"పెట్టె వెలితో, మనసు వెలితో సరిగా చూసుకో ఏమంటే, ఈ పెళ్ళిలో మనస్సు దొంగిలించే జాణలు కూడా ఉన్నారు" అంటూ జోక్ విసిరాడు పెళ్ళికొడుకు. అప్పటికే శివరాం వ్యవహారం స్నేహితుల ద్వారా చూచాయగా తెలుసుకుని - తక్కిన స్నేహితులంతా ఘొల్లుమన్నారు. సరిగ్గా అదే సమయానికి తనూ సీతా, మెట్లన్నీ ఎక్కి అక్కడికి చేరుకున్నారు. పెట్టి సర్దుకుంటూన్న వాడల్లా తఃనకేసి చూశాడు శివరాం. తనని చోడగానే ఏదో పెద్ద ఆందోళన తగ్గి స్థిమితపడ్డట్టు అయాడు అతను. తన స్నేహితుల్ని పెళ్ళికొడుకు సీతకి పరిచయం చేయసాగాడు. అభినందనలు తెలిపి. ఒక్కొక్కళ్ళే పెట్లూ బెడ్డింగులూ పుచ్చుకుని మెట్లు దిగి వెళ్ళారు. కాస్సేపటిలో వచ్చే బస్సుకి కిందహాల్లో వేచి ఉండడం కోసం. చివరికి పెళ్ళికొడుకూ, సీతా, శివరాం, తనూ నలుగురూ మిగిలారు మేడమీద గదిలో -
ఆ తర్వాత పెళ్ళికొడుకు, పక్క వరండాలోకి కావాలని వెళ్ళి, "సిగరెట్టు పెట్టి ఇలా పట్రా అని కేకేసి, సీతని కూడా వరండాలోకి రప్పించు కొని తనకీ శివరాంకి ఏకాంతాన్ని ఆ గదిలో కల్పించాడు. గదిలో తనూ....ఎదురుగుండా శివరాం.....గుండె ఏదో తెలియని భయంతో వేగంగా కొట్టుకో సాగింది. ఇద్దరూ ఒకళ్ళ కేసి ఒకళ్ళు చూసుకున్నారు. ఏదో మాట్లాడుకోవాలని కోరిక ఇద్దర్లోనూ..... కాని ఎలా?.....ఏం మాట్లాడాలి? ఎవరు ముందు పలకరించాలి? ...... నిముషాలు బరువుగా కదులుతున్నాయి. చివరికి శివరామే సాహసించి కొంచెం దగ్గరగా వచ్చి "మరి నేను వెళుతున్నాను" అన్నాడు, తను బాధగా "ఊ" అని ఊరుకుంది.
"పెళ్ళికి వచ్చి ఒకటి పారేసుకున్నాను. అది మీరు దొంగిలించారు" అన్నాడు. శివరాం బాధగా బరువుగా.
అదిరిపడి "నేనా" అంది కంగారుపడుతూ తను భయంగా.
"అవును.....మీరే?....సరిగ్గా నా కళ్ళల్లోకి చూసి చెప్పండి ఏం దొంగిలించలేదని" నవ్వుతూ అడిగాడు శివరాం. తన ఒళ్ళు ఝల్లుమంది.
ఎక్కడి నుంచో మంత్రాలతో కలిసి వినిపిస్తూ శ్రావ్యమైన సన్నాయి పాట! కొత్త తాటాకుల పచ్చితోరణాల వాసన్లతో కలిసి వీస్తూన్న జాజుల పరిమళం?
పద్ధెనిమిది సంవత్సారాలుగా గుండెల నిండుగా దాచుకున్న మధురమైన దివ్యానుభూతి. హృదయంలో మెల్లగా కరిగి భావాల్లో బరువుగా కదిలి, తన కళ్ళల్లోంచి శివరాం పాదాల మీదకి రెండు ముత్యాలుగా కురిసింది.
"ఛ...ఏమిటిది?" అంటూ శివరాం కొనగోటితో తన కంటిదగ్గర తుడిచేదాకా ఏం జరిగిందో తనకి తెలియలేదు. అతని స్పర్శతో ఒళ్ళంతా, వీణమీటినట్లూ, విధ్యుత్తులు ప్రవహించినట్లూ, భరించలేని చలనంతో పులకించింది అతనిచేతిని తనచేతితో ఆమట్టునే అదిమి పట్టుకుని, కింది పెదిమి ఆగడాన్ని పై పెదిమితో నొక్కిపట్టి, గుటక వేసి నోటమాటలేకుండా ఉండిపోయింది. తను తాటాకులా చలించిపోతూన్న తనని పొదివిపట్టుకుని దగ్గరగా తీసుకున్నాడు శివరాం. మాటలకందని ఆ మధుర సమాధిలో ఎంతసేపో....ఎంతసేపో....బయట అడుగుల సవ్వడి అయి, తనూ శివాం విడివిడిగా విడిపోయి. ఒకరి ఎడ్రస్ ఒకరు అడిగి రాసుకుంటూన్నట్లు నటించ సాగారు.
ఇంతలో పెళ్ళికొడుకూ సీతా నవ్వుకుంటూ అక్కడికి వచ్చి, "అబ్బే.....ఇంకేమి ఎడ్రస్ లు విడివిడిగా ఉంటే లాభంలేదు" అన్నారు. ఆ తర్వాత అమ్మకి ఎన్నివిధాలో నచ్చచెప్పి నాన్నని ఒప్పించేటప్పటికి ఆరునెలలు పట్టింది. ఆఖరికి "మీ తల్లీ కూతురూ కలసి నిర్ణయం చేస్తున్నారు. సరే కానియ్యండి. పోలీసు ఇన్ స్పెక్టరు చేస్తున్నాడు. అందంగా ఆకర్షణగా ఉన్నాడు. అన్నదే చూస్తున్నారు కాని ఆస్తీ డబ్బూ ఇదేం ఆలోచించడంలేదు. డబ్బుకి మాత్రమే విలువ ఉన్న రోజులివి..... సరే.... సరే "అంటూ శివరాం కాళ్ళు కడిగి తన కోరికల మందిరానికి తోరణాలు కట్టాడు నాన్న........
ఇలా గతాన్నంతా చల్లగా స్మరించుకొంటూన్న సునంద వెచ్చగా కిటికీలోంచి సూర్యకిరణాలువచ్చి తనని తాకుతున్నాయనీ, తియ్యని ఊహల్ని, చేదైన నిజాలుగా మార్చిన కాలం, హాస్పిటల్ కి వెళ్ళి శివరాం కి ఓవల్టీస్ ఇవ్వవలసిన టైమయిందని, తనబాధ్యతని గుర్తు చేస్తోందనీ గమనించనేలేదు. వీధితలుపు ఎవరో దబదబా కొట్టుతున్నట్లయి. ఉలిక్కిపడిలేచి తలుపు తీసింది. ఎదురుగుండా జిప్ బేగ్ పట్టుకుని గోపాలం! కష్టాల్లో ఉండగా ఆత్మీయులు కనిపిస్తే దుఃఖం కట్టలు తెంచుకు ప్రవహిస్తుంది. మరిదిని చూసేటప్పటికి సునందకి అలాగే అయింది.
"కళ్ళనీళ్ళు పెట్టుకోకువదినా....అన్నయ్యకి ఎలాఉంది?" అన్నాడు ఆదుర్దాగా గోపాలం. దుఃఖంతో గొంతు పెగలలేదు సునందకి పైట చెంగుతో కళ్ళు అద్దుకుమ్తూ "అలాగే ఉంది" అన్నట్లు తల నిలువుగా ఊపింది. ఆ తర్వాత తనని తాను సంబాళించుకొని "రత్నంకులాసాయేనా? బాబు ఆరోగ్యంగా ఉన్నాడా? పోనీ వాళ్ళనికూడా తీసుకురాకపోయావా?" అంది సునంద. "కొన్నాళ్ళలో ఏకంగా అంతా ఇక్కడే ఉందాం. నే నిక్కడికి ట్రాన్స్ ఫర్ చేయించుకో బోతున్నాను అన్నాడు గోపాలం. ఆహా.....నిజంగానే..... లే..... మొహం కడుక్కో.....కాఫీ పెడుతున్నా.....తర్వాత మీ అన్నయ్యకి ఓవల్టీసు పెట్టి హాస్పిటల్ కి పట్టికెళతా "అంది సునంద. "ముందు అన్నయ్యకి ఓవల్టీసు పెట్టు. హాస్పిటల్ కి నేను పట్టుకెళతా" అన్నాడు గోపాలం. ఆ మాటకే ఎంతో విశ్రాంతి లభించినట్లు ఆనందించింది సునంద-
5
"అక్కయా నీకేవో రెండు కవర్లు వచ్చాయి. టేబిల్ మీద పెట్టాను" అంది రత్నం. అప్పుడే ఆఫీసునుంచి వచ్చి మెట్లు ఎక్కుతున్న సునందతో. పాకు కుంటూ వచ్చివచ్చి కాళ్ళకు చుట్టేసిన బాబిగాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ. "అహా ...... అలాగా. చూస్తా అంటూ టేబిల్ కేసి నడిచింది సునంద.
కాఫీ పట్టుకుని వీధిగదిలోకి వచ్చిన రత్నం. ఉత్తరాలు చేత్తో పుచ్చుకుని దిగాలుగా కూచున్న సునందని చూసి గతుక్కుమని, "ఏమిటి అక్కయ్యా అలా వున్నావేం? ఉత్తరాలు ఎక్కడ నుంచి" అంటూ ఆదుర్దాగా ప్రశ్నించింది. వెంటనే సునంద తనను తాను సంబాళించుకుని "అబ్బీ.....ఏంలేదు..... కాఫీ నువ్వు తెచ్చావా? నేను కాళ్ళు కడుక్కుని వంటింట్లోకి వద్డునుగా?" అంటూ లేచింది, ఒళ్ళోవున్న బాబిగాడిని చంకనెత్తుకుంటూ - మాటకూడా తప్పించాలని చూస్తూ.
"ఉత్తరాలు ఎవరురాశారు?" రత్నం ప్రశ్నలో ఇంకా ఆదుర్దా తగ్గలేదు. "మా స్నేహితురాలు సీత అని వుందిలే." అదొకటి రాసింది. రెండోది మా అమ్మ" ఏదో ఆలోచిస్తూ తాపీగా జవాబు చెప్పింది సునంద.
"అంతా క్షేమమేనా, ఏం రాశారు?" అమాయకంగా ప్రశ్నించింది రత్నం, "ఆ" అన్నట్లు తల ఊపి ఆపైన జవాబేం చెప్పకుండా ఊరుకుంది సునంద. ఏం చెబుతుంది? సీత తనని ఉత్తరంలో తలవాచేటట్లు చివాట్లుపెట్టింది.
"నీ పట్టుదల మూలాన్ని మీ అమ్మా, నాన్నా మానసికంగా చాలా బాధపడుతుణరంది. అటువంటి తల్లిదండ్రులు ఎంత అదృష్టం వుంటేనో కాని దొరకరంది. భర్త మీదమక్కువ వుండొచ్చు కాని. అది కారణంగా కన్నవారిని హింసించడం పరమ కిరాతకం అంది. మగవాడు కనుక నాన్న మనస్సు దిటవు చేసుకుని ఎలానో పైకి గంభీరంగా వుండగలుగుతున్నాడు కాని, నువ్వు పట్టుదలపట్టి పుట్టింటికి రానందుకూ, నయాపైసా వాళ్ళది ముట్టనందుకూ, ఉద్యోగం చేసి సంపాదించి రాత్రింబగళ్ళు శ్రమపడుతున్నందుకూ, అస్తమాను కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ మీ అమ్మ కృశించి పోతోంది అంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కమారు తల్లిదండ్రుల్ని చూసి రావడం వివేకవతి అయిన నీ ధర్మం అంటూ నిష్ఠూరంగా జాబు ముగించింది సీత ఈ ఆరాలన్నీ రత్నానికి సునంద ఏం చెబుతుంది. అందుకనే సమాధానం ఏం చెప్పకుండా మౌనంగా ఊరుకుంది. తన ప్రశ్నకు సునంద జవాబు చెప్పకపోవడంతో. ఎందుకు అడిగాన అని బాధపడి, రత్నం మనస్సు చిన్నబుచ్చుకుంది. సునంద కూడా తన ఆలోచనలో తను వుంది. అమ్మ ఉత్తరం సీత ఉత్తరం మీద మోతాదులో ఏం తక్కువగా లేదు. అయితే అదే విషయం చివాట్లు పెట్టినట్లు కాకుండా బాధగా. మనస్సు కరిగేలా రాసింది. "ఆశలన్నీ నీమీదే పెత్తుకున్నాం-నాన్న ఏదో అన్న రని అలిగి, ఉద్యోగంతో శరీరాన్ని, వేదనతో మనస్సునీ, కష్టపెట్టుకోవడం ఎందుకు తల్లీ- మా మీద కోపం మాని. రేపు పండగలకి వచ్చి రెండు రోజులు వుండి వెళ్ళు, ఈ ఆస్తీ సంపదా. ఆశలూ, చివారికి మా బ్రతుకులూ, అన్నీ నీ కోసమే కదా - ఇవన్నీ కాలదన్ని అక్కడ ఒక్కత్తెవీ దిక్కులేకుండా, పురాణాల్లో సతీ సావిత్రిలాగ ఇక్కట్లుపడతావా? ఏం లోటు అమ్మా నీకు! అమ్మా నాన్న లేరనుకున్నావా" ఇదీ అమ్మ ఉత్తరం. మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటే కళ్ళమ్మట నీళ్ళు రాసాగాయి సునందకి.
"కాఫీ చల్లారిపోతోంది తీసుకో అక్కయ్యా" అంది రత్నం.
"అయ్యో మరచేపోయాను" అని నొచ్చుకుంటూ కాఫీ గ్లాసు అందుకుని, చంకనున్న చంటాడిని రత్నానికి అందించబోయింది సునంద. కాని వాడు అమ్మదగ్గరికి వెళ్ళనంటూ వెనక్కి సునంద భుజం మీదకే వాలిపోయాడు. "ఏరా దొడ్డమ్మ దగ్గరే బావుంది ఏమిటి? అంది రత్నం, వాడు అవునన్నట్లు తల ఊపాడు. "హారి భడవా" అంటూ నవ్వుతూ తుంటిమీద ఓటి అంటించింది. సునందకూడా పకపకా నవ్వుతూ వాడిని గుండెలకి గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టుకుంది.
ఉత్తరాలు తెచ్చిన వ్యాకులతని బాబిగాడి వల్ల వచ్చిన ఆ ఆనందం దూరంగా తరిమేసింది. పాలల్లో కడిగిన ముత్యంలా సునంద మనస్సు తేలిగ్గా. స్వచ్చంగా హాయిగా అయింది. ఇంతలో గోపాలం ఇంట్లోకి అడుగుపెడుతూ "ఏమిటి అక్కా చెల్లెళ్ళు అంతగట్టిగా నవ్వుతున్నారు!" అన్నాడు. ఇన్నాళ్ళకి వదిన ముఖంమీద విషాద మేఘం తొలగి కాంతిరేఖ కన్పించింది కదా అనే సంతోషంతో- మరిదికి విన్పించేటంత గట్టిగా నవ్వినందుకు సిగ్గుపడి, బాబిగాడిని తీసుకుని పక్కగదిలోకి వెళ్ళిపోయింది సునంద.
రత్నం బుగ్గమీద చిటికేసి నవ్వుతూ, కళ్ళతో పలకరించాడు గోపాలం. బుగ్గలు ఎరుపెక్కికోపంతో "ఏమిటది? అక్కయ్య చూస్తుంది" అంది రత్నం. చూడనీ-చెల్లెలు మరిదిని బాగానే ఆకట్టుకొంది అనుకుంటుంది" అన్నాడు గోపాలం కొంటెగా. "చాల్లెండి బట్టలు మార్చుకోండి - కాఫీ తెస్తా" అంటూ వెనక్కి తిరిగిన రత్నం మెడమీద వెచ్చగా ముద్దుపెట్టుకొని, వెంటనే ఏమీ ఎరగనట్లు హేంగర్ దగ్గరికి నడిచాడు గోపాలం ఒళ్ళంతా పులకింతలయిపోయి, తనలో తను నవ్వుకొని, ఆనందలోకాల్లో తేలిపోతూ, లోపలికి వెళ్ళిపోయింది రత్నం.
