Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 6


    "ఓ. నేను సిద్ధం!" అన్నాడు రాజా. "వారం రోజులు సెలవు పెట్టాను నేను, నీకోసమే."
    "థాంక్స్" అంటూ "త్వరగా బయల్దేరండి, పద్మా" అన్నాడు శ్రీహరి.
    రాత్రి భోజనాలై అందరూ పడుకున్న తరువాత శాంతి తన గదిలోకి వెళ్ళి తలుపు బిగించుకుంది. షికారు వెళ్ళినప్పుడు ధరించిన దుస్తులైనా మార్చకుండా ఆత్రంగా ఆ పాకెట్ తీసింది. గుండెలు దడదడలాడాయి. విప్పి చూడటానికి ధైర్యం చాలలేదు. 'కూడని పని చేశావా?' అని పదే పదే తర్కించుకుంది. కొంతఃసేపు రాధా మాధవ చిత్రం దగ్గర నిల్చుని రాజా ఇచ్చిన ఫైనల్ టచెస్ చూస్తూఉండిపోయింది. కడకు వెళ్ళి మంచంమీద కూర్చుని "ఏమైతే అయ్యిం'దనుకొంటూ మొండి ధైర్యంతో విప్పింది. చూస్తూనే ఉద్వేగం, ఉత్సహం, ఆశ్చర్యం ముప్పిరిగొని కొద్దిసేపు కనురెప్పలు కదలడం మానేశాయి. గుండె వేగం హెచ్చింది.
    రెండు చిత్రపటాలు! ఒకటి తాను ముగ్ధురాలై తిలకించిన నిర్మలమూర్తి గురుదేవుడు రవీంద్రుడు! శాంతికి-రాజా అని వ్రాశాడు క్రింద. వెయ్యి రూపాయలనుకూడా త్రుణీకరించి ప్రాణ ప్రదంగా పదిలపరుచుకున్న చిత్రం తనకు కానుకగా ఇచ్చాడు. రెండవది లేత గులాబి దుస్తులలో ఉన్నలతాంగి!  రాధా మాధవులమ తన్మయురాలై తిలకిస్తూంది. కొద్దిగా తలవంచి, చెక్కిట చెయ్యి జేర్చి, విశాల నేత్రాలుగల ఆ సుందరి ఇంకెవరు? పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ రూపం తనదేనని గ్రహించటానికి శాంతికి ఏమాత్రం ఆలస్యం కాలేదు. అవును దక్షిణేశ్వరం చూడటానికి రెండవసారి వెళ్ళినప్పుడు, రాజాతో పరిచయమైనావాడు తాను గులాబి వర్ణపు దుస్తులే ధరించింది! అందుకే కాబోలు క్రిందటి రోజు అతడింటికి వెళ్ళినప్పుడు 'ఆ చిత్రం ఎవరిదో చెప్పుకొమ్మని కొంటెగా అడిగాడు. 'ఎవరో తెలుసుకొందుకు రెండు రోజులు ఆగ'మని అర్ధయుక్తంగా చెప్పాడు. ఎంత చతురుడు! అయినా యిదెక్కడి ధైర్యం! అత డెవరు? తనెవరు? రెండు రోజుల పరిచయానికే ఈ చనువేమిటి? స్నేహితుడి చెల్లెలైనంత మాత్రాన ఈ బహుమతులేమిటి? అతడు మంచివాడౌనో, కాదో! అన్నయ్యా, వదినా చూడకూడదని అతడభిప్రాయం కాబోలు! అందుకే అప్పుడు చూడనివ్వలేదు. అన్నయ్య స్నేహితులు చాలామంది ఉన్నారు కాని, ఎవరూ తనతో యిలా ప్రవర్తించలేదే?
    శాంతి హృదయం పరిపరివిధాల పోయింది. నిద్ర పట్టలేదు. నెమ్మదిగా లేచి కిటికీ దగ్గరి కెళ్ళింది. బయట అందంగా ఉంది వెన్నెల. చిత్రపాటలు దాచేసి, లైటుతీసి, కాస్సేపు ఆ చీకట్లో నిల్చుని వెన్నెల చూస్తూంటే ఏమిటో హృదయం తేలిక పడ్డట్టనిపించింది. దూరాన వెన్నెలలో మిలమిల మెరుస్తూన్న గంగావాహిని గలగల వాదాలు నిశ్శబ్ధాన్ని చీల్చుకుంటూ చెవులను హాయిగా తాకుతున్నాయి. ఎంతసేపు నిల్చున్నా విసుగనిపించలేదు శాంతికి. నిర్మల గాంభీర్యం కూడిన ప్రకృతిని ఎంతసేపు చూచినా తనివి తీరలేదు.
    వాయుదేవునికి వెరచి వెడలిపోయిన మేఘుని చాటునుండి వెలికి వచ్చిన దినకరునివలే విచిత్ర మైన ఊహా మేఘమాలికల మాటున ఆచ్చాదిత మైన శాంతి కళాదృష్టి ఆ కమనీయ పరిసర సందర్శనతో మేల్కొంది.
    తాత్కాలికంగా ఆ భారమైన ఆలోచనలను దూరంగా నెట్టి లైటువేసింది. స్టాండుమీద రాధా మాధవులను తీసి పదిలంగా దాచి, క్రొత్త చిత్రానికి మళ్ళీ ప్లేటు అమర్చి రంగులు కలుపుతూంటే రాధా మాధవులను సరిదిద్దుతూన్న రాజా, నేత్రాలలో మెదిలాడు. ఎదురుగా నిలబడి అతడు ముగ్ధ మోహనంగా నవ్వుతున్నట్లే అనిపించింది. ఏ ఆలోచనలనైతే బలవత్తరంగా పారద్రోలిందో అవే ఆలోచనలు తిరిగి వచ్చి మరింత పటిష్టంగా  తిష్ట వేశాయి మనస్సులో. రాజా ఈ సమయంలో ఏం చేస్తున్నాడో! తన లాగే రకరకాల ఆలోచనలతో సతమతమౌతున్నాడో, లేక ఏదైనా చిత్రం గీస్తున్నాడో! 'అయినా రాయిలాటి నా మనస్సిలాగైపోయిందేమిటి? అతడెవరు? నేనెవరు నాకు అతడిపై ఈ ఆలోచన లేమిటి?'ఇక ఈ రోజుకు తన మనస్సు చిత్రం గీసే స్థితిలో లేదని నిర్ధారించుకుని మెల్లగా లైటార్పి పడుకుంది శాంతి.
    మర్నాడు నిద్ర లేవటానికి వచ్చిన పద్మ గుర్తు చేసేవరకూ తాను క్రిందటి రోజు షైరువెళ్ళిన మంచి విలువైన దుస్తులతోనే పడుకున్నట్లు శాంతికి గుర్తురాలేదు.
    "ఆ క్రొత్త పుస్తకాలు చూస్తూంటే ఎప్పుడో నిద్రపట్టేసింది" అని అబద్ధమాడేసింది. కాని లేస్తూనే అబద్ధమాడవలసి వచ్చినందుకు కొద్దిగా బాధపడింది. రాజా యిచ్చిన చిత్రాలను అన్నయ్యకు, వదినకు చూపడమూ, వద్దా అనే ఆలోచన మరొకవైపు. కాని ఎందుకో ఆమె మనస్సు ఆ విషయం రహస్యంగానే ఉంచెయ్యాలని కోరుకుంది. కారణం తనకే తెలియదు.
    ప్రతిదినం రాజా వచ్చేవాడు. కాని వట్టి చేతులతో రాకుండా తోటలో పూలో, పళ్ళో, క్రొత్త క్రొత్త పుస్తకాలో తెచ్చేవాడు. ప్రత్యేకంగా ఎవ్వరికీ కాకుండా బల్లమీదుంచేస్తే వదిన చనువుగా తీసుకుని శాంతికి కూడ ఇచ్చేది. శ్రీహరి కీ, పద్మకూ అతడొక స్నేహితుడుమాత్రమే. కాని శాంతికి అతడి ప్రవర్తనలో, చేష్టలలో, చూపులలో, మాటలలో......అనేక అర్ధాలు అస్పష్టంగా దోబూచులాడుతూ కనిపించేవి. ప్రతిరోజూ ఊరు చూడడానికి బయల్దేరే వారు. కాళీఘాట్, బిర్లామందిర్, జూ, విక్టోరియా మెమోరియల్, మూజియం - చూడవలసినవన్నీ చూసేశారు. ఆ విహారాలలో రాజా, శాంతి హృదయాని కతి సన్నిహితంగా వచ్చినట్లు అనిపించింది. ఎన్నోసార్లు శాంతి అడగటానికి ప్రయత్నించింది. 'ఆ చిత్రా లివ్వడంలో మీ వుద్దేశ్య మేమి'టని. కాని, అవకాశం కలుగలేదు. రాజా బుద్దిపూర్వకంగానే అటువంటి అవకాశం కలుగకుండా చేశాడేమో అనిపించింది శాంతికి. ఒకటి రెండు సార్లు కొద్ది నిమిషాలు ఏకాంతం లభించినా శాంతిని ఏదో మూగతనం ఆవహించివేసింది. నెలరోజులు గడిచినా శాంతి హృదయంలోని సందేహం సందేహంగానే మిగిలిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS