Previous Page Next Page 
మారిన విలువలు పేజి 6

                                   

    ఆ పరిస్థితుల్లో తన ఉద్యోగం విషయం ప్రస్తావించడం లో లాభం లేదనుకొంది జానకి. బయట పడిన నాడే చెప్పచ్చులే అనుకొంది. మూడవ నాటికే ఆ విషయం అన్నకు తెలిసిపోయింది.
    "ఈ అండ చూసుకోనా అంతలా రెచ్చిపోయావు?"అన్నాడు అన్న.
    "ఆడపిల్ల ఇలా ఉద్యోగం చేయడం మన ఇంటా వంటా లేని పనే. నీకిదేం పాడు బుద్దే! నీ అత్తగారి చెవిని పడితే ఎంత అప్రతిష్టే?"అని కళ్ళ నీళ్ళు పెట్టుకొంటూ బుర్ర మొత్తుకోన్నది తల్లి.
    "నేను నలుగురి లో పరువుగా బ్రతుకుతున్నాను. నా పరువు ప్రతిష్టలు మంట కలిపేవు. వీధిలో నేను తలెత్తు కోలేని పని చేసేవు. పెళ్ళయిన పిల్లని నీకిదేం బుద్దే!"
    "నువ్వు బుర్ర దించు కోవలసిన పని నేనేం చెయ్యలేదు, అన్నయ్యా! ఒకవేళ అటువంటి పరిస్థితి ఏర్పడితే, అది ఇరవయ్యో శతాబ్దపు ఉత్తర భాగంలో నువ్వీ మాట అంటున్నందుకు " అని ఎత్తి పొడిచింది జానకి.
    చెల్లెలు ఉద్యోగం చెయ్యడం సూర్యారావు కు ఏమాత్రం ఇష్టం లేదు. ఆమె ప్రతిఘటనకు ఆగలేక అప్పటి మటుకు నోరు మూసుకున్నాడు. సమయం దొరికినప్పుడల్లా సణుగుతూనే ఉండేవాడు. పని ఒత్తిడి వల్ల జానకి కాస్త ఆలస్యంగా వస్తే సవాలక్ష కారణాలు చెప్పుకోవలసి వచ్చేది. ఇంత చెప్పుకొన్నా, "తిరుగుడు నేర్చిన ఆడది చెడుతుందని ఊరికే అన్నారా ?"అనే వాడు.
    "తిరక్కుండా ఇంట్లో  కూర్చుని కూడా కొందరు చెడిపోతున్నారు" అనేది జానకి.
    "ఊసర వెల్లిలా ఒక్కొక్క రంగూ అప్పుడే కనిపిస్తున్నది. ఇదివరలో ఇంట్లో వాళ్ళ మాటలకి ఇలా ఎదురు జవాబు చెప్పేదానివా?" అని నిలదీసేవాడు సూర్యారావు.
    "ఇంట్లో వాళ్ళు సరియైన మాట చెప్తే ఇప్పుడు కూడా ఎదురు చెప్పవలసిన అవసరం కలగదు, అన్నయ్యా' అనేది జానకి.
    ఏది ఏమైనా, ఎవరు ఏమనుకొన్నా తను ఉద్యోగం మానకూడదనే నిశ్చయానికి వచ్చింది జానకి. తల్లీ కన్నీళ్ళు, అన్నగారి ఆర్భాటాలు, ఇరుగు పొరుగుల హేళన లు ఏవీ కూడా ఆమె నిశ్చయాన్ని సడలించలేక పోయేయి. జానకి మొదటి నెల జీతం పుచ్చుకొన్న వాడే ఆమె అటువంటి నిశ్చయానికి రాగలిగిన సంఘటన జరిగింది.
    సాయంకాలం ఇంటికి వచ్చేసరికి పెద్ద తమ్ముడు సంబశివం దిగాలు పడి కూర్చున్నాడు. తన మనసులోని బాధను పైకి కనిపించకుండా దాచుకోడం లో మొనగాడని తను భావిస్తున్న సాంబు ఆ విధంగా ఉండడంతో జానకి అయోమయంగా అతని వైపు చూసింది.
    "ఏమిటిరా, సాంబూ? ఏమయింది?' అన్నది దగ్గరగా వచ్చి.
    "ఏం లేదక్కా!" ముఖం అటు తిప్పుకున్నాడు.
    "చెప్పరా. నాతొ చెప్పింది కేం?"
    "........."
    "అన్నయ్యే మైనా అన్నాడా?" తమ్ముణ్ణి బుజ్జగించింది.
    అప్పటికీ సాంబు మాట్లాడ లేదు.
    "ఏమిరా, సాంబూ?ఆపాటి నీకష్టం పంచుకొందికి తగనుట్రా? మీరంతా నన్నెందుకిలా వేరు చేస్తున్నారు?" అన్నది బాధగా జానకి.
    "అలాగేం అనుకోకు అక్కా. చెప్పిందికి కూడా ఏం లేదు. రేపు ఫైను తో కూడా టర్మ్ జీతం కట్టిందికి ఆఖరి రోజు. ఎలా అవుతుందా అని ఆలోచిస్తున్నాను."
    'అన్నయ్యతో చేప్పేవా?"
    "పది రోజుల కిందటే చెప్పెను. ఈ రోజు మళ్ళా జ్ఞాపకం చేసెను."
    "ఏమన్నాడు?"
    "అప్పటి నుండి ప్రయత్నం చేస్తున్నాను. సందర్భం కాలేదు రా. ఏం చెయ్యాలో తోచకుండా ఉంది అన్నాడు. వాడు మాత్రం ఎక్కడి కని తెస్తాడు? అంతా వాడి మీద పడి తినేవాళ్ళమే-- " ఆ మాట అన్నాక తన తప్పు తెలుసుకొన్నాడు సాంబశివం.
    "నువ్వుతప్ప ' అన్నాడు అక్క వైపు చూస్తూ.
    "ఇక ముందు మాటేమో కాని, ఇప్పటి వరకు నేనూ అంతే" అన్నది జానకి తేలికగా నవ్వుతూ.
    "వదిలే, సాంబూ! ఇంకా రేపల్లా టైముంది కదా? ఎలాగో లాగ కట్టేద్దాం. నువ్వేం గాభరా పడకు" అన్నది.
    ఒక్కరోజు గడువియ్యమని ప్రిన్సిపల్ గారిని బ్రతిమిలాడ వెళ్ళిన సూర్యారావు , జీతం సొమ్ము చెల్లించిన విషయం కాషియర్ నోటి మీదుగా విని క్షణకాలం ఆలోచనలో పడ్డాడు.
    "ఎవరు వచ్చి సొమ్ము చెల్లించేరు?" అని ప్రశ్నించేడు.
    "ఎవరో అమ్మాయి."
    అంతలోనే ఆ అమ్మాయి ఎవరో సూర్యారావు కు అర్ధమైంది. మనసులో తేదీలు లేక్కవేసుకుని ఒక నెలయింది అనుకొన్నాడు. నా బ్రతుకు ఇంతకు దిగ జారిందా అని బాధపడ్డాడు. ఉద్యోగం వద్దని తను వ్యతిరేకిస్తున్న చెల్లెలి మొదటి నెల జీతం తన అవసరానికి వాడుకోవలసి వచ్చిందని చిన్నపుచ్చుకున్నాడు.
    సంతోషంగా ఇంటి ముఖం పట్టిన సాంబశివం వీధి గుమ్మంలోనే జానకిని చూసేడు.
    "అక్కా, నువ్వు నా జీతం కట్టేవా?" అన్నాడు ఆనందంగా.
    "అవునురా. నిన్ననే నా జీతం అందింది. మరి కొంత సొమ్ము అడ్వాన్సు గా తీసుకొన్నాను." అన్నది జానకి, ఇందులో ఆశ్చర్యపడవలసిన సంగాతేమున్నాదన్నట్లు.
    అక్కకు ఎన్నో విధాల తన కృతజ్ఞత తెలుపుకోవాలనుకున్నాడు. సాంబశివం. కాని ఒక్క మాట కూడా అతని నోటంట రాలేదు. ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తే ఎంత మంచిదో అన్నతో వాదిద్డామనుకున్నాడు. కాని ఎక్కడ మొదలు పెట్టాలో ఎలా అంతం చెయ్యాలో అతనికి తోచలేదు.
    'అక్కా!' అని మాత్రం అన్నాడు జానకి చేతులు పట్టుకుని, అతని కళ్ళలో నీళ్ళు నిలిచాయి.
    తనకన్న రెండేళ్ళు చిన్నవాడైనా, చిన్నన్నగారిలా మరి రెండు గుప్పెళ్ళ పొడుగుతో ఎర్రగా, అందంగా ఉన్న తమ్ముడి వైపు చూసింది జానకి. ఆడపిల్లలా అతి సుకుమారంగా లేత గులాబి వర్ణం తో చిక్కితే పాలు  కారుతాయన్నట్లున్న బుగ్గల మీదుగా రెండు కన్నీటి బొట్లు జారిపడ్డాయి.
    ఒక చిన్న పరిహాసాని- బుగ్గలు ఎర్ర చేసుకొని, ఆ రక్తిను మరుగు పరచడానికి తలదించుకునే తమ్ముణ్ణి చూసి , మరీ ఇంత సుకుమారం ఏమిటి? అనుకొనేది జానకి.
    "చిన్నప్పుడు తాగిన ఉగ్గు, పాలు ఇంకా మరిది గారి బుగ్గల్ని వదలనంటున్నాయి" అని పరిహాసం చేసేది వదిన గారు కనకం.
    "మరీ అంత మెత్తగా , ముట్టుకోకుండానే కందిపోయినట్లుంటే, ఏ ఆడపిల్లా నీ ముఖం చూడకుండా ఉండాలి. కాస్త కరుకు గాను, మరికాస్త గంభీరం గాను ఉండాలి." అనేవాడు ప్రకాశం.
    "పోనీలేరా ! చిన్నన్నయ్య ని ఏ ఆడపిల్లా చూసి వరించక[పోయినా, నిండా భూమికి అయిదడుగుల ఎత్తైనా లేని తను పొట్టి బుడంకాయ అవతారం చూసి ,ఆడపిల్లలంతా నీ వెంట వెంటనే తిరుగుతారులే" అనేది చెల్లెలు శాంత.
    ఎవరు ఎన్ని మాటలన్నా పెదవి కదపక , నిదానంగా తప్పుకుపోయేవాడు సాంబశివం.
    ప్రాయం వచ్చిన సాంబశివం కళ్ళలో నీళ్ళు చూసిన జానకికి చిన్నతనంలో అమ్మ కొడితే తన దగ్గరికి వచ్చి, "అక్కా, అమ్మ కొత్తింది" అనే తమ్ముడు జ్ఞాపకం వచ్చేడు. ఈనాడూ అదే ఆప్యాయతతో 'ఛీ! కళ్ళ నీళ్ళు పెట్టుకోడం ఎందుకురా , సాంబూ!" అని తన చీర కొంగుతో ఒత్తింది.
    సూర్యారావు మూలంగా అంతకు పూర్వమే సుందరమ్మ జరిగిన సంగతి తెలుసుకొంది. ఒక్క క్షణ కాలం ఆమె హృదయం ఆనందంగా కేరింతలు కొట్టింది. ఈ ఇరుకు గది నిండా చల్లని గాలి నిండి పోరలుతున్నట్లు సంతృప్తిగా , తేలిగ్గా ఊపిరి పీల్చుకొంది. అది అంత మాత్రమే. మరుక్షణం లో పరువు మర్యాదల కోసం పాకులాడే మామూలు సుందరమ్మ అయిపొయింది.
    "ఏమిటోనమ్మా ఈ కాలంలో ఏది మంచో , ఏది చెడ్డో తెలియకుండా పోతున్నది. పెద్దవాళ్ళు మంచి అనుకున్నదానికి పిల్లలు దుమ్మెత్తి పోస్తారు. ఇంక పిల్లలు చూసే మంచి చెడ్డలు పెద్దలకి అరక్కుండా తయారవుతున్నాయి. కళ్ళు మూసుకొని బ్రతుకులు గడుపుకు పోవలసిన తరుణం వచ్చింది నాలాటి వాళ్ళకి. ఏమనుకొందికి మనమెవరం? అంతా దైవనిర్ణయం." అనుకోని మనసును సరిపెట్టుకుంది సుందరమ్మ.
    ముఖం ఎదురుగా తనతో అనకపోయినా అని తనను ఉద్దేశించి అన్న మాటలే అన్న సంగతి జానకి గ్రహించింది. తల్లి ధోరణి లో వచ్చిన మార్పుకి ఆమె మనసు కాస్త తేలికపడింది.
    ఎంత గొప్ప సంఘటన అయినా నలుగురి నోళ్ళలో పడి, నాలుగు రోజులు గడిచేసరికి పాతబడి అలవాటుగా మారిపోతుంది. అటువంటిది జానకి ఉద్యోగం అనగా ఏం మహా గొప్ప విషయమని కలకాలం కొత్తగా నిలిచిందికి!"
    మొదట్లో అన్నతో పాటు తిండి తిని పనిలోకి పోతున్న కూతుర్ని చూసి సుందరమ్మ కళ్ళుఒత్తుకోని రోజు లేదు. "నా తల్లీ! సిరిసంపదలతో , పిల్లా పాపలతో మూడు పువ్వులూ, ఆరు కాయాలుగా ఉండవలసిన ఈ వయస్సులో ఈ ఉద్యోగం ఎక్కడ దాపురించిందే నీకు!" అనేది.
    సాయంకాలం అలసిపోయి వాడిన ముఖంతో ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి, "మగాళ్ళ తో పాటు ఆడాళ్ళు తగుదునమ్మా అంటూ ఉద్యోగాలకైతే ఎగబడతారు కాని, వాళ్ళ కున్న బలం ఓర్పు ఉండద్దూ? కాస్త ముఖం కాళ్ళు చేతులు కడుక్కునిరా. తాగింది కేమైనా ఇస్తాను." అని ఓదార్పుతో కలిపిన చీవాట్లు పెట్టేది.
    ఆర్ధికంగా కాస్త ఒడుదుడుకులు తగ్గినా సూర్యారావుకు జానకి ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదు. ఇంట్లో ఏ ఖర్చు కైనా ఆమె సొమ్ము ఇచ్చిననాడు తన అసమర్ధతను చెల్లెలు వేలెత్తి చూపుతున్నట్లు బాధపడేవాడు.
    "మా ఇంట పుట్టిన ఆడపిల్లకి ముగ్గురు అన్నదమ్ములం ఉండి, ఆపాటి తిండి పెట్టలేకపోము. నీ కడుపుకి నువ్వు గడించుకోనక్కర లేదు. అత్తారింటికి వెళ్ళకపోతే ఇంట్లో అమ్మకి సాయంగా ఉండు" అనేవాడు సూర్యారావు.
    "అమ్మకి వదిన సాయంగా ఉంది , అన్నయ్యా! నన్ను నీకు సాయంగా ఉండని. నీ రక్తం పండుకు పుట్టినందుకు నీ బరువు బాధ్యతల్లో నన్నూ కాస్త పంచుకొని" అనేది జానకి.
    "నీ కేమయ్యా , నిక్షేపంలా గడించి పెడుతున్న చెల్లెలు ఉండగా? అందరికీ అటువంటిఅదృష్టం కలిసోస్తుందా?" అనేవారు తోటి గుమాస్తాలు వ్యంగ్య ధోరణి లో.
    అదృష్టమా, దురదృష్టమో ఈ రివాజు జానకీ తో ఆగిపోవాలి. శాంతకు తగిన సంబంధం చూసి వెంటనే పెళ్ళి చెయ్యాలని అనుకొన్నాడు సూర్యారావు.
    
                             *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS