Previous Page Next Page 
వంశాంకురం పేజి 7

 

    అరుణను పుట్టింటి వరకు విడిచి రావటానికి ఆనంద్ తయారవుతున్నాడు. రుక్మిణి దంపతులు తయారవుతున్నారు. రుక్మిణి నెమ్మదిగా ఆనంద్ దగ్గర కొచ్చింది. ఆమె చిన్నగా నవ్వింది.
    "నిన్న ఏదో అన్నామని మనసులో పెట్టుకోకు ఆనంద్. మాధవ్ ను వదిలి వెళ్తున్నాను. నీఇష్టం , రాత్రంతా వాళ్ళ నాన్నకు నచ్చ చెప్పాను."
    అనవసరంగా శ్రమ పడ్డావు వదినా. ఇప్పుడు అరుణా వెళ్ళిపోతుంది. రావడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. అమ్మ ఒక్కర్తీ శ్రమ పడలేదు. చిన్న పిల్లల పెంపకమంటే మాటలా? వాడికేమైనా బాధపడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న సమస్యలు కాక క్రొత్తవి దేనికి? తరువాత ఆలోచిస్తాము" ఆమె మరేం జవాబు చెప్పలేదు. నిష్టూరంగా వెళ్ళిపోయింది. అరుణ అత్తమామలకు నమస్కరించి కన్నీటి తో కార్లో కూర్చుంది. అత్తగారు యెన్నో విధాలుగా ధైర్యము చెబుతూనే వుంది. కారు కదిలింది. దారి పొడవునా ఆనంద్ యెన్నో విధాలుగా నచ్చ చెప్పాడు. ఆమె మనసు స్థిమితంగా లేదు.
    'అప్పుడప్పుడు మీరు రావాలి" అన్నది దిగులుగా.
    "తప్పక సెలవు పెట్టె వచ్చేవాడిని కాని నా చేతి కింద అతను లేడు."
    "వద్దులెండి. దినమంతా తోచక బాధపడాలి. పని వుంటే కాస్త మరిచి పోవచ్చు."
    "నీ స్థితి యెప్పటికప్పుడూ తెలుపాలి సుమా. వాసుకు, మామగారికి కూడా చెప్తాను ఉత్తరాలు వ్రాస్తుండమని. కారు వారి ఊరు చేరింది. అరుణ తల్లితండ్రులు యెదురు వచ్చి కూతుర్ని, అల్లుడి ని ఆప్యాయంగా ఆహ్వానించారు. సాయంత్రము వరకుండి తిరిగి వచ్చాడు ఆనంద్.
    
                                  *    *    *    *
    మూడు నెలలకు ఆస్పత్రి నుండి తిరిగి వచ్చింది అరుణ. ఆమెకు ప్రాణాపాయము తప్పింది. అందుకే అందరూ సంతోషించారు. అటునుండే పుణ్య క్షేత్రాలు దర్శించుకుని ఇల్లు చేరారు. అరుణ నిరంతరమూ బాధతో ఉండటము మూలాన ఆనంద్ ఇదివరకు ఆమెపట్ల జాలి తప్ప మరే భావము రానిచ్చేవాడు కాదు. ఇప్పుడలా కాదు. ఆమె చలాకీ గా తల్లికి పనులు చేస్తూ తిరుగుతుంది. ఆనంద్ ప్రతిరోజూ ధైదీభావాలతో సతమత మవుతున్నాడు. కాలము గడుస్తూనే వుంది. వసంతఋతువువరుదేంచినది. ఆరోజు అకాలంగా తెప్ప చినుకులు పడి చల్లగా , హాయిగా ఉంది. భోజనము చేస్తుండగా, అరుణ అందంగా అలంకరించుకుని అతనికి కనిపించింది. ఆరోజు విశేషమేమిటో అర్ధం కాలేదు. అతని కనులలోని భావము కనిపెట్టినట్టే ఆమె జవాబు చెప్పింది.

 

                          
    "ఈపూట శాస్త్రి గారి మనుమడి పుట్టిన రోజండీ" ఆమె చెప్పే మాటలు వినటము లేదు. ఆమె వంక దీక్షగా చూచాడు. వంగపండు రంగులో గల మదురై చీర కట్టింది. లేతగులాబీ రంగు జాకెట్టు , మెడలో పెద్ద బిళ్ళ గల నల్ల పూసల దండ. వింత అందము తో మెరిసిపోతున్నాయి. తలంటుకున్న జుట్టు పట్టులా, చెవుల పైకి జారినది. మరువము మల్లెల మాల సువాసనలు వెదజల్లుతూ అతన్ని మైమరిపించేశాయి. అతనిలో అణగారిన కోర్కెలు తలెత్తి బుసలు కొట్టసాగేయి. ఆమె వంగి ఏదో వడ్డించబోయినది. అతను ఆమె ముఖము రెండు చేతులలోకి తీసుకుని ఆవేశంగా చుంబించాడు.
    'వదలండి, అత్తయ్య వస్తారు. వదలమంటే ' చిరుకోపంగా చూచింది.
    "ఆరూ! ఆకులూ వక్కలు కావాలి. పైకి వస్తావు కదూ?"
    "ఊ....వదలండి ." అతన్ని విడిపించుకున్నది.
    "నాన్నగారేక్కడ?"
    'ఈ పూట గురువారము. వారిద్దరూ భోజనము చేయరు." పెద్దవారిని గూర్చి చెప్పింది అరుణ.
    "అయితే నీవు కూర్చోరాదూ" అతను ఆమె ఒడ్డించుకునేవరకు కూర్చున్నాడు. ఆనాటి ఆమె ప్రతీ కదలిక అతన్ని ఉత్తేజితుడిని చెయ్యసాగింది.
    "ఏమిటండీ. అలా చూస్తారు?"
    "నీ చేతులేంతో అందంగా ఉన్నాయి సుమా." ఆమె నవ్వింది. రెండు బుగ్గలలో చిన్నగా గుంటలు పడ్డాయి.
    "ఏమిటండీ మీకీ రోజు..." అతని కళ్ళు చూచి మాటలు ఆపింది. కాంక్షతో కదిలాడుతున్నాయి. మరేం మాట్లాడక భోజనము చేసింది. అతను భోజనము అయిందనిపించి పైకి వెళ్ళి పోయాడు. కిటికీలో నుండి వచ్చిన చల్లని గాలి తరంగము అతని శరీరాన్ని స్పృశించి చక్కలి గింతలు పెట్టింది. గది కడిగి సత్తి అగరొత్తులు వెలిగించాడులా ఉంది. చక్కని వాసనలు అతనిని ఏదో లోకాలకు తీసుకుపోసాగాయి. అసహనంగా గది బయటికి వచ్చి క్రిందికి చూచాడు. చేతిలో పళ్ళెము పట్టుకుని అరుణ మెట్లు దగ్గర నిల్చుంది. సరస్వతమ్మ గొంతు వినిపిస్తుంది.
    'ఆపరేషన్ అంటే మాటలా. పునర్జన్మ ఎత్తావు తల్లీ. ఆరు నెలల వరకు మేడ యెక్కడమూ, బరువులు ఎత్తడము కూడవని డాక్టర్ చెప్పలేదూ....."
    "ఆకులూ కావాలన్నార'త్తయ్యా ." అసహయురాలు అంతకంటే ఏమంటుంది?
    'క్రిందికి వచ్చి వేసుకుంటాడు. సత్తీ!....చినబాబు ను నేను పిలుస్తున్నానని చెప్పు...." ఆనంద్ త్వరగా గదిలోకి వచ్చాడు. కోపంగా సిగరెట్లు వెలిగించాడు. అతనికి కోపము వచ్చింది. ఎందుకు అందరూ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. చివరకు ప్రకృతి కూడా వ్యతిరేకమేనా? మందనవనపు గిలిగింతలకు అలక వహించి , కోపంగా కిటికీ మూశాడు. బల్లపై వెలిగే అగరొత్తుల సువాసనలు అధిక మయ్యాయి.
    "బాబుగారూ....అమ్మగారు రమ్మంటున్నారు." సత్తి వచ్చాడు.
    "ఊ.....అగరొత్తులెవరు వెలిగించమన్నారు?"
    "గది కదిగినాక పచ్చి వాసన వేస్తుందని అమ్మగారు వెలిగించమన్నారు." మరికొంతసేపు నిల్చుని అతను వెళ్ళిపోయాడు. అసహనంగా నిల్చుని బాల్కనీ లోకి వచ్చాడు. వెనుక వైపు ఇంటిలో వుండే దంపతులు పకపక నవ్వు తున్నారు. అతనికి చెంప పై కొట్టినట్టు అయింది. వెనుతిరిగాడు. మనసు కుదుట పడాలంటే కృష్ణా బారేజ్ పై కాసేపు తిరిగి రావాలనిపించింది. బయట తిరగాలని ఎంత మాత్రమూ లేదు. వెచ్చగా.......అది అసాధ్యము. వెంటనే లేచి దుస్తులు ధరించాడు. క్రిందికి దిగాడు. అతను బయటకు వెళ్తుంటే, త్వరగా అరుణ అడ్డు వచ్చింది.
    "నాపై కోపము కదూ?"
    "నీపైన దేనికి? నాపై నాకేకోపంగా వుంది" అనేసి బయటికి వచ్చాడు. గారేజ్ లో వున్న కారు తీశాడు. కారు రోడ్డు దాటి వెళ్ళి బ్రిడ్జి దగ్గరాగింది. అతను నీటిలో కనిపించే దీపాల ప్రతిబింబాలను చూస్తూ నిల్చున్నాడు. సిగరెట్టూ పై సిగరెట్టూ వెలిగించినా , మనసు కుదుట పడలేదు. ప్రకృతి అంతా అతనికి పరమానందంగా కనిపించింది. ఎటు చూసినా జంటలుగా, తిరుగుతున్నా స్త్రీ పురుషులే కనిపించారు. అది ప్రతిరోజూ చూస్తాడు కాని అతని కెందుకో ఆరోజు క్రొత్తగా కనిపించింది.
    'ఆంధ్రకు పారిస్ పట్టణమేమో విజయవాడ. ఆనందాన్ని, అందాన్ని కొనుక్కోవచ్చు...." అన్న స్నేహితుని మాటలు గుర్తు కొచ్చాయి, వెంటనే సిగరెట్టు అర్పి వచ్చి కారులో కూర్చున్నాడు. కారు తిరిగి, తిరిగి ఒక సందు దగ్గర ఆగింది. కొద్ది దూరంగా సినిమా దియేటర్ లోంచి పాటలు గోలగా వినిపిస్తున్నాయి. ఇంకా రెండవ అట మొదలు పెట్టలేదల్లె వుంది. సందులోనే అందాన్ని ఆనందాన్ని డబ్బుకు వెచ్చించే గృహాలున్నాయి అంటారు. ఎలా వెళ్ళాలో అతనికి తెలియలేదు. కారుకు అనుకుని నిలబడి మరో సిగరెట్టు వెలిగించాడు.
    "ఏ ఊరండి మన్ది?' ఒకతను ఆనంద్ వైపు చూస్తూ అడిగాడు.
    ఈ ఊరే.
    "అబద్దాలు చెప్పకు సార్....నా కంత మాత్రం తెల్దేవిటి? ఈ ఊరి వారంతా ఈ పాటికే తొందరపడి బేరాలు కుదుర్చు కుంటారు. ఇట్ట నిలబడి చూస్తారేమిటి?' ఆనంద్ చిన్నగా నవ్వాడు.
    "ఏం బేరము?"
    "సార్! నాకే యెదురు మాటా! ఈ మాత్రము తెల్సు కోలేనేమిటి? ఈ వ్యవహారము లో క్రొత్త వారిలా ఉన్నారు. నా వెంట రండి. పసందైన చోటికి తీసుకు వెళ్తాను. వరహాలు నువ్వు దైవ కాంతను చూశావోయ్ , అని తరువాత అనకపోతే అడుగు....ఆ....' ఆనంద్ లొ ఉవ్వెత్తున లేచే కోరికలు అతడిని వివశుడ్ని చేశాయి. ఏమయినా సరే.....ఆరోజు ప్రపంచములో అందరికీ అందుబాటులో ఉండి తనకు దూరంగా పారిపోయే ఆనందాన్ని అందుకోవాలి. మరో సిగరెట్టు వెలిగించాడు. వరహాలు కోటిచ్చాడు. కారుకు తాళం పెట్టి అతని వెనకాల ఇరుకుగా ఉన్న వీధిలో నడవసాగాడు. అతను అదే పట్టణము లో ఉన్నా, ఆ వీధిలోకి యెప్పుడూ రాలేదు. పేరయితే విన్నాడు గాని, వీలుగా, గుమ్మత్తుగా అలంకరించబడి ఉన్నాయి. ఒక ఇంటి ముందు ముప్పై దాటిన స్త్రీ నిలబడి వుంది. ఆమె, చీర జాకెట్టు ధరించినా , పరికిణీ , బాణీ వేసుకున్నట్టే కనిపిస్తుంది. అంత సన్నని దుస్తులు ధరించింది.
    "వరహాలు ! బాబుగారిని ఇటు పిలువు....' యెంతో వినయంగా అడ్డము వచ్చింది. "లే  మేము నీ దగ్గరకు రాలేదు. బాబుగారిని ఊర్వసి దగ్గరకు తీసుకెళ్తాను. "వరహాలు ఠీవిగా ముందుకు నడిచాడు.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS