ప్రకాశం ఉమాపతి రోడ్డు మీదికి వచ్చారు.
"ఎందుకు ఉమాపతీ ,దినదినానికి ఇలాగవుతున్నాఫు?మీ అమ్మా, నాన్నా నీలో ప్రాణం ఉంచుకొని బ్రతుకుతున్నారు. నువ్విలాగైతే ఆ సంసారం గతేమిటి?"చాలా నెమ్మదిగా అన్నాడు ప్రకాశం.
"నేనాలాగయ్యాను/ ఎవర్నయినా ప్రేమించటం తప్పా? తప్పు కాదే! నేనూ,విమల ప్రేమించుకున్నాం...."
"వివాహం చేసుకోబోతున్నారా?' మాట మధ్యలో ప్రశ్నించాడు ప్రకాశం.
"లేదు. పెళ్ళి చేసుకుంటే తర్వాత ప్రేమేమిటి? నా తలకాయ!"
"అలాగైతే జీవితాంతం ఇలాగే ఉంటారా?"
"ఇష్టం ఉన్నన్ని రోజులుంటాం. కష్టమైతే బై బై అని విదిపోతాం."
"ఈలోగా పిల్లలు పుడితే?"
ఉమాపతి బిగ్గరగా నవ్వాడు. ప్రకాశం జబ్బ మీద గట్టిగా చరుస్తూ అన్నాడు.
"పిల్ల లెందుకు పుడతారోయ్? ఇది బి.సి కాదు. ఇరవయ్యో శతాబ్దం. ఎ.డి. మోడర్న్ సైన్సు చాలా అభివృద్ధయింది."

ఇక చర్చించి లాభం లేదనుకుని సెలవు తీసుకుని బయలు దేరాడు. ప్రకాశం, అతని తల, రేగిన తేనెటీగల తుట్టె లాగుంది. విమల, ఉమాపతులతో మాట్లాడిన తర్వాత అతనిలో అనేక సందేహాలు పొడసూపాయి. అతనికి యీ యువతీ యువకుల పోకడలు చూస్తుంటే ఒకవైపు నవ్వూ, మరొక వైపూ విచారమూ కలుగుతున్నాయి. ఈ ప్రవృత్తి ఇలాగే సాగితే మగ అడజాతుల మధ్య సామరస్యం నశించి ఇవి రెండూ పరస్పరం నాశనం చేసుకుంటాయి. అప్పుడు మహోన్నతమైన మానవ సంస్కృతి కి , క్షణ క్షణ పోరాటం తో అభివృద్ధి అయిన నాగరికతకూ వారసులే లేకుండా పోతారు. ఆలోచనలతోనే సారది గది చేరాడు ప్రకాశం.
"ఏమిటయ్యా , మహాశయా! నీకోసం మదరాసు మహానగరమంతా వలవేసి గాలించాను. ఎక్కడ దాక్కున్నావు?" అన్నాడు సారధి.
ప్రకాశం జరిగిన కధంతా చెప్పాడు.
'చూశావా? ప్రజలు ఆర్ధిక సమస్యలతో చస్తుంటే, ఇలా సెక్సు సమస్యల్లో పడి యేడుస్తున్నారు యువకులు. ఆమాటకొస్తే సెక్సు సమస్యకు గూడ ఆర్ధిక ప్రాతిపదిక ఉంది."
"నాకు ఆకలిగా గూడా ఉంది" అన్నాడు ప్రకాశం నవ్వుతూ.
"అవునవును భోజనం సిద్దంగా కూడా ఉంది. ఆవిషయం మరిచే పోయాను."
ఇద్దరూ భోజనానికి లేచారు.
మరుసటి దినం 'రుద్రవీణ' కవ్యావిష్కరణం జరిగింది. మదరాసు నగరంలో ఉన్న చాలామంది కవులు, గాయకులూ, కళాకారులు వచ్చారు. అధ్యక్షుడు సభను ప్రారంభించిన తర్వాత సారధి లేచి తన కావ్యాన్ని గూర్చి, తనకు ఉత్తేజం కలుగ జేసిన విషయాలను గూర్చి మాట్లాడాడు.
"అసలు 'రుద్రవీణ' అన్న మాటకు అర్ధం చెబుతారా?' అని అడిగాడొక సభికుడు.
"రుద్రవీణ అంటే....రుద్రుని....."
"రుద్రునికి వీణ లేదే!"
"లేకపోతె భయంకర...."
"వీణ భయంకరమిందా?"
"ఇలాంటి పదాల్ని అలా ఆలోచించగూడదండి. అగ్నీవీణ అని ఉందనుకోండి. దానికి అగ్నితో చేసిన వీణ అని అర్ధం చేబుతామా?"
"మరేమిటని చెబుతారు?"
"అగ్నిని వర్షించే వీణ అని అర్ధం."
"ఓహో! అభ్యుదయ కావ్యం అంటే ఇలాంటి పేరు వుండాలి బాగుంది" అన్నాడు ఆ చాదస్తం పండితుడు.
ఆమాటతో అల్లరి రేగింది. మాటా మాటా పెరిగింది. సారధి ఎంత మొండి ఘటమో, అతను గూడా అంతే. వీధి వ్యభిచారులను గురించి గానీ బిచ్చగాళ్ళ ను గురించీ గాని, యజమాని దౌష్ట్యాలిని బలి అయిన కూలీలను గురించి గానీ వ్రాసి అన్నిటికీ కారణం డబ్బని నినాదాలు చేయడం తప్పితే అభ్యుదయం అభ్యుదయ కవిత్వంలోలేదని తెగేసి చెప్పాడా పెద్ద మనిషి.
అభ్యుదయం అంటే అదేనన్నాడు సారధి. ప్రకాశం కల్పించుకుని సర్దాలని ప్రయత్నం చేశాడు.
ఆ పెద్ద మనిషి ప్రకాశం మీదికే తిరగబడ్డాడు.
"అభ్యుదయం అంటే రానున్న కాలాన్ని, దాని స్వరూపాన్ని గుర్తించడం.దానికి ఇవన్నీ మార్లాలవుతాయి. మీరు దయచేసి కోపం చేసుకోకుండా కూర్చోండి." నమస్కారం చేసి ప్రార్ధించాడు ప్రకాశం. ఆ మాటతో ఆ పెద్దమనిషి కాస్త మెత్తబడ్డాడు.
"ఇది పోట్లాట కాదు, నాయనా, సాహిత్య చర్చ. ఇందులో కోపాలూ, తాపాలూ లేవు" అన్నాడు.
తర్వాత సభ బాగానే జరిగింది. అందరూ బయలు దేరుతున్నారు. ప్రకాశం కూడా బయలుదేరబోతుండగా ఇందాకటి పెద్ద మనిషి వచ్చి, "మీదే వూరు నాయనా?" అని అడిగాడు.
ప్రకాశం చెప్పాడు.
"ఇందాకా రాబోతున్నకాలాన్ని దర్శించగలిగినవాడే అభ్యుదయ వాది అని కదూ నువ్వన్నావు?"
"అవునండి" అన్నాడు ప్రకాశం.
"సాంఘిక విలువలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి గదా. అలాంటప్పుడెలా రాబోయే కాలాన్ని చూడటం?"
"కొంతదాకా మారే విలువలు కొన్ని ప్రాధమిక సూత్రాలకు లోబడే వుంటాయి. కానీ ఒక స్థితి వచ్చేసరికి అన్ని ప్రాధమిక సూత్రాల్నీ కాదని విలువలు మారిపోతాయి."
"తర్వాత మార్పు ఉండదా?"
"ఉండదనే అంటారు కొందరు. కానీ నాకు అనుమానంగానే వుంది."
"అలాంటప్పుడు ఇలాంటి కావ్యాలు నిలవ్వు. కొన్ని వేల సంవత్సరాల నుంచీ సాంఘిక విలువలు యెంత మారినా రామాయణ, భారత , భాగవతాలకు విలువ తగ్గలేదు."
సారధి వచ్చీ రాగానే ఆ పెద్ద మనిషితో అన్నాడు.
"దానికి కారణం నేను చెబుతాను. చూడండి. ఇందాకా వచ్చిన మార్పులు- కొడుకు తండ్రి మాటలు గౌరవించాలి, తమ్ముడు అన్న కోసం ఎలాంటి త్యాగమైనా చేయాలి -- మొదలగు ప్రాధమిక సూత్రాలకు లోబడి వచ్చాయి. కానీ మారే సాంఘిక విలువల్లో యీ నీతులకు స్థానం లేకపోతె మీ రామాయణ, భారత, భాగవతాలు కూలి యిస్తామన్నా యెవరూ చదవరు, తెలుసా?" బిగ్గరగా నవ్వాడు సారధి.
ఆ పెద్దమనిషి త్రుళ్ళీ పడ్డాడు. "రామ రామ" అంటూ చెవులు మూసుకొని వెళ్ళిపోయాడు.
'చూశావా మన దెబ్బ' అన్నట్టు చూచాడు సారధి ప్రకాశం వైపు.
"అలా మాట్లాడకూడదు , సారదీ' అన్నాడు ప్రకాశం.
"నువ్వెంత అభ్యుదయవాదినైనా యెక్కడో నీలో కాస్త చాదస్తం వుందిరా!" అంటూ నవ్వాడు సారధి.
* * * *
ప్రకాశంతో శారద పెళ్ళి విషయం చెవిలో పడినప్పటి నుంచీ రత్నమ్మ మనసు మనసులో లేదు. ఎంతో కాలం నుంచి తను వేస్తున్న పధకాలు పునాదులతో సహా లేచిపోయినట్లు అనిపించింది. ఆ పెళ్ళే సాగితే తమ బ్రతికి లాభం లేదు. శారద తనను విడిచి మరో యింటికి వెడితే తనీ యింట్లో బానిసై పోతుంది. శారద అత్తవారింట్లో దాసీదై పోతుంది. అందులో ఆ ప్రకాశం చండశాసనుడు. తనేమైనా వారి సంసార విషయంలో కల్పించు కుంటే వాడి వాలకం చూస్తె ఊరుకోనేలా లేడు. బయటకు దయచేయమనేలా ఉన్నాడు. ఇక వాళ్ళమ్మ సావిత్రమ్మ. ఆవిడ మొగుడు చచ్చినా భయపడని ఆడపులి. ఆవిడ కూడా అలాంటిదే. తన పప్పులేవీ ఆ యింటి బావి నీళ్ళకు ఉడికేలా లేవు. ఇక ఇటు చేస్తే సుందర -- ఆవిడ శుద్ధ మందర -- శారదకు ఆ మూడు ముళ్ళూ పడితే తనను యీ యింట్లోంచి వెళ్ళగొట్టగలదు. అంతటి మనిషే ఆవిడ! ఇక విశ్వనాధం. వాడూ ఒక మనిషేనా!
ఆ ప్రకాశం అసలు నాలుగు కాలాల పాటు బ్రతికి బట్టక్కట్టేలాలేడు. ఈడ్చి కొలిస్తే జానెడు లేని వెధవ. వాడి కప్పుడే ఊరి వ్యవహారాలూ కావలసి వచ్చాయి. ఈ ఊరు అలాంటిదే. శుద్ధ అలగా కొంప! ఈ అలగా వెధవలందరికీ వాడు దేవుడు! లేకపోతె ఆ వెధవ , మాదిగ ఎర్రోడు అంటాడా-- 'అమ్మయ్య గోలో! వస్తన్నయమ్మా మాకూ రోజులు. మేము గుళ్ళల్లో కెళ్ళవచ్చునంటగా?"-- అని.
'పోరా వెర్రి ముండా' అంది తాను.
"అద్గదీ! మా ప్రకాశం బాబయ్య కంటే మీకు ఎక్కువగా తెలుసేంటి?" అన్నాడు.
ప్రకాశం ఇలాంటి ముండమోపి పనులు చేస్తున్నాడని అప్పుడే అర్ధమైంది తనకు. ఈ ఆలోచనలన్నీ తనకెందుకు? తన స్వార్ధం కోసం ప్రకాశానికీ శారదకూ పెళ్ళి జరగకూడదు.అది జరిగిందా -- ఇక తాను బ్రతికి లాభమే లేదు. ఆ ఉమాపతి కి ఉత్తరం వ్రాయిస్తే జవాబే లేదు. బహుశా మరునాడు రావచ్చు.
రత్నమ్మ తలలో మెరుపులా ఒక ఆలోచన మెరిసింది. లేచి గంట చూసింది. ఇంకా నాలుగే. అలాగైతే జగన్నాధం గారు ఇంట్లోనే ఉంటారు. జగన్నాధం కూతురు పేరేమిటమ్మా?ఇందిర. అదో సుడిగాలి! అదైతే యీ ప్రకాశం పొగరు అనుగుతుంది.
రత్నమ్మ గదిలో నుంచి బయటికి వచ్చేసరికి సుందరమ్మ ఎదురైంది. రత్నమ్మ ఎక్కడికో ప్రయాణ సన్నాహంలో ఉందని సుందరమ్మ గ్రహించింది.
రత్నమ్మ వెళ్ళిపోయిన తర్వాత శారదను అడిగింది సుందరమ్మ.
"నాకూ తెలీదత్తయ్యా" అంది శారద.
* * * *
