Previous Page Next Page 
మమత పేజి 6

 

    రెచ్చిన కోపాన్ని బలవంతాన వెనక్కు నెట్టుకుంటూ అన్నాడు రఘుపతి గారు.
    మూడొందలు పోయిందండీ రాత్రి చిట్లాటలో. చెయ్యి మరీ నాసిగా చచ్చింది. ఉచ్చిలుగాడు మహా రెచ్చిపోయాడు రఘుపతిగారూ.... ఆ తుప్ప వాసన చుట్ట త్రాగేసరికి తలతిరిగి పొరపాటున జోకరు గిరాటేట్టా ఆ దెబ్బతో మనచేయ్యి చచ్చింది. ఆ పోరంబోకగాడి చెయ్యి హెచ్చింది.'
    'హైదరాబాద్ నాతొ రేపు వస్తున్నట్లేనాంట?'
    'అలాగే కానీండి. నాలుగు పుగాకు కాడలుంటే , యిలా గిరాటేట్టండి. ఇవాళ మళ్ళీ తెల్లవార్లు ఆడైనా ఆ ఉచ్చిలు గాడ గూబలు మెలిపెట్టాలి?'
    'రేపు ఉదయం బయలుదేరాల మనం'
    వెళ్ళిపోయాడు మున్సుబు 'అలాగే' అంటూ.
    'ఇవాళ కూడా బడికి లేటుగామల్సు' అనుకుంటూ లేవబోతున్న స్వామిని వెనక్కు పిలిచి ' రేపటికో వందుంటే సర్ధవోయ్. హైదరాబాదు నుంచి రాగానే సర్దేస్తా.'అనేసి లోపలికి వెళ్ళిపోయాడు రఘుపతిగారు.
    కీలేని గడియారం లా గుండె ఆగిపోతున్నట్లనిపించింది. స్నానం చేయకుండా పరిగెత్తాడు బడికి. పిల్లలకు ఏం పాఠాలు చెప్పాడో తనకే తెలియదు. సాయింత్రం యింట్లో రఘుపతి గారి జాడ కనిపించ లేదు. ఊరిని బాగుచేయాలనే మహా యజ్ఞం తలపెట్టిన రఘుపతిగారికి క్షణం తీరిక దొరకడం లేదు.
    పర్సు తీసి మిగిలిన ఇరవై ఏడు రూపాయలు  లెక్క పెట్టుకుని మళ్ళీ లోపల పెట్టుకుంటూ ఉసూరు మన్నాడు.
    'ఏమిటి మేష్టారూ దావా పోయిన కోర్టు పక్షిలా నిట్టుర్పులూ మేస్తున్నారు" అంటూ గదిలోకి వచ్చింది పావని.
    "వంట్లో బాగుండలేదండి!"
    "యింకా పోలా తలనొప్పి . మరీ కాస్త శోంఠీ గంధం?'
    "వద్దండి, తలనొప్పి తగ్గింది .'
    'మరి'
    'మనస్సు -'
    'అదా? నే వదలగొట్టనా? నీరు కారిపోతున్నట్లు ప్రపంచం బరువంతా మోస్తున్నట్లూ కనిపించే ట్రాజెడీ హీరో అంటే మహా చెడ్డ విసుగండీ నాకు. మాష్టారూ ఒక చిన్న కోరిక.'
    "?'
    'చెప్పనా?'
    'చెప్పండి'
    'తీరుస్తానని మాటిస్తే-'
    'తెలియకుండా ఎలాగండి?'
    'కాదండి మాష్టారూ! ఈరోజుల్లో ఎవరు పెట్టుకుంటూన్నారండి మరీ చాదస్తంగా ఈ పిలకలు? దానికి తోడు చెవులకు ధగధగ మెరుస్తూ ఆ దిద్దులు , ముక్కు మొహం తమది తీరుగా ఉండబట్టి భరించగలుగుతున్నాం ఈవేషం. ఇలా పిలకలుపెట్టించి చూడండి ఒక్కొక్కళ్ళకు హడలి చస్తాం. అలా వుంటే ఆ అవతారాల స్వరూపం ఊహకు కూడా అందదు.'
    'మీకేం అపకారం చేసిందండీ ఈ పిలక..'
    దెబ్బతిన్న అభిమానంతో తీవ్రంగానే అడిగాడు స్వామి.
    'కోపమొచ్చిందా మాష్టారూ! భారతి అంది లెండి- అదేం అవతారమే బాబూ - చందాలు పోగుచేయించన్నా ఆ మనిషిని మరమత్తు చేయవే - అంటూ. అనేశా ఉన్న మాట. పొరపాటయితే క్షమించండి స్వామీ.'
    చళ్ళుమంటూ చెంపలు వేసుకు వెళ్లి పోయింది పావని.
    తన అందచందాల గురించి అంతకు ముందెన్నడూ ఆలోచించలేదు స్వామీ. 'అందాలూ అలంకారాలూ ఆడదానికీ గానీ మగ మహారాజు కెందుకయ్యా ' అనేది రంగజమ్మ తండ్రితో. తన తండ్రి పిలక తీయించడం గురించి అగ్రహారంలో పెద్దలంతా వింతగా చెప్పుకున్నారట. అమ్మకుమాత్రం సంప్రదాయాల మీద గౌరవం, 'మ్ముంమూర్తులా మీ తాత గారి పోలికరా తండ్రీ' అంటూ దగ్గరుండి దుద్దులు కుట్టించిన బామ్మ మురిసిపోయింది. అప్పుడు బళ్ళో నూ, ట్రయినింగ్ స్కూల్లో నూ ఎంతమంది గేలి చేసినా ఆ సంప్రదాయాన్ని విసర్జించ లేదు స్వామి.
    కాని--
    పావని వెళ్ళిన తర్వాత అద్దంలో పరకాయించి పది క్షణాలు తన ముఖం చూసుకోకుండా వుండలేక పోయాడు. తనకు తన ముఖం అలాగే అలవాటై పోయింది.... 'చందాలు ప్రోగు చేసి సంర్పించుకుంటాం. దయుంచి పిలక తీయించండి స్వామీ' అంటూ పావని నాటక పక్కీలో ప్రాధేయపడుతున్న భంగిమ గుర్తుకు వచ్చి, అటువంటి పరిస్థితుల్లో గూడా నవ్వుకోకుండా ఉండలేక పోయాడు. స్వామి.

                            *    *    *    *
    మర్నాడు నిజంగానే హైదరాబాదు ప్రయాణం కట్టారు రఘుపతిగారు.
    ఆ ఉదయం యింట్లో భార్య భర్తల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. బిగ్గరగా కేకలు పెడుతూ వస్తున్నా రఘుపతి గారు ముఖం చూస్తె భయంకరంగా కనిపించింది. కోపంతో రెచ్చిపోయిన మనిషిలో రాక్షసుడి పోలికలుంటాయి గామల్సు. 'తెచ్చావుటోయ్ ' అన్నాడు రఘుపతి గారు అంటే తన దగ్గర డబ్బు లేదని ఆయనకు తెలుసన్నమాట. లేకపోయినా ఎక్కడైనా సరే తెచ్చి యివ్వలసిన విద్యుక్త ధర్మం తనకున్నదన్నమాట.
    'గంటలో యిస్తానండీ'అంటూ చకచక అడుగులు వేసుకుంటూ బయటకు నడిచాడు స్వామి.
    ఇరకాటంలో పడ్డాడు. 'పాపం పసివాడు- ' అంటూ గోలగా గేలి చేస్తున్నట్లు మొద్దుబారిన గ్రాం ఫోనుపిన్ను ఆసరాతో రణగొణ ధ్వనిచేస్తూ టూరింగు సినిమా ఏడ్వార్టయిజుమెంటు నడుస్తుంది.
    అప్పుచేయవలసి వచ్చింది మొదటి జీతంకూడా అందుకొక ముందే. ఈ మహా విషయంలో తనకంత అనుభవం లేదు. దీన్ని ఒక మహా కళగా సాధన చేసి మహో జ్వాల చరిత్రలను సృష్టించి , దగాపడిన తమ్ముళ్ళందరికీ చిరస్మరణీయులైన మహానుభావు లెవరూ స్వామికి అంతకుముందు పరిచయంకాలేదు.
    ఎవరిని అడగాలిఆప్పు? -అని ఆలోచించినప్పుడు- రక రకాల మూర్తులు కార్టూను సినిమాలో బొమ్మల మాదిరి కళ్ళ ముందు కదిలాయి. హెడ్ మాష్టారు వెంకటరత్నం గారు గుర్తొచ్చి -- అయన యింటికి వెళ్ళాడు. ఒక్కగానొక్క కొడుక్కి అజీర్తి విరోచనాలు కావడంతో ఆయుర్వేదచార్లుగారితో సంప్రదిస్తున్న మాష్టార్ని చూశాక 'అప్పు' అడిగే ధైర్యం లేకపోయింది స్వామికి.
    హెడ్ మాష్టారు తన రాకను అపార్ధం చేసుకున్నాడు. 'బిడ్డ కింత జబ్బు చేసినా - ఇందరు టీచర్లున్నారు. నువ్వోచ్చావంటే నాలాగా నువ్వు అమాయకుడివి గనుక - ఊళ్ళో కలరా వుందే అనుకో, కేకవేస్తే పలికే అంతదూరంలో వున్నాడే పరాంకుశం ? ఈ చాయలకు రాలేదనుకో. అంతే! కష్ట కాలంలో గాని తెలియదు తన వాళ్ళెవరో.'
    స్వామి వచ్చినందుకు మాష్టారు సంబరపడిపోయాడు. నమ్మిన బంటుగా భావించి ' ఎంత బాధ పడుతున్నాడో కడుపు నొప్పితో బిడ్డ చూడు; అంటూ మంచం మీద కూర్చోబెట్టు కున్నారు. తనని గూడా. మాష్టారి దగ్గర నుంచి బయటపడే సరికి తలప్రాణం తోకకు వచ్చింది.
    'పాతికేళ్ళ సర్వీసులో బడికి లేటుగా వెళ్ళటం అలవాటు లేదు. కాస్త ఆలస్యంగా వస్తానని చెప్పు ఆ పరాంకుసానికి. బంట్రోతు కు కూడా కలరాట' అంటూ వీధి సగం దాకా వచ్చి సాగనంపి పోయాడు మేష్టారు.
    స్కూలులో అడుగు పెడుతూనే పరాంకుశం గారి దగ్గర కెళ్ళి హెడ్ మాష్టారు లేటుగా వస్తారన్న సంగతి చేప్పాడు.
    'పాపం! లేక లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు విన్నావంటయ్యా! మన స్కూలు బంట్రోతు కూ కలరా తోనే పోయాట్ట.'
    'ఎప్పుడండీ.'
    'ఉదయంట'    
    'మీ దగ్గర ఓ యాభై రూపాయలుంటే బడులిస్టారా?' ఎవరిని ఆడకూడదనుకున్నాడో ఆ పరాంకుశం నే చివరకు నోరు తెరిచి అడిగేశాడు.
    'అంత అవసరమేమొచ్చిందయయ్యా? అన్నాడు పరాంకుశం.
    'యింటికి పంపించాలండి అర్జంటుగా.
    'ఏం? మీ అమ్మగారి కేమన్నా -- కొంప తీసి - దేశమంతా కలరా తగిలి - పోతున్నారు పక్షుల్లా.'
    తలవంచుకున్నాడు స్వామి.
    'ఒంటిగంటకిస్టా. మూన్నెల్ల క్రితం యిలాగే తీసుకెళ్ళాడు కొత్త గుమస్తా వెంకటేశం. పెళ్ళాం ప్రసవించడానికి హాస్పిటల్లో చేరిందంటూ అసలీ పెళ్ళి కాలేదని తర్వాత తెలిసింది. నిలదీసి అడిగా నిన్న. ఇవాళ ఒంటి గంటకు యిస్తానన్నాడు.'
    పన్నెండు గంటలకు బడికి వచ్చిన హెడ్ మాస్టారు రాగానే స్వామిని పిలిపించి 'నిజమేనా బాబూ పరాంకుశం చెప్పాడు. మీ అమ్మగారికి కూడా ప్రాణం మీద కొచ్చిందిట.?'
     స్వామికి ఊపిరాడలేదు.
    'ఏమిటి సుస్తీ? గుండె జబ్బా?'
    తలూపాడు. అస్పష్టంగా స్వామి.
    నిట్టూర్చాడు మాష్టారు ఆలోచనల్లో మునిగి, తేలి, కళ్ళజోడు తీసి టేబిలు మీద గిరవాటేట్టి, 'మా అమ్మ కూడా గుండె జబ్బుతోనే చచ్చిపోయింది' అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.
    "బాధపడకండి మేష్టారు-- ఇంకేమనాలో తెలియలేదు.
    "కాదబ్బాయ్! అందరం పోయేవాళ్ళమే అనుకో. నేను హెడ్ అయ్యేదాకా నన్నా బ్రతికుంటే నాకింత బాధ వుండేది కాదు -- నువ్వు హెడ్ మాస్టార్ వైతే చూడాలని వుందిరా అబ్బీ- అంటుండేది . అమ్మ పోయిన మానసికం నాటికి గాని అర్దరు తాలేదు. అందుకే ఇంత పదవి వచ్చిందన్న మాటేగాని, సంతోషం లేకుండా పోయింది ఏం చేసుకోను చెప్పు?'
    మాష్టారి చెంపల మీద నుంచి ధారాపాతంగా కారుతున్నాయి కన్నీళ్లు. మనుమల్ని ఎత్తుకోగల వయస్సున్న పెద్ద మనిషి- ముగ్గుబుట్టలా నెరిసిన గడ్డాన్ని తడుముకుంటూ అలా వెక్కివెక్కి ఏడుస్తున్నప్పుడు స్వామి కళ్ళు గూడా చెమ్మగిల్లాయి. అంత సున్నితమైన మనస్సు ,మాష్టారుది. ఆయను ఒదార్చగల వయస్సు కాదు తనది.
    చివరకు హెడ్ మాష్టారు చీడుకుని, పంచె కొంగుతో కళ్ళు తుడుచుకొని, కుట్టు బనీను తో జేబులో పంచెకట్టు మాటున దాగిన పర్సు తీసి మూడు మడతలు విప్పి- "చివరి మడతలో దాక్కున్న రెండు పదిరూపాయల నోట్లు బైటకు తీసి స్వామి చేతిలో పెట్టి "ఎందుకన్నా మంచిది ఈ మొత్తం కూడా నీ దగ్గర ఉంచుకో బాబూ. ఇంగ్లీషు డాక్టర్ల్ని పిలిపించి గట్టి వైద్యం చేయించు. చేతిలో డబ్బు ఆడక నాటు వైద్యం చేయించి, విషంలాంటి కషాయం గొంతులో పోసి,హింసించి అమ్మను చంపుకున్న దౌర్భాగ్యుణ్ణి- నువ్వు హెడ్ మాస్టారు అయేదాకా నన్న మీ అమ్మను వ్రతికించుకో బాబూ. వెళ్ళు బాబూ వెళ్ళు. ఆలస్యం చేయకు. అమ్మను బ్రతికించుకో.' అంటూ రెండు చేతులతో  స్వామి అరచేయిని గట్టిగా నొక్కాడు.
    ప్రాణం లేని ప్రతిమ లా నడుస్తూ రఘుపతిగారింటికి బయలురేరాడు స్వామి. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS