"ఛీ! పో అన్నయ్యా....." వసంత సిగ్గుపడి పోయింది. అంటే దాని భావం "యిష్ట"మే నన్న మాట. "ఛీ! దొంగకానా...." అన్నాడు భాస్కరం ఆప్యాయంగా-వసంత "ఉండు.... అమ్మని కాఫీ యిమ్మని తెస్తా" నని వెళ్ళిపోయింది.
భాస్కరం ఆలోచనలో పడ్డాడు. తాను చూడవల్సిన యీ పెళ్ళి సంబంధానికీ, వసంతకు చూసిన పెళ్ళి సంబంధానికీ ఎక్కడో బాదరాయణం ఉండి ఉండాలని తోచింది. రవమ్మగారి మాటలు, అందులోని "చెలాయిఁపూ" చూస్తే రాఘవేంద్రరావు ఆమె "మాటాడమంటే ఆడతాడూ, వద్దూ అంటే మానేస్తాడూ అని తోచింది - అయితే "ధనమ్మ కెందుకూ నామీద వింత ఆపేక్షా .....కొంపతీసి-రేపు నన్ను చూడమనే పెళ్ళికూతురు ఈమె కూతురు కాదుగదా?" అనుకున్నాడు.
వసంత కాఫీ కప్పుతో వచ్చి, అన్న తదేకంగా పరధ్యానంలో పడిపోడం గమనించింది. దగ్గరిగా వొచ్చి "అన్నయ్యా" అని పలకించింది. ఆమె చూపులో వాత్సల్యమూ, ఆపేక్షా తొణికిసలాడినయ్.... ఉలిక్కిపడ్డాడు భాస్కరం. కాఫీ కప్పు అందుకున్నాడు- "నీకు ఇప్పుడు పెళ్ళి చేసుకోడం ఇష్టంలేదుకదూ?" పెద్ద ఆరిందాలాగ అడుగుతున్నది వసంత.
భాస్కరం మాటాడలేదు. అటుకేసి తిరిగి చూడనేనా లేదు.
అన్నయ్య మౌనంలో తాను వూహించినకన్నా యెక్కువ విపరీతమే ఏదో ఉన్నదని భావించింది వసంత-మెత్తగా అడిగింది.
"అన్నాయ్! ఓ మాట అడగవా?"
"ఊఁ."
"నాతో చెప్పకూడదా? నే నమ్మతో చెపుతానుగా."
"అది కాదమ్మాయ్! నన్ను నమ్ము. ఇందులో పెద్ద ఇదేమీ లేదు" -భాస్కరం పొడిగా నవ్వి అసలు సంగతి తప్పించా లనుకున్నాడు. "చూడు నీకు పెళ్ళి చేయాలి- అదీ తొందర మొదట.....అలాగే నాకు యీ చదువు పూర్తవ్వాలీ-అదీ తొందర నాకు..... అదీ గాకుండా నాకు ఒక గుదిబండను కడితే ఎలా చెప్పు?" పైగా ఉద్యోగం పురుష లక్షణం-అది చేస్తూంటే అప్పుడూ పెళ్ళీ....." మళ్ళీ నవ్వాలని ప్రయత్నించేడు. "పెళ్ళీ అంటే ఖర్చుతో పని" అన్నాడు. "బాగుంది అన్నయ్యా!.....ఖర్చు లవుతాయని పెళ్ళిళ్ళు మానుకుంటారా? .... అదీగాక వొదినె వస్తే ఉత్తచేతుల్తో రాదుకదా?...." అన్నది అమాయకంగా వసంత.
"కట్నం కాసుల పేరిట ఒకరి కొంప గుల్ల చేయడం నా కిష్టంలేదు చెల్లీ" ఆవేశంగా అని, మళ్ళీ వసంత నొచ్చుకున్నదేమో నని బాధపడ్డాడు భాస్కరం.
వసంత చురుక్కున చూసింది.
"కట్నం వొద్దని చెప్పేవాళ్ళకి యివ్వకూడదని తెలియాలిగా ...." అడిగింది.
ఆ అమ్మాయి కంఠంలోని తీవ్రతకి భాస్కరం చకితుడయ్యాడు- 'పసిపిల్ల' దీని మనసు అనవసరంగా నొప్పించాననే కించపడ్డాడు కూడా.....
"మరి కట్నం పేరిట మీ రెందుకు నా నెత్తిన యిన్ని వేలు గుమ్మరిస్తున్నారు.....? ఆదర్శమంటే నీ ఒక్కడిదేనా? అన్నాయ్!! నీ దగ్గర ఒక శాస్త్రం నాకో న్యాయమూనా?"
ఏమనగలడు భాస్కరం!
ఏమన్నా, సూటిగా శూలంలా తన ఎదను గుచ్చుకుంటున్నది వసంత. అదీగాక ముక్కుపచ్చలారని తన వసంతేనా? యిన్ని ప్రశ్నలు-నిన్నటిదాకా అడ్డమైన పుస్తకాలు చదవ్వొద్దని తనచేత చీవాట్లూ దెబ్బలు తిని ఏడ్చిన చిన్న పిల్ల వసంతేనా? ఇంత లేసి ప్రశ్నలు వేస్తున్నది! "ఆడపిల్ల లెంతలో ఎదిగిపోతారు!"
అందుకని అతను మాట-తీరే మార్చాడు.
"అది సరే! మొదట యిది చెప్పు .... మీ అన్నయ్య పరీక్ష ప్యాసవ్వాలా? అక్కరలేదా?"
"మహారాజులా ఫస్టుక్లాసులో ప్యాసవ్వాలి....."
"మరి చదువుకోనా? మీ వొదినెగారు వస్తే ఆమె గారి సేవే చేసుకోనా?"
"రెండూను" నవ్వింది వసంత. మిల మిలా మెరిసే కళ్ళతో చిలిపిగా అన్నయ్యను చూసి.
"ఉహూఁ! రెండూ కుదరవు....అందాకా పెళ్ళి ఆగాల్సిందే....లేపోతే నా పరీక్ష కొండెక్కిపోతుంది....భాస్కరం అనునయంగా చెల్లెలి చెవి దగ్గరగా వొచ్చి చెప్పాడు.
"అన్నీ అబద్ధాలు ...." వసంత అన్నయ్య వాదాన్ని కొట్టిపారేసింది. "ఐతే నీ పెళ్ళిదాకా నాదీ వద్దు ..... ముందస్తుగా చెప్తున్నా.....ఆనక అమ్మ దగ్గిర నన్ను ఉరిమి చూడొద్దు.....తిడితే కూడా ఒప్పుకోను.....ఏడుస్తా నంతే" చరచరా కప్పు, సాసరూ తీసుకుని పారిపోయింది వసంత.
"ఏం బాధ వచ్చిందిరా బాబూ!"
అనుకోని పిడుగు పడ్డట్లయింది. "ఇదేం అన్యాయం .... నాకు పెళ్ళి వొద్దు మొర్రో అంటే నాకూ వొద్దంటుందీ మంకుపిల్ల" విసుక్కున్నాడు భాస్కరం. "పిన్ని చెబితే అదే వింటుందిలే" అనుకున్నాడు కాని, పిన్నీతోనా?-"బాబోయ్! అది పిన్నికి మొదటే అన్నయ్య పెళ్ళి వొద్దన్నాడే, పిల్లను చూడనన్నాడే అని చెప్పేనో"-భాస్కరం భయపడ్డాడు. "పిన్నికి కోపం వస్తుంది" అని గుండెల్లో రాయి పడింది.
"ఛా! ఛా! వసంత పెంకెదై పోయింది. నా పెళ్ళికీ, దీని పెళ్ళికీ ముడెందుకూ?'
"పైగా కట్నం ఇవ్వకుండా ఎలా?" భాస్కరం ఎంత ఆలోచించినా, వసంతను ఒప్పించటం ఎలాగో తోచలేదు.
"ఆ పెద్దమనిషి ఎవడో గాని, "అయ్యా! మీ అబ్బాయికి మా అమ్మాయిని కట్న మడగకుండా చేసుకోండీ అంటే వింటాడా?....."
బహుశా వసంతకు పిన్ని చెప్పివుండాలి. పిన్ని రెండు మూడుసార్లు అన్నది కూడా "ఇంత ప్రయోజకుడైన కొడుకు, మూడు మూర్తులా అందమైన వాడూ ఉండి-కూడా జానకమ్మ బిగిసి, కట్నం ఎక్కువ రాబట్టలేదూ అంటే సాటివారిలో ఎలా గండీ తల ఎత్తుకోడం?" అని సుబ్బారావుగారితో. "అదీగాక వసంతకు చేసిన కంటే ఘనంగా భాసడి పెళ్ళి చెయ్యాల్సిందే" నంటుందామె.
"వసంతకు ధనమ్మగారు చూసిన యీ సమ్మంధంలో ఏదో గుంభన ఉన్నది" అనుకున్నాడు. భాస్కరం కాని ఆలోచనలు, ఆందోళన తరగలేదు. ఎద మరిగి కాగిపోయింది.
"అబ్బా! చిన్నప్పన్నించీ యీ పిల్లకి హఠం ఆవాటు చేశాం.....అది నేను పెళ్ళికి ఒప్పుకుంటే గాని, ఇక పెళ్ళికి లొంగదు" చెల్లెలిని తిట్టుకున్నాడు.
పోనీ, పద్మావతిని తాను ప్రేమిస్తున్నానని చెబితే .... "అమ్మయ్యో! ఇంట్లో అందరూ త్యాగమూర్తులే ..... ఊఁ అంటే చాలు; పిన్ని నిరశనవ్రతం ...... ఉపవాసదీక్షా పడుతుంది ..... కోపంతో నూతిలో పడిపోతానంటే ...."
పద్మావతి విషయంలో జానకమ్మ సుముఖ మవుతుందనే ఆశ ఎందుచేతనో భాస్కరానికి కలుగనే లేదు. అందుక్కారణాలు ఒకటి గాదు; అనేకం ఉంటాయని అతని అంతరాత్మ ఘోషిస్తూనే ఉన్నది.
"వసంతకు యీ సమ్మంధం అన్నివిధాలా నప్పింది. కుర్రవాడు దానికి నచ్చాడూ.....తతిమ్మావి అమ్మకీ నాన్నగారికీ నచ్చాయి..... ఇది జరిగితీరాలి" అనుకున్నాడు. ఉద్వేగంగా లేచి అటూ యిటూ పచార్లు మొదలుపెట్టాడు.
చటుక్కున ఏదో స్ఫురించినవాడిలా పిన్ని దగ్గరకు వెళ్ళాడు.
"నేను అట్లా బయటకు పోయివస్తాను పిన్నీ!" అన్నాడు.
"పోయి రా!.......ఉండు. దీపం పెడతా; మొహం చూసి పో....లేకపోతే ఏ మొహం చూస్తావో యేమో" నని ఆమె దీపం వెలిగించి పుస్తెలు తీసుకొని కళ్ళ కద్దుకుని భాస్కరం తన మొహం చూసేడనుకున్నాకా, వంటయింటిలోకి వెళ్ళిపోయింది.
"త్వరగా రా" అని కేకేద్దా మనుకుని "పోనీ వెళ్ళనీ; వాడికి తెలియదా? వాడే వచ్చేస్తాడు" అని ఊరుకుని వంటయింటి పనులలో నిమగ్నమై పోయింది.
అదింకా దీపాలవేళ కాదు గాని, భాస్కరం ఆవిడ మొహంలోనికి భక్తి విశ్వాసాలతో చూశాడు. "తనా? నాకు అవకాశం చేస్తున్నదేమో నని నేను అనుకున్నాను?" భాస్కరం, పిన్ని గురించి అలా ఆలోచించి నందుకు సిగ్గుపడ్డాడు.
"తల్లి తనకు చెరువు చేస్తుందని భావిస్తున్నావా?" తిట్టుకున్నాడు భాస్కరం. కాని తను పద్మావతి గురించి చెప్పలేడు.
రోడ్డుమీద నడుస్తూ వున్నా, పిన్నిని రేపటి తనకు చూడబోయే పెళ్ళి-సమ్మంధం నుంచి విముఖురాలిని చేయడం ఎలా అన్నదే అతని ఆలోచన.
వసంతకు పిన్నికి నచ్చిన సమ్మంధం అయిపోయిందా? ఇక తాను బయటపడవచ్చును-కాని జానకమ్మకు దూరంగా వెళ్తూ ఆలోచిస్తున్నాడే తప్ప, భాస్కరం ఎదుటపడితే ఏమీ బదులు పలకలేడు.
కాని వంటయింటపనులు చక్కబెట్టుకుంటున్న జానకమ్మగారికి కూడా ఏ పనీ చేతబట్టటంలేదు. ఆమె "తన గురించి ఏమీ పసిగట్టలేదూ" అనుకున్న భాస్కరం కేవలం అనుభవశూన్యుడే. ఆమె ఆలోచిస్తూనే ఉంది.
"ప్రాయంలో ఉన్న ఏ పిల్లవాడేనా సరే! పరిస్థితుల దృష్ట్యానో లేక సిగ్గుచేతో కాస్త ముందు వెనుకా ఆడినా, వివాహమంటే కుతూహలం చూపక మానడు-ప్రాయంలో ఉన్న ఏ పిల్లా ఐనా పెళ్ళి అంటే చెక్కిళ్ళు కందిపోగా సిగ్గు పడకనూ మానదు......కాని భాపడు పెళ్ళి అంటే మొహం చిన్నబుచ్చుకుంటున్నాడు" అదే ఆమె అనుమానానికి కారణం. "ఏమో బాబూ!" అని గట్టిగానే అనుకుని ఆమె భయపడ్డది.
"ఏడు ఏ నీతిమాలిన దాన్నో, కులంలేని దాన్నో చూసి దాని వలలో పడకుండా కాపాడు భగవంతుడా?" అని మనసా కోరకున్న దామె.
10
ఆకాశాన లాలిమ ...... కొండ అంచులనీలిమ నిండి శోభాయమానంగా ఉన్నది. ప్రకాశం-బ్యారేజీ దగ్గర సాయంతరపు సంధ్యకాంతు లింకా కరిగి పోనమి దీపాలు వెలవెల బోతున్నాయి. అది విజయ వాడ నగరం.
కాస్త ప్రశాంతంగా ఆలోచించుకుందామని భాస్కరం పూలమొక్కలున్న పార్కును! దాటి, లాకుల కవతలి ప్రక్కకు వెళ్ళాడు. వెనుకటి రోజుల్లో డేంజరులైటు ఉండే రాతి-తిన్నె మీదకు వెళ్ళి చతికిల బడ్డాడు.
కృష్ణమ్మ నిద్దురబోయే ఏనుగులా ఉన్నది ఒక క్షణంలో - మరు క్షణంలో సంధ్యకాంతులు నెమరు వేసే కపిల గోవులా ఉన్నది. అటు కాస్సేపూ, ఆకాశం లోకి కాస్సేపూ చూశాడు భాస్కరం.
"రేపు ఎలాగేనా యీ సమ్మంధం చూడకుండా తప్పించుకోవాలి....." అదే ఆలోచన.
"పోనీ, చూసి నచ్చలేదంటే సరిపోతుంది" అని సరిపుచ్చుకున్నాడు.
కాస్సేపు దూరాన కదిలి వచ్చే కార్ల హెడ్ లైట్లు విరజిమ్మే కాంతిపుంజ విన్యాసాల్ని చూశాడు. ప్రకృతి కాంత జార్చుకున్న తొలి-చీకటి మేలి ముసుగునూ చూశాడు.
"రేపటి పెళ్ళిచూపులకీ, వసంత సమ్మంధానికీ ఏదో ముడి ఉంది" అన్న అనుమానమే వెంటాడుతున్న దతన్ని.
లేచి నడక సాగించాడు ఆ ఆలోచన నించి పారిపోదామా అన్నట్లు.
"ఇంతకీ పద్మకు సీటు దొరికిందో లేదో అన్నట్లు సురేఖ మళ్ళీ అగుపించనే లేదు. ఆ పిల్ల కూడా యూనివర్శిటీ కే వస్తుందేమో?" ఈ ఆలోచనలన్నీ తన మంచి తాను పారిపోయేటందుకు చేసే ప్రయత్నాలే.
అంతలో .....వెదుకబోయిన తీగె కాలికి తగిలినట్లు 'సురేఖ' అగుపించింది. పూలమొక్కల బారు ప్రక్కనే ఉన్న పచ్చికలో కూచున్న దామె. ప్రక్కనే ఒక పది-పన్నెండేళ్ళ కుర్రవాడు ఒకడు ఉన్నాడు - వాడి ఆట ధోరణిలో వాడున్నాడు. ఆ అమ్మాయి మాత్రం ఎటో దీర్ఘంగా చూస్తున్నది.
ఆ ఇద్దరిలో మొదట ఎవరు ఎవర్ని "నమస్కార" మని పలకరించుకున్నారో చెప్పలేం గాని, ఆ ఇద్దరూ ఒకర్నొకరు గుర్తించి పలకరించుకున్నారు-ఆమె లేవబోయింది. "ఫర్వాలేదు కూచోండి-నేనూ కూచుంటా" నని కూర్చున్నాడు కాస్త ఎడంగా భాస్కరం.
