"నిజం చెప్పాలంటే లీలకి నే నింత గమ్మత్తుగా మాట్లాడతానని తెలియదు."
"చాలామంది మొగాళ్ళంతేనండి. పెళ్ళాల దగ్గిర మేటరాఫ్ ఫేక్ట్ గా ఉండి పైవాళ్ళ దగ్గర జోక్సేస్తుంటారు."
జయప్రద సీరియస్ గానే అన్నాను సుమా అన్నట్లు ఊగింది, నవ్వు తగ్గించి.
"కొంతమంది ఆడవాళ్లెం చేస్తారో నే చెప్పనా?"
"చెప్పండి."
"ఎందుకులెండి..."
"చెప్పండీ, ఫరవాలేదు."
"మీరు ఊండవుతారు."
"డాక్టర్లం మేం ఊండ్స్ చేస్తాం; ఊండ్స్ హీల్ చేస్తాం గానీ మేం ఊండవం."
"మరింకేం? నే చెప్పబోయేది మీరే చెప్పేశారు. మీ వాక్యంలో డాక్టర్లం అన్న ముక్క తీసేస్తే సరి!"
"అమ్మ బాబోయ్! చంపేశారు." జయప్రద నవ్వక మానలేకపోయింది.
లీల కాఫీ పట్టుకొచ్చింది. జయప్రదనీ, ఆయన్నీ ఒంటరిగా వదిలేస్తే వాళ్ళిద్దరూ ఏదో పోట్లాట వచ్చే టాపిక్ మాట్లాడుకుంటారని బరువుగా వెళ్ళింది తను. కొంత టైమ్ ఎలా గడపాలని ఆలోచిస్తే జయకి రెండోసారి కాఫీ ఇవ్వవచ్చు అన్న విషయం గుర్తు వచ్చి, సదుపాయంగా పది నిముషాలు గడిపేసింది. వాళ్ళిద్దరూ కులాసాగా నవ్వుకోవడం చూసి నిజంగానే ఆమెకి చాలా ఆనందం కలిగింది.
"వదినా మరుదులిద్ధరూ ఏదో చాలా హుషార్లో ఉన్నారు. అదేమిటో నా చెవినీ వేస్తే..." నవ్వుతూ అంది లీల.
"నీ చెవిని నా లాంటి వాళ్ళు ఎన్ని వేస్తే ఏం లాభంలే కానీ... ఏమిటి తెచ్చావ్?" అంది జయప్రద.
"తెచ్చిం దేమిటో తరవాత చూద్దురుగాని మీ ఫ్రెండ్ తో మనం చాలా ముఖ్యమైనది మాట్లాడు కొంటున్నామని చెప్పండి..."
"అదేం... మీ రిద్దరూ పోట్లాడుకున్నారా? పోనీ లెండి. ఇదిగో... అమ్మాయ్, విన్నావ్ గా చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం కానీ.... తమరు కాస్త దయచేయండి..." నవ్వుతూనే గుమ్మంవేపు చేయి చూపించింది జయప్రద.
"ఓ......నిరభ్యంతరంగా" అంటూ ట్రేతోబాటు తిరగబోయింది.
"ఇదిగో, లీలోయ్! నిన్ను వద్దన్నాంగానీ.... కాఫీని కాదుగా? రెండు కప్పులు మా ముఖాన పడేసి మరీ పో!"
"మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నాకు చిన్న పని ఉంది. వస్తాను..." కాఫీ కప్పులందిస్తూ అందిలీల.
"వెళితే వెళ్ళు కానీ.....తొందరగా వచ్చేయ్. ఇప్పటికే మీ ఆయనతో వేగలేకుండా ఉన్నాను." నవ్వుతూ అంది జయప్రద.
"పది నిమిషాలకే నువ్విలా అంటే జీవితాంతం వేగాల్సిన న మాటేమిటి? నిజంగా పది నిమిషాల్లోనే వచ్చేస్తాను. పక్కింటావిడ పిలవడం మొదలెట్టి అరగంటయింది" అంటూ వెళ్ళిపోయింది లీల.
"లీల చాలా మంచిదండీ....సరే....ఏమిటో చాలా చాలా మాట్లాడాలన్నంత సీరియస్ గా అన్నారు...ఇప్పుడు చెప్పండి."
"చెప్పడాని కేముందండీ....మీరు మారేజ్ కిచ్చిన ప్రెజెంటేషన్ కి థాంక్స్ చెప్పాలని ఎప్పటినుంచో అనుకొంటూనే మరిచిపోతున్నాను."
"మీరు మమ్మల్ని మరిచిపోయినా, నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోనండి."
"నేను మాత్రం ఎలా మరిచిపోగలను-చెప్పండి?"
"ఇంతకీ విషయం చెప్పారు కాదు..."
"అదే....థాంక్స్ చెప్పాలనుకొన్నాను."
"చెప్పారుగా.....కానీ, ఒక్క విషయం, బావగారూ! మీరు అంటున్నంత నవ్వుతాలకి నేను మీ కది ఇవ్వలేను..."
"పోనీలెండి, మీరు ఎలా ఇస్తే ఏం పోయింది? ఏదో భగవంతుడి దయవల్ల మీ కోరికే నెరవేరింది కదా!"
"భగవంతుడి వల్లో, ఎవరి వల్లో కానీండీ....అటు మీ కోరికా నెరవేరలేదు, ఇటు నా కోరికా నెరవేర లేదు."
"అదేమిటి?"
"ఏమిటేమిటండీ....లీల ఆరోగ్యం చెడినా పిల్లలు పుట్టి ఉంటే మీకు తృప్తి. పిల్లలు లేకపోయినా లీల ఆరోగ్యంగా ఉండడం నాకు తృప్తి....ఈ రెండూ కాలేదుగా?"
"లీల ఆరోగ్యంగా ఉండటం ఏదో నా కిష్టం లేనట్లుగా మీరు మాట్లాడుతున్నారు. ఇది చాలా అన్యాయమండీ!" అంటూ సంభాషణ పెంచడం ఇష్టంలేదన్నట్టుగా చేతిలో ఉన్న పేపరును విసురుగా మూలకి విసిరేసి వెళ్ళిపోయాడు ప్రభాకరం. జయప్రద నిర్ఘాంతపోయింది.
6
ఇల్లు ఇంకా ఫర్లాంగు దూర మున్నదనగానే ప్రభాకరం బండి దిగి, "వీరన్నా, బళ్ళు జాగ్రత్తగా తీసుకురా" అని పాలేరుకు ఒప్పజెప్పి తొందరగా నడుస్తూ ఇంటికి వచ్చేశాడు.
లోపలికి వస్తూనే ఏదో విషాదం కళ్ళకి పొడచూపింది. గదిలోకి వెళ్ళాడు. అక్కడ లీల పడుకొంది. గదంతా ఆసుపత్రి వాసన, పక్కన స్టూల్ మీద మందులు, గ్లాసులు.
దృశ్యం చూడగానే ప్రభాకరం గుండె వడివడిగా కొట్టుకోసాగింది.
ఏమయింది?
లీల నిద్రపోతూంది. ఆ గదిలోంచి వసారా దాటి ధాన్యపు కొట్టులోకి వెళ్ళాడు. అప్పటి కప్పుడే పెద్దక్క గారు గది ఖాళీ చేయించి పాత ధాన్యపు బస్తాలన్నీ ఒక మూల సర్దించింది.
"అక్కా..."
"వచ్చేశావుట్రా..."
"లీల కేమయింది? ఒంట్లో బాగాలేదా?'
"ఆఁ... మళ్ళీ చచ్చి బతికింది."
అంతే ఆ తరవాత మరి మాటాడ బుద్ధి పుట్టలేదు. తను లేకుండా చూసి ఎవరో దొంగలు పడి ఇంట్లోవన్నీ దోచుకున్నారన్నా ఇంతకంటే తేలిగ్గా ఉండేది. సరిగ్గా ఈ ఆపదలన్నీ తను లేనప్పుడే ఎందుకు జరుగుతున్నాయి?
అయిదు నెల్లయింది. దినం ఇరవై నాలుగ్గంటలూ చాలా జాగ్రత్తగా తోడున్నాడు తను. లీల భయపడుతూనే ఉంది. "నీ కేం ఫర్వాలేదు" అని, "పండంటి బిడ్డను కంటావు" అని ధైర్యం చెపుతూనే ఉన్నాడు.
లీలకి ఒంట్లో బలహీనత కంటే మానసికమైన నీరసం ఎక్కువేమో? లేకపోతే తనింత ధైర్యం చెప్పినా, ఇన్ని మందులు ఇప్పించినా నాలుగో నెల్లోనే మళ్ళీ గర్భస్రావం జరుగుతుందా?
అసలేమైంది? ఎవర్నడగాలి? నిజానికి లీలని తను ఎంతో ఆదరించాడు. సౌందర్యస్వరూపుడైన భగవంతుడు తనకు కరుణించి ఇచ్చిన పూజాపుష్పం లీల.
సృష్టిలో ఆకులకంటే చిగుళ్ళందం. కాయలకంటే పిందె లందం. ఏ జీవరాశిని తీసుకున్నా తల్లికంటే బిడ్డ ముద్దు. తండ్రి గరగర, తల్లి పీచుపీచయినా బిడ్డలు రత్నమాణిక్యాలే కదా!
తను లీలనుంచి కోరింది అతి సహజమైన కనీసపు కోర్కె. అందమైన గాజుబొమ్మలోంచి చిన్న కాంతి కిరణం కావాలనుకున్నాడు. ఆ కిరణం బయటికి వస్తే తన మనసు అద్దమై కాంతిపుంజాన్ని వెదజల్లి తన ఇంటిని తేజోమయం చేస్తుందని తను ఆశ పడ్డాడు. వెలుగును ప్రసాదిస్తుందనుకొన్నాడు.
జీవితంలో తనూ, లీలా ఎన్నో అనుభవించారు. పెళ్ళైన నాటినుంచీ ఆమెకు అతి సుందరమైన దృశ్యాలన్నీ చూపించాడు. ఆమెతో సరిగ్గా వంట టైము దాటాక పెళ్ళయింది. గురువుగారి ఇంటినుంచి రాగానే మిగిలిన పనులన్నీ సాంబం మామయ్యకు అప్పజెప్పి దూరదేశం తిరిగారు. ఏ సుందరప్రదేశానికి వెళ్ళినా, తామిద్దరూ చూసేది ఒకే దృశ్యమైనా తానొక్కడూ చూసేది వేరే దృశ్యం- ఈ లీల తన కీయబోయే పసిడి కాన్క-దాని కాంతులెటువంటి వో?
సరదాగా తాను ఎప్పుడో ఒకనాడు అన్న మాట, దానికి లీల ఇచ్చిన సమాధానం....
"నీ ఆకారం, నా బలం వచ్చే మన పిల్లలు" అంటే, ఆమె "మీ ఆకారం, నా బలం వచ్చినట్లయితే కష్టమేగా!" అంది.
తన ఆశల్ని గౌరవించలేదామె. మాతృత్వం పొందాలన్న కాంక్ష తన కెన్నడూ లేనట్టే ప్రవర్తిస్తూంది. పెళ్ళయిన కొత్తలో తను రెట్టించి అడిగిననాడు, "అప్పుడే ఎందుకు లెస్తురూ?" అని అనేది. క్రమంగా లీలకి భయమే వేస్తున్నది. తమ ఇంట్లో పాప పుట్టితే తానే ఉండదన్నంత భయం లీలకి ఏర్పడి రెండేళ్ళయినట్టుంది.
తాను లీలని మనపట్లా ప్రేమిస్తున్నాడా? ఏమో? లీల అప్పుడెప్పుడో అన్నట్లు.....తనకి లీలపై ఉండే అభిమానమంతా ఆమెకి పుట్టబోయే తన పిల్లలమీద ప్రేమేనేమో?
కానీ.... ఇప్పుడు లీల ఎవరు? తన కామె ఏమవుతుంది? తన దృష్టిలో అనంతకాలం అచంచలంగా నిలువగలిగిన అతి సుందరమైన వస్తువు.....తనతో అయిదు సంవత్సరాలుగా కాపరం చేస్తూ తనని సుఖగిరి శిఖరాలపైన, ఆనందార్ణవపు లోతుల్లోను ఓలలాడించిన ఒక సౌందర్యఖని. తనతో దేశం నలుమూలలకీ, ఊరు నాలుగు వీధులకీ, ఇంట్లో అన్ని ప్రదేశాలకీ తన ప్రాణానికి ప్రాణమై తిరిగి, తనకి హుషారిచ్చిన తన సహధర్మచారిణి...ఏమైనా కావచ్చు కానీ....తన పిల్లలకు తల్లి మాత్రం కాలేకపోయింది. తన పిల్ల తల్లి కానంత మాత్రాన తన కేమీ కాదా?
అనేక కోట్ల దంపతులు ప్రపంచంలో ఒకరి నొకరు ప్రేమించుకొంటూనే ఉన్నారు. "వారు వివాహం చేసుకొని కలకాలం సుఖంగా కాపరం చేశారు" అని ఎన్నో కథలో చివర్న చెపుతారు. ఈ వైవాహిక శుభం వెనక పిల్లల ప్రసక్తి ఉందా? భార్యాభర్తలు ఒకర్నొకరు ప్రేమించుకోవాలంటే వారికి పిల్లలు ఉండి తీరవలసిందేనా? ఇందులో ఏదో మూర్ఖత్వం ఉన్నట్లుంది.
"అలా ఈ పట్టుకు కూర్చోకురా, ప్రభాకరం. ఇంకా నయం కదూ?" అంటూ కాఫీగ్లాసు అందించింది కమల.
ప్రభాకరానికి ఆ గ్లాసు అందుకో బుద్ధి కాలేదు.
"అస లేం జరిగిందక్కా?"
"ఏముందిరా! మామూలుగా కడుపులో తిప్పిందన్నది. షర్బత్ చేసి ఇచ్చాను, వాంతి చేసుకుంది. నీరసం వచ్చి మంచం మీద పడుకొంది. పక్కమీద నెత్తురు చూసి ఖంగారుపడి డాక్టరు సుభద్రమ్మ కు కబురు పెట్టాను. అప్పటికే ఒంటిమీద తెలివి లేదు. వాళ్ళ కారులోనే హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. అక్కడ చిన్న ఆపరేషన్ చేయకపోతే తల్లిప్రాణానికే ముప్పు వస్తుందన్నారు. అంతా నిమిషాల మీద జరిగిపోయింది. మొన్న పొద్దున్న తీసుకెళ్ళిన వాళ్ళు నిన్న సాయంత్రం తీసుకొచ్చారు."
"ఆపరేషనా?" ఆశ్చర్యపోయాడు ప్రభాకరం.
"అవును....ఇంకా కుట్టు ఆరలేదు. సుభద్రమ్మ నిన్న రాత్రంతా ఇక్కడే ఉండి, పెద్ద పెద్ద సీసాలతో మూ డింజక్షన్లు ఇచ్చింది. పెద్ద ప్రాణాన్ని గురించి భయమేమీలేదని చెప్పింది. కానీ..."
"ఇంతయినా నాకు కబురు పెట్టలే దక్కా?"
"కబురు పెట్టినా నువ్వూ నేనూ వచ్చి చేయగలిగిందేమి ఉందిరా ఖంగారే తప్ప? అందుకే అందరూ గొడవ చేసినా నేనే ఊర్కొన్నాను..."
"పోనీ, సుభద్రమ్మ దగ్గరికి వెళ్ళిరానా-ఇంకా ఏమంటుందో?" అన్నాడు ప్రభాకరం.
"ఇంకెవరిదగ్గరికీ వెళ్ళనక్కర్లేదు. చెప్పవలసినదంతా చెప్పే వెళ్ళింది."
ఏమిటన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు ప్రభాకరం.
"ఇప్పటికి గండం గడిచినట్లే కానీ.... నీ కెలా చెప్పాలో నాకు తెలియకుండా ఉంది, తమ్ముడూ..."
"జరిగినవాటికంటే ఘోరాలు ఏముంటాయిలే-చెప్పు..."
"ఘోరమే మరి....ఇంకెప్పటికీ పిల్లలే పుట్టుక పోవచ్చంది. అయిదో నెల దాటేదాకా గర్భం నిలిస్తే కొంచెం ఆశ ఉందని అన్నది" కాఫీ గ్లాసు పట్టుకొని నిర్లిప్తంగా వెళ్ళిపోతున్న అక్కగారి వేపు నిర్ఘాంత పోయి చూస్తూండిపోయాడు ప్రభాకరం. అతని మనసు ఏదో నిద్రలాంటి మగతలో పడి, ఏమీ ఆలోచించలేని స్థితిలో పడింది. శూన్యమైన మనసులో ఏ అనుభవమూ లేదు, ఏ ఆపేక్షలూ లేవు, ఏ ఆవేశాలూ లేవు. అతను సముద్రం మధ్య ద్వీపంలో ఒంటరిగా ఉన్నట్లు ఫీలయ్యాడు.
ఏదో గొంతు నూతిలోంచి-"ఏమండీ!" అని పిలిచినట్లయింది. నాలుగయిదు సార్లు ఆ పిలుపు వినపడినా అది తన పక్కనుంచే వస్తూందన్న సంగతి అర్ధం కాలేదు ప్రభాకరానికి. పక్కకి చూశాడు..... ఆమె మెల్లగా కదులుతూంది...'ఇక్కడ కూర్చోండి' అన్నట్టుగా ఆమె చేతితో సంజ్ఞ చేసింది. అతను కుర్చీలోంచి లేచి, మంచం దగ్గరికి కెళ్ళి నిలుచున్నాడు. మంచంమీద కూర్చో బుద్ధి కాలేదు.
కూర్చోమన్నట్టు మళ్ళీ సంజ్ఞ చేసింది లీల. అతను బలవంతంగా పక్కకి ఒరిగి తగలకుండా కూర్చున్నాడు. అతని చేతి ఆమె చేతిలోకి తీసుకుని నుదుటిమీద పెట్టుకొంది. చల్లగా ఉంది. ఉపశమించ వలసిన బాధ ఏమీ ఉన్నట్టు పైకి కనిపించలేదు. "అక్క చెప్పింది. భయపడకు. ఏ దెలా జరిగితే అలా జరగనీ" అన్నాడు. తన వాక్యాలు తనకే కఠోరంగా వినిపించాయి.
అమెకి ఇంచుమించు ప్రాణాపాయం సంభవించింది. తాను ఆమెను ఊరడించాడా? లేదు. ఎవరో వేదాంతి తత్త్వం చెప్పినట్టు ఉంది. ఆమె చేతినుంచి తన చేతిని మెల్లిగా విడిపించుకొన్నాడు.
ఆమెను సృశించాలని అనిపించడం లేదు. లేచి నిలుచున్నాడు. కూర్చోమన్నట్టుగా ఆమె సంజ్ఞ చేసింది. దుప్పటి కప్పి ఉన్న ఆమె భుజం మీద చేయి వేసి, "నీ కింకా ఒంట్లో బావులేదు. అయినా నువ్వు భయపడకూడదు" అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
