Previous Page Next Page 
నీళ్ళు రాని కళ్ళు పేజి 6


    అప్పటికప్పుడే నేను శ్రావణ కుమార్ శలవు కాగితం తీసుకు వచ్చినట్లు ఆఫీసంతా తెల్సి పోయింది.
    "మీ ఇల్లు వాడికేట్లా తెలుసండీ" అన్నాడొకతను.
    "అఫీసుకన్న మీ ఇల్లే అతనికి దగ్గరై ఉండొచ్చు. అన్నాడు మరొక యు.డి.సి .
    "శలవు కాగితం తెచ్చినందు వల్ల తప్పు లేదను కొండి. మనమంతా ఒక ఆఫీసులో వాళ్ళం. కాని వాడితో జాగ్రత్తగా ఉండాలి. అన్నాడొక ఎల్.డి.సి . "మోస్ట్ ట్రిక్కి ష్ ఫెలో ఆండోయ్" అన్నాడు కో టైపిస్ట్.
    నాకూ నవ్వొచ్చింది. పళ్ళ బింకాన ఆపుకున్నాను. "అతన్ని గురించి ఎవరి అభిప్రాయం వాళ్ళు చాలా చెప్పారు. ఇంకా ఎవరైనా చెప్పేవాళ్ళుంటే చెప్పండి. ఒక్కసారే వింటాను. నాకు అతని మీద ఏ అభిప్రాయం లేదు. మనందరం ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాం. ఈ సదభిప్రాయం తోనే శలవు కాగితం తెచ్చాను. మీ శలవు కాగితాలూ తెమ్మంటే మీ ఇళ్ళకు వచ్చి తీసుకుంటాను. పాపం మీరంతా మా ఇంటికి రావటం కష్టం" అన్నాను.
    ఎవరి సీట్ల లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం ఆరున్నర కు శ్రావణ కుమార్ మళ్ళీ మా ఇంటి కి వచ్చాడు. నేను ఆఫీసు నుంచీ వచ్చి పది నిమిషాలైంది. నాన్న కూడా స్కూల్ నుంచి వచ్చారు.
    "శలవు కాగితం ఇచ్చారా" అన్నాడు.
    "ఆహా , ఈరోజు అందరికీ ఇదే అసెంబ్లీ క్వశ్చన్ లా తయారైంది. మిమ్మల్ని గురించి అందరి అభిప్రాయాలు నేను అడక్కుండానే చెప్పేశారు. మీ పాపులారిటీ కి అంజలి ఘటించ వలసిందే' అన్నాను. పైకి నవ్వుతూ చెప్పినా లోపల ఉడికి పోతున్నాను. నాన్న కూడా అక్కడే ఉన్నారు.
    'అదేమిటమ్మా . శలవు కాగితానికే ఇంత గొడవ జరిగిందా< ఏం నాయనా, మీ ఆఫీసులో శలవు దొరకడం కష్టమా ఏమిటి' అన్నారు నాన్న.
    శ్రావణ కుమార్  నా వైపు చూస్తూ అన్నాడు. "ఈ రోజున నాకసలు శలవు అవసరమే లేదు. కాని కొంతమంది ని స్టడీ చెయ్యాల్సొచ్చింది. దానికి ఇదే చిటకా వైద్య మనుకున్నాను. మీ చేత శలవు కాగితం పంపాను, చింతకాయ పుల్లగా ఉంటుందనే అందరి భావం, కాని బాగా పక్వాని కొచ్చి పండితే అంత పుల్లని కాయా కొంత తియ్యబడుతుంది." అన్నాడు.
    నేను వంటింట్లో కి వెళ్లాను. సాయంత్రం రాగానే నాకూ, నాన్న గారికీ కాఫీ ఇస్తుంది అమ్మ. ఆరోజున ఇంకా కాఫీ తాగలేదు. అతని క్కూడా కాఫీ ఇద్దామంటే పాలు లేవు. ఆ ఉన్న కాఫీ నే టూ బైత్రీ చేసి మూడు గ్లాసుల్లో పోసి తెచ్చాను. ఈలోగా నాన్నగారు అతన్ని కుశల ప్రశ్నలు వేస్తున్నారు.
    "కాఫీ తీసుకోండి" అన్నాను.
    "ఇప్పుడే తాగొచ్చానండీ?' అన్నాడు శ్రావణ కుమార్.
    "ప్రొహిబిషన్ ఉన్న ఈ రోజుల్లోనే" అన్నాను.
    "కాఫీకి ప్రొహిబిషనేమిటండోయ్"
    అతని ముఖ కవలికల్ని బట్టి అతను నేనన్నది ఊహించినది తప్పుకునేందుకు ఈ మాటన్నాడని గ్రహించాను, ముగ్గురం కాఫీ తాగాం.
    "నేను జోక్ గా అన్నదానికి జోక్ గా సమాధానం చెప్పారు" ముగ్గురం నవ్వుకున్నాం.
    'అయితే నా శలవు కాగితం దుమారం లేపిందన్న మాట."
    "ఏదో కాస్త కాకపోయినా గాలి ఉంటేనా దుమారం రేగేది. అది లేనప్పుడు ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది." అన్నాను.
    కొంచెం ఇబ్బందిగా చూశాడు.
    "మీ నాన్నగారేం చేస్తూ ఉంటారు. అన్నారు నాన్న.
    ఈయనేదో సంబంధం కలిపేటట్లున్నాడని గ్రహించాను.
    "ఈ లోకంలో విషయాలే మనకు పూర్తిగా తెలీనప్పుడు పర లోకంలో ఉన్న మా నాన్నగారేం చేస్తుంటారో యెట్లా చెప్పేది" అన్నాడు.
    నువ్వు చాలా సరదాగా మాట్లాడతావోయ్. వెరీ గుడ్. వెళ్లిరా" అన్నారు నాన్న.
    బ్రతికానురా భగవంతుడా అనుకున్నాను శ్రావణ కుమార్ వెళ్ళిపోయాడు.
    గుమ్మం అవతల ఉండి పొంచి వింటున్న అక్కయ్య నెత్తి గోక్కుంటూ వచ్చింది.
    "ఈ సంబంధం అయితే బావుంటుంది నాన్నా" అన్నది.
    "ఎవరికే పిచ్చిదానా" అన్నారు నాన్న.
    "సుభా కి" అన్నది.
    నా మనస్సులో ఏ సంచలనమూ కలుగలేదు. నాన్న మనస్సు మూగ బోయింది.
    "ఆ. పెద్ద కూతురు పెళ్లి చేసి తాటాకుల పాకలో కాపురం చేస్తున్నాను. రెండో కూతురు పెళ్లి చేసి ఈ తాహతు లేక చెట్టు కింద....'
    "నాన్నా? ఉగ్రరూపం దాల్చిన శక్తి లా అన్నాను. అంత కోపం, ఆవేశం, క్రోధం ఉక్రోషం ఇంకా ఇంకా ఎమోమివచ్చాయో నాకు తెలీదు. నన్ను చూసిన నాన్న, అక్కయ్య మ్రాన్పడి పోయాడు. అక్కయ్య గజగజ వణికి పోయింది. నాన్నకు నోట మాటరాలేదు. అమ్మ పెరట్లో నుంచి వచ్చింది. ఏమీ అర్ధం కాక దిగాలు పడి నిల్చుండి పోయింది.
    "నేను పెళ్ళే చేసుకుంటే నాకు నచ్చిన వాణ్ని నువ్వు మెచ్చిన వాణ్ని, రూపాయి కట్నం లేకుండా మీ అంగీకారంతో పెళ్లి చేసుకుంటాను. నన్ను గురించి నువ్వు కల్లో కూడా బాధపదక్క ర్లేదు." ఆవేశంతో అన్నాను. అందరి హృదయాలు తేలిక పడ్డట్టు వాళ్ళ ముఖాలే చెప్పాయి.
    టైపిస్టు గా నా సర్వీసు ఒక సంవత్సరం పూర్తయింది. ఒక ఇంక్రి మెంటు వచ్చింది. ఒక ఇంక్రిమెంట్ వచ్చింది.
    నేను బ్రతక లేకపోననే ధీమా కలిగింది. ఉన్న ఉద్యోగం పోదు. ఇంకో సంవత్సరం లో ప్రొబేషన్ పూర్తయినప్పుడు ప్రోబెషనరు నై పోతాను. ఉద్యోగం వేరు. జీవితంలో కలిగే మార్పులు వేరు. ఉద్యోగరీత్యా ఆ పరిధి లో కొన్ని నిబంధన లూ, చట్టాలు ఉన్నాయి. ఆఖరి గీతలో మన ఇష్ట ప్రకారం నిజాయితీ గా ఉద్యోగం చేసి ఆర్ధికంగా, సాంఘికంగా కొంత మనశ్శాంతి పొందవచ్చు. ఏ వ్యక్తీ కయినా ఆర్ధిక స్వాతంత్యం ఉంటేనే ఇతరాత్రా కూడా రాణిస్తాడు. స్వశక్తి మీద గౌరవ ప్రదంగా ఆర్ధిక స్వాతంత్ర్య పు విలువ మనవారి కన్నా ఎక్కువ గానే ఉంటుంది. మానసికంగా ఎంతో సంతృప్తి.
    అటువంటి సంతృప్తి నాలో కలిగినా ఎప్పటి కయినా సాయంత్రం ఇంటికి రాగానే మనస్సు విప్పి చెప్పుకునే "నావారు" అనే వ్యక్తీ ఉండాలనే కోరికకు అంకురం నాకు తెలీకుండానే ఏర్పడింది. పురుష వాంచ కోసం కాంక్షించే కాంక్ష కాదు. సంసార సాగరం లో కాలూని, ఆ సముద్రపు కెరటాలలో స్నానం చేద్దామనీ కాదు, ఒక స్త్రీ గా ఆదర్శ గృహిణి గా జీవితాన్ని మలుచుకుందామనే ప్రాతిపదిక మీద శారీరక వాంచ ని తీర్చి దిద్దు కోడానికే కాదు, ఏదో ఎందుకో ఏమిటో తెలియని ఆకాంక్ష. నేను నా హృదయం విప్పి కబుర్లు చెప్తూంటే మనస్పూర్తిగా విని సంతోషంతో నా అభిప్రాయాన్ని మన్నించి గౌరవించి ఆచరించే వ్యక్తీ కావాలి. అట్లాగే వారి అభిప్రాయాల్ని కూడా మనస్పూర్తిగా విని ఎంతో ఆనందంతో ఆచరణ లోకి తెచ్చి గౌరవంతో అమలు పరుస్తాను. వారి హృదయం లోకి నేనూ, నా హృదయం లోకి వారూ ఎప్పుడూ ప్రవేశిస్తూ తనివి తీరా తృప్తిగా కబుర్లు చెప్పే వారుగా ఉండాలి, శారీరకంగా, మానసికంగా ఆలోచనా పరంగా , అభిప్రాయను సారంగా ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. అలాంటి వ్యక్తీ ఎవరు? తల్లిదండ్రులు కారు,  అక్కా చెల్లెళ్ళు కారు, అన్నదమ్ములు కారు, చివరికి ప్రాణ మిత్రులు కారు. అలాంటి వ్యక్తీ స్త్రీకి భర్త. పురుషుడి కి భార్య. ఇటువంటి దాంపత్యమైతే ఎంత బావుంటుంది?
    వార్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనని ఘనంగా చెప్పే స్వభావం నాకక్కర్లేదు. భర్తను కొంగుకు కట్టుకుని తిప్పగల సాహసము నాకు లేదు. అనుక్షణమూ భర్త కౌగిలిలో కరిగి పోదామనే ఆకాంక్ష నాకు లేదు. నేనూ సంపాదన పరురాలిననే అభిజాత్యం తో భర్తను లేక్కచేయ్యకూడదనే గడుసు మనస్తత్వం నాకు లేదు. భర్త ఆదరణనూ, ఔన్నత్యాన్ని చాటుకుంటూ చుట్టూ పక్కల అమ్మలక్కలతో గర్వంగా, ఠీవి గా మాట్లాడే మనస్తత్వాన్ని నా మనసులో ప్రవేశించనియను. స్త్రీ కుండవలసిన వ్యక్తిత్వాన్ని , గౌరవాన్ని, సాంఘిక విలువనూ, సామాజిక నీతిని సర్వం భర్త పాదాల మీద కుప్పగా పోసి అయన పాద ధూళి ని నేను నెత్తి మీద వేసుకొను. ఇంకా ఏవేవో కోరికలు, అభిప్రాయాలూ ఆదర్శాలూ ఉద్దేశ్యాలూ విమర్శలూ.
    ఇవన్నీ నా జీవితం లో అమలు జరగాలంటే? అలాంటి చేరువైన వ్యక్తీ కావాలంటే? కావలసింది ....పె..ళ్ళీ ....అయితే ఆ వ్యక్తీ ఎవరు?
    ఈ ఆలోచనలన్నీ ఆఫీసు నుంచీ ఇంటికి వస్తుంటే నే కలిగేవి. ఇంటికి వెళ్ళగానే ఆ వాతావరణం లేదు, ఈ మనస్సే ఆ ఇంట్లో ఉన్నా, ఆ మనస్సులో అమ్మా, నాన్నా, భర్త వదిలి పెట్టిన అమాయకురాలైన అక్కయ్య, వాడి లోకమేదో వాడికే అర్ధం కాని రౌడీ మనస్తత్వం కల అన్నయ్య వీళ్ళే ప్రవేశిస్తారు కాని మరో విషయం తలకెక్కదు ఆఫీసు లోనూ అంతే. ఆర్.డి.ఓ గారు హెడ్ క్లర్క్ , యు.డి.సి లు యల్.డి.సి. లు , కో టైపిస్టు , జవాన్లు టైపు చెయ్యాల్సిన కాగితాలూ , అర్జంట్లు, బుడేలు సీక్రెట్ డిస్పోజల్సు , కాన్పిడేన్షియల్ పేపర్లు, డైరీ , పెండింగ్ పేపర్లు . తెల్లకాగితాలకూ, కార్బన్ కాగితాలకు , టైప్ రిబ్బన్ల కూ ఇండెంటు చెయ్యటం, అప్పుడే అయి పోయాయా అని క్వశ్చన్ మార్కు ముఖంతో రెండు ముక్కుల నిండా పోడుం దట్టించే స్టేషనరీ క్లార్కు మరో ప్రపంచం కాని అదో ప్రపంచం.
    ఈ అదో ప్రపంచం లోనే లాల్చీలు లేని రాజకీయాలు, హత్యలు  లేని కుట్రలు, బల్లి పురుగుల్ని తింటుంది. ఉడుత అందిన కాయాల్ని కొట్టేస్తుంది. చిలక సగం కాయ కొట్టుకు తినగానే ఆ కాయ కిందకు రాలి పడుతుంది. ఇందులో కొన్ని జల చరాలు చిన్న చేప, పెద్ద చేప . తిమింగలం, కొన్ని ఎందుకూ పనికి రాని నత్త గుల్లలు కొన్ని తేళ్ళు. పాములు మాత్రం లేవు.

 

                                 
    అక్కయ్య ఇన్ని నెల్ల నుంచీ ఎన్నడూ బైటికి రాలేదు. అది ఒక్కర్తీ ఎక్కడికీ వెళ్ళి రాలేదు. అమ్మ గాని, నేను గాని ఎవరో ఒకరం వుండవలసిందే. ఇంట్లో కూర్చుంటే దాని ఊహలు బావిలోని కప్ప మాదిరే ఉంటాయ్యోమో నని ఒక రెండో శనివారం రోజున బట్టలు కొనుక్కుందామని అక్కయ్య ను తీసుకుని బయల్దేరాను, చేనేత పప్తాహం జరుగుతోంది. రూపాయకి పది పైసలు రిబేటు , మెల్లిగా నడిచి వెళ్లి ఆ కొట్టు దగ్గిరికి చేరాం. దార్లో అక్కయ్య కు చెప్పాను. నెత్తి గోక్కోవద్దు. వెకిలి నవ్వు తగ్గించు, అర్ధం లేని అభిప్రాయాలు చెప్పకు అని. సరేనని తల ఊపింది.
    ముందు ఒక వరసన ఉన్న కొట్లన్నీ చూస్తూ వెళ్ళాం. వింతగా చూడసాగింది అక్కయ్య. అది చూసినంత సేపూ తొందర చెయ్యకుండా నేనూ నోల్చుని చూసేదాన్ని. అక్కయ్య కావాలంటే దానికి నచ్చిన చీర కొందామని డబ్బు కూడా తీసుకు వెళ్ళాను.
    అన్నికొట్లూ తీరిగ్గా చూచాక "ఇక వెళదామా" అన్నది అక్కయ్య.
    "నువ్వేం చీరే కొనుక్కోవా?'
    "చీరా, నువ్వు కొని పెడతావా?"
    "అవును, కావాల్సిన చీర తీసుకో. డబ్బు తెచ్చాను."
    "ఏం వద్దు లెద్దూ కాసేపు ఆ పక్కన కూర్చుని అందర్నీ చూసి వెళ్ళిపోదాం."
    కాళీ జాగాలో కూర్చున్నాం, అరగంట సేపూ అక్కయ్య వచ్చే పొయ్యేవాళ్ళని చూస్తూ కూర్చుంది. దానంతట అది ఏం మాట్లాడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS