Previous Page Next Page 
నిష్టూర ప్రేమ పేజి 6

   
    అత్తయ్య కీ, మామయ్య కి కాఫీ ఇచ్చి, రెండు కప్పుల్లో మంజులకీ, మాధవరావు కీ కూడా కాఫీ పట్టుకు వెళ్ళిందామె "థాంక్స్ , ఇందిరా!' అంటూ మంజుల ఉత్సాహంగా కప్పు అందుకుంది. ఇంకా వరండాలో నే నిలబడి ఉన్న మాధవరావు దగ్గిరికి వెళ్లి నుంచుంది కప్పుతో సహా. దృష్టి రోడ్డు మీదనించి మరల్చి, అతను ఇందిర చేతిలోని కాఫీ కప్పు అందుకున్నాడు మాట్లాడకుండా. అతను కాఫీ పూర్తీ చేసేవరకూ అక్కడే నుంచుంది ఇందిర రోడ్డు మీదికి చూస్తూ.
    ఖాళీ కప్పు అందుకున్న ఇందిర మీద చూపు నిలిపి , అతను అన్నాడు "ఇంక నేను వెడతాను. ఇంట్లో చెప్పండి." "ఉహూ! భోజనం చేసి వేడుదురు గాని , కాసేపు విశ్రాంతి తీసుకోండి లోపల" అంది ఇందిర సౌమ్యంగా , అలసిపోయిన అతని మొహం చూస్తూ.
    "అనవసరపు శ్రమ మీకు ఎందుకు? నే వేడతాను. మీకు చాలా పని ఉంది అసలే" అంటున్నా అతని మాటలు వినిపించుకోకుండా ఆమె అంది? "మీరు లోపలికి పోయి కూర్చోండి. ఇక్కడ చల్లబడుతుంది."
    అతని కింకేం మాట్లాడ్డానికీ అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది ఇందిర అక్కణ్ణించి . ఆమె వెళ్ళిన వంకే కాసేపు చూసి, మెల్లిగా లోపలికి పోయి మంజుల కూర్చున్న చోట కూర్చున్నాడు. ఇద్దరూ చాలాసేపు అలాగే కదల్లేదు. ఇందిరే వచ్చి తలుపు తీసింది. లోపలికి వస్తున్న నాయర్ ను చూడగానే భగ్గుమంది మంజుల. ఇందిర మంజులను వారించి వివరాలదిగింది. నాయక్ కి దూరపు బందు ఒకావిడ పోయిందిట హటాత్తుగా శరీరాన్ని మోయ్యడానికి పోవలసి వచ్చిందని చెప్పాడు. వెంటనే స్నానం చేసుకుని వంట ప్రయత్నం చేయమని చెప్పి ఇందిర అక్కడే కూర్చుని , వాళ్ళ విహార యాత్ర విశేషాలడిగింది మంజులను.
    "అమ్మ కాలు బెణకడం , నాన్నగారి తలనొప్పి ఆదినారాయణ రావు గారి భార్య సణుగుడు తప్ప చెప్పుకోదగిన విశేశాలెం లేవు" మంజుల విరక్తి గా అంది.
    "మీ అభిప్రాయం ఏమిటి?" మాధవరావు ను అడిగింది.
    "చివరికి కొంచెం గలభా జరిగినా , మొత్తం మీద చక్కగా గడిచింది" అన్నాడతను గోడ మీది కేలండరు వంక చూస్తూ.
    "అది మీరే చెప్పాలి, మహాశయా . వెళ్ళినప్పటి నించి ఇప్పటి దాకా ఇరవయి మాటలు మాట్లాడితే ఒట్టు, ఇందిరా. ప్రపంచపు బాధ్యత అంతా తానె చేతున్నట్టు కూర్చున్నారు కానీ, పిక్ నిక్ కి వెళ్ళిన సరదా కాగడా పెట్టి వెదికినా కనబడలేదు." దుడుకుగా అందుకుంది మంజుల.
    "వాసన్ రాలేదా?"
    "ఉహూ" అంది మంజుల అందుకు కూడా మాధవరావే బాధ్యుడన్నట్టు.
    "మీ అత్తయ్య కేలా ఉంది? డాక్టరు ను పిలవ మంటారా?" మాట మార్చాడతను.
    "అక్కర్లేదు ! ఒళ్ళు నొప్పులకు మందిచ్చాను . తెల్లారేసరికి తగ్గిపోతుంది." ఇందిర అంది.
    "అయితే నే వెళతాను, మంజులా . అదృష్టం కలిసి రాలేదు , ఏం చేస్తాం? నామీద ఎక్కువ కోపగించుకోక. ఆజీర్ణం చేస్తుంది" అంటూ లేచాడతను. గుమ్మం దాకా సాగనంపింది ఇందిర.
    "థాంక్స్ ఫర్ ద కాఫీ -- బై" అని త్వరత్వరగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. కాసేపటికి కారు స్టార్టు చేసిన చప్పుడయింది. వెళుతూ తన వంక చూస్తాడేమోనని ఎదురు చూసింది కానీ, క్షణం లో అదృశ్య మైంది కారు, మాధవరావు ను తీసుకుని. మెల్లిగా నిట్టూర్చి గదిలోకి వచ్చింది.
    "ఈయనకి యమ మూడ్స్ , బాబూ. ఇంత మూడీగా ఉంటాడని నాకయితే ఇప్పటి దాకా తెలియదు. తెలిస్తే చస్తే వెళ్ళేదాన్ని కాదు. బోరు కొట్టేసింది" అంది మంజుల.
    తను మధ్యాహ్నం ఎంతో కులాసాగా గడిపిన విషయం చెప్పాలని ఉన్నా, అది సమయం కాదని ఊరు కుంది ఇందిర.

                              *    *    *    *
    ఆ రాత్రి భోజనాలయి పడుకునేసరికి పన్నెండయింది. శరీరానికి, మనస్సు కి కూడా చాలా శ్రమ కలిగినందు వల్ల చప్పున నిద్ర వస్తుందని ఆశించిన ఇందిర కళ్ళు నాలుగున్నర దాకా మూత పడలేదు. ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. లేచి ఏదేనా చదువుకుంటూ కూచుందామా అంటే పక్క మంచం మీద పడుకున్న మంజులకు నిద్రాభంగమవుతుందని ఊరుకుంది. ముందు హాల్లోకి పోవడానికీ వీల్లేదు. చలికాలం మొదలవగానే వరండా మాని, నాయర్ హాల్లో పక్కవేస్తాడు. పాడు డిల్లీలో మనిషి కోక గది కావాలంటే సాక్షాత్తూ బిర్లా అయి పుట్టాలి. అంతకంటే గత్యంతరం లేదు.
    తల అంతా బరువుగా ఉంది. తనకి నిద్ర పట్టకపోవడానికి కారణ మేమయి ఉంటుందా అని ఆలోచించింది ఇందిర. ఆ రాత్రి దాకా గడిచిన తన జీవిత చరిత్ర సింహలోకనం చెయ్యడం మొదలు పెట్టింది. డిల్లీ నగరం నడి బొడ్డున ఉన్న ఈ ఇంటిలో ఒక గదిలో పడుకున్న ఇందిర మనస్సుకు తన ఇరవయ్యొక్క ఏళ్ళ జీవితంలో కొట్టవచ్చినట్టు కనబడే అంశాలెం దొరకలేదు. తాపీగా ఎగుడుదిగుడు లేని రోడ్డు మీద సునాయాసంగా నడిచింది. తను కూడా, క్లాసు తరవాత క్లాసు శ్రమ లేకుండా చదువు కుంటూ ఏమ్.ఎ కానిచ్చింది. కష్టం అంటే ఏమిటో తెలియదనే చెప్పుకోవాలి. అమ్మ కోప్పడిందనీ, నాన్నగారు మనస్సు కష్ట పెట్టుకున్నారనీ, అక్క తన కోసం దిగులు పెట్టుకుందనీ బాధ పడటమే తప్ప, జీవితంలో అంత కన్న ఎక్కువ తెలియదు. అలాగనీ సుఖం అంటే ఏమిటో తెలుసుకోడానికీ వీల్లేదు. స్నేహితులతో సినిమాకి వెళ్ళడం లోనూ, అక్కలతో కబుర్లు చెప్పుకోవడం లోనూ అనుభవించిన ఆనందం అతి సామాన్యం. ఎటొచ్చి విశాఖపట్నం లో చదువుకునే రోజుల్లో నిద్ర పట్టని రాత్రుల్లో   సముద్రపు హోరు వింటున్నప్పుడూ , ఎండా కాలంలో మేడ మీద ఆరు బయట పడుకున్నప్పుడు పైన మెరిసే నక్షత్రాలను చూసినప్పుడూ , హైదరాబాదు లో హుసేన్ సాగర్ కి పిక్ నిక్ కి వెళ్ళినప్పుడు పడవ ప్రయాణం చేస్తుండగా , ఆ బోటు జనం ఎక్కువవడం వల్ల ఒకవేపు ఒరిగి అందరినీ సాగరగర్భం లో కలిపినంతపని చేసిన ఆ రెండు క్షణాల్లో నూ జీవితం అనేది భగవంతుడిచ్చిన అమూల్యమైన వరం అని గ్రహించి పరవశం చెందింది.
    జీవితం అమూల్యమైనదని గ్రహించీ కూడా తాను భవిష్యత్తు లో జీవించడం మానుకోదెం? గతాన్నీ , భవిష్యత్తు నూ రబ్బరు తో శుభ్రంగా చెరిపేసి వర్తమానం లో జీవించడం నేర్చుకొంటే నే గానీ తనకు అసలైన జీవితం లో పరిచయం కలగదు. తనకి జీవితంలో కావలసిన వన్నీ ఉన్నాయి. అభిమానించే అమ్మా, నాన్నా అతిగా ప్రేమించే అమృతమూర్తి పెద్దక్కా ఉన్నారు. పెద్దక్క లాంటి వాళ్ళు మనుష్యుల్లో మనకు ఉండే నమ్మకానికి ఎప్పటి కప్పుడు నీరు పోస్తూ ఉంటారు. చిన్నక్కా, తనూ అక్కకి రెండు కళ్ళను కోవచ్చు. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇటువంటి అక్క లభిస్తుందో తనకయితే తెలియదు. తనకి జ్వరాలు వచ్చినప్పుడు రాత్రీ పగలూ పక్కన ఉండి ఎంత సపర్య చేసింది! నిరుపమని ఈ మాధవరావు తిరస్కరించి నపుడు నిరుపమం కంటే కూడా అభిమాన పడింది పెద్దక్క కాదూ ఆ మాటకొస్తే! నీరూ గురించి ఏవో అవాకులూ,మ్ చెవాకులూ అన్నాడని విని అక్క ఎంతో బాధపడింది. అదే మధావరావు ని తనకి తెలుసనీ, మామయ్య వాళ్ళింట్లో తను తరచూ చూస్తుందని తెలిస్తే అక్క ఏమంటుందో! అక్కకి ద్వేషించడం తెలియదు. నీరక్క మొహం మాత్రం అవమానంతో ఎర్రబడవచ్చు. ఏమైనా సరే మాధవరావు కి గుణపాఠం నేర్పాలి. అతన్ని తిరస్కరించి అవహేళన చేస్తే గాని, అతనికి బోధపడదు నీరూ పడ్డ బాధ. అతన్ని తాను మెల్లిగా లొంగదీసుకుని, తనను వివాహం చేసుకోమని కోరేలాగ చెయ్య గలిగితే ఎంత బాగుండును! అప్పుడు మొహం మీద టక్కున చెప్పవచ్చును. "మహాశయా, నీలాంటి నాలుగో రకపు మనుషులను చేసుకోడం ణా కిష్టం లేదు. తమరు పడ్డ శ్రమకి దన్యవాదా" లని.
    "ఎవరో తన్ను బలవంతంగా తాగడం . కొట్టడం చేస్తున్నారని భయంగా కళ్ళు తెరిచిన ఇందిరకు ఎదురుగా పువ్వులా తయారయిన మంజుల కనిపించింది.

 

                               


    'అమ్మ లేవమంది, ఇందూ ." తప్పు చేసిన దానిలా అంది.
    "బాబోయ్, టైమెంత?"
    "ఎనిమిది...."
    "చంపావు , ఇక పరుగెత్తాలయితే....ఔనూ , అత్తయ్య కెలాగుంది?"
    "కాలు కొంచెం వాపు తగ్గింది కానీ, లేవలేక పడుకునే ఉంది."
    గబగబా లేచి ముడీ ముస్తాబూ పూర్తీ చేసుకుని అత్తయ్య ని పలకరించి బయట పడింది ఇంట్లో నించి. బస్సు అందుకున్నాక గానీ ఆమెకు మనః స్తిమితం చిక్కలేదు. రాత్రి కన్న చిత్రాచిత్రమైన కలల బరువుతో మత్తుగా జోగుతూ రోజు గడిపింది. కీట్సు ఒన్స్ చెబుతూ అసందర్భంగా బైరావ్ ప్రసక్తి తెచ్చి, అతని శీలాన్ని తెగ విమర్శించింది. అసలు నైటింగే లు ఒన్స్ లో బైరాన్ ఎందుకు వచ్చాడో తెలియక దూకుడుగా దంచేస్తున్న ఇందిరను ప్రశ్నించే ధైర్యం లేక ఊరుకున్నారా వేళకి విద్యార్ధినులు. కాలేజీ అయిందని పించుకుని సరాసరి ఇల్లు చేరింది పక్క కరుచుకుని నిద్ర పోవాలనే సదుద్దేశంతో. నాయర్ ఇచ్చిన కాఫీ చప్పరిస్తుంటే టెలిఫోను మోగింది. మాట్లాడింది మాధవరావు. అత్తయ్య కేలా ఉందని అడిగాడు.కులాసాయేని చెప్పాక ,అనాలోచితంగా అతన్ని వీలుంటే వచ్చి పొమ్మంది. ఇది విని అతను బహుశా ఆశ్చర్య పడి ఉంటాడు . అందుకనే "ఏమిటి విశేషం?' అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS