Previous Page Next Page 
పాప నవ్వింది పేజి 6

 

    కమల విస్తుపోయి 'రెండే కదమ్మా నా జీతం' అని మూడోది బల్ల మీద పెట్టింది.
    రాజేశ్వరి మళ్ళీ అది తీసి కమల చేతిలో పెట్టి నువ్వు నాకెంత సాయంగా వన్తున్నావో తెలుసా. నువ్వొచ్చి నేలైనా కాలేదు. నేనన్నీ నీకప్పగించి హాయిగా తిరుగుతున్నాను. ఇప్పుడు పాప పనే కాక ఇల్లంతా ఎవరు చూస్తున్నారు. నువ్వేగా. ' అన్నది.
    'దానికేముందమ్మా. ఏమీ చెయ్యకుండా యెట్లా వుంటాను రోజంతా ముంగిలా. మునుపు మా యింట్లో ఎట్లా అన్నీ చూసుకునేదాన్నో ఇక్కడా అంతే గదా. దానికి మీరివ్వాలా" అంటూ మళ్ళీ అడబ్బివ్వ పోయింది.
    రాజేశ్వరి కొంచెం కోపంగానే 'సరే, అయితే ఈ రోజు నించి నువ్వు పాప పనే చూడు. అదీ పై పనే, నా కింక నీవేమీ చెప్పద్దు' అంటూ అటు తిరిగింది.
    'అది కాదమ్మా మీరు కోపగించుకోకండి. నా అనేవాళ్ళు ఆదుకునేవాళ్ళూ లేని నిరాశ్రయురాలిని నన్ను మీరు ఆదరించి ఇంత చోటు చూపించారు. మీ ఇంట్లో ఒకతేగా మీ బిడ్డల్లె ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు అభిమానంగా. నాకిప్పుడు మీ దగ్గర....'
    అంటుండగానే రాజేశ్వరి అందుకుని 'కనకనే కమలా నే చెప్పినట్టు విను. నా మాటకి విలువ ఇచ్చి ఇట్లాగే ఈ ఇంట్లో ఒకరిగా నిలిచి పో' అన్నది. కమల ఇంకేం మాట్లాడక ఆ డబ్బు తీసుకువొచ్చేసింది.
    ఈమధ్య కమల తన ఇంటికి వెళ్ళొచ్చింది ఒకసారి. నరసయ్య ఎవర్నో అద్దెకి ఇంట్లో పెట్టాడు. కమల తన మిగిలి పోయిన బట్టలు, ఫిడేలు తీసుకుని నరసయ్య ని అనూరాధని చూసి వచ్చింది. ఇక్కడి సంగతులన్నీ విన్నాక వాళ్ళు కూడా మంచి చోటు దొరికినందుకు సంతోషించారు.
    ఆ పూటకంతా పాప ఏమీ తోచకుండగా ఇంట్లోకి బైటికి తిరిగింది. ఎటొచ్చి కమల ఎంతో నచ్చ చెప్పి వెళ్ళటాన ఎవరితోటీ పేచీ పడలేదంతే. కమలీ రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకుంది. కమలీ ఇచ్చిన పళ్ళు బొమ్మ తీసుకుని మురుస్తున్న పాపను చూసి శ్రీనివాసరావు గారు' భలేదానివమ్మా కమలా , పిల్లనిట్టే మచ్చిక చేసుకున్నావన్నారు.
    రాజేశ్వరి నీరజ కోసం బొంబాయి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు కమలకి, శ్రీనివాసరావు గారికి అంతా ఒప్పచేప్పి మరీ వెళ్ళింది. నిశ్చింతగా ఇప్పుడామెకి పాప భయం కూడా లేదు. అక్కడ వియ్యాలవారుండ మనటంతో ఇంకో రెండు రోజులాగి మరీ నీరజతో వచ్చింది.
    అప్పటికే కమల నీరజ కోసం ఒక గది తుడిపించి, గదిలో కావాల్సినవన్నీ అమర్చి పెట్టింది. రైలు టైముకి శ్రీనివాసరావు గారితో పాటు పాపని కూడా కార్లో , స్టేషన్ కి పంపింది.
    'ఈ దుడుకు పిండాన్ని నేనపగలనా అమ్మాయ్.'
    అయన మాటలకి నవ్వి 'పాప బుద్దిగా వుంటానని మాట ఇచ్చింది లెండి' అన్నది కమల. వాళ్ళు వెళ్ళినాక మళ్ళీ ఒకసారి అన్నీ సరిగ్గా వున్నయ్యా లేదా అని చూసి బైట కొచ్చి నిలబడ్డది.
    ఇంట్లో కారొచ్చి ఆగింది. పాప దిగి 'అదుగో మా కమలీ అని అరుస్తూ వో ఇరవై ఏళ్ళ అమ్మాయిని చెయ్యి పట్టుకు లాక్కురావటం చూసింది కమల. వాళ్ళకి ఎదురెళ్ళి రాజేశ్వరి చేతుల్లో శాల్వా అందుకుంది. పాపకి సాక్షాత్తు మేనత్తే నీరజ, ఆ రూపంలోనూ , మాటలలోనూ , నడక లోనూ చాలా అందంగా నాజూగ్గా వుంది. కాస్త ప్రయాణంతో అలిసినా మహా చురుగ్గా వుంది.
    కమల వంక చూస్తున్న నీరజకి కమల ని పరిచయం చేసి 'చూడమ్మా కమలా. నువ్వు కనిపెట్టి చూసుకోటానికి అమ్మాయిని తీసుకొచ్చా. అత్తింటి పిల్ల. ఎట్లా చూస్తావో ఏమిటో' అంటూ నడిచింది.
    'నిన్ను చూడక పోయినా చూసినట్లు గానే వుంది కమలా. అక్కడున్న నాలుగు రోజులు అమ్మ నీ గురించే చెప్పేది, కమల అట్లా చేస్తుంది ఇట్లా మాట్లాడుతుందంటూ . ఇంక స్టేషన్ లో దిగానో లేదో వసపిట్ట 'మా కమలీ' అంటూ ఒకటే పాట. నాకు నిజంగా కోపం వచ్చిందనుకో వీళ్ళకి ఇంత దగ్గిరైన నీ మీద' అంటూ 'నేనూ నిన్ను కమలీ' అనే అంటాను. సరేనా' అంది. కమల నవ్వుతో ;అనండి. పోయిందేముంది' అన్నది.
    వాళ్ళిద్దరూ రెండేళ్ళు హెచ్చు తగ్గుగా ఒక వయసు వాళ్ళు. కావటాన సంస్కారం కలవాళ్ళు కావటంతో యిట్టె స్నేహం కలిసిపోయింది. ఇప్పుడు పాపతో ముగ్గురూ జతగా తిరగడం మొదలెట్టారు. కమల 'అండి' అనద్దంటే మానకపోవటంతో నీరజ ఒక పూట కోపమొచ్చి మాట్లాడలేదు. అత్త కమలీ ఎందుకు మాట్లాడుకోవడం లేదా అని పాపకి తోచలేదు. పాప, నీరజ ఒకటి కావడంతో కమల కింక ఏమీ చేతకాక వాళ్ళు మాత్రం ఉన్నప్పుడు పేరుపెట్టి పిలవటానికి వొప్పుకుని రాజీ పడ్డది.  
    తల్లి కూతుళ్ళు విశ్రాంతిగా మాట్లాడుకుంటున్నారు. కమలతో ఇంట్లో వచ్చిన చైతన్యానికి వాళ్ళు సంతోషిస్తూ. పాపకే కాకుండా, ఇంట్లో అమ్మకి చేదోడుగా , మిగతా వాళ్ళందరికీ తల్లో నాలికల్లె వున్న కమలని చూసిన నీరజ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు వాళ్ళకి పాపలో కూడా మార్పు కనపడుతున్నది. మునుపటల్లె మూతి ముడుచుకుని ఎవరికీ అంటకుండా కూర్చోడం లేదు. సంతోషంగా ఇల్లంతా ఏకం చేస్తూ బొంగరం అల్లే తిరుగుతున్నది. పకపకా మనసారా నవ్వుతున్నది. ముద్దుగా అల్లరి చేస్తున్నది. తను చెయ్యటమే కాక చుట్టూ వున్న వాళ్ళ చేత చేయిస్తున్నది. ఇప్పుడా ఇల్లు నవ్వులతో ఆటలతో పాటలతో మోగిపోతున్నది. చెప్పిన మాట వినకుండా మంకుగా వుండే పాప ఇప్పుడు ముద్దుగా మాట వినటం మొదలు పెట్టింది.
    మంచి అలవాట్లు నేర్చుకుంటున్నది పాప. పాలు తాగినాక నీళ్ళలో చెయ్యి ముంచి మూతి తుడుచుకోటం నీరజ చూసింది. 'అదేమిటి పాప కొత్త అలావాటు' అని అడిగింది.
    'కమలీ చెప్పింది. లేకపోతె మూతి నల్లబడుతుందిట' అన్నది.
    చదువంటే కూడా ఇప్పుడు శ్రద్ధ చూపిస్తున్నది. ఒకరోజు పొద్దుటి పూట టైమెంతైందత్తా అని అడిగి పుస్తకాలను తెచ్చుకుంది.
    'నీకు టైమేమిటమ్మా పాప?'
    'కమలీ ఇప్పుడు నాకు చదువు చెప్తుందిగా' అన్నది. ఎన్నో ఇంగ్లీషు నర్సరీ రైమ్స్ , చిన్న తెలుగు పాటలు పాడటం మొదలుపెట్టింది ముద్దు ముద్దుగా.
    పాప టీపార్టీ కి అత్తనీ, మామ్మనీ ఒక సాయంత్రం పిలిచి పళ్ళు, బిస్కెట్లు పెట్టింది. చిన్న కేటిల్ మూత మీద చెయ్యి పెట్టి పాలు వంచడం చూసి ' ఇదెప్పుడు నేర్చుకున్నావ్ పాపా' అంది నీరజ.
    'కమలీ చెప్పింది ఇట్లా పోయ్యాలిట లేకపోతె మూత 'డమీ' అని పడిపోతుందిట' అన్నది. ఆరిందా అల్లే. ఇట్లాగే థాంక్స్ చెప్పటం, సారీ అనటం అలవాటైనై. ఇప్పుడు కొత్త విషయాలు చాలా తెలుసుకుని మాట్లాడుతుంది పాప.
    ఒకరోజు రాజేశ్వరి బైటి కేల్తూ 'పాపా నీకేం కావాలమ్మా' అన్న వెంటనే పాప 'శివాజీ బొమ్మ' అంది. ఆ మాటలకి విభ్రాంతి తో వాళ్ళు' అదెవరు పాపా' అన్నారు.
    'వో పెద్ద రాజుగారుట. ఆరంజిజేబుతో విద్డం చేసేవాట్ల.' వాళ్ళు విరగబడి నవ్వుతూ 'ఆరంజిజేబెవరమ్మా' అంటే?
    'నీకు తెలియదులే. మా కమలీ చెప్పింది. నాకు కమలీ రోజూ కధ చెప్పాల్సిందే. లేకపోతె వూరుకుంటానా ' అంటూ నవ్వుతూ వేలాడిస్తూ వెళ్ళింది.
    'అవునమ్మా. మొన్న రాత్రి నే వెళ్ళేటప్పటికి కమలీ అన్నం తినిపిస్తున్నది. ఇది మామ్మ ముద్దు, ఇది అత్తది, ఇది నాన్నది' అంటూ. ఇంతలో పాప 'నే తిననంటూ' కూర్చున్నది కధ చెప్పకపోతే. కమలీ 'నీకింకా ఏం చెప్పనమ్మా , నా కొచ్చిన కధలన్నీ చెప్పా కదా. సరే, రోజూ వోకధ వెతుక్కునే బదులు పెద్ద కధ చెప్తాను. నీకు రామాయణం కావాలా భరతం కావాలా' అంది. 'రామణం' కాదమ్మా రాముడి కధ చెప్పనా, కృష్ణుడి కధ చెప్పనా' అన్నది. అప్పుడు పాప రాముడి కధ అడిగింది. ఇట్లాగే రోజూ చెప్తుంది కాబోలు.'
    'వోహో అందుకా అమ్మాయి పదజాలం లో తాటకి, మంధర లాంటి మాటలు కూడా దొర్లుతున్నాయి-' అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది రాజేశ్వరి.
    నీరజ కమలా స్నేహం అల్లుకు పోయింది. బైటి కెళ్ళినప్పుడల్లా ఇద్దరూ తోడుగా వెళ్తారు. పాప మొదట్లో తనూ వస్తానని మారాం చేసేది. కాని కమల చెప్తే విని రమణమ్మ దగ్గరే వుండటం నేర్చుకుంది. 'ఈ మంకుపిల్ల నెట్లా దారికి తెచ్చావు కమలీ' అంటే 'పాప మంకుపిల్లా ఎవరన్నారు నాకు తెలియదే' అనేది కమల.
    'నువ్వోచ్చినా' నాకు హాయిగా , తోడుగా వుంటున్నది కమలీ' అనేది నీరజ.
    కమలకి కూడా తన ఈడు పిల్లతో తిరగటం ఆనందంగానే వుంది. కాని నీరజ ఏదైనా కొనిస్తే మాత్రం కమల తీసుకునేది కాదు. కాస్త ఇద్దరూ ముఖాలు తిప్పుకు తిరిగేవాళ్ళు ఒక గంట అంతే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS