Previous Page Next Page 
ఇందుమతి పేజి 6


    అంతా విన్న దుర్గాప్రసదరావు గారు కవరు లో పెట్టి తీసుకు వచ్చిన సిల్కు చొక్కా గుడ్డ సుబ్బారావు గారి చేతికిచ్చి, "నాయనా, ఇది చిన్న బాబుకు అంద చెయ్యి. చలపతిని మనస్సు బాధ పెట్టుకోవద్దని చెప్పు" అని లేచి రాజును తీసుకుని, భారతి తోడూ రాగా, వచ్చిన దారినే వెళ్ళిపోయారు.
    దారిలో రాజు, "తాతయ్యా, తమ్ముణ్ణి చూపించ లేదేం?" అన్నాడు అమాయికంగా.
    "ఇప్పుడు చూడకూడదు. నాయనా. పెద్దవాడయ్యాక చూద్దువు గాని" అని నచ్చచెప్పారు ప్రసాదరావు గారు.
    మూడవ ఏట రమణకు లివరు జబ్బు చేసింది. నానాటికి కడుపు పెరిగిపోయి, చేతులూ, కాళ్ళూ సన్నగిల్లి  కూర్చున్న చోటు నించి లేవకుండా తయారయ్యాడు. వెంకాయమ్మ గారికి ఆయుర్వేద వైద్యం మీద నమ్మకం ఎక్కువ. ఆవిడ ఇష్ట ప్రకారమే ఒక ఆయుర్వేద వైద్యుడి కి చూపించి మందు ఇప్పించటం మొదలు పెట్టారు. ఆరు నెలలు మందు ఇప్పించినా ఏ మాత్రము గుణము కనిపించక పోగా నానాటికీ పరిస్థితి క్షీణించ సాగింది. చివరికి ఆయుర్వేదం కాదని ఎల్లోపతీ అన్నారు. ఎల్లోపతీ వైద్యులు జబ్బు చాలా ముదిరి పోయిందని పెదవులు విరిచారు. ఏ కారణం చేత నయితే నేమి మూడేళ్ళు నిండక ముందే రమణ కు అయిష్హ్షు నిండిపోయింది.
    వెంకాయమ్మ గారు దుర్గాప్రసాదరావు దంపతుల మీద విరుచుకు పడింది. కుర్రవాడు అకాల మృత్యువు వాత పడటానికి మాణిక్యమ్మ గారి ఓర్వలేని తనమే కారణ మన్నది. బారసాల నాడు పిలవని పేరంటంగా వచ్చిన దుర్గాప్రసాద రావు గారు ఆనాడే కుర్రవాడికి శాపము పెట్టి పోయినాడన్నది. ఇక ఈ ఊళ్ళో ఉంటె తన కూతురి ప్రాణానికే ముప్పన్నది. ఆమె నోటికి హద్దు, పద్దు లేదు.
    వెంకాయమ్మ గారి మనః ప్రవృత్తి కి అనుకూలం గానే వెంకటా చలపతి గారి ఆర్ధిక పరిస్థితి కూడా వక్రించి తిరుగు లేని అధోగతి లో పడింది. లాభాలు సన్నగిల్లాయి. ఖర్చులు ఎక్కువయ్యాయి. అప్పులు పెరిగిపోయాయి. ఈవిధంగా ఇంక ఎక్కువ కాలం గడవదన్న దృడ నిశ్చయానికి వచ్చిన చలపతి గారు సుబ్బారావు గారికీ కబురు పెట్టారు. వెంకట రత్నం గారూ, సుబ్బారావు గారూ కలిసి చలపతి గారి వ్యాపార పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలించి ఇక ఈ వ్యాపారం కట్టిపెట్టి మరేదైనా మార్గం చూచుకోవటం మంచిదని సలహా ఇచ్చారు. ఆ ప్రకారం గానే వ్యాపారానికి స్వస్తి చెప్పి ఉన్నదేదో తెగనమ్మి , అప్పుల వాళ్ళ అప్పులు తీర్చి మిగిలిన అయిదు వందల రూపాయలు చేత బట్టుకుని స్వగ్రామమయిన వీరన్న పేటకు ప్రయాణ మయ్యారు వెంకట చలపతి గారు. ఇంక మునిగిపోయిన ఓడను పట్టుకు పాకులాడడం ఎందుకని వెంకాయమ్మ గారూ, సంతానం తమ స్వగ్రామానికి బయలు దేరారు.
    వెంకటా చలపతి గారు సుబ్బారావు గారి సలహా మీద చేతిలో ఉన్న అయిదు వందల రూపాయలకు అన్నగారు అప్పుగా ఇచ్చిన మరొక మూడు వందలు కలిపి చెరువు కింద రెండెకరాల మాగాణి భూమి కొన్నారు. పిత్రార్జితమైన ఆస్తిలో మిగిలిన పెంకు టిల్లు ఉండనే ఉన్నది తలదాచుకొను. సంసారం చితికి పోవటం తో కొంతవరకు బుద్ది తెచ్చుకున్న భార్య రాజేశ్వరీ తోనూ, జరిగిన రాద్ధాంతాలు చాలా వరకు మరిచిపోయిన తల్లి సీతమ్మ గారితోనూ కొత్త సంసారం ప్రారంభించారు వీరన్న పేటలో.

                                    6
    వీరన్న పేట కరిణీకం సుబ్బారావు గారిది. అయన మాట అంటే ఆ ఊరి రైతాంగం లో అందరికీ కూడా గౌరవం. మునసబు బాసివి రెడ్డి గారు నిరక్షర కుక్షి. అయన చెయ్యవలసిన పని అంతా కూడా సుబ్బారావు గారి చేతనే చేయించుకుని, ఆయన చెప్పినట్టే నడుచుకునే వాడు. వెంకట రెడ్డి, తిమ్మ రెడ్డి, సూరప రెడ్డి మొదలయిన పెద్ద రైతులందరూ కూడా సుబ్బారావు గారి సలహా లేనిదే ఒక్క పని చేసి ఎరగరు. ఆ ఊళ్ళో అయిదారు బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. అందరూ సుబ్బారావు గారికి కావలసిన వారే. ఏదో విధంగా సుబ్బారావు గారి సహాయాన్ని పొందిన వారే. సుబ్బారావు గారికి తండ్రి గారి వల్ల సంక్రమించినది ఆ కరిణీకమూ, నాలుగు ఎకరాల మాగాణీ ఆరు ఎకరాల మెరక మాత్రమే. విజయవాడ లో మూడవ ఫారం వరకూ చదివి కృతర్దుడైన సుబ్బారావు గారు ఆ తరవాత కరణీకం పరీక్షలు పాసయి తండ్రి గారిచ్చిన కరిణీకాన్ని, ఆస్తినీ కనిపెట్టుకుని, కష్ట పడి పనిచేసి వృద్ది లోకి వచ్చారు. అయన కిప్పుడు ఎనిమిది ఎకరాల మాగాణి, పన్నెండు ఎకరాల మెరక, ఒక మామిడి తోట ఉన్నాయి. ఒక కొడుకూ, ఒక కూతురూ. కొడుకు రామచంద్ర మూర్తి, రాజశేఖర మూర్తి కన్న రెండేళ్ళు పెద్ద. కూతురు శారద ఆరేళ్ళు చిన్నది.
    వ్యాపారం లో దెబ్బతిని స్వగ్రామం చేరిన వెంకటా చలపతి గారిని గ్రామ ప్రజలందరూ కూడా సానుభూతి తో అదలిరించారు. రెండెకరాల భూమిమీద వచ్చే ఆదాయంతో జీవనం ఎలా గడుస్తుంది? ఇంత కాలమూ అలవాటు లేకపోవటం చేత స్వంత వ్యవసాయం కూడా చేసుకో లేరాయెను! మునసబు గారు మొదలయిన ఊరి పెద్దలంతా కలిసి వెంకటా చలపతి గారి చేత ఒక పాఠశాల పెట్టిస్తే బాగుంటుందని యోచించారు. ఊళ్ళో ప్రాధమిక పాఠశాల అయినా లేకపోవటం చేత చదువుకో దలుచుకున్న అక్కడి పిల్లలందరూ మూడు మైళ్ళ దూరంలో ఉన్న మరొక పల్లెకు పోయి చదువుకుని రావలసి వస్తున్నది. ఇంతకూ ముందే ఇటువంటి ప్రతిపాదన ఒకటి వచ్చినప్పటికీ అందుబాటు లో తగిన ఉపాధ్యాయుడు లేకపోవడం తో మానుకోవలసి వచ్చింది. వెంకటా చలపతి గారికీ, సుబ్బారావు గారికీ కూడా ఈ యోచన బాగున్నదని పించింది సరేనన్నారు.
    పెద్దలందరూ తలుచుకుంటే ఎంతసేపు? పాఠశాలకు గాను తాత్కాలికంగా తాటాకు కప్పుతో రెండు నిట్రాళ్ళతో ఒక పాక వేయించారు. అంతవరకూ స్కూలు ముఖం ఎరగని ఒక ఇరవై మంది విద్యార్దుల్ని పోగు చేసి పాఠశాల ప్రారంభించారు. క్రమ క్రమంగా పొరుగూరి స్కూలు కు వెడుతున్న మరొక ఇరవై మంది విద్యార్ధులు కూడా అక్కడికి వెళ్ళటం మానివేసి ఊరిలో ఉన్న స్కూల్లో నే చేరారు.
    ఒకటవ క్లాసు మొదలు నాలుగవ క్లాసు వరకూ అన్ని క్లాసు లూ తెరిచారు. ఒక్కొక్క విద్యార్ధి ఏడాదికి బస్తా వడ్లు అయ్యే ఖర్చుకు గాను ప్రభుత్వం నుండి గ్రాంటు రాబట్టుకోవటానికి గ్రామం తరపున అర్జీ పెట్టారు. ఆనతి కాలంలోనే స్కూళ్ళ ఇన్ స్పెక్టర్ విచ్చేసి స్కూలు తనిఖీ చేసి గ్రాంటు మంజూరు చేసి వెళ్ళిపోయారు.  అయితే ఉపాద్యాయు డైన వెంకటా చలపతి గారు ట్రెయినింగు కాలేదన్న కారణం చేత స్కూలుకు రావలసిన గ్రాంటు పూర్తిగా రాలేదు. ట్రెయినింగు అయిన పక్షం లో ఎక్కువ గ్రాంటు ఇస్తామన్నారు. వచ్చిన దానితోనే సంతృప్తి చెందిన వెంకటా చలపతి గారు తన శక్తి సామర్ధ్యాలు పూర్తిగా వినియోగించి పాఠశాల వృద్ది చెయ్యటానికి పూనుకున్నారు.
    అత్తా కోడళ్ళ మధ్య ఎక్కువ సామరస్యం లేకపోయినా, ఎక్కువ కీచులాటలు లేకుండానే కాలం గడుస్తున్నది. వెంకాయమ్మ గారూ, సంతానం అప్పుడప్పుడు వచ్చి చూసి పోతున్నారు. కాని సీతమ్మ గారికి ఇప్పుడు స్థాన బలిమి ఉన్నది. నాలుగయిదు నెలలకు ఒకసారి వెంకటా చలపతి గారు గుంటూరు వెళ్లి రాజశేఖర మూర్తి ని చూసి వస్తుండేవారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS