Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 6

                              3    
    ఇంట్లోకి వచ్చేసి నెమ్మదిగా భోజనాల గదిలోకి వెళ్ళాడు శ్రీనివాస్ "పిన్నీ కొంచెం అన్నం పెడతారా?' గొంతు కొద్దిగా హెచ్చించి మరీ అడిగాడు.
    "ఆ యిదుగో వచ్చేస్తున్నాను. నీకూ మీ నాన్నగారికి అలాగే వడ్డించే స్తాను."
    గోపాలం మౌనంగా రెండు మెతుకులు గొంతులో వేసుకుని వాటిని నీటితో లోపలికి పోనిచాడు. శ్రీనివాస్ కి కొత్తగానే వుంది. తండ్రి యిదివరకు ప్రతి పదార్ధానికీ పేరు పెట్టనిదే పీట మీంచి లేచేవాడు కాడు, కాని యివాళ యింత మౌనంగా .....తలెత్తి సుభద్ర వైపు చూడాలని పించింది ఒకే క్షణం. కానీ శ్రీనివాస్ దేనికో భయపడ్డాడు . తండ్రి యేమైనా అనుకుంటే? అవూహ రాగానే సిగ్గు పడ్డాడు కూడా.
    సరస్వతి రావడంతో యింట్లో వాతావరణం కదిలింది.
    "నాకూ పెట్టేయ్యి పిన్నీ! ఆకలిగా వుంది' సరస్వతి అంది. గొంతులో వుండలు కట్టిన బాధ యింట్లో ఎవోక్కరికి తెలియనీయ కూడదు. ఉప్పెనలా దుఃఖం ముంచుకు వస్తోంది శ్రీహరి గుర్తుకు రాగానే. సరస్వతి కి సుభద్ర వడ్డించి లోపలికి వెళ్ళిపోయింది. గోపాలం కంచం ముందు నుంచి లేచి వెళ్ళాడు. వీధిలో కర్ర టకటక మంటోంది. అంటే గోపాలం పొన్ను కర్ర్ర ఎటో దారి తీస్తోంది. సుభద్ర ఆ రాత్రి భోజనం చేయలేదు. తెల్లని మల్లెలు క్రమంగా వెనక్కి వాలిపోయి రాలిపోయాయి. వొకటోకటి గా. సుభద్ర నిస్త్రాణగా మంచం మీద వాలి పోయింది. యెవరితో ఏమని చెప్పుకుంటుంది? భర్త కన్నెత్తి చూడడం లేదంటే ప్రపంచం నవ్వుతుంది. వూళ్ళో నలుగురూ చేరి బుగ్గలు రెండు మధ్యకి అతుక్కు పోయేలా నొక్కు కుంటారు. 'ఏం విడ్డూరం బాబూ. అసలే వ్యసనాల పుట్ట. గోపాలం భార్య ని వదిలి ఉండకేం. చక్కని పెళ్ళాన్ని పక్కన వేసుకుని తిరగడం మనం చూడలేదూ. పెళ్ళాం పోయిన వెంటనే పెళ్లి కొడుకయ్యాడు.'
    'వయసు లో వుంది ఏం తెగులూ' యిటువంటి గమ్మత్తుగా వినిపించే మాటలు చాలా వింది. వినడం లో ఆ రోజు అంత చికాకు అనిపించలేదు కూడా. తనకింతే రాసి ఉందను కుంది. పొతే భర్త తన కొంగు చుట్టూ తిరగడం లో కొంత గర్వం తొణికిసలాడింది. గోపాలం వున్నట్టుండి యిలా అయిపోవడం సుభద్ర హృదయం లో గొడ్డలి పెట్టు లాంటి బాధ అంకురించి వ్రేళ్ళతో సహా లాగేస్తోంది.
    'అమ్మా,' 'అమ్మా, అనుకున్నా అర్ధం కాని బాధ అలాగే విడవకుండా వుండి పోయింది. భర్త కౌగిట్లో ఊర్ధ్వ లోకాల్లో విహరించాలనీ , ఆ సన్నిధి లో పెన్నిధి దొరికినంత ఆనందించాలనీ , తిండికీ బట్టకీ కరువైనా వీటిని మరిపించే భర్త అనురాగ స్రవంతి లో తను కొట్టుకు పోవాలనీ సుభద్ర కోరిన కోరికలు నిలువునా ' ధ్వంసం అయిపోయాయి. తన భర్త కనుసన్నల్లో కరిగిపోవాలనే కోరిక నానాటికీ గగన కుసుమం అయిపొయింది. సుభద్ర అంతర్గతంగా చేలరేగే అనేక రకాల భావాలకి అర్ధం పలికించే నాధుడు లేకుండా పోయాడు. ఆవిడ అంతరంగం లో గోపాలం వయసుతో నిమిత్తం లేకపోయింది. అతని నిర్లక్ష్యానికి సుభద్ర మూగదై పోయింది. సరస్వతి అనవసరంగా సవతి తల్లి ని గురించి అంచనా వేసుకున్నానని బాధ  పడేది. కంటతడి కనిపించనీయ కుండా తుడుచుకుంటుంటే తను స్నేహితురాలిగా అడగాలను కునేది. కానీ సుభద్ర యెప్పుడూ యివ్వలేదు ఆ అవకాశం.
    
                          *    *    *    *
    'పిన్నీ, రాజమండ్రి వెడుతున్నాను. రెండేళ్ళ లో వచ్చేస్తాను. ట్రైనింగ్ అవుతే అర్ధం వుంటుంది. పై చదువు చదివే యోగ్యత యెలాగూ లేదు, 'శ్రీనివాస్ కంఠం లో మాటలు ఆగిపోయాయి బాధ వల్ల. సుభద్ర తలెత్తి అతనికి దగ్గరగా వెళ్లి భుజం మీద చేయి వేసింది. తృళ్ళీ పడ్డాడు శ్రీనివాస్. 'మీ నాన్నతో చెప్పు శ్రీనివాస్. వాడుకోవాల్సిన వస్తువుల్ని పదిలంగా దాచి పెట్టుకుంటే యెప్పటి కైనా అనర్ధం వస్తుందని.'
    "అంటే.'
    "యేవీ లేదు, నాకోసం మీ నాన్న చేయించిన పలక సర్లు అమ్మేయ మన్నాననీ, ఆ డబ్బు  బాంకు లో వేసి నువ్వు కావాలనుకున్న బి.యస్.సి నో, బి య్యే వో చదివించ మన్నాననీ చెప్పు.'
    "పిన్నీ! మీరు.'
    'ఏం భయంగా వుందా?'
    'లెదు పిన్నీ. అందుకు కాదు. నా కసలు ఆ చదువు మీద అంత యింటరెస్టు లేదు. ఎవరి కెంత ప్రాప్తం వుండాలో అంతకు మించి వుండదు. నన్ను క్షమించండి. ఆయన్ని అసలు అడగను నేను.'
    'ట్రైనింగ్ అంటే ఏదో కొంత స్టైఫెండ్ యిస్తారు. చాలు రెండేళ్ళు ఎంతలో గడిచి పోతాయి.'
    గుమ్మం మీద కాలి బొటన వ్రేలితో రాస్తుండి పోయింది సుభద్ర. నిజమే తండ్రి మీద అతనికి ప్రేమ ఉంటుంది. ముక్కూ, మొహం యెరుగని తను మనస్పూర్తిగా అన్నా ఆ మాటలు శ్రీనివాస్ కి నమ్మకం కలిగించవు.'
    'సరే నేనే మీ నాన్నను కనుక్కుంటాను.'
    సుభద్ర గిరుక్కున తిరిగి వెళ్ళింది భర్త గదిలోకి. సుడిగాలి లా వచ్చే సుభద్ర ను చూస్తుంటే గోపాలానికి భయం కమ్ముకు వస్తోంది. తనని అనరాని మాటలు అంటుందనీ, తన మీద దౌర్జన్యం చేస్తుందని బెంగ అసలు యే మాత్రం లేవు. సుభద్ర లో రగిలే కోపం చల్లారి పోయి తనని అంటి పెట్టుకుని వదలకుండా వుంటే యింత కన్నా మరో దారి వుంటుందా అనేదే అతనిలో తెగని సమస్య.
    'చూడండి.'

                          
    గోపాలం యిటు తిరిగాడు.
    'మీరు నాకు చేయించిన పలకసర్లు యిస్తారా?'
    గోపాలం మాట్లాడ కుండానే బుర్ర వూపాడు 'సరే' అన్నట్లు.
    'అది అమ్మేయాలి.'
    గోపాలం మళ్ళీ తల వూపాడు.
    'ఆ డబ్బుతో శ్రీనివాస్ ని చదివించండి. అతనికి చదవాలని వుందట. పనికిరాని యే వస్తువూ యీ యింట్లో అంటే మీ దృష్టి లో వుండడం నాకు యిష్టం లేదు. నేను మీ భార్య ని కాలేనపుడు న్యాయంగా ఆ డబ్బు నాది కాదు. కానీ అతన్ని చదివించాలి, యేమంటారు?'
    'నీ యిష్టమే. యేది జరిగినా అది నీకోసం. సరే సుభద్రా.'
    'అయితే రేపే విషయం తేల్చుకోండి.'
    'అలాగే శ్రీనివాస్ తో కబురు చేయి.'
    'దేనికి?'
    'మీ నాన్నకి చెప్పి చేస్తే మంచిది సుభద్రా. తరువాత నేనే బలవంతంగా లాక్కున్నానని వాళ్ళు బాధపడవచ్చును.'
    'అలాగే పంపుతాను.'
    శ్రీనివాస్ యెప్పుడూ ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ కూడా చొరవ తీసుకోడు. సరస్వతి సున్నితంగా నవ్వుతూ సుభద్ర భుజం మీద చెయి వేసింది. 'పిన్నీ నిన్ను గురించి చాలా చెడ్డగా అనుకున్నాను. నీ మంచితనం తెలుసుకుంది కి చాలా రోజులు పట్టింది సుమా'
సుభద్ర వంట యింటి గోడకు చేరగిల బడి సరస్వతి మాటలు వింది. నిర్వేదావస్థ లో వున్న పిన తల్లిని చూడగానే సరస్వతి మనసు తరుక్కు పోయింది.
    'లే పిన్నీ భోజనానికి.'
    'వొద్దు సరస్వతీ నాకు ఆకలిగా లేదు.'
    'నీ బాధవిటో చెప్పు పిన్నీ. యెప్పుడూ నవ్వుతుండే దానివి. ఉన్నట్టుండి ఎందుకిలాగ అయిపోయావు? అన్నయ్య గానీ, నన్నగానీ ఏదైనా అన్నారా? చెప్పు పిన్నీ. నేను తప్ప యెవరు న్నారు చెప్పుకుందుకి చెప్పు పిన్నీ.'
    సరస్వతి పదేపదే అడుగుతుంటే ఉప్పెనలా పొంగుకు వచ్చింది దుఃఖం. పెదాలతో అదిమేస్తూ మాట్లాడకుండా వుండిపోయింది సుభద్ర.
    గోపాలం మనసు పెండ్యులంలా వూగుతోంది . అతని మనసులో మాటలకి ఒక దానితో వొకటి సంబంధం లేకుండా, పొత్తు కుదరకుండా దొర్లిపోతున్నాయి. సుభద్ర తన పక్కనే రెండు గజాల దూరంలో తలగడ లో తలదూర్చి కుళ్ళికుళ్ళి ఏడుస్తుంటే తన వైపుకు తిప్పుకుని రెండు చేతుల్తో బంధించి ' వద్దు సుభద్రా. ఏడవకు నా తల్లివి కదూ' అనాలనిపించేది. సమ్మెట పోటులా మనస్సు వెక్కిరిస్తూనే వుంది. 'నువ్వు నిలువునా నాశనం చేశావు' అనేది అంతరాత్మ. ఆ యేడుపు వినిపించకుండా చెవుల చుట్టూ ముసుగు తన్ని ముడుచు కు పోయేవాడు . వొక వ్యక్తిని యింత అన్యాయం చేసి తను హాయిగా వుండడం అతనికే నచ్చలేదు.
    గోపాలం మరో మెట్టు మరో మెట్టు క్రిందికి కూలిపోతున్నాడు చివికి పోయిన సౌధం లా.
    'మీ కాళ్ళు పట్టుకుంటాను. జరిగినదేదో జరిగిపోయింది. మన బాంధవ్యం మన మధ్య తప్ప మరొకరికి వరకూ పోయే ఆస్కారం లేదు. ఎందుకీలా చేస్తున్నారు? ఎవరి మీద సాధిస్తున్నారు కక్ష. నేనేం పాపం చేసుకున్నాను?'
    'ఈ తాగుడు మీకు వొద్దు. నేను ఎంతో చిత్ర వధ అనుభవిస్తున్నాను. యింకా దేనికి రంపపు కోత కోస్తారు నన్ను. మీ పిచ్చి పిచ్చి మాటలతో , మీ కైపుతో నేను హింస పడిపోతున్నాను.'
    విచిత్రావస్థ లో నోరు మూత వేసుకునే వాడు. కాస్సేపు ఆగి మరీ అనేవాడు. 'నేను చేసింది ఘోరమైన పాపం. నన్ను నేను మరిచిపోనీ సుభద్రా. ఈ మైకం లో కొంచెం ప్రశాంతత మిగులుతోంది నాకు. డాన్ని సర్వనాశనం చేసుకుంటే యింక అట్టే రోజులు బ్రతుకుతాననే నమ్మకం లేదు నాకు', అన్నాడు గోపాలం.
    గుప్పిళ్ళ మధ్య ఖంగుమని బెదిరిపోయే మంగళ సూత్రాల్ని గట్టిగా మరీ గట్టిగా పట్టుకుని గోపాలం కాళ్ళ దగ్గర కూర్చుండి పోయింది. కంటి నీరు ధారగా వర్షం లా కారుతోంది, 'మేం పేదవాళ్ళం వొప్పుకుంటున్నాను. మా నాన్న నాకు చేసింది న్యాయమో, అన్యాయమో దేవుడు గుర్తించాలి. నా పట్ల అది అన్యాయమే అనిపిస్తే మీరు మరీ నరకాన్ని చూపిస్తున్నారు. భర్తగా మీ బాధ్యత తిండి పెట్టడం కాదు. నేను....నేను చాలా.....సుభద్ర చెప్పదలచు కున్న మాటలు మింగుడు పడిపోయాయి.
    'నన్ను కొన్నాళ్ళు యిలా వుండనివ్వు సుభద్రా. నా మనసులో ముసురుకొన్న భయాలూ, ఆందోళన లూ, చీకటు లూ వొక్కసారి త్వరలోనే అంతం అయిపోతాయేమో?'
    'యేమండీ,' సుభద్ర భోరున యేడ్చేసింది. గోపాలం తనని యింకా యెందుకిలా మాటలతో తూట్లు పొడి చేస్తున్నాడు. తనకి ....తనకింతే రాసి వుంది. అనుభవించాలి : 'సుభద్ర వాదించలేదు. మంచో చెడో-- న్యాయమో, అన్యాయమో నలుగురు పెద్దల సమక్షం లో నిండుగా వున్న పందిరిలో 'నాది' అని కన్నె చెర విడిపించిన గోపాలం తనకి భర్త కాక పోడు. కానీ అతని తదనంతరం తన నొసట శాశ్వతంగా నిలవాలనుకున్న కుంకుమ రేఖలు జారి పొతే ...శూన్యమైన బ్రతుకులో ఏం బావుకోవాలని తనీ ప్రయత్నం చేయడం . పోనీ తానే ఆత్మహత్య చేసుకుంటే?సుభద్ర బేల మనసు మరీ దిగజారి పోయింది. తనని అర్ధం చేసుకోలేదు ఏ ఒక్కరూ యీ యింట్లో.
    నిద్రలో గోపాలం మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. 'తప్పే చేశానురా. పిల్ల అందం చూసి ఆశపడి ఎంతో దగా చేశాను. మనశ్శాంతి లేకుండా యిలా అయిపోయాను .
    'యేవండీ ?' సుభద్ర మనసు తహతహలాడింది. తనతో అనుబంధాన్ని పెంచుకున్న మనిషి ని తనెలా నిర్దాక్షిణ్యంగా నిర్లక్ష్యంగా వదిలించుకో గలదు?
    'ఆ' నిద్రలోనే 'వూ' కొట్టాడు.
    'కొంచెం మంచి నీళ్లు యివ్వనా?'
    'ఆ.'
    సుభద్ర లోపలికి వెళ్ళింది. రాత్రి పన్నెండు గంటలు దాటిపోయింది. శ్రీనివాస్ దీపం ముందు నిశ్చలంగా కూర్చుని దీర్ఘంగా చదువు తున్నాడు. అతను శ్రద్దగా మరీ శ్రద్దగా చదువుతున్నాడు. సుభద్ర త్యాగం అతన్ని వెన్నంటే వుంది. అప్పుడే గోపాలంతో పెద్ద పేచీ పడింది శ్రీనివాస్ చదువు విషయం లో : 'నగలూ, నాణ్యాలూ నన్ను రక్షించవు. పోతూ పోతూ యివన్నీ నేను వెంట వేసుకుని వెళ్ళను శ్రీనివాస్ చదువుకన్నా యివేం పెద్ద ముఖ్యం కావు. అతన్ని చదివించే శక్తి మీకు లేకపోతె నాకు వుంది.' అంది వున్న మరో రెండు జతల గాజులు తీసేసి అతని చేతికి యిచ్చేస్తూ.
    
                          *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS