Previous Page Next Page 
అర్పణ పేజి 6


    దూరంగా పాడుపడిన నుయ్యి. దాని చుట్టూ పెరిగిన గడ్డిని బక్క చిక్కిన ఆవులు పది పన్నెండు మేస్తున్నాయి. ఒకరిద్దరు మంద కాపరులు- చిన్నపిల్లలు -- చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ చేతిలోని ప్లూటు తమాషాగా ఊదుతున్నారు. ఆ ధ్వని వినీ వినిపించక జారిపోయింది. మరొక పాడుపడిన నుయ్యి.
    పార్వతి కి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడి దృశ్యాలు బాగున్నాయి అనుకుంది. అదొక పాడుపడిన నుయ్యి. ఏమిటిక్కడ ఇన్ని బావులున్నాయి. లక్ష్మక్క కు ఇల్లాంటి చోట్లంటే తగని భయం! పిచ్చి అక్క! ఏం చేస్తున్నదో? ఇల్లాంటప్పుడు పుస్తకాలు చదువు కుంటుందేమో ఇంట్లో కూర్చుని. డానికి తెలుగు బాగా వచ్చు. బావ ఇంట్లో ఉండి ఉంటాడా?
    బావ అంటే జ్ఞాపకం వస్తున్నది. తన పెళ్లి గురించి నాన్న ప్రసంగం ఎత్తగానే పైకి కోపం నటించింది తను. కానీ లోపల భయం కూడా ఉంది. ఈ బావకు తనను చేసుకోవడం ఇష్టం ఉండదనే తోస్తున్నది. ముఖ్యంగా దీన్ని గురించి ఎంత రాద్దాంతం జరుగుతుందో తలుచుకుంటే ఒళ్ళు అవిసి పోతున్నది. అనుభవిస్తున్నప్పుడు ఉండదు గాని, అనుభవానికి రాబోయే క్లిష్ట పరిస్థితి తలుచుకుంటే మహా సంకటం గా ఉంటుంది. దేన్నయినా ఎదుర్కోవడానికి తను సిద్దంగా ఉండాలి. లొంగిపోయినట్ల యితే మరింత లోకువ. ప్రపంచంలో ఉన్న నాలుగు రోజులూ దర్జాగా, ధాటీగా బతకాలి. దేవుళ్ళూ, దెయ్యాలూ . వెర్రి వేదాంతా లూ, ఆచారాలూ అంటూ కూర్చుంటే అనుభవించవలసిన సౌఖ్యం అంతా అందినట్టే అంది జారిపోతుంది. ఒకవేళ దేవుడంటూ ఉంటె చచ్చాక ఎలాగా వెళ్లక తప్పదు కదా అయన దగ్గరికి? అల్లంటప్పుడు ఇక్కడ్నుంచీ దేవులాడ్డం ఎందుకు? అవివేక మనిపిస్తుంది తనకు. అయినా ఉన్నారు భక్తులు -- త్యాగరాజట, రామదాసు, సూరదాస్ , జయదేవ్ , మీరా -------ఓహ్! నాన్న కూడా ఒక భక్తుడే! ఏటా దుర్గకు మహోత్సవాలు జరిపిస్తాడు. ఆరోజుల్లో ఇల్లంతా కలకల్లాడుతూ ........
    కంట్లో నలుసు పడింది. రైలు వేగంతో సరిసమానంగా పరిగెత్తుతున్న పార్వతి ఆలోచనలు టకీమని ఆగిపోయాయి. ఎంత ప్రయత్నించినా రాదు ఆ నలక. గింజుకుంది. పూర్తిగా ఎర్రబడింది కనుగుడ్డు. అగ్గి మీద గుగ్గిలం వేసినట్లు ఇందాక పరిశీలనగా చూసిన ఆవిడ కలకలా నవ్వింది. పార్వతికి కోపం వచ్చింది. కానీ ఆవిడ పార్వతి దగ్గరికి వచ్చి పక్కనే తగులుతూ కూర్చుంది.
    "అయ్యో, అలా నలపకండి. ఏదీ ఇటు చూడండి!" పార్వతి ఆవిడ వైపు మొహం తిప్పింది. ఆమె పార్వతి కనురెప్పను వేలితో పైకెత్తి, బుగ్గలు రెండూ పూరించి కంట్లో కి ఊడింది. నవ్వు పట్టలేక కిలకిలా నవ్వింది ఆవిడను చూస్తూ పార్వతి. ఆమె మాత్రం "పోయిందా? పోయిందా?" అని గాబరా పెట్టేస్తున్నది. ఆ సందడి లో కంట్లో నలుసు ఎటు పోయిందో!
    ఇంకా ఇద్దరూ సరిగ్గా పరిచయం కాకముందే ఒక స్టేషన్ లో బండి ఆగింది.
    "అమ్మయ్యో!" ఆవిడ చెంగున తన సీటు దగ్గరికి పరుగెత్తింది. హోల్డాలు చుట్టి పెట్టె మీద పెట్టి , అదీ ఇదీ సరి చూసుకుని "వెళ్తానండీ" అంటూ తన వైపు నవ్వుతూ చూసి కిందికి దిగిపోయింది. కూలీ వచ్చి సామాను దించాడు. పార్వతి ఫ్లాట్ ఫారం మీదికి చూచింది. ఆమె పక్కన పొడుగ్గా, అందంగా ఉన్న ఒకాయన ఉన్నాడు. అతను నవ్వుతూ ఏదో ప్రసంగిస్తున్నాడు గానీ, ఆమె ముఖం ఉదాసీనంగా కనిపించింది. "ఏమిటో , చిత్రమైన మనిషి!' అని పార్వతి అనుకున్నంత లో ట్రెయిన్ కదిలింది. ఆమె కూడా ఒకసారి పార్వతి ఉన్న పెట్టె వైపు చూసి, అంతలో పడమటి ఆకాశం వైపు చూపు తిప్పుకుంది. ఆ సంధ్యా సమయంలో , బండి ఆవిడను అక్కడ వదిలి ముందుకు పోతుంటే అవ్యక్తంగా గుండె బరువెక్కింది పార్వతికి. ఎందుకు? అని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు. కాకపోతే రైలు స్నేహితులూ, బస్సు స్నేహితులూ ఎలా వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో గుర్తు పెట్టుకో గలమా?
    సంధ్య చీకట్లు నలుమూలలా వ్యాపించాయి. కొద్ది కొద్దిగా తమో గుణాన్ని పొందుతున్న పశ్చిమాకాశం లో నీడలు గా దృశ్య మవుతున్న కొబ్బరి చెట్లు గుండ్రంగా తిరుగుతున్నాయి రైలు పరుగులో. చవుకు చెట్లు జీమూతానికి మల్లె కంటికి అలుక్కు పోతున్నాయి. అసుర సంధ్య . కొందరికి అటువంటి సంధ్య అంటే చాలా ఇష్టం. చంద్రో దయం అవుతుంటే మరీను. మంచి మంచి ఊహలెన్నో కదిలాడతాయి. అంతేగాక వేదాంత తర్కాదులకు సంబంధించిన మధురమైన భావనలెన్నో మెరుపులా మాదిరిగా చౌకళీస్తాయి. పక్క నుంచి పోయే పెద్ద చెట్లలో రామ చిలకలు హాయిగా పలుకుతున్నాయి.
    అల్లాంటి సంధ్య అంటే పార్వతికి భయం. దిగులు పుట్టించే తలపులు వస్తాయి ఆమె మెదడులోకి. లోపలకు కళ్ళు తిప్పింది. అప్పుడే లైట్లు వేశాడు. ఇద్దరు మగవాళ్లు తీవ్రంగా చర్చించు కుంటున్నారు. ఇద్దరి అభిప్రాయాలకూ ఎక్కడా లంగరందడం లేదు. ఇంక కాస్సీపటికి  జుత్తూ జుత్తూ పట్టుకునేట్లు ఉన్నారు. ఆప్రాయట్నంగా మీదకు చూసిన పార్వతికి పై బెర్తు మీద ఒక యువకుడు తన వైపే చూస్తుండటం కనిపించింది. అతను పడుకుని ఉండటం వల్ల పొడవు నిర్ణయంగా తెలియకపోయినా, నల్లగా ఉన్నాడని  తెలుస్తున్నది. చాలా ఒళ్ళు అతనికి. పెంకితనంగా చూస్తున్నట్ల నిపించ లేదు. రెండు సార్లు అటు చూసి,. మరొక మూలకు చూచింది. మధ్యాహ్నం మంచినీళ్ళు తాగిన అబ్బాయి కదులుతున్న రైల్లో నుంచి దూరంగా కనిపిస్తున్న తెల్లటి కట్టడం వైపు చూపించి ప్రశ్న వేశాడు వాళ్ళ అమ్మను. ఆవిడ పొంగి పోయి కొడుకు బుగ్గల మీద ముద్దులు కురిపించి ఒళ్లో కూర్చో బెట్టుకుంది. పార్వతి కి ఆ తల్లీ బిడ్డలను మరీ మరీ చూడాలని పించింది.
    "ఏమండీ! పత్రిక చదువుతారా?' పై బెర్తు మీద యువకుడు సమాధానం రాకుండానే వారపత్రికను పార్వతి సీటు మీదికి విసిరాడు. పార్వతి తడబడింది.
    "ఎక్కడి దాకా వెళ్తారండి?' అతనే అడిగాడు. ఒకసారి అతని వైపు చూసి, ఎక్కడికి వెళ్తున్నదో చెప్పి ఊరుకుంది, పుస్తకం చూస్తూ. పార్వతి పుస్తకం చూస్తున్నట్లు పేజీలు  తిరగవేస్తూనే ఆ యువకుడి చొరవకు ఆశ్చర్య పడింది. తనకు స్కూల్లో, కాలేజీ లో మగ స్నేహితులు లేకపోలేదు. శేఖరమూ, శర్మా తనతో మరీ పూసుకు తిరుగుతారు. వీరందరి లో స్కూలు సహాధ్యాయుడు గోపాల కృష్ణే తనకు నచ్చిన స్వభావం కలవాడు. అతను మాట్లాడుతుంటే గంటల తరబడి వినాలనిపిస్తుంది. అతను గాని నవ్వితే ఇల్లెగిరిపోవలసిందే! పెంకి ఘటమే గాని, తనబోటి వాళ్ళ దగ్గర వినయంగా మాట్లాడతాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళతో పరిచయం వల్ల కొత్త అనిపించదు. సిగ్గు అంతకంటే ఉండదు. శర్మ అక్కడెక్కడో పల్లెటూళ్ళో గుమస్తా చేస్తున్నాడిప్పుడు. ఎప్పుడైనా సొంత ఊరు వస్తే తన దగ్గరికి వచ్చి తిష్ట వేస్తాడు. తను తీరికగా కూర్చుని అతనితో మాట్లాడాలి. లేకపోతె కోపగించుకుని పెద్ద రాద్దాంతం చేస్తాడు. ఎందుచేతనో మూడు నాలుగు నెలలుగా అతను కనిపించలేదు. ఏమైనా తనకు మగవాళ్ళ తో కొత్తగా పరిచయం అంటూ కాగానే వెంటనే మాట్లాడేయటం చేత కాదు. ఎటువంటి వారో ఏమో అన్న జంకు పుడుతుంది.
    పార్వతి ఒకటి రెండు శీర్షికలు చదివి తిరిగి అతని కిచ్చేసింది ఆ వార పత్రిక.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS