ్యం గియ్యం అంటే నేను మంచిదాన్ని కాను. చూడు నాన్నా! అన్నం బెదదామని వచ్చినదాన్నేలాగంటాడో?'
    "దయ్యమంటే తప్పు గాదె, దయ్యమా! దైవము ప్రకృతి దయ్యము వికృతి.'
    మీ పోట్లాట సరేగాని, సరస్వతీ! నన్నయ్య వచ్చాడు చూడు అన్నానికి....'
    'కొత్తమ్మ గారూ! నా తిండి చూసి జడుసుకునేరు' అన్నాడు నన్నయ్య.
    గోదాదేవి నవ్వి, ఏం జవాబుచేప్పాలో తెలియక ఊరుకుంది.
    'తిండి కలిగితే కండ కలదోయ్! కండ కలవాడేను మనిషోయ్!' అన్నాడనంతయ్య.
    సరస్వతి తండ్రికి, వాసవి కి విస్తళ్ళ లో అమర్చింది.
    'మీరూ కూర్చోండి, పొలంలో అన్నం తినడం ఎంత సరదాగా ఉంటుందో చూద్దురు గానీ....' వాసవి.
    'ఊహూ...మేం తరవాత.'
    'ఇక్కడా?" అన్నట్టు చూసింది గోదాదేవి.
    'అయితేనేం? సిగ్గెందుకు?" అన్నట్లు సరస్వతి కళ్ళతో సమాధానం చెప్పింది.
    'పప్పులో సింత సిగురు వేశారు, భలే బాగుందయ్యా...' అన్నాడు నన్నయ్య.
    సింత సిగురు వేసిన పప్పంటే జ్ఞప్తి కోస్తాడు-- ఎవరు?' అన్నం కలుపుకుంటూ అన్నాడనంతయ్య.
    'హూ. అతడు సామాన్యుడా? ఆంధ్రజాతి పొగరు....' వాసవి.
    'కాదయ్యా. సిల్తాకు సిగురు జూడు, సిల్నదాని పొగరు జూడు....' ముద్దా నములుతూ నన్నయ్య.
    పక్కుమని నవ్వడం లో పోతబోయింది అనంతయ్య కు. సరస్వతి నవ్వుతూ అంది. సిగురు, పొగరు పదాల్ని నన్నయ్య తనకు తెలిసిన సాహిత్యం లో సమస్యా పూరణం చేశాడు.'
    'అది కదయ్యా , నన్నయ్యా! నాలుగు వందల ఏళ్ళ కు ముందు శ్రీకృష్ణ దేవరాయాలనే రాజుండేవాడు. ఆయనొక మహాకావ్యం వ్రాశాడు. ఆ కావ్యంలో రైతుకు జీవనాడి అయిన వర్ష ఋతువు ను గూర్చి అద్భుతంగా వర్ణించాడు! ఆ వర్ష ఋతువులో రైతు లిళ్ళలోనే కాలం గడిపారు. కుంపట్ల తో చలి కాచుకుంటూ, చుట్టూ ఉన్న దూడలు ఒళ్ళు నాకుతుండగా , మంచ మెక్కినారు. సిన్తసిగురు వేసిన పప్పు, అరికన్నమూ మెక్కినారు.....'
    'రాజుగారికి అరికన్నము ఎట్టా తెలుసబ్బా!'
    'అదేనయ్యా ఆ రాజులోని ప్రత్యేకత ! అయన ఈ గుడ్డకు ప్రాణమైన రైతును ప్రేమించాడు. వాని ఇల్లు , వాని తిండి , వాని సంపద కళ్ళారా చూశాడు. ఆర్ద్రంగా హత్తుకున్నాడు. ఆ ఆత్మ ఇక్కడి గాలిలో, మట్టి లో , రైతులో , ఋతువు లో ఐక్యమయింది. అందుకే ఇది "రాయలసీమ" అయింది!'
    'సింత సిగురు కత అదన్న మాట!'
    'ఆ కృష్ణ దేవరాయలంటే రాఘవరెడ్డి కి చెప్పలేని అభిమానం . అందుకే తన కుమార్తెకు గోదాదేవి పేరు పెట్టుకున్నాడు.'
    అన్నం తినడం ముగించారు.
    'గొర్రు సాగిడ్డామా?'
    ' ఇప్పుడే అన్నం తిన్నాము. కాసేపు కూచోండయ్యా, ఇంకేంతుంది? నాలుగు మలుపులు మళ్ళితే గెట్టు....' గుడి వేపుగా నడిచారు.
    'ఇక రావచ్చు.' సరస్వతి.    
    'ఇద్దరికీ ఒక విస్తరే....'
    'ఆ...వేరు వేరుగా నేను సర్దుతాను, బాబూ!' విసుక్కుంది.
    కానీ, విషయ మది గాదు. గోదాదేవి ప్రసన్న ముఖంతో ఆలోచిస్తుంది. ఇందుకు కూడా అనంతయ్య నే  అభినందించాలా? సందేహ మెందుకు? సరి అయిన శిక్షణ విచ్చినందుకు సుత్తి యోగ్యుడే! అయితే, సన్మార్గుని సంతానం దుర్మార్గులు కావడం ఆలోచిస్తే , వీళ్ళని తేలిక చెయ్యడం సాధ్యం కాదు.
    'అరె! కూర్చో ! అదిగో , రాతి సింహాసనం! నీ జీవితం వడ్డించిన విస్తరి కావాలని నా కోరిక.'
    గోదాదేవి సరస్వతి కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో నిశ్చలమైన కోనేటి నీటి ప్రశాంతి! గోదాదేవి హృదయంలో నించీ సంతోషం ఒరుసుకుని వచ్చింది. సరస్వతి చే యందుకుంది. 'థాంక్యూ! మరి నీ జీవితం?'
    'చిరిగిన విస్తరి కాకుంటే చాలు....'
    'ఛీ! ఛీ! నీకు వాక్శుద్ధి లేదు!' సరస్వతి చేయి విసిరేసింది.
    'దోష పరిహారార్ధం....' అంటూ ముద్ద కలిపి గోదాదేవి చేతి కందించింది.
    తుమ్మచెట్టు మీద కాకి, నోరు తెరుచుకుని ఓరగా వాళ్ళ కేసి చూస్తుంది. ఎక్కడో గొల్లబోయాడు కేకేసి గొర్రెల్ని పిలుస్తున్నాడు.
    సరస్వతి గుడిలోని అంకాళమ్మ కధ చెబుతుంది. ఉగాది పండుగ నాడు అలంకరించుకున్న ఎద్దులతో బళ్ళు కట్టుకుని వచ్చి, టెంకాయ కొట్టి బోనాలు పెట్టడం, బోనాల అన్నం చాకలి , మంగలి వాళ్ళకు పంచెయ్యడం , బళ్ళన్నీ కోలాహలంగా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యడం, గుడిలో ఏడు శిరసుల నాగరాజు-- తల మీద మణి కాంతులతో అర్ధరాత్రి ప్రతి రోజూ అంకాళమ్మ ను పూజించడం!
    వెన్నెల రాత్రుల, అంకాళమ్మ ఆరుగురు అక్క చెల్లెళ్ళ తో దాగుడు మూత లాడుకోవడం, ఒకరోజు ప్రొద్దుపోయి అత్తగారి ఊరి నుంచి వస్తూన్న ఆవుల కన్నయ్య వాళ్ళను చూడ్డం....భద్రం సుమా! ఈ సంగతి ఎవరితో నైనా చెపితే చస్తానని వాళ్లు హెచ్చరించడం.... కానీ, కన్నయ్య దాచుకోలేక బైటి కనడం, ఆ సంజవేళకు ప్రాణం విడవడం ....చెబుతుంది. దానిలో ఉన్న నిజాన్ని వాళ్ళిద్దరూ ఆలోచించ కుండానే, ఆయా సంఘటనలు కలిగించిన అనుభూతికి లోనయ్యారు చిత్రంగా. ఆ అలౌకికత్వం వదిలించుకుని చూసేటప్పటికి , వాళ్లు ముగ్గురూ చేలో సగం దూరంలో కనిపించారు!
    'నాన్నోయ్! మేం పోతున్నాం....' విశాలమైన ఆ పొలాల్లో , పైరు లో చిరుగాలి చేసే చప్పుళ్ళ లో, సరస్వతి కేక గోదాదేవి శ్రవనేంద్రియాల కతి వినూత్నంగా వినిపించింది. అంత గట్టిగా అరవాలనిపించే అవసర ముంటుందని గూడా ఇంతకూ ముందామెకు తెలియదు. ఆ కేక వినడానికి ఆసక్తి గానూ ఉంది, అసహ్యంగానూ ఉంది.
    వాళ్లు ఆగి తిరిగి చూశారు. అటునుంచి కేక! ఆ శబ్ద తరంగాలు వలయాలుగా పయనించి, వాళ్లి చెవికి సోకి సోకకుండా పగిలి గాలిలో కలిసిపోయినాయి! గోదాదేవి కర్ధం కాలేదు.
    'ఎమిటంటున్నారు?'
    'తుమ్మముళ్లుంటాయి. రబ్బరు చెప్పుల్లో దిగబడతాయి, జాగ్రత్త" అంటున్నారు.
    'ఫరవాలేదు ! మీరు పొండి' మళ్ళీ గట్టి కేక!
    'అబ్బ! ఏమిటా కేక!' విసుక్కుంది.
    సరస్వతి నవ్వుతూ, అన్నం తెచ్చిన గంప అందుకుని ముందుకు కడుగేస్తూ అంది: 'పొలం లో కొస్తే గట్టిగా కేకేయాలనిపిస్తుంది....'
    'ఎందుకూ?"
    "ఎందుకో మరి, నాకు తెలియదు.'
    రెండు వేరుసెనగ చెట్లు పీకి, కాయలు తెంపి గోదాదేవి చేతిలో కొన్ని పోసి, తనూ తీసుకుని కసాపిసా నమల సాగింది.
    'ఎంత ఘోరంగా నములుతున్నావు!'
    సరస్వతి నమలటం ఆపటం కుదర దన్నట్లు బదులు పలకలేదు. గోదాదేవి మట్టి పెళ్లను తన్నుకుని తొట్రుపడింది!
    'ఆ, భద్రం! సావిత్రీ, ఎంత కష్టం! ఇటు రమ్ము! భుజము మెడ వైచి కేల్బూని ముందు నడువు..... కాయభారమున కంది సాలు ఇయ్యేడ వంగే, కంది కాయలు కోసుకుందామా?'
    "ఎందుకు?'
    "ఎందుకా? అవి ఉడకేసుకుని తింటే ఎంత బాగుంటాయని! నీకెవరూ అలాంటి విందు ఇచ్చి ఉండదు. ఏ హోటల్లోనూ, నువ్వింతకు ముందు ఉడకబెట్టిన కంది కాయ తిని ఉండవు....'
    'కందికాయా వద్దు, కాకరకాయా వద్దు. పోదాం పద!'
    'సరే! నీ ఖర్మ! పోదాం పద.' బాటకు పడమటి వైపున నిలువెత్తు జొన్న చేను. తూర్పున ...ఒక సారి మంత్రించినట్లు ఆగిపోయింది గోదాదేవి.
    'అబ్బ! అటు చూడు, ఏం పూల చెట్లవి?'
    సరస్వతి నవ్వు దాచుకుంది. 'అవా! అవి దేవలోకం నించీ వచ్చినవి. ఈ ఊళ్ళో పూర్వీకు లెవరో సత్తే భావ నడిగి కొన్ని విత్తనాలు తెచ్చుకున్నారట. అప్పట్నించీ...'
    'అబ్బ! చెప్పరాదూ?'
    'అవి గోగుపూలు!"
    గోదాదేవి కొంచెం లోపలికి వెళ్లి చూసింది. దోసెడు వెడల్పున విచ్చిన రంగుల , ఇంద్ర ధనువులు పొడుపు కున్న పూలు! పువ్వు పువ్వునా వాలిన సీతాకోక చిలుకలు. సీతాకోక చిలుక రెక్కల వంటి పూల రేకులు! ఒక మొక్క వంచి పువ్వు తెంచి చూడసాగింది. చేతనైతే ఇలాంటి చిత్రం గీస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది! ఆమె ఆ దృశ్యాన్ని కళ్ళలో దాచుకునేందుకు అయిదు నిమిషాలు చూసి, బాటలోకి దిగింది. సరస్వతి కనిపించలేదు. నాలుగు బారల దూరంలో జొన్న కటువైపున సన్న సన్నని మాటలు!
    'వస్తుంది, బావుండదు....నువ్వెళ్ళు!' సరస్వతి  వెనుదిరిగి చూస్తూ వచ్చింది.
    గోదాదేవి గబగబా రెండడుగు లేసి సరస్వతి చూస్తూ వచ్చిన దిక్కుగా చూసింది. సరస్వతి  ముఖంలో సిగ్గు చిత్రంగా పరుగెత్తింది. గోదాదేవి నవ్వు చూసి, ముందు కడుగేసింది. జడ లాగడం వల్ల ఆగింది.
    'ఫరవాలేదు . పల్లెటూరి పిల్ల వనుకున్నాను-------ప్రబంధ సుందరివేనె! ప్రస్తుతం ఏ అవస్థ?"
    'ప్రధమావస్థ!'
    'మలయానిల మన్మధ దూషణల దాకా వచ్చిందా?'
    'ఇంకా రాలేదు' నవ్వింది.
    'చదువు?'
    'వానాకాలం చదువు!'
    'ముందు కధ?'
    'మూడు ముళ్ళు.'
    'అయితే, నేను మళ్లీ రావడం నీ పెళ్లికే.'
    'అట్లనే అనుకుందాం....'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS