Previous Page Next Page 
పిల్లలతో ప్రేమయాత్ర పేజి 7

 

    ఐతే పదినెలల పిల్లకి సీసాతో పాలు పట్టటం వాళ్ళ కంటికి మహాపరాధంగా కనిపించింది. పిల్లకి పాలివ్వకపోతే దానికి కారణం ఖచ్చితంగా తన సౌందర్యం పాడయి పోతుందన్న భయమేనని వారి ఉద్దేశ్యం.
    అలా కాస్త చదువు, షోకులు ఉన్నఅమ్మాయిలను తమకు, ప్రబల విరోధులుగా భావించి ఎలాగోలా వాళ్ళను అవమానపరచాలని , కించ పరచాలని చూస్తుంటారు. చాలామంది అవిద్యావంతులైన వయసు మళ్ళిన స్త్రీలు.
      ఐతే వో గంట, రెండు గంటలు గడిచిన తరువాత కళ్యాణి మంచితనం, పిల్లల మంకు తనం, కాంతారావు లోని పెద్ద మనిషి తరహ అన్నీ చూసి ముచ్చట పడి వాళ్ళతో స్నేహపూర్వకంగా మాట్లాడటం ప్రారంభించేరు.
    తిరుపతి లో పిల్లవాడికి తలనీలాలివ్వ బోతున్నారన్న సంగతి విని సంతృప్తి చెందేరు. ఆడవాళ్ళు -- చదువుకున్నప్పటికీ వీళ్ళకు దైవభీతి బాగానే ఉందని.
    'బాబూ! నీ పేరేమిటి?' అంటూ బాబిగాడిని ఒక ముసలాయన యెత్తుకోగానే సమాధానంగా వాడు అయన ముక్కు మీదకు వాలి ఉన్న కళ్ళ జోడును చటుక్కున లాగి పారవేసాడు.
    హటాత్తుగా జరిగిన అ సంఘటనకు మొదట అదిరి పడ్డా వెంటనే సర్దుకుని నవ్వేడు ముసలాయన.
    'నీకెందుకు నాయనా! నచ్చేయి ఆ కళ్ళజోడు అది లేకపోతె నాకు కళ్ళు కనపడవు.' అన్నాడు.
    బాబిగాడు అయన అభ్యర్ధనను విననట్టే నటిస్తూ కళ్ళజోడును రెండు వేళ్ళతో పట్టుకుని పైకీ క్రిందికి నిశితంగా పరిశీలించసాగెడు.
    'ఇంక చూట్టం అయింది గా ఇవ్వు బాబూ!' అంటూ జోడును తీసుకో బోయాడు.
    'ఊ, ఉండు. చూడనీ!' అంటూ సీరియస్ గా అయన మీద విసుక్కుని ఆ జోడును ఒంటి వెలి మీద పెట్టి బాలెన్స్ చెయ్యటానికి ప్రయత్నించసాగెడు బాబిగాడు.
    ఆ దృశ్యం చూసేసరికి ఆ ముసలాయన గుండెలు గుండెల్లో లేవు. మదన కామరాజు కధలో రాజకుమారుడు గనుక రాక్షసుని ప్రాణం గల చిలకను పట్టుకున్నప్పుడు ఆ రాక్షసుని గుండె ఎలా విలవిలాడి పోతోందో ఆ ముసలాయన ప్రాణం కూడా ఆ సమయంలో అలాగే కొట్టుకో సాగింది. తాను మాట్లాడకుండా ఊరుకుంటే ఆ పిల్లవాడు కళ్ళజోడు ను క్రింద పడేసి ఎక్కడ పగల కొడ్తాడో నని వో పక్క భయం. గట్టిగా కోప్పడి లాక్కుంటే తన అసభ్య ప్రవర్తన కు అందరూ యేమనుకుంటారోనన్న మొహమాటం. మరోవైపు ఆయనను పట్టుకుని పీడించినాయ్.
    తానున్న సంకట స్థితికి ఏడవాలో నవ్వాలో తెలియక ఏడుపు , నవ్వు మిళితం చేసిన భావంతో ముఖాన్ని ముప్పై వంకర్లు తిప్పుతూ 'హీ హీ హీ! ఇవ్వు బాబూ! మా నాయనావు కదూ?' అంటూ ఆ పిల్లవాడిని బ్రతిమాలసాగెడు.
    ససేమిరా యివ్వనన్నాడు బాబిగాడు మొండి కెత్తి.
    'ఇక నటించటం నా వల్ల కాదురా!' అనుకున్నాడు ముసలాయన పళ్ళు పటపట లాడించుకుంటూ.
    వ్యవహారం ముదిరిపోతోందని గ్రహించిన కాంతారావు, కల్యాణి గూడా గాభరా పడసాగేరు.
    బాబిగాడు చూస్తె మంచి మాటలతో జోడిచ్చేటట్టు లేదు. గట్టిగా వాణ్ణి మందలించడానికి కూడా సున్నితంగా ఫీలవ్వసాగెడు.
    'తాతగారి జోడు యిచ్చేయి బాబూ!' అన్నాడు కాంతారావు లాలనగా.
    'ఉండు .......! అంటూ గాలిలోకి జోడును విసిరివేసినంత పని చేసేడు బాబిగాడు.
    'రాస్కెల్! బయట వాళ్ళ ముందు మరీ మొండి కేత్తుతాడు వీడు - మా నిస్సహాయత ను గమనించి, అంత చిన్నతనం లో వీడికింత తెలివి ఎలా వచ్చిందో వెధవ!' అనుకున్నాడు మనసులో కాంతారావు.
    పైకి మాత్రం ముఖానికి నవ్వు పులుముకుని ఇవ్వవా! తాతగారు నీకు బిస్కెట్ట్ పెడ్తారట , జోడిచ్చేయ్!!" అన్నాడు.
    బాబిగాడు వోరకంట తాతగారి వైపు కోసారి చూసి అయన గారి చేతిలో బిస్కెట్టు వంటి పదార్దామేమీ లేదని గ్రహించి అబద్దమాడుతున్న తండ్రి వంక అదోలా చూసి, మళ్ళీ జోడుతో ఆడుకోసాగెడు.
    ఇక లాభం లేదనుకుని కళ్యాణి బాబిగాడి నెత్తి మీద వో మొట్టికాయ వేసి, సభ్యతను భగ్నం చేసింది.
    అమ్మ చేతి చురుకు తగలటం తో ఏడవాలి గనుక 'ఆ' అంటూ నోరంతా తెరిచాడు బాబిగాడు. అదే సమయమానుకుని ముసలాయన బాబిగాడి చేతిలో నుండి చటుక్కున లాగేసుకున్నాడు తన జోడును. కుదుటపడిన గుండెను చేతితో తడుముకుని, కళ్ళజోడును పై పంచతో తుడుచుకుని కళ్ళకు తగిలించుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.
    ఇంకా వీళ్ళ వైపుకుచూస్తే ఆ పిల్లవాడు మళ్ళా ఏం అఘాయిత్యం చేస్తాడో నని తన ముఖాన్ని భద్రంగా పేపరు వెనకకు దాచేసుకున్నాడు.
    జోడు లాక్కున్నడన్న ఉక్రోషం తో   బాబిగాడు తండ్రి ఒడిలో నుండి జారిపడి, క్రింద చతికిల బడి గట్టిగా రాగాలు తీయసాగేడు.
    చెత్త కుండిలా ఉన్న ఆ ధర్డు క్లాసు రైలు పెట్టె లో కొడుకు క్రింద పడి పొర్లుతుంటే చూడలేకపోయింది కళ్యాణి.
    "బాబిగా! లేవరా! అలా క్రింద పడకు. బట్టలు మాసిపోతాయ్. అంటూ వాడికి నచ్చచెప్పింది.
    తల్లి బ్రతిమాలుతున్న కొద్ది బాబిగాడు కాళ్ళు నేలకు మరింత గట్టిగా రాసి, అరచేతి మందాన మట్టి అంటించుకున్నాడు. అప్పటికి గాని వాడి కసి తీరలేదు. నిక్షేపం లాటి బట్టలను పాడు చేసుకున్న కొడుకును చూసేసరికి కాంతారావులోని సహనం కాస్తా నశించి పోయింది.
    'వెధవా! చెప్తున్నా కొద్ది వంటికీ, మట్టి రాసుకుంటావా?" అంటూ వీపు మీద రెండు వేసేడు, అప్పటికి గాని బాబిగాడు లేవలేదు.
    కాసేపు ఏడిచి తండ్రి భుజం మీద వాలి నిద్రపోయేడు.
    పాప కూడా నిద్రపోయింది.
    అప్పటికి రాత్రి పది గంటలు దాటింది.
    కళ్యాణి , కాంతారావు ఏదో స్టేషన్ లో అర్దరిచ్చిన భోజనం వస్తే తిన్నారు. అప్పటికి ప్రాణం తెరిపిన పడింది యిద్దరికీను.
    కడుపు నిండుగా ఉంది. అటు పిల్లల గొడవ లేదు.
    ఇంక ఆ దంపతులలో తియ్యని తలపులు ఒక్కటొక్కటీ పుట్టుకు రాసాగాయ్.
    బాబిగాడిని తన సీట్లో పడుకో బెట్టి వచ్చి కల్యాణి ప్రక్కనే కూర్చున్నాడు కాంతారావు.
    నిద్ర మత్తులో జోగుతున్న ఒకామె ఎక్కువ అభ్యంతరం పెట్టకుండానే ప్రక్కకు జరిగి అతనికి చోటిచ్చింది.
    కాంతారావు పెట్టేంతా ఒకసారి కలియజూసేడు. అప్పటికే చాలామంది గాడనిద్రలో మునిగి పోయేరు. కొందరు లయబద్దంగా గురక కూడా పెడ్తున్నారు.
    కొందరు నిద్ర తెప్పించుకోవటానికి కళ్ళు మూసుకున్తుంటే తాము కళ్ళు మూసుకుంటే తమ సామాను ఎక్కడ కనుమరు గై పోతుందో నని మూతలు పడుతున్న కళ్ళను బలవంతాన తెరవటానికి ప్రయత్నిస్తున్నారు. మరికొందరు ఆ బాపతు వాళ్ళంతా ఒంటి కన్ను తెరిచి భావ శూన్యంగా వోసారి పెట్టె లోని వాళ్ళ వంక చూసి మళ్ళీ వెంటనే కళ్ళు మూసుకుని నిద్రలోకి ఒరిగి పోతున్నారు.
    కాంతారావు కి, కళ్యాణి కి మాత్రం నిద్ర రావటం లేదు. అందునా యిలాటి దూర ప్రయాణాలు చెయ్యటం కొత్త అవటం వల్ల అలా సిగ్గు లేకుండా నోళ్ళు తెరుచుకుని కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టె నిద్ర లోకి ఒరగటం చూసి నవ్వుకున్నారిద్దరూ.
    'ఆ ముసలాయన చూడు , నోట్లోంచి చొంగ కారుస్తూ ఎలా నిద్రపోతున్నాడో!' అన్నాడు కాంతారావు -- కళ్యాణి నడుం చుట్టూ చెయ్యి వేసి.
    కళ్యాణి కిలకిల నవ్వింది. ఆ చప్పుడుకు ఒకరిద్దరు కళ్ళు తెరిచి వాళ్ళ వంక చూసేరు.
    కాంతారావు కళ్యాణి నడుం మీద నుండి చెయ్యి తీసేశాడు.
    ఐదు నిమిషాల పాటు ఏమీ ఎరగనట్లు బార్యా భర్రలిద్దరూ కిటికీ లోంచి చీకట్లోకి చూస్తూ కూర్చున్నారు.
    ఏం ప్రమాదం లేదనుకుని వాళ్ళు మళ్ళీ  .......

                                     4
    పది నిమిషాలలా గడచేక కళ్యాణి ఒడిలోని పాప నిద్రపోవటానికి పొజిషన్ సరీగా దొరక్క కాళ్ళూ చేతులు కొట్టుకుంటూ చిరాకు పడసాగింది.
    'ఇంక మాములుగా కూర్చోండి. పాప ఏడుస్తుంది.' అంటూ తను కూడా సరిగ్గా కూర్చుంది కళ్యాణి.
    కాంతారావు తేరుకుని చుట్టూ వోసారి చూసి అందరూ నిద్రపోతున్న సంగతి గమనించి, తృప్తి పడి మంచిగా సర్దుకుని కూర్చున్నాడు. ఐతే వాళ్ళ కెదురుగా ఉన్న పై బెర్తు మీద పడుకున్న గడ్డం సింగు అర్ధ నిమీలిత నేత్రాలతో అప్పటి నుండి ఆ దంపతుల ప్రణయ లీలలను గమనిస్తున్న సంగతిని గుర్తించనే లేదు కాంతారావు.
    కాంతారావు అతని వంక చూసినపుడల్లా రెండు కళ్ళూ గట్టిగా మూసుకుని గురకతో సహా నిద్ర నటిస్తుండటం వల్ల కాంతారావు మోసపోవలసి వచ్చింది.
    ఇంకా వారి ప్రణయం పాకానపడుతుందేమో నని వోరకంట చూసీ చూసీ చివరకు వాళ్ళు ఎవరికి వారు నిద్రలోకి వోరగటం చూసి నిరుత్సాహ పడిపోయి , తాను కూడా నిజం నిద్రలోకి వోరిగేడు సింగు.
    కళ్యాణి కి మెలకువ వచ్చేసరికి భళ్ళున తెల్లవారింది. పిల్లలింకా గాడంగా నిద్రపోతూనే ఉన్నారు. కాంతారావు ఆమె భుజం మీద వాలి, సొమ్మసిల్లి పోయినట్లు నిద్రపోతున్నాడు. రాత్రి అతను చేసిన చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది కళ్యాణి.
    భర్తను నిద్రలేపే యత్నం లో ప్రేమగా అతని భుజం నిమిరింది. కాంతారావు కళ్ళు తెరిచేడు.
    కళ్యాణి నవ్వు ముఖంతో కనపడే సరికి లేచి సరిగ్గా కూర్చున్నాడు కాంతారావు.
    ఇంటి దగ్గర రోజూ ఉదయం మెలకువ రాగానే కళ్యాణి ముఖం చూడనిదే పక్క మీద నుండి లేవడు కాంతారావు. ఈ రైలు పెట్టిలో ఏ మహానుభావుడి ముఖం కనబడుతుందో నని హడలి పోతున్న కాంతారావు కి మాములుగా కల్యాణి నవ్వు ముఖం కనపడేసరికి సంతోషపడ్డాడు. 'ఫరవాలేదు ఇవ్వాళ శకునం బాగానే ఉంది.' అనుకుంటూ.
    అప్పటికి పెట్టిలోని చాలామంది ప్రయాణీకులు నిద్రలేచి ముఖం కడుక్కుని కాఫీలు, ఇడ్లీ లు మీదకు దండయాత్ర ప్రారంబించేరు.
    మరికొందరు ఆలస్యం చేస్తే రైలు ఎక్కడ బయలుదేరుతుందో , యిడ్లీలు తినటం తప్పుతుందో నన్న భయంతో గబగబా ముఖాలు కడుక్కుంటున్నారు.
    నిద్రలోని తియ్యని సుఖాన్నేరేగిన కొందరు యిడ్లీలను కూడా త్యాగం చేసేసి హాయిగా నిద్రపోతున్నారు.
    కాంతారావు రైలు దిగి కాంటీన్ లోకి వెళ్లి ఒక ఫ్లాస్కు లో పాపకి పాలు, మరొక ఫ్లాస్కు లో కాఫీ పోసుకుని ఇడ్లీల పొట్లం తో సహా పరుగులు పెడ్తూ కదులుతున్న   రైల్లోకి ఎక్కి కూర్చున్నాడు.
    కళ్యాణి, కాంతారావు ముఖాలు కడుక్కుని ఇడ్లీలు తింటూ పిల్లలిద్ద్తరికీ చేరోటి యిచ్చేరు.
    ఆ దంపతులిద్దరూ కబుర్ల లో పడి తింటూ , పిల్లల సంగతే మర్చిపోయేరు. తీరా తినటం పూర్తయి చూసేసరికి పాప యిడ్లీ ని తిన్నంత తిని మిగతాది తుంపి వంటికి నలుగు పెట్టుకోసాగింది.
    బాబిగాడు అమ్మా నాన్నలలా పచ్చడి తో కలిపి యిడ్లీ తినాలని ముచ్చట పడి , ఆ తిన్న చేతినో కంట్లో పెట్టుకుని కీచుకీచు మంటూ ఏడవటం మొదలెట్టేడు.
    పాపకు వళ్ళంతా కడిగి, బాబు కళ్ళు తుడిచి వాళ్ళను సముదాయించే సరికి ఆ దంపతులు తిన్న యిడ్లీలు కాస్తా పూరిగా జీర్ణం అయిపోయినాయ్.
    అప్పుడు వేడీ కాఫీ గొంతులో పోసుకుని పోబోతున్న ప్రాణాన్ని నిలబెట్టుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS