Previous Page Next Page 
అపరిష్కృతం పేజి 6

 

    మరో అయిదు నిమిషాలకు నాయుడు ఆ రూమ్ లోకి ప్రవేశించాడు. ముఖానికి దిగులు పులుముకుని మాట్లాడలేనంత నీరసంగా ప్రిన్సిపల్ గారిని విష్ చేశాడు.
    ఉపోద్ఘాతమేమీ లేకుండా, నాయుడిని కూర్చోమని కూడా అనకుండా -- "మిస్టర్ నాయుడూ! సుకన్య విషయంలో మీ సంజాయిషీ ఏమిటి?" అని ప్రశ్నించారు ప్రిన్సిపల్.
    ఎదురు చూసిన ప్రశ్నయినా, ప్రిన్సిపల్ అంత సూటిగా అడిగేసరికి తెల్లబోయాడు నాయుడు. మరో క్షణానికి తేరుకుని, రుద్ద కంఠం తో -- "ఏం చెప్పమంటారు , సార్ . ఘోరం జరిగిపోయింది, నేను మనః స్పూర్తిగా సుకన్య ను ప్రేమించాను. లోకానికి భయపడకుండా పెండ్లి కూడా చేసుకొందామనుకొన్నాను. ఇంతలోనే కొందరు స్టూడెంట్లు ఇందులో కలగజేసుకొని, అధిక ప్రసంగం చేసి, నన్నూ, సుకన్య నూ అవమానించారు. సుకన్యది ఎంతో మెత్తని పువ్వు లాంటి మనసు. అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకొంది, సార్! ఇంతగా బాధ పడుతుందని నాకు కూడా తెలియదు. అయినా, నేను ఉండగా వాళ్ళ పిచ్చి మాటలను లెక్క చెయ్యవలసిన అవసరం ఏముంది? జాబయినా వ్రాయకుండా ఆత్మహత్య చేసుకొంది. అసలు దీని కంతా ఆ శేఖరే కారణం!" అన్నాడు, జేబు రుమాలుతో కళ్ళు ఒత్తుకుంటూ.
    స్థిరమైన కంఠం తో ప్రిన్సిపల్ ------- "మిస్టర్ నాయుడూ! మీరు మంచి నటకులని ఇప్పుడే తెలుస్తున్నది. కంగ్రాచ్యులేషన్స్!" అన్నారు వ్యంగ్యంగా .
    అదిరిపడి, కంగారుగా -- "అంటే , మీ ఉద్దేశ్య మేమిటి , సార్?' అని అడిగాడు నాయుడు.
    "అభిప్రాయం చెప్పడం లోనే ఉద్దేశం తెలియలేదా? మీకు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఉంది?  నవాబు లైతే రెండు వందల పెండ్లిండ్ల దాకా చేసుకొనే వారట. మీరు కనీసం రెండు పెండ్లిండ్లయినా చేసుకోవాలని అనుకొన్నారేమో గదా! కనకనే, భార్య ఉండగా సుకన్య ను మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకొన్నానని నాతొ అంటున్నారు. పోనీ, పెండ్లి చేసుకోదలచానని నాతొ అన్న ముక్కే, సుకన్య తో ఎందుకు చెప్పలేక పోయారు?" ప్రిన్సిపల్ గొంతు కఠినంగా మారిపోయింది.
    నాయుడు ఇంకా కంగారుగా -- "మీ మాటలు నాకు అర్ధం కావడం లేదు! సుకన్య తో నేను చెప్పక పోవడమేమిటి?' అన్నాడు.
    "ఈ జాబు చదవండి. మీరు చెప్పిన అబద్ద మేమిటో తెలుస్తుంది!" అన్నారు ప్రిన్సిపల్ , జాబు ను నాయుడి ముందుకి తోస్తూ.
    కంపించుతున్న చేతులతో జాబు తీసుకుని చదివాడు నాయుడు.
    "ప్రిన్సిపల్ గారికి, శిష్యురాలిని అనిపించుకోవడానికి అర్హత పోగొట్టుకొన్న సుకన్య వ్రాయునది.
    నేనింత భ్రష్టురాల నవుతానని తెలియకుండా మా వాళ్ళు నాకు 'సుకన్య' అనే పేరు పెట్టారు. నేను వయసు పొగరుతో , నాయుడు గారు నన్ను తప్పకుండా పెళ్ళి చేసుకొంటారన్న గుండె నిబ్బరంతో కాలు జారాను. ఫలితం మీ బోటి పెద్దలతో చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. వ్యవహారం ఇంతదూరం రాక మునుపే శేకర్ గారు కలగ జేసుకొంటే, నా జీవితం బాగుపడేదేమో! అయినా, అదృష్టవంతుడిని చెరిచే వాడూ, దురదృష్టవంతుడిని బాగు పరిచే వాడూ లేడేమో!
    నా మీద అన్ని ఆశలూ పెట్టుకొన్న నా తలిదండ్రులకీ, నా ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన తమ్ముడి కీ ఒక్క మాట కూడా చెప్పకుండా , వాళ్ళకు దక్కకుండా పోతున్నాను. అవమానాన్ని భరించలేక చనిపోయానని మీరు వాళ్ళతో చెప్పగలరా? నా నిజ స్థితి నా తలి దండ్రుల కు కూడా తెలియనీయకూడదు. అందుకే ఈ భారాన్ని మీ మీద మోపి, నేను పోతున్నాను.
    ఆడపిల్లల జీవితాలతో చెలగాటం ఆడిన నాయుడు గారి లాంటి వాళ్ళూ, క్షణికొద్రేకం లో పచ్చని జీవితంలో చిచ్చు రగుల్చుకునే నాబోటి మూర్ఖురండ్రూ ఎన్నడూ బాగుపడరు.
    కుంతీదేవి అంతది పెండ్లి కాక ముందు పుట్టిన సంతానాన్ని గంగ పాలు చేసింది! ఇక నే నెంత! నా గర్భం లో పెరుగుతున్న శిశువు తో పాటు నేనూ గంగ పాలవుతున్నాను.
    వివాహిత కాకుండా తల్లి అయిన స్త్రీ ని , కలిగిన సంతానాన్నీ ఎంతో హీనంగా చూస్తుంది , మన సమాజం! అది సహజమే! శీలానికి ఎక్కువ ప్రాముఖ్య మిచ్చే మన దేశంలో పుట్టి కాముకి గా తిరిగి ఫలితాన్ని అనుభవిస్తున్న నేను కానీ, నాకు కలగబోయే సంతానం కానీ అవమానాన్ని ఎదుర్కోలేము. ఈ తప్పు నా స్వయం కృతం. అందుకే నేనే దీనికి శిక్ష విధించుకొంటున్నాను. ఇంతకంటే వేరే మార్గం లేదు.
    నా చావును గురించి పోలీస్ శాఖ నుండి ఎటువంటి కష్టమూ రాకుండా కాపాడాలని మిమ్ము ప్రార్ధిస్తున్నాను.
                                                                              --సుఖన్య."
    జాబు పూర్తిగా చదివేసరికి నాయుడికి ముఖం తెల్లగా పాలిపోయింది. నిలబడలేక కుర్చీలో కూల బడ్డాడు.
    "అమ్మా! ఆడవాళ్ళు! ఎంత పని చేసింది సుకన్య! తనతో ఒక్క మాటన్నా చెప్పకుండా ప్రిన్సిపల్ గారికి కధంతా వ్రాసింది! ఇందుకన్న మాట, తనను పెండ్లి చేసుకోమని పట్టు పట్టింది. సముద్రం లోతు తెలుసుకోవచ్చు గాని, ఆడదాని అంతర్యం తెలుసుకోలేము గదా! పైకి ఎంతో అమాయకంగా కనిపించి, లోలోపల ఇంత పని చేస్తుందా?
    "జాబు చదివారు కదా, మిస్టర్ నాయుడూ! ఇక వినండి. శేఖర్ అన్న మాటలకు రోషపడి ఆత్మహత్య చేసుకొన్నదని గదా మీ ఆరోపణ? బహుశా , విద్యార్ధులలో కూడా మీరే ఆ భావాన్ని కలిగించి ఉండవచ్చు.
    సుకన్య తాను గర్బవతి అనీ, పెండ్లి చేసుకోక తప్పదనీ మిమ్మల్ని బలవంత పెడితే మీరే ఆమెను ఏదో మోసంతో నూతి లోకి తోశారని , పైగా అమాయకుడి మీద అబద్దాలు ప్రచారం చేస్తున్నరనీ చెబుతాననుకోండి! మీ మీద హత్యానేరం మోపుతాననుకోండి! ఏం చేస్తారు మీరు? మీరీ కాలేజీ లో ఉండతగరు! ఇంకా ఎంతమంది బుద్ది లేని ఆడపిల్లలను పాడు చేస్తారో? మిమ్మల్ని తక్షణం ఇక్కడి నుండి మార్చాలని వ్రాస్తాను. తన సంగతి నలుగురి కి చెప్పి తనని అవమానించ వద్దని ఆ అమ్మాయి వ్రాసింది కాబట్టి , మీ నీచత్వం నలుగురికి వెల్లడి చెయ్యలేక పోతున్నాను! ఇంతపని చేసి, పైగా చిన్న వాడయినా , బుద్ది చెప్పటానికి వచ్చిన శేఖర్ పై నింద వేస్తారా? శేఖర్ మీద విరుచుకు పడుతున్న విద్యార్ధులంతా అసలు కధను బయట పెడితే ఏమంటారో? శేఖర్ ను బయటికి పంపాలంటారో, లేక మిమ్మల్నో! ఛీ! ఛీ! ఏళ్ళు రాగానే సరి కాదు. వయస్సు వచ్చిన కొద్ది మనిషిగా బ్రతకటం నేర్వాలి గాని జంతువు లాగా కాదు. మీకు ఆడపిల్ల లున్నారో, లేదో తెలియదు గాని, ఉంటె ఆ పిల్లకు తప్పకుండా సుకన్య గతే పట్టాలని నేను శాపం పెట్టుతున్నాను! అభం శుభం తెలియని ఆడపిల్ల అని జాలి తలచబోయినా, మీరు చేసిన పాపం తలుచుకొన్నప్పుడు మీ లాంటి వాళ్ళకు అదే సరి అయిన శిక్ష అని అనిపించుతుంది. వెళ్ళండి. మీతో మాట్లాడటం కూడా అసహ్యం! భవిష్యత్తు లోనైనా ఆడపిల్లల బ్రతుకులో నిప్పులు పోయకండి!" ప్రిన్సిపల్ మాటల్లో ఎంతో బాధ మిళితమై ఉంది.
    తల వంచుకొని వెళ్ళిపోయాడు నాయుడు.
    కాలేజీ లో చదివే విద్యార్ధిని చనిపోయిన కారణంగా ఆరోజు సెలవుగా ప్రకటించబడింది.

                       *    *    *    *
    శేఖర్ తో ప్రిన్సిపల్ అన్నారు. "నాయనా! నీలాంటి కొడుకు నాకుంటే ఎంతో గర్వించేవాడిని. నా విద్యార్ధులంతా నాకు పుత్ర సమానులే. నిన్ను ఆ విధంగా చూసుకోవడానికి వీలు లేకుండా ఈ పరిస్థితి ఏర్పడింది. నిర్ణయం నీకే వదులుతున్నాను. సుకన్య జాబు నలుగురు విద్యార్ధుల ముందూ పెట్టి సంగతి సందర్భాలు వాళ్ళకు వివరించమంటావా? లేక, లేని నింద నెత్తి మీద వేసుకొని వేరే కాలేజీ కి వెడతానంటావా? నీ ఇష్టం. నిర్ణయించే అధికారం నీకే వదులుతున్నాను."
    ఎంతో మనోధైర్యంతో శేఖర్ -- "సార్! మీ కున్న సదభిప్రాయానికి కృతజ్ఞుడిని. సుకన్య గారి జాబు మీరు నలుగురి ముందూ పెట్టనవసరం లేదు. నేను వేరే కాలేజీ లో చేరతాను. నింద దేమున్నది లెండి! కాలం గడిచే కొద్ది అదే మరుపున పడుతుంది. సుకన్య గారు వ్రాసినట్లు చనిపోయిన తరువాత ఆమెను అవమానించడం ధర్మం కాదు " అన్నాడు.
    ప్రిన్సిపల్ మెప్పుకోలుగా -- "శేఖర్ ! పాట్నా కాలేజీ ప్రిన్సిపల్ నా స్నేహితుడు. చాలా మంచివాడు. నేను అతనికి జాబు వ్రాస్తాను. నువ్వు ఆ కాలేజీ లో చేరు. నువ్వు పైకి రావటానికి అతను ఎంతో సహకరిస్తాడు. నీబోటి సహృదయులకు ఆదే మంచిది!" అన్నాడు.
    శేఖర్ తో బాటు నాయుడు గారు కూడా వెళ్ళిపోవడం విద్యార్ధి లోకంలో ఆశ్చర్యాన్ని కలిగించింది. సుకన్య వియోగాన్ని భరించలేక నాయుడు వెళ్ళి పోయాడని విద్యార్ధులనుకొన్నారు.
    తమ సమైక్య బలానికి భయపడి ప్రిన్సిపల్ శేఖర్ ను కాలేజీ నుండి తరిమాడని శాస్త్రి అందరి తోటి చెప్పడం, అంతా నిజమేనని నమ్మడం , శాస్త్రి కాలేజీ విద్యార్ధి బృందానికి మకుటం లేని నాయకుడుగా గౌరవించబడడం జరిగాయి.

                        *    *    *    *
    శేష ఫణి శాస్త్రి గారి వాకిట్లో సన్నాయి మోగుతున్నది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.
    ఆ మనోహర సమయంలో సన్నగా వినవచ్చే సన్నాయి మ్రోత సన్నమ్మ లేత గుండెలో చెప్పలేని భావాలను కలిగిస్తున్నది. ఏదో భయం, ఆకాంక్ష , దిగులు, కుతూహలం , సంతోషం - ఒకటేమిటి , మనస్సులో రకరకాల భావాలు జడలల్లు కొంటున్నాయి.
    ఈ రోజున తనకు శోభనం చేస్తారట. శోభనం అంటే?
    రెండు నెలల క్రితం తనలో యౌవనం వికసించటం మొదలు పెట్టింది. ఆనాటి నుండి ఈ నాటి వరకు ఇంచుమించు ప్రతి రోజూ ఈ "శోభనం' అన్న మాట వినపడుతున్నది.
    సిగ్గు పడ్డది సన్నమ్మ. భర్తను పెండ్లి లో కూడా సరిగా చూడలేదు. పెండ్లి తరువాత భర్త ఈ ఇల్లే తొక్కలేదు! ఎవరి మీద ఆయనకు కోపం? తన మీద కాదు గదా! శోభనం లో నన్నా తన మీద ప్రేమ చూపిస్తాడా!
    అవ్యక్త మధుర భావాలతో సన్నమ్మ నిలువెల్లా పులకరించింది. తన నెలుకొనడానికి వస్తున్నాడు తన భర్త!
    శోభనం మాట అనుకొన్నప్పుడు -- "ఇదేం అన్యాయం రా, నాయనా? బొత్తిగా పసిపిల్ల. దానికీ పీదంతా ఇప్పుడే ఎందుకురా?' అని పాపమ్మ గారు దీర్ఘాలు తీశారు.
    కృష్ణ వేణమ్మ గారు ఏం పలకలేదు గాని, కండ్ల లో దిగులు కనుపించింది.
    శేషఫణి శాస్త్రి గారికి అల్లుడి మీద పీకల దాకా కోపమున్నది.
    పెండ్లి నాడు పీటల మీద ముఖం దుమధుమ లాడిస్తూ క్పూర్చోవడం తప్ప , మళ్ళీ తన గడప తొక్కలేదు. ఎన్ని జాబులు వ్రాసినా, తండ్రి వ్రాయవలసిందే కాని అల్లుడు ఉలకడు! పలకడు! కలిసి చదువుకొన్న రోజులలో కొడుకుతో మాట్లాడటం కూడా నామోషీ అయింది వెధవకు! ఏవో గొప్ప చదువులు చదివి , పెద్ద ఉద్యోగస్తుడవుతాడని కూతురిని ఇచ్చి పెళ్ళి చేస్తే, ఈ వేళ ఏకు మేకయి కూర్చున్నాడు!
    శాస్త్రి బి.ఏ లో ప్రధమ శ్రేణి లో పాసయాడని వియ్యంకుడు వ్రాసినప్పుడు నిజంగా శేష ఫణి శాస్త్రి గారు ఎంతో సంతోషించారు. శేఖర్ కూడా బావమరిది గొప్పతనానికి ఎంతో గర్వించాడు. శాస్త్రి  చేసిన అపకారాన్ని, అవమానాన్నీ ఇంచుమించు మరిచే స్థితికి వచ్చాడు శేఖర్.
    అయితే ఈవేళ చెల్లెలికి శోభనం చెయ్యటం శేఖర్ కు బొత్తిగా ఇష్టం లేదు.
    "ఇంత చిన్న పిల్లకు శోభనం ఏమిటి, నాన్నా? సహజంగా రావలసిన శారీరకమైన మార్పులేవో వచ్చినంత మాత్రాన పాపను ఇప్పుడే సంసారం లోకి దించడమేమిటి? పాపే ఒక పసిపిల్ల. రేపు దానికో పసిపిల్ల! అన్యాయం గాదూ!" అని గట్టిగా వాదించాడు శేఖర్.
    "ఏడిచావు లేవోయ్! అక్కడికి మేమే తెలివి తక్కువ వాళ్ళం! నీ బావమరిది బండారం కాలేజీ లోనే బయట పడిందిగా! వాడొక లుచ్చా. ఎన్ని జాబులు రాసినా, వాళ్ళ నాయన బడులిస్తాడే గాని, వీడు కిమ్మనడు! ఇరవై అయిదు వేల రొక్కం ఎగరేసుకు పోయాడే గాని, మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కడా? నా బిడ్డ సంగతని ఆలోచిస్తున్నా గాని, వెధవను నరికి ఉప్పు పాతర వేసే వాడిని! ఈ వేళో , రేపో అమెరికా వేడతాట్ట. దగుల్భాజీ వెధవకు అమెరికా కూడాను! అక్కడికి వెళితే ఇహ మన చెయ్యి దాటినట్లే. ఇదిగో, ఈ తతంగం కాస్తా కానిచ్చి, "నాయనా! నీవు ఒక్కడివే ఎందుకు? నీ భార్యను కూడా పిలుచుకొని చిలకా గోరింకలల్లే తిరిగి రండి. కావాలంటే మరో అయిదు వేలు తీసుకో!' అని కబురు పెట్టాను. డబ్బుకు గడ్డి తినే వెధవ! ఒప్పుకొన్నాడట" అని శేష ఫణి శాస్త్రి గారు జవాబు చెప్పారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS