Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 6


                                      3
    విశాల తో పరిచయం కోసం సూర్యం తహతహ లాడాడు. అతని మనసులో ఆమె వయసుతో తొణికిసలాడుతున్నట్లు వూహించుకునేవాడు. అతను వూహించుకున్న సోయగం, అందం యీ నాటికి కాకపోయినా ముందుకైనా చూడగలనన్న ఆశ ఆతని కుంది. మామ్మ విషయం లో గడచిన పచ్చదనం వూహించినట్లు విశాల గురించి వూహించనవసరం లేదు.
    తలవని తలంపుగా అమ్మ అన్నది 'విశాల యింగ్లీషు లో కాస్త వెనకబడి వుందట. నీకు తీరుబడిగా నున్నప్పుడు కాస్త ప్రయివేటు చెప్పరాదూ?'
    'వాళ్ళు అడిగారా?'
    'మామ్మ కోరింది.'
    'అలాగే' అన్నాడు.
    రోజూ సాయంత్రం కూర్చొని రాత్రి భోజనానికి లేచేవరకూ ట్యూషను చెప్పేవాడు. ట్యూషను చెప్పినప్పుడల్లా మామ్మ యింట్లో ఒక మూల కూర్చొనేది. సూర్యం కొద్దిగా తడబడేవాడు. ఒకోసారి ఆమె వంట యింట్లో వుండే టప్పుడు విశాల వేపు కోరికలు నింపుకున్న చూపులను ప్రసరించేవాడు. యౌవ్వనం వుబికి వుబికీ వురకలు వెయ్య సిద్దంగా నున్న వయసు అమెది. సూర్యోదయానికి ముందుగా వెలుగుతున్న స్వచ్చమైన ఆకాశం లా ఆమె ముఖం మెరవసాగేది. ఆ కళ్ళు తీపితీపి భావాలతో నిండి ఆ రెప్పల కదలిక లో బెదురుతున్న లేడి చూపులు స్పుటంగా అగపడేవి. ఒకోసారి చేతులు యిద్దరూ కోరి అందీ అందనట్లు ఏదో సాకుతో తాకేవారు. ఇంకోసారి విశాల ఊరకనే చిరునగవు వొలక బోసేది. ఆ చిరునగవును సిగ్గు తెరలు కప్పి ఆమె అవయవాల సోయగానికి మెరుగులు దిద్దేవి.
    ఈ మధ్య ఒకసారి మామ్మతో కొంటెగా 'విశాల నే చెప్పినట్లు వినటం లేదండి మామ్మగారూ.'
    'వినకపోతే వూరుకోకు నాయనా. నాలుగు కేకలు వెయ్యి- అప్పటికీ చదవక పొతే -- రెండు మొట్టి కాయలు పెట్టు.'
    ఆ మరుసటి రోజు విశాల తీక్షణంగా వుంది. ఏమి అడిగినా ముక్తసరిగా జవాబు చెప్తోంది. మామ్మ పెరట వుండటం చూసి, 'కోపం వచ్చిందా?' అడిగాడు.
    జవాబు లేదు.
    'ఆమాత్రం అనటానికి చనువు లేదా?'
    'నాతొ అంటే పోయేదిగా . మీకు కోపం వస్తే చాటుగా నన్ను నాలుగు వడ్డించకూడదు?'
    విశాల మనసులో గుట్టు అప్పుడే చొచ్చుకుంది. ఇక ఈమె యెంత కాలమో ఈ లంగా జాకెట్ల తో వుండదు. అలాగే ఆ నెలలోనే ప్రయివేటు కు అంతరాయం కలిగింది.
    'రా నాయనా ...నీ చేతులతో నాలుగు అన్క్షింతలు వెయ్యి' అంది మామ్మ.
    అక్షింతలు చేత పట్టుకుని విశాల వేపు చూసాడు. ఆమె సిల్కు బట్టలతో వుంది. లంగా మీద వోణీ వేసుకుంది. ఒంట నగలున్నాయ్. అప్పుడే జుత్తు మెలికలు తిరిగి పోతోంది. బంగారు నగకు మెరుగులు దిద్ది నట్లు, కాఫీ లో పంచదార , కూరలో వుప్పు పడినట్లు ఈమెలో మార్పు వచ్చేసింది. ఈ మార్పుతో అమెకు సిగ్గు ముంచు కొచ్చింది. అక్షతలు మౌనంగా వేస్తుంటే 'మంచి బాబువి-- దీవించు నాయనా?' అంది మామ్మ.
    ఏమని దీవించమంటారన్నట్లు సూర్యం మామ్మ వేపు చూసాడు.
    'వేగం పెళ్ళి కావాలని దీవించరా?' అమ్మ అందుకుంది.
    'అప్పుడే ...చదువు పూర్తీ కాకుండానే.'
    'ఆడపిల్లకు చదువు కాదు నాయనా --  పెళ్లి ముఖ్యం.'
    'నేను చిన్న వాడిని . మీలాంటి పెద్దలు దీవించారు -- చాలదా?'

                     
    'వయసు కాదు ముఖ్యం -- హక్కు-- నీ దీవన బ్రహ్మదీవన అవుతుంది. మనస్పూర్తిగా మంచి మొగుడు రావాలని దీవించు' మామ్మ అందుకుంది. విశాల యింకా సిగ్గుతో తల వంచటం చూసాడు.
    'విశాలకు ఏం లోటు?'
    'నాయనా! అది పుట్టింది -- దానికీ అన్నీ లోటే అయిపోయాయ్'. తల్లి ప్రేమకు నొచుకుందా, తల్లి అభిమానానికి నోచు కుందా, తండ్రి అభిమానానికి నోచుకుందా? ఆ వచ్చిన మొగుడు మంచి వాడైతే వాడి అభిమానాని కైనా నోచు కుంటుందని నా ఆశ -- బాగా దీవించు నాయనా.'
    'మంచి మొగుడే వస్తాడు.'
    సూర్యం తిరిగి వచ్చి యింట్లో ఒక మూల కుర్చీలో కూర్చుండి పోయాడు. ఇంకా విశాల కళ్ళకు కట్తోంది. ఇన్నాళ్ళూ ఆమె సొగసు పై కప్పిన తెర తీసినట్లు ఆమె వెలిగి పోతోంది. కోరికల గాలి పడగను ఆలోచనల దారంతో యెగరనిచ్చాడు. సూర్యం కు చాలా నమ్మకాలున్నాయ్. తన పూర్వులు అదుపులు, అంక్షల అవసరం వుందని అతని గట్టి నమ్మకం. అతను  కర్మ సిద్దాంతాన్ని నమ్ముతాడు. మనిషి మళ్లీ యెన్నో జన్మలెత్తుతాడంటే కాదనడు. అతను ఆలయాలకు వెళ్ళకపోయినా దేవుడున్నాడన్న వాదాన్ని ఖండించడు. ఏవో తంతులు తను ఆచరించక పోయినా పూర్వులు పెట్టారు కాబట్టి ఆచరించ వలసిందే అంటాడు.
    తన పూర్వులు చెప్పినవీ, చేసినవీ శాశించినవీ యెన్నెన్నో నమ్ముతాడు. ఈ గతం గీసిన గీతలు దాటాలని తనకు లేదు. కానీ ఒక్కసారే దాటాలని మనసులో కాస్త సంశయం లో నే అనుకున్నాడు. అదీ తన జాతి కాని పిల్ల. విశాలను పెళ్ళాడటానికి యీ గీతను దాటాలి.
    విశాలకు తనకూ మధ్య అడ్డుగోడలు లేచిపోయాయి. 'ఆమెకు మామ్మ చదువు మాన్పించింది. దానితో మామ్మపై యెడ తెగని కోపం వచ్చేసింది. తన ప్రయివేటు మాన్పిస్తే ఫరవాలేదు. కానీ చదువు మాన్పించటం తో మామ్మ వేపే చూసాడు కాదు. తల్లితో తన వుద్దేశ్యం చెప్పాడు కూడాను. మామ్మ అతని వుద్దేశ్యాన్నితెలుసుకున్నట్లుంది.
    'ఎంత చదువు చదివినా వంట యింటి కుందేలు కావడానికే కదా బాబూ? మా విశాల కు బొత్తిగా పని పాట్లు రావు. వచ్చే మొగుడు యెంత చదువుకుందో చూడడే. ఎలా వండుతుందో చూస్తాడు.'
    'ఈ కాలంలో చదువే చూస్తారు మామ్మగారూ. మెట్రిక్ వరకూ చదువు వుండటం మంచిది. పెళ్లి ప్రస్తావన వచ్చాక మాన్పించే వచ్చుగా!'
    మామ్మ మనసు మార్చుకుంది. తను ప్రవేటు చెప్పక పోయినా అప్పుడప్పుడూ విశాల కు స్కూలు కు వెళ్ళే టప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు చూడగలుగు తున్నాడు. అతనిని చూడగానే ఆమె కంగారు పడుతుంది. ఒకోసారి తల దించుకునే గబగబా నడుస్తుంది. ఇంకోసారి అలా వెళ్తూ ఒకసారి వెనుతిరిగి చూస్తుంది. ఆమె వెంటపడి ఆమె మనసులో అనుమానాలను సృష్టించటం సూర్యం కు నచ్చలేదు. సాధారణంగా యెదురై నప్పుడు ఒకసారి తలెత్తి అమాయకంగా ఆమె కళ్ళ వేపు చూసి తల దించుకుని మళ్లీ వెళ్ళిపోయేవాడు. ఆమె కళ్ళలో క్రొత్త వెలుగుతో పాటు ఆమె అవయవాల్లో క్రొత్త బిగువు చొచ్చుకుంది. కొద్ది నెలలకే ఆమె బాగా యెదిగి పోయింది. ఎదిగి , సౌందర్య రాసులను ఒళ్ళంతా కుప్పలుగా పట్టుకుని , వక్షం లో సౌరభాన్ని కేంద్రీకరించింది. ఆమె పెదాలు గులాబీ రెక్కలై , కళ్ళు తామర రేకుల్లా కదలజోచ్చినాయ్. ఆ రేకుల పై ముత్యం లా ఆడుతున్న నీటి బిందువులా అప్పుడప్పుడూ కన్నీటిబిందువులు కదిలేవి. ఆ కన్నీటి బిందువు చూడగలిగే అదృష్ట వంతుడు తనైతే యెంత బావున్ననుకున్నాడు సూర్యం. సూర్యం యెన్నెన్నో అనుకుంటున్నాడు. ఆ అనుకోవటం లో ఆనందం, ఆనందంతో పాటు నిరీక్షణ, నిరీక్షిస్తూ వేదన -- వేదనలో కల్లోలం! కల్లోలమైన మనసులో కోరికలు నావలా కదులుతున్నాయ్. అలాంటి కోరికలు తీర్చు కుంటేనే ఆనందపు టంచులు చూసే అవకాశం వుంటుంది. ఊహలలోనే రెండేళ్ళు దొర్లి పోయాయి.
    మాఘ ఆదివారం నాడు మామ్మ, అమ్మా కలిసి మాధవ స్వామిని దర్శించటానికి వెళ్ళే టప్పుడు పెరట విశాల యెండలో ఒంటిగా జుత్తు అరబోసు కుంటోంది. ఏదో పని వున్నట్లు సూర్యం అటు వెళ్ళాడు. ఆమె అతని వేపు చూడలేదు. వంట యింట్లో నికి వెళ్లి ఒక గిన్నె తీస్తూ కింద వదిలాడు. ఆ శబ్దంతో ఆమె ఒకసారి అతని వేపు చూసింది, మళ్ళీ ముఖం త్రిప్పేసింది. చివుక్కు మన్న మనసుతో గదిలోకి వెళ్ళిపోయాడు. మళ్లీ వెళ్లమని మనసు వురకలు వేస్తున్నా యేలానో ప్రయత్నించి అలానే కూర్చున్నాడు . కాస్సేపయ్యాక కాలుకాలిన పిల్లిలా అయి మళ్లీ వంట యింటి వేపు వెళ్ళాడు. ఈసారి విశాల యిటు వేపే చూస్తూ కూర్చొని వుండటం గమనించాడు. అతనిని చూడగానే రెండో వేపు తిరిగిపోయింది. అలా తిరుగుతూ ఆమె మౌనంగా వదిలిన దరహాసం చూసాడు. తనను పరీక్షిస్తోందనుకున్నాడు. ఆమె లంగా జాకెట్టు తో నున్నప్పుడు సంశయించకుండా చూసేది. ఇప్పుడు ఆమె ప్రతి చూపులోనూ సంశయం తొణికిసలాడుతోంది. అందమైన పూలను చూసి తాక బుద్ది పుట్టినట్లే అందమైన ఆడదాన్ని చూడగానే తాకాలన్న కాంక్ష కలగటం సహజం. ఎవరో గాని అందరూ చెట్టునున్న అందమైన పూవును చూస్తూ తెంపలేరు. తెంపిన వాళైనా తెంపాక ఏదో తప్పు చేసినట్లు బాధపడ్తారు. అలా ఆమె వేపు అందమైన పూవు వేపు చూసినట్లే సూర్యం చూసాడు. ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్ళ లేకపోయాడు. ఆమె చూపులతో తన చూపులు, ఆమె నగవుతో తన నగవు ఆమె హృదయ స్పందనతో తనదీ, ఆమె సొగసుతో తనదీ....కలపాలని , ప్రయత్నించాడు. ఆమె అతను ఆరాట పడుతుండగానే యింట్లోకి వెళ్ళిపోయింది.
    ఏదో తప్పు చేసిన మనిషిలా సూర్యం యింట్లో కి వచ్చి కూలబడ్డాడు. మనస్సు మహా సముద్రమై పోయింది. అవమానంతో తన తప్పును తెలుసుకున్నాడు. ఒకప్పుడు విశాల తననే పెళ్లాడతానని ముందుకు వస్తే తను చేసుకోగలడా? తన వెనక నున్న చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు యెలా అవుతాయ్? తన కుటుంబానికి లేని మచ్చను తొలిసారి తనే తేవాలా? విశాల కు అన్యాయం తానెప్పుడూ చెయ్యలేడు. ఆమెను గేలాం వేసి క్రూరంగా ఆమె వునికి నించి బైటకు లాగాలని తనకు లేదు. ఆమెను కట్టుకునే ధైర్యం తనకుంటేనే ఆమెలో తన పై అభిమానం, వలపు పండించాలి. అలా చెయ్యలేనప్పుడు ఆశలను సృష్టించి పెను తుఫాను లో సర్వ నాశనం చేసి జీవిత కాలం వగచే పరిస్థితి తీసుకు రాకూడదు. ఆమె పై నున్న మమకారం తనను ఒక దారిలో నడవ నియ్యలేదు. ఆమె కంటికి అగు పిస్తే తను యేకాంతంగా అలోచించి నిర్ధారించుకున్నవన్నీ మరచి పోతున్నాడు. స్వాతి వానకోసం వేచి వున్న ముత్యపు చిప్పలా ఆమె దర్శనం కోసం వేచి వుండటం అలవాటై పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS