5
రాత్రి తొమ్మిధైంది. తులసి వంటపని పూర్తి చేసుకుంది. అత్తా, మామలకు భోజనాలు పెట్టేసింది. కాసేపు కమలతో పిచ్చాపాటీ వేసుకుని వచ్చింది. మరికాసేపు షార్టు హాండ్ ఎక్సర్ సైజులు ప్రాక్టీస్ చేసింది. భర్త కోసం ఎదురు చూస్తూంది. ఐనా పాప జాడ లేదు. తులసి మనసు కలవరపడింది. ఏడున్నరకు క్లాసెస్ ఐపోతాయి. మరో అరగంట సేపు బస్సు కోసం నిలబడ్డా ఎప్పుడో వచ్చెయ్యాల్సింది. ఒంటరిగా పాప ఎక్కడ తిరుగుతున్నట్టు? ఎంతో సంబరంతో రమ్మన్నదేగాని, అది వచ్చిన క్షణాన్నే తెలిసిపోయింది, తను చివరిసారిగా ఊళ్ళో చూసిన అల్లరి పాపకూ, ఎదిగి చలాకీయై తన కిష్టంలేని విధంగా మారిన పాపకూ ఎంతో తేడా ఉందని. పాప ఇలాంటిదని తెలిస్తే తను రమ్మనకపొయ్యేదే. తనకు గుండెల మీది కుంపటి. రోజులు బాగులేవు. ఏదైనా అఘాయిత్యం జరిగితే తరవాత నెత్తీనోరూ కొట్టుకున్నా లాభం ఉండదు. అది ఏవేవో చెబుతూంటుంది. ఎవరో క్రిస్టియన్ అమ్మాయితో దీనికి దోస్తీ అట. వద్దంటే వినదు. మొదట వాళ్ళ కబుర్లన్నీ చెప్పేది. తన కిష్టం లేదని తెలియగానే చెప్పటం మానేసింది. కాని అసలు ఆ స్నేహం మానలేదు ఇంకా. క్రిస్మస్ వస్తూంది, వాళ్ళింటికి రమ్మందిట. ఎలా? ఇంకా తీవ్రంగా చెబితే నొచ్చుకుంటుందేమో....అప్పుడే కమల ఇంట్లోకెళ్ళి ఆవిడ భర్త ఉన్నప్పుడు కూడా కబుర్లు చెబుతూంది. ప్రస్తుతం తన వయస్సు ఎంత చెడ్డదో తను తెలుసుకోలేదా? లేక అన్నీ తెలిసి చేస్తున్న నెరజాణ చేష్టలా?

విసుగ్గా వాకిలి వేసి రావాలనుకుని లేస్తుంటే, గేటు తోసుకుని పాప వచ్చింది. పర్సు పారేస్తూ తనను మాట్లాడనివ్వకుండానే, "అక్కా, ఇంక ఇవాల్టినించీ నేను నడిచివస్తాను. నాకు మరో స్నేహితుఆలు కలిసింది. వాళ్ళిల్లు కూడా ఇక్కడే. ఆ బస్సుకోసం నేను నిలుచోలేను బాబూ" అంది పాప.
"ఎవరే, నీకు రోజుకో స్నేహితురాలు కలుస్తూంటుంది" అంది తులసి.
"పుష్పావతి అని మా క్లాస్ మేట్ ఆవిడకూడా టైపు నేర్చుకుంటోంది" అంటూ మెట్లు దిగింది పాప.
తులసి ఊరుకోలేదు. తను చూస్తూ ఊరుకోలేదిలాంటి విషయాల్లో.
పాప కాళ్ళు కడుక్కుని రాగానే తులసి మళ్ళీ ప్రారంభించింది.
"అబ్బ! ఏమిటీ క్రాస్ ఎక్జామినేషన్! నా మీద నమ్మకం లేదూ?" అంది పాప విసుక్కుంటూ.
"అదికాదే, నీకు తెలియదు. ఇంత దూరం ఇలా చీకట్లో నడిచిరావటం మంచిది కాదు" అంటున్న తులసిని ఆపేసి, "చీకటెక్కడ! దారిపొడుగునా దుకాణాలు, హోటళ్ళు, వీధిలైట్లు, ఎప్పుడూ వస్తూపోతూ వుండే బస్సులు. ఇంకా ఒంటరితనమేది, చీకటేది?" అంది పాప.
తనకే పాఠాలు చెబుతూంది!
"రైస్ మిల్లు ఉంది చూడు, అక్కడ బావ కలిశాడు" అంది పాప మళ్ళీ.
తులసి కర్ధం కాలేదు.
"ఎవరు?" అంది.
"ఎవరేమిటి, బావ. నీ మొగుడు!" అంది పాప పకపకా నవ్వుతూ.
తులసి చాలా అడగాలనుకుంది. కాని అడగలేక పోయింది. పాపను చూస్తే భయమేసింది. పాప ఇంత పెద్దదనీ, ఇంత తెలివైందనీ తను గ్రహించలేదు.
"లే, తిందువుగాని" అంది తులసి.
"కాస్తాగితే బావకూడా వస్తాడు. ముగ్గురం తినచ్చు.... ఐనా మీ ఏకాంతానికి నే నడ్డెందుకులే, ముందే తినేస్తాను, పద" అంది పాప.
తులసికి కోపం వచ్చింది.
"ఏయ్, ఆ మాటలే మంచివుకావు. నీ ఇష్టమై నప్పుడే తినుగాని, అలా మాట్లాడ కింకెప్పుడూ. తెలిసిందా?" అంది.
పాప క్షణం నిర్ఘాంతపోయింది. మొహం మాడ్చుకుంది.
తులసి బాధపడింది. తను ఇంత పరుషంగా మాట్లాడి ఉండకూడదు.
సీతాపతి రాగానే ముగ్గురూ కలిసి భోజనం చేశారు. అతడేవేవో కబుర్లు చెప్పాడు. కాని పాపా కదపలేదు, సీతాపతీ ఎత్తలేదు, వాళ్ళెక్కడో రోడ్డుమీద కలిసిన విషయం. నిప్పులాంటి అనుమానాన్ని మనసులో దాచుకోగలిగిందేగాని భర్తతో ముఖాముఖీ తేల్చుకునే ధైర్యం తెచ్చుకోలేకపోయింది తులసి.
ఆ రాత్రంతా బాధపడి మరో నిర్ణయం చేసుకుంది. తెల్లారి పాపతో, "పాపా, నువ్వు సాయంత్రం వెళ్ళటమెందుకులే? మనందరం వెళితే ఏం బాగు. నువ్వు ఉదయం బాచ్ కి మార్చుకో" అంది.
"అవునక్కా, అదే బాగుంటుంది" అంది పాప.
కొద్ది రోజుల తరవాత ఓ నాడు తులసి ఆఫీసునించి ఇన్స్టిట్యూట్ కు వెళ్ళింది. కాని రగుల్కొంటున్న సందేహాలు ఆమె నక్కడ కూర్చోనివ్వలేదు. ఇంటికి వచ్చేసింది. కమలవాళ్ళతో కలిసి అత్తగారు సినిమాకి వెళతానన్నది. మామగారు లైబ్రరీకి వెళ్లుంటారు. ఇంట్లో పాప ఒక్కత్తే ఉండాలి. పాప ఏం చేస్తూ ఉంటుంది? చప్పుడు కానివ్వకుండా గేటు తీసుకుని ఇంట్లోకి వచ్చింది. వీళ్ళ వాటాకు ఈవలినుంచి గొళ్ళెంపెట్టి ఉంది. స్టూడెంట్సు వాటాలో లైటు వెలుగుతూంది. పాప?
తులసికి కాళ్ళు వణికేయి. గొళ్ళెం తియ్యలేదు. నెమ్మదిగా బాత్ రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది. మునివేళ్ళ మీద నిలబడి చూస్తే, బాత్ రూం వెంటిలేటరు గుండా ఆ స్టూడెంట్స్ రూం కనిపించక పోలేదు. అరికాళ్ళలొ చెమట వచ్చేసింది. రొప్పు ఆగటం లేదు.
అతడు- వెంకట్రావు కాబోలు; మరొకతను రంగారెడ్డి.
కిటికీలో కూర్చుంది పాప-పాపిష్టి ముండ, పైట ఎలా జారిపోయిందో-ఎంత నిర్లక్ష్యంగా కూర్చుంది!
"నువ్వూ ఉద్యోగం చెయ్యకూడదూ?" ఎవరు అతను?
"చెయ్యచ్చు. కాని ఏజ్ లేదుగా. అబ్బ! ఊరికే వాగించేస్తున్నాడు బాబూ, రెండు వెధవపుస్తకాలివ్వ టానికి. మా అక్కయ్య కూడా వచ్చేస్తుంది. నేనిక్కడున్నానంటే చంపేస్తుంది."
"పోనీ, వెధవపుస్తకాలైతే వద్దులే!"
ఎవడు వాడు, వెంకట్రావా, దొంగ!...
"వెధవపుస్తకాలు కావు. మంచి పుస్తకాలేగాని ఇవ్వండి. ప్లీజ్!"
"ఏదీ. నువ్వు ప్లీజ్ అంటున్నప్పుడు ఆ పెదాలు ఎంత అందంగా సాగుతాయో, మరోసారి అను, ప్లీజ్."
"ప్లీజ్!" అంది పాప.
"ఇలా రా, బొమ్మలు చూపిస్తాను."
తులసికి తల తిరిగిపోయింది. తలుపు తీసుకుని ఈవలికి వచ్చింది.
"ఛీ! బూతుబొమ్మలు" అంటూ పాప పరుగున మెట్లు దిగింది. తులసిని చూసి నిశ్చేష్టురాలైంది. ఏదో అనబోయింది. ఏమీ అనలేక ఇంట్లోకి పోయింది. తడబడే అడుగులతో తులసికూడా ఇంట్లోకి నడిచింది. పాప ఏడవటం లేదు. ఎలా ప్రారంభించాలో తులసికి కూడా అర్ధం కాలేదు. ఈ విషయం భర్తకు చెప్పేదా? భర్త పాపను తన స్వంత చెల్లిలాగే చూసుకుంటున్నాడా? ఎవరికి రిపోర్టు చెయ్యాలి, పాపను అజమాయిషీ లో పెట్టాలని?
నేరం చేసినట్టుగా పాప తల కిందికేసుకుని రేడియో దగ్గిర కూర్చుంది.
భర్తకు చెబితే వెంటనే వాళ్ళను ఖాళీ చేయిస్తాడు. ఐనా మన బంగారం మంచిది కానప్పుడు..... ఇవ్వాళ వీళ్ళు, రేపు మరొకరు. పాప మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో....దగ్గిరగా వచ్చి, "పాపా, అలా చెయ్యకూడదే, తప్పు!" అంది తులసి. ఇంకా చాలా చెప్పాలనుకుంది. కాని ఎలా చెప్పగలదు? పాప కివన్నీ తెలియవా? అసలు తను ఆ మాటకూడా అనక్కర్లేదు. తన తృప్తికోసం, తనలోంచి లావా కొంచెం బయటికి కక్కి తనను తాను చల్లార్చుకోవటానికి అందేకాని పాపకు చెప్పటానికి కాదు. ఈ విషయం తనెట్లాగూ భర్తకు చెప్పలేదు. తనకు అతడిలో నమ్మకం పోతూంది.
పాప తలెత్త లేదు.కదలలేదు.
"పాపా!"
పాప పలకలేదు. బుజం మీద చెయ్యి వేసింది తులసి.
పాప ఆకస్మికంగా ఏడ్చింది.
అలా ఏడ్చే చెల్లెల్ని చూస్తే గుండె తరుక్కుపోయింది తులసికి.
పాపను కౌగిలించుకుంది. గుండెలకు హత్తుకుంది. తులసి కళ్ళలో కూడా నీళ్ళు నిండాయి.
"ఊరుకో. ఊరుకోవే, నా చెల్లాయి గదూ, ఊరుకో వాళ్ళను ఖాళీ చేయిద్దాం. ఊరుకో."
చెల్లెలు ఊరుకోలేదు. వీపు నిమురుతుంటే పాప ఒళ్ళు వేడిగా తగిలింది.
"పాపా, ఒళ్ళు వెచ్చచేసిందా ఏమిటి?" అంది తులసి గాభరాగా.
"లేదు. ఏం లేదక్కా, అదే తగ్గిపోతుంది" అంటున్నా వినిపించుకోక తులసి థర్మామీటరు తెచ్చింది.
"ఇదిగో, చూశావా, 100 డిగ్రీలు ఉంది. నువ్వు ఇంక అన్నం తినక పడుకో కాసేపైం తర్వాత పాలు తాగు. మీ బావగా రొచ్చింతర్వాత మందు తెప్పిస్తాను. వేసుకుందువుగాని" అంది తులసి.
పాప పడుకుంది.
* * *
"తులసీ, పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఏదో వేకెన్సీ లున్నాయిట, చూశావా" అంటూ వార్తాపత్రిక తీసి చూపించాడు సీతాపతి.
"ఊఁ. నా కొస్తుందంటారా!" అంటూ నిట్టూర్చింది తులసి.
"ఏమో, ప్రయత్నించటంలో తప్పేముంది? ఓ అప్లికేషన్ పడెయ్యటమేగా నువ్వు చెయ్యాల్సింది" అన్నాడు సీతాపతి.
"ఆ లెక్కన నేను అప్లై చెయ్యంది దేనికి? ఈ గొంగళిపురుగు ఉద్యోగానికి తప్ప మరెందుకూ పనికి రానేమో నేను" అంది తులసి.
"నీకు తప్పకుండా వస్తుందని నాకు నమ్మకం ఉంది, తులసీ. కాకపోతే పని ఎక్కువగా ఉంటుందేమో. ఎనిమిది గంటలు పని చెయ్యాలనుకుంటాను" అన్నాడు సీతాపతి.
"పోనివ్వండి. ఎనిమిది కాకపోతే పన్నెండు గంటలు పనిచేస్తాను. కాని ఎక్కువ డబ్బు కావాలి" అంది తులసి.
"చాలా ఎక్కువ పని" అన్నాడు సీతాపతి లైటార్పేసి తులసి వైపు తిరుగుతూ.
"సరేగాని ఒక్క మాట. చేస్తానంటే చెబుతాను" అంది తులసి. అతని శ్వాస ఆమె మొహం మీద తీవ్రంగా తగిలింది.
"ఏమిటి?" అన్నాడు సీతాపతి.
"ఆ స్టూడెంట్సును ఖాళీ చెయ్యించాలి" అంది తులసి.
"ఎందుకు?" అన్నాడు సీతాపతి. అతడికి మరేదో అనుమానం వచ్చింది. అలా రావటమే మంచిది.
"చాలా సీరియస్ గా ఉంది వ్యవహారం" అంది తులసి.
"వాళ్ళేమన్నారు?" అన్నాడు సీతాపతి లేస్తూ.
"పడుకోండి, చెబుతాను. పాప వాళ్ళింటికి ఎక్కువగా వెడుతోంది..." తనకూ మాట తడబడింది ఇంక మాటలు వీల్లేదు. సీతాపతి మాట్లాడనివ్వలేదు. కాసేపు ఈ విచారలకూ, గొడవలకూ అతీతమైన ఉద్రేకంలొ గడిపి, అలిసి సుఖంగా నిద్రపోయింది తులసి.
6
పాప జ్వరం తలనెప్పిమాత్రతో తగ్గలేదు. డాక్టరును పిలుచుకురావలసినంత అవసరం కలగలేదు. కాని పాప సుస్తీగానే కొంచెం లేచి తిరుగుతూంది. స్టూడెంట్సు ఇల్లు ఖాళీ చేశారు. తులసి ఆదివారం తప్ప ఆఫీసుకు వెళ్ళకుండా ఉండలేదు. పరీక్షలు సమీపించటంవల్ల క్లాసులు మానెయ్యలేకపోయింది. కాని సీతాపతి కాలేజీ మానేసి ఇంటిపట్టుకు మరిగాడు. తల్లి సహాయంతో సాయంత్రాలు వంటకూడా చేసేవాడు. నెలనెలా పాటించ వలసిన నాలుగు రోజుల 'దూరం' కూడా ఆ నెలలో తులసి పాటించకపోవటం గమనించాడు. ఆ రాత్రి గదిలోకి వెళ్ళగానే ఆత్రంగా అడిగేశాడు.
"ఏమోమరి. అదికూడా నా తప్పే!" అంది తులసి.
"నా తప్పేమోనని" అన్నాడు సీతాపతి తులసి చేయి పట్టుకుని లాగుతూ.
"డాక్టరు దగ్గరకెళ్ళి ఓ సారి చూపించుకోవాలనుకుంటున్నా నండీ. ఏ విషయమూ తెలుస్తుంది" అంది తులసి అతని చేతుల్లో ఒరుగుతూ.
"తులసీ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎక్కువగా కష్టపడకూడదు. రాత్రిళ్ళు మేలుకో గూడదు. ఒళ్ళు అలవకొట్టుకోగూడదు" అన్నాడు సీతాపతి.
