Previous Page Next Page 
వంశాంకురం పేజి 6

 

    సాయంత్రము ఆమెకు కడుపు నొప్పి తిరగబెట్టింది. అత్తగారు , కోడలికి మందులిచ్చి దగ్గర కూర్చుంది. ఆనంద్ మాధవ్ నెత్తుకుని వచ్చాడు.
    "వీడినిలా ఒంటరిగా వదిలారేం? బజారమ్మట ఏడుస్తూ వెళ్తున్నాడు. ఏ కారు క్రిందో పడితే?"
    "ఎంతోసేపు కాలేదురా. అమ్మాయి తన్ను కుంటుంటే ఇక్కడే కూర్చున్నాను. రా మాధవా?' చేతులు చాచింది. వాడు రాలేదు. ఆనంద్ భుజాన్నే అంటి పెట్టుకున్నాడు.
    "అమ్మ....అమ్మ కావాలి." మారాము మొదలు పెట్టాడు. వాడి మారాము , ఇటు అరుణ నొప్పి అందరి చే అర్దారాత్రి వరకు జాగరణ చేయించాయి. వాడిని తల్లి ధ్యాస నుండి తప్పించటానికి అడిగిందల్లా కొనసాగేరు. అరుణ మరో సత్యము తెలుసుకుంది. తను ఎవరినైనా పెంచితే, అది అత్తగారి శ్రమే తప్ప తన వల్ల కాదని. నాల్గు రోజులు గడిచాయి. వాడు కాస్త తనవారిని మరిచి, ఇంటి వారితో కలిసిపోయాడు. పెద్దవారి నోటికి, చేతికి పని కలిగింది. చుట్టుప్రక్కల వారికి కుతూహలము పెరిగింది. పెంచుకుంటున్నారా?" 'దత్తత చేసుకుంటారా?' ఇప్పుడే తొందరేం? కోడలికి పిల్లలయ్యే యోగ్యత లేదని డాక్టరు చెప్పాడా?' అందరి ప్రశ్నలకు జావాబులు చెప్పలేక పోతున్నారు. తమ బ్రతుకేదో తమను బ్రతకనీవ్వరీ జనము అనుకుని నిట్టుర్చారు.
    అందరూ అరుణను ఒప్పించి ఆపరేషన్ చేయించటానికి సిద్దపడ్డారు. ప్రతిరోజూ తనను గూర్చి వారంతా దిగులు పడటము దేనికి? మరణిస్తే మంచిదే ఓ సమస్య పరిష్కారమవుతుందని మనసు రాయి చేసుకుంది అరుణ. కాని ఎక్కడో ఆశా కిరణము తళుక్కు మంది . ఆపరేషన్ చేయకపోతే, ఎప్పుడో ఒకప్పుడు తను సంతానవతి అవుతుంది. కులదీపకుడు జన్మిస్తాడు. గర్వంగా భర్త కందిస్తుంది. అలాంటి ఊహలే. ఎప్పుడూ వస్తుంటాయి. అందుకే దీనంగా భర్తను ప్రార్ధిస్తుంది. ఈసారి అతనితో మాట్లాడే ధైర్యము లేదు. అందుకే నిరాశగా బట్టలు సర్దుకోసాగింది. క్రింద కోలాహలము. మాధవ్ వేసే సంతోష పూరితమైన కేరింతలు విని క్రిందికి దిగింది. రుక్మిణీ, ఆమె భర్త, పిల్లలు వచ్చారు. "కన్నతల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనది. కొన్ని రోజులు కొడుకుని విడిచి ఉండలేదు. ఇతర పిల్లలున్నా, ఒకరు లేనివేల్తీ కనిపిస్తుంది కాబోలు. అటువంటి మహత్తరమైన మాతృస్థానం అలంకరించే శక్తి తనకు లేదు. ' ఆమె అంతరంగము ఆవేదనా పూరితమై అలమటించసాగింది.
    "అలా చిత్రంగా చూస్తావేం అరుణా! వెంటనే వచ్చననా?" మాధవ్ నేత్తుకున్న రుక్మిణి అడిగింది.
    "లేదక్కయ్యా! నీవెంత అదృష్టవంతురాలివని చూస్తున్నాను.' అరుణ ఆ మాతన్నప్పుడు రుక్మిణీ కళ్ళు గర్వముతో మెరిశాయి. సాయంత్రము రుక్మీణి, అందరు కూర్చున్నప్పుడు తను వచ్చిన విషయము ఎత్తింది.
    "అత్తయ్యా! మాధవ్ ను విడిచి ఉండటము అయన కెంత మాత్రమూ ఇష్టము లేదు.' నసిగింది.
    "నేను మొదటే చెప్పలేడుటే మీవారి నందరిని అడగమని...." ఎందుకో సరస్వతమ్మ తేలికగా నిట్టూర్చింది.
    "అన్నావనుకో-- ఒక షరతు పై ఉంచుతామంటున్నారు."
    "ఏమిటి?" అసహనంగా ఆనంద్ అడిగాడు.
    "పెద్ద సంగతేం కాదు. అసలు నా కిష్టము లేదు కాని నల్గురు అదే మాట అంటున్నారు అందుకని...."
    "నల్గురు ఏమంటున్నారు?" రంగారావు కల్పించుకున్నారు.
    "అదే మామయ్యా.' చెప్పలేకపోయింది.
    "అంతభయము దేనికి. దొంగతనము చేసినట్టు!" రుక్మిణి భర్త విసుక్కున్నాడు.
    "కుమ్మరింటి నుంచి కుండ తెచ్చినా, గట్టిదా, ఒటిదా అని నాల్గుసార్లు కొట్టి చూస్తాము. పిల్లాడిని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు మంచీ చెడూ చూడకూడదా?"
    "ఇప్పుడు పిల్లవాడికి వచ్చిన చెడు ఏమిటండి?" ఆనంద్ గొంతు తీవ్రంగా ఉంది.
    "చూడండి. మనము బంధుత్వము కలుపుకోవాలని కూర్చున్నాము గాని పోట్టాడుకోవాలని కాదు. ఇప్పుడు మాధవ్ కు ఏం నష్టము కలుగలేదు. రేపు కలుగదన్న హామీ ఏమిటి? అందుకే  ముందుగానే చెప్తున్నాను. వాడి భవిష్యత్తు బాగుండాలంటే , ఆస్తి నంతా వాడి పేర పెట్టాలి." శ్రోతలంతా అప్రతిభులయిపోయారు. రుక్మిణి తప్ప.
    "ఇదేం మాట!" సరస్వతమ్మ ముందు కోలుకుంది."
    "నేనన్నమాట అసమంజసంగా లేదు...."
    "అని మీరనుకోగానే సరా? అప్పుడే ఆస్తి విషయాలదాకా దేనికి?"
    "క్షమించండి పిన్నిగారూవ్యవహారము దగ్గర నిర్మొహమాటంగా ఉండాలి. ఇప్పుడుకాక మరెప్పుడు? రేపు అదృష్టవశాత్తు ఆనంద్ కు సంతానము కల్గితే అప్పుడు తగవులు రావూ?"
    "అదృష్టవశాత్తు ఆనంద్ కు సంతానమే కలగాలగాని తగువులు దేనికి వస్తాయి? మాధవ్ పాదమహిమ అనుకుంటాము. వాడిని పెద్ద మనుమడుగా చూస్తాము."
    "అది ఇప్పటి మాటండీ." అతను మీ విషయాలు ఊహించగలను అన్నట్లు నవ్వాడు. అది ఆనంద్ సహించలేక పోయాడు.
    "అమ్మా! మీరూరుకొండి. చూడండి మీకింత ముందు చూపు ఉండటము హర్చించదగ్గ విషయమే. మాకు అలాంటి ఆలోచనలే ఉంటాయని ఎందుకనుకోరు. ఉన్నదంతా నీ పిల్లవాడికి రాసిచ్చి , రేపు నాకు సంతానం కలిగితే బిచ్చమేత్తిమనే కదూ మీ అభిప్రాయము! మీ పిల్లాడిని పెంచుకుందామనే ఉద్దేశము మాకు లేదు. రుక్మిణి వదిన తనంతట తాను వచ్చి, మా స్థితికి జాలి తలిచినట్లు నటించి పిల్లాడిని వదులుతా నన్నప్పుడు, ఇంట్లో పెద్దవారు అయిష్టత కనబరిచారు మా అంతట మేము అడిగితె ఇలాంటి హిరణ్యాక్షవరాలు కోరుతారు. తానె హృదయ పూరకంగా అంగీకరిస్తుంది కదా అని నేను 'ఊ" అన్నాను. మేము ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. కుర్రవాడు మా దగ్గర ఉండగలుగుతాడా లేదా అనుకున్నాము. మీరు సంతోషంగా మీ కుర్రవాడిని పిలుచుకు పొండి."
    "మీరు మరీను.....' రుక్మిణి భర్త వంక చూచింది. "ఏదో నిర్మొహమాటమంటూ ఆనంద్ కు కోపము తెప్పించారు. నీకు ఇచ్చినాడే వాడు నీ బిడ్డడు అయ్యాడు ఆనంద్, చూడు....మీరా ఆస్తిపరులు అందరి కళ్ళు మీపైనే ఉంటాయి. అందుకని ఏదో రక్షణ కల్పించమన్నాము." అన్నది.
    "దురదృష్టవంతులము. మాకే రక్షణ లేదు. ఇతరుల కేలా రక్షణ కల్పిస్తాము వదినా? దయచేసి యెక్కువ మాటలు వద్దు మా దురదృష్టానికి మామ్మల్ని ఏడువనివ్వండి. మాతో పాటు మీరు దేనికి ఏడుస్తారు? ఆసరా లేనినాడు నల్గురు అనాధలు వచ్చి ఆసరాగా నిలిచి, నా తదనంతరము వారే ఆస్తికి వారసులవుతారు.' అనేసి చరచరా మేడ యేక్కాడు. మీ అభిప్రాయం అదేనా అన్నట్టు చూచారా దంపతులు పెద్దవారి వంక.
    'అంటే నాయనా, మీరెందుకు ఇబ్బంది పడాలి."
    'ఆనంద్ లా నువ్వూ తొందరపడితే యెలా? నేనో మాట చెప్తాను. అంతా పెట్టవద్దు. సగం వ్రాయండి చాలు. మీరు అన్యాయము చేస్తారని కాదు. పరిస్థితులు అలాంటివి. రేపున్నట్టుండి అరుణ పుట్టింటి వైపు వారి నెవరినో తెస్తే."
    "నా అవస్థ ఏదో పడ్డాను, నా తరము గడిచింది. దానిష్టము యెవరినైనా తెచ్చుకొని. ఎవరొచ్చినా నాకు పెట్టేదేం లేదు. అంత అదృష్టమే ఉంటె వాడి కడుపునే ఓ కాయ కాచేది." సరస్వతమ్మ కళ్ళు ఒత్తుకుని వంట ఇంటి వైపు వెళ్ళింది.
    "ఇలాంటి ఇబ్బందులనే నేను అనాధులను పెంచుకోవాన్నాను." కళ్ళజోడు సవరించాడు రంగారావు.
    "ఇంత అనుభవము కలవారు, మీరు పసితనంగా మాట్లాడుతారేం మామయ్యా? యెవరో వచ్చి మిమ్మల్ని ఉద్దరిస్తాడా?"
    "యెవరు ఉద్దరించరమ్మా కొన్నిసార్లు కన్నవారే తల్లితండ్రులకు అన్నము పెట్టరు." ఇక ఆ విషయము అపమన్నట్టు. పేపరు తీసుకుని కూర్చున్నాడు రంగారావు. భార్యాభర్తలు ఒకరి వొకరు చూస్తూ కూర్చున్నారు. చాలాసేపటికి ఆనంద్ మేడ దిగి వచ్చాడు. అతనికి అరుణ కనిపించలేదు. ఆమె పడుకొనే గదిలోకి వెళ్ళాడు. బోర్లా పడుకుని ఉంది. చీకటి గా ఉన్నా లైటు వేసుకోలేదు. అతను లైటు వేశాడు. వెలుతురూ కన్పించిందేమో తల ఎత్తింది. ఆమె కళ్ళు ఎర్రగా వాచీ ఉన్నాయి. అతను వెళ్ళి మంచము పై కూర్చున్నాడు.
    "ప్రొద్దుట భయము లేదని అంత నచ్చ చెప్పినా తిరిగి ఏడుస్తున్నావు కదూ?"
    'ఆపరేషన్ అంటే భయము లేదండీ? ఎటయినా చింతలేదు. నావల్ల మీరు అందరూ బాధలకు గురి అవుతున్నారు. అది చూస్తుంటే నా గుండె తరుక్కు పోయింది. ఎవరిని చూచినా ఆరోగ్యంగా ఉంటాడు. ఏనాడు చేసిన పాపమో నన్నిలా వెంటాడుతున్నది. నన్ను చేసుకున్నందుకు మీరు అనుభవిస్తున్నారు."
    "పొరపడుతున్నావు అరుణా. పాపమంతా నాది. ఒక తండ్రిని నమ్మించి మోసపుచ్చాను. అతని శాపమే ...అతని శాపమే ..." ఆవేశంగా అరిచాడు. ఆమె వింతగా చూచింది.
    "ఎవరిని మోసపుచ్చారండీ? దయచేసి విషయమేమిటో చెప్పండి....' అతని చెయ్యి పట్టుకుంది. అతని భావాలు వెంటనే మారిపోయాయి. ఆమె చేతిని మృదువుగా త్రోశాడు.
    "ఎప్పుడో ఒకరోజు ఆ విషయము చెప్తాను. ఆరూ. ఇప్పుడు కాదు. వారన్న మాటలు మనసులో ఉంచుకోకు. నీవు ఆరోగ్యవంతురాలి వై వచ్చాక ఆలోచించవచ్చు." అని లేచి బయటికి వెళ్ళాడు. అతను అన్న మాటలకు అర్ధాలు ఊహిస్తూ చాలాసేపు కూర్చుండి పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS