'అది కాదు ....' అని ఏదో అనబోయి ఆతని ముఖంలో కనబడిన సన్నని నవ్వూ కళ్ళలో చిలిపితనం చూసి సిగ్గుతో ఎర్రబడిన ముఖం కిందికి దించేసుకుంది లలిత. కాని తనని తాను పరిచయం చేసుకోక తప్పదు అన్నది జ్ఞాపకం వచ్చి నెమ్మదిగా తలెత్తింది.
'నేను లలితని, సుబ్బమ్మ గారు మేనకోడల్ని.' అంది.
"ఏమిటీ?' అని అడిరిపడ్డట్టు అన్నాడు అతను కళ్ళలో చిలిపితనం మాయమై పాలభాగం ముడుతలు పడింది. 'నేనండి సుబ్బమ్మగారి లలితని. లాయరు వెంకట్రామయ్యర్ గారు మీకు రాసి ఉండాలి' అంది ధైర్యంగా. కాని ఇలా చెప్పుకోవలసి వచ్చినందుకు ముఖం కందగడ్డలాగా అయిపొయింది.
"మైగాడ్! ఈ రోజేలా వచ్చి పడ్డావిక్కడ ? ఎనిమిదో తేదీని వస్తానన్నారే?' అన్నాడు ఆశ్చర్యాన్ని కొద్దిపాటి విసుగుతో మిళాయిస్తూ.
లలిత కిది నిజంగా బాధనిపించింది. ఎవరూ స్టేషను కి వచ్చి తీసుకు రాలేదు సరికదా -- నిలబెట్టి ఇప్పుడెందుకొచ్చావు? అంటే బాధగానే ఉంటుంది మరి. అసలే ఇష్టం లేకుండా రావలసి వచ్చిన స్థితి.
"ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. గేటు తెరిచిన మీ రత్తి ధోరణిపట్టి అదే అనుకున్నాను నేను'; అంది కొంచెం కోపంగా.
'నాకసలు తెలియదు మీరొస్తారని....ఇక్కడి కేలా చేరకల్గారు? స్టేషను నుంచి చాలా దూరమే....'
'టాక్సీ లో వచ్చాను.'
'క్షమించండి. లాయరు గారు మీరు ఎనిమిదికి వస్తారని రాశారు. అంచేత ఇలా జరిగింది. మిమ్మల్ని స్టేషను లో కలిసి ఇంటికి పిలుచుకుని రాలేక పోయినందు కెంత బాధపడుతున్నానో చెప్తే తెలియదు అన్యదా భావించకండి' అన్నాడు.
అతని కంఠస్వరం లో ఏ గుణం లేకపోయినా అతని ధోరణి లో ఎప్పుడూ నిజాయితీ మటుకు లోపించదనిపించింది లలితకి.
"మీ కొత్త యింటికి సుస్వాగతం' అంటూ చేయి జాపాడు. ఆ కళ్ళలో చిలిపితనం తిరిగి వెల్గింది.
చేతులు జోడించి నమస్కరిస్తూ 'థాంక్యూ....' అంది లలిత 'రండి కూర్చుని మీ ప్రయాణం విశేషాలు చెప్పండి -- మిమ్మల్ని చూసి సరళ కోసం ఎవరో స్నేహితులు వచ్చారను కున్నాను....' అంటూ సోఫా కేసి దారి తీశాడు బలరామ శాస్త్రి.
'అసలా లాయరు కి వృద్దాప్యం వచ్చేసి ఉండాలి-- లేకుంటే ఏమిటీ పొరపాట్లు?' అంటూ సంభాషణ ప్రారంభించాడు.
వళ్ళో చేతులు పెట్టుకుని ఒకటికి పదిసార్లు తన వేళ్ళను లెక్కపెడుతూ కూర్చుంది లలిత.
'గుమస్తా పోరపాటై ఉంటుంది' అంది నెమ్మదిగా.
'నిజమే అయి వుండొచ్చు . అయితే మాత్రం అయినోసారి చూసుకోవద్దా' నేనీ సంగతి ఘాటుగా రాసి తీరాలి, మీరు సేఫ్ గా వచ్చి చేరారు కనుక సరిపోయింది లేకుంటే?'

'లేదండీ వెంకట్రామయ్యర్ చాలా నెమ్మదస్తులు మంచివారు. నేనంటే వారికీ చాలా అభిమానం' ఎందుకో తెలియదు గాని ఈయన చివాట్ల నుంచి అయన గార్ని రక్షించాలని పించింది లలితకి.
"ఓ వయస్సు వచ్చాక రిటైరై పోవాలి అంటారు. ఇందుకనే కాబోలు' తనలో తనుగా అనుకున్నాడు బలరామ శాస్త్రి . 'గట్టివాడు! ఓ పట్టాన వాదించి గెలవడం కష్టం.' అనుకుంది లలిత.
"మీరనుకునేటంత ముసలి నగ్గెం కాదు లాయరు గారు. ఆయనా నేను క్షేమంగా చేరానుగా. ఆసంగతి రాస్తే చాలదా?' ధైర్యం గానే అడిగింది.
"నిజం నిజం. నేను ఎదురు చూసిన వ్యక్తీ మీవంటిదైతే అది సాధ్యం అయి ఉండేది కాదు." సన్నగా నవ్వుతూ అన్నాడు. "పోనీలెండి ఎలాగో వచ్చి చేరారు కదా? నేను స్టేషను కి ఎవరినీ పంపించక పోయి నందుకు క్షమిస్తారు కదూ!" మాట మార్చేశాడు.
"మీరేవర్ని ఎదురు చూశారు!" కుతూహలంగా అడిగింది లలిత.
"ఓ పదేళ్ళ రెండు జడల పిల్లని. అందుకే స్టేషను లో దింపుకొందుకు అంత బందోబస్తు ఏర్పాటు చేశాను' గట్టిగా నవ్వేశాడు.
"అయితే నాలాగే మీకూ అయిందన్న మాట' అనేసి నాలిక్కరుచుకుంది లలిత.
"అంటే?' అత్రంగానూ తీవ్రంగానూ అడిగాడు.
"మీరెవరో పెద్దవారై ఉంటారు లేకుంటే నాకు సంరక్షకునిగా ఎలా నియమించారు? అనుకున్నాను తీరా చేసి చూస్తె.....' నసిగింది లలిత.
అతగాడు గట్టిగా నవ్వేశాడు.
లలిత కూడా నవ్వకుండా ఉండలేక పోయింది.
"మీ ఎడ్రసు చెప్పగానే స్టేషను లోపలా బయటా కూడా అంతా సహాయం చేశారు.' అంది ;లలిత.
"మంది 'కీర్తి పతాక' కదూ' ఒక్క చేతి కదలికతో ఇంటిని కలయ చూసాడు. ఈ ప్రాంతాల కిది కొంచెం ప్రసిద్దమే.... మీరిక్కడ సుఖంగా వుంటారని ఆశిస్తాను.' అన్నాడు.
'చాలా బాగుందండీ, పట్నవాసపు అగ్గి పెట్టిళ్ళు చూసిన నా కళ్ళకిది వేరే లోకం లాగా ఉంది...'
'మీ మామయ్య బాగా జ్ఞాపకం ఉన్నాడా మీకు?"
కుతూహలంగా అడిగాడు.
"నాకు బాగా జ్ఞాపకం . వో ఏడేళ్ళ నుంచీ అసలు రానే లేదు. అంతకి ముందు వచ్చినప్పుడే ఇక్కడ అత్తయ్యతో ఘర్షణ పడ్డాడు.... నా గురించి....'
'అవునవును. నాకు రాసేవాడు. మేం ఇద్దరం చాలా సన్నిహితులంగా బ్రతికాం. అకాలమరణం పాలిపోయాడు....మీ అత్తయ్య కి నేను ఉత్తరం రాస్తేనే వచ్చింది.. నన్ను మీ సంరక్షకునిగా నియమించి తను కూడబెట్టిన దంతా భద్రం చేసి మీకు అందించమని వాడి కోరిక. మీ ఫోటో కూడా చూపెట్టాడొకసారి. దాన్ని పట్టే మీరింకా ఏ హైస్కూల్లో విడిచి ఉంటారని ఊహించాను' నవ్వాడు.
"అంత చిన్నప్పటి ఫోటో చూపాడా ' ఆశ్చర్యంగా అడిగింది లలిత.
సమాధానంగా కుతూహలంగా లలిత ముఖం లోకి చూస్తూ ఊరుకున్నాడు బలరామ శాస్త్రి. కళ్ళు దించుకుంది లలిత.
"మీ మేనత్త తత్త్వం నాకో పట్టాన అర్ధం కాదు.... పోనీలెండి అవన్నీ తరవాత మాట్లాడుకుందాం. ఇదిగో రత్తి వస్తుంది. కూడా వెనక వస్తున్నది మా వంటావిడ. మీరావిడని చూసి భయపడకూడదు. శరీరం ఎంత పెద్దదో మనస్సు అంత సున్నితం. నేనేమేనా చెప్తే నిన్ను ఎత్తి పెంచానని నా నోరు నొక్కుతుంది...' నవ్వాడు.
"బాబూ ఎంత తప్పయి పోయిందో చూశావా? మీ అత్తయ్యగారేనా ఉండకూడదూ. ఈరోజే వెళ్లాలా ఎక్కడికో ' అంటూనే సమీపించింది వంటావిడ-
'పోనీలే , వచ్చేస్తారుగా. అమ్మాయిగారికి గదులు చూపించు. కాసేపు విశ్రాంతి గా పడుకుంటారు. అంతా కలిసి టిఫిను చేస్తాం లే." అంటూ "మీరు మీ రూంకి వెళ్ళండి నే మళ్ళా కలుస్తా' నంటూ లేచి వెళ్ళాడు. వెడుతున్న అతన్నే క్షణం రెప్పవాల్చక చూసింది లలిత నే ఊహించిన సంరక్షకునికి ఈయనకీ పోలికే లేదు, అనుకుంది.
"రండమ్మాయిగారూ,' అంది రత్తి .
"వెళ్ళమ్మా ఓ గంట నడుం వాల్చు.' అని చెప్పి శరీరాన్ని ఈడ్చుకుంటూ మళ్ళింది వంటావిడ. రత్తీ వెనకాతలే మేడ ఎక్కింది లలిత.
అదొక విడి భాగం లాగా ఉంది. ముందో హాలు. అందంగా అన్నీ సద్ది ఉన్నాయి. దాన్ని అనుకునే పడకగది. ఓ పక్కన బాల్కనీ. గది వెనక వైపు బాత్ రూము కూడా ఉంది. అంతా పరిశుభ్రంగా హుందాగా ఉంది.
'రెండురోజుల క్రితమే -- యిదంతా తమరి కోసం అమర్చాం అమ్మాయి గారూ, బాబుగారన్నారు- మేష్టారోచ్చినా ముందు గదిలో కూర్చుని చదువు కుంటుందని ' అంటూ పడగ్గది లో లలిత పెట్టెలు సరిగా పెట్టడం ప్రారంభించింది రత్తి.
హైస్కూల్లో చదువుకునే ఏ అల్లరి పిల్లో వస్తుందని ఎదురు చూసినట్లున్నారు! అనుకుంది లలిత "నే తోటలో ఉంటాను కావలిస్తే అలా అక్కణ్నుంచి తొంగి చూస్తె చాలు' అంటూ 'రత్తి క్రిందికి దిగింది.
బాల్కనీ లోకి వెళ్లి తొంగి చూసింది లలిత ఓ పక్కగా తోటవాడి పాకా. అటు వైపుగా గేటూ కనీ కనిపించనట్టు చెట్ల గుబురులోంచి కన్పిస్తున్నాయి.
"అమ్మయ్య!' అనుకుంటూ మెత్తని పరుపు మీద నడుం వాల్చింది లలిత... ఇదొక కొత్త బ్రతుకు....ఎన్నాళ్లో? అనుకుంది ...కళ్ళు మూసుకు పడుతుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో మీదికి వంగి రత్తి లేవుతోంది.
'రండమ్మా టిఫిను చేసి కాఫీ తాగి పడుకుందురు గాని. సరళమ్మ గారూ సరస్వతమ్మ గారూ వచ్చినారు.' అంది. లలిత లేస్తుంటేనే పరుపు మీద దుప్పటి సాపు చేస్తూ 'మీరెలా ఉన్నారంటూ ఏం ప్రశ్నలు కురిపించారని , సరళమ్మది ఏం అందంలే . అయినా నీ అంత నాజూకుగా ఉండదు.' అంది ముసిముసిగా నవ్వుతూ.
"నా వయ్యస్సుంటుందా!' కుతూహలంగా అడిగింది లలిత. ఏం లేదు. కంపెనీ కి ముఖం వాచిన తనకి క్కడో జత దొరికితే హాయిగా ఉంటుందని తల పోసింది.
'ఇంకా పెద్దారేనమ్మా' ఆ వేషం అలాంటిది అంటూ దారి తీసింది రత్తి.
లలిత ముందు ముఖం కడుక్కుని తల దువ్వుకుంది. విడుపాటి కురులు లూజూగా వాలుజడలో అందంగా ఉన్నాయి. లేత గులాబి రంగు వేంకటగిరి చీర కట్టుకుంది. పాతకాలం జాకెట్టు తొడిగింది. వెనక బొత్తాలతో అవస్త పడుతుంటే రత్తి తిరిగి వస్తూ యింకా ఇక్కడే ఉన్నారా? అంటూనే కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంది. 'అలా చూస్తావేం కొంచెం మధ్య బొత్తాం పెట్టు.' అని వెనక్కి తిరిగింది లలిత.
బొత్తాం పెట్టి ముఖానికి చేతులు రాసి మెటికలు విరుచుకుంది రత్తి. 'అబ్బ అపరంజి బొమ్మ వెనమ్మా. ఇప్పుడు చూడాలి సరళమ్మ ముఖం." అంది తృప్తిగా.
"నాలుగు రోజులై ఒకటే గోణగోణ మీ గురించి. ఇక్కడి కెందుకు ఏదో స్కూల్లో పెట్టమంటాడు. తల్లీ కూతుళ్ళు. అయ్యో పాపం అత్తయ్య పోయి బెంగ పడి ఉంటుంది -- నాలుగు నెల్లు నా దగ్గర ఉండి చనువేర్పద్దాక బోర్డింగు పెడతానంటారు. గొడవలే -- చూస్తారుగా --" అంటూ గబగబ వెళ్ళింది రత్తి-- వంటావిడతో ఏదో చెప్పాలని దాని ఆత్రం. ఆఖరుసారి ఓసారి అద్దంలో చూసుకుని ముఖానికి కుంకుమ పెట్టుకుని క్రిందికి దిగింది లలిత.
