కాంతారావు కళ్యాణి 'స్ట్రా ' లేకుండానే సీసాను పైకెత్తి సోడా తాగినట్టు తాగేసేరు. అలా త్రాగటానికి రెండు సంవత్సరాల క్రితం అయితే వాళ్ళు సిగ్గుపడే వాళ్ళేమో! కాని యిప్పుడలాటి చిన్న విషయాలకు కించ పడేంత చిన్నతనం వాళ్ళలో లేదు. ఇద్దరు పిల్లల తల్లిదండ్రులాయె!
కాంతారావు రైలు కదిలే ముందు బిస్కెట్ పాకెట్, అరటి పళ్ళు, యాపిల్ పళ్ళు, రెండు వారపత్రికలు, మూడు రకాల న్యూస్ పేపర్స్ కొన్నాడు- తీరికగా రైల్లో కూర్చున్నాక కళ్యాణి కి చటుక్కున తను మర్చిపోయిన వస్తువులు జ్ఞాపకం వచ్చినయ్. బాబిగాడి కోసం పెరగన్నం కలిపి పెట్టిన టిఫిను బాక్స్ తీసుకు రాలేదు. పళ్ళు కోసుకునేందుకు గాను అవసరమైన చాకు కూడా తీసుకు రాలేదు.
తాను మర్చిపోయిన వస్తువులను గుర్తుకు చేసేసరికి కాంతారావు నవ్వేడు- 'నేను మొదట్నుంచీ చెప్తూనే వున్నాను-- ఎన్నిసార్లు చూసుకున్నా చివరికి ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటామని. ఇంకా అప్పుడే యేమయింది? కొన్ని గంటల ప్రయాణం చేస్తే మనం మర్చిపోయిన వస్తువులు యింకా చాలా జ్ఞప్తికి వస్తాయ్!" అన్నాడు.
రైలు కదిలేసరికి సాయంత్రం ఐదు న్నర కావస్తోంది. అప్పుడే సూర్యాస్తమయం కావస్తోంది. పశ్చిమాకాశం సిగ్గుతో ఎర్రబారిన నవ వధువు ముఖ మండలంలా వెలిగిపోతోంది. కిలకిలా రావాలు చేస్తూ పక్షులు పరుగులు పెడ్తున్నాయ్ తమ తమ గూళ్ళ వైపుకు.
రైలు కదలగానే ఆ కదలికను చూసి పిల్లలిద్దరూ ఒక్కసారిగా బిత్తర పోయేరు. వెంటనే తేరుకుని కిలకిల మంటూ నవ్వేరు. చప్పట్లు చరిచేరు. చేతులు బయట పెట్టి అవ్యక్తమైన భాషలో తమ ఆనందాన్ని ప్రకటించేరు.
కొద్ది నిమిషాలలోనే కళ్యాణి మనసంతా సంతృప్తి తో నిండిపోయింది. ఎదురుగా తను మనసారా ప్రేమించే భర్త, ఆనందంగా , ఆరోగ్యంగా మిడిసి పడుతున్న పిల్లలు ....చల్లని సాయం సమయంలో ప్రేమైక జీవులైన తమ సంసారాన్ని మోసుకుని పోతున్న ఆ రైలు పుష్పక విమానం లా ఉందామె కంటికి.
ముఖాన్ని స్పృశిస్తున్న శీతల వాయువులతో శరీరానికి, మనసుకి ఎంతో హాయిగా ఉంది. ఆ ప్రశాంత సంధ్యా సమయంలో నగరం దాటి వచ్చిన ఆ రైలు వేగం హెచ్చింఛి చెట్లు, పుట్టలు, కొండలు, కొనలు, పొలాలు, నదులు దాటుకుంటూ తమని ఒక నూతన ప్రపంచంలోకి దివ్యమైన ఆనందానుభూతులతో మధురమైన జ్ఞాపకాలతో నింపి వేసే సుందర ప్రదేశాలకి తీసుకు పోతుంటే కళ్యాణి మనసు క్రమంగా తేలిక పడసాగింది.
అంతవరకు తనని బాధిస్తున్న ఆర్ధిక సమస్యలు, సంసారిక సమస్యలు, మానసికమైన చికాకులు మొదలైన లౌకిక విషయాలేమీ యిప్పుడామే మనసును స్పృశించటం లేదు.
సంధ్యారుణ కాంతులతో వెలిగిపోతున్న ప్రకృతిని రెండు కళ్లతోనూ చూస్తూ, తనవారి సమక్షం లో సురక్షితంగా ఉన్నామన్న భావంతో మనసును నింపుకుంటూ, తాము సందర్శించబోయే సుందర ప్రదేశాలను గూర్చి ఊహాగానం చేస్తూ, తమ ప్రేమ యాత్రను ప్రారంభించేరు కళ్యాణి, కాంతారావు లు.
* * * *
బాగా చీకటి పడేవరకు అలాగే బయటకు చూస్తూ ఒకరకమైన తన్మయావస్థ లో కూర్చుండి పోయేరు భార్యాభర్తలిద్దరూ. పిల్లలు కూడా మొదటిసారిగా ట్రైన్ ప్రయాణం చేస్తున్న ఆనందం లో అల్లరి చెయ్యాలన్న సంగతి మర్చిపోయి రైలు తో పాటు పరుగెత్తుతున్న చెట్లను, కొండలను, పొలాలను వింతగా చూస్తూ నిల్చున్నారు కిటికీ దగ్గర.
బాబిగాడు కంటికి కనిపించిన ప్రతి వస్తువునూ, చూపించి 'అదేంటి?' అంటూ అడుగుతున్నాడు. పాపకు అలా అడగటం రాక, అంత చక్కగా తన భావాలను వెల్లడి చేస్తున్న అన్న వంక వింతగా, ప్రశంసా పూర్వకంగా చూస్తూ కూర్చుంది. నేను కూడా అలా అన్నలాగా మాట్లాడ గలిగితే ఎంత బాగుండును!" అన్న భావం ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది.
కాంతారావు విసుగు లేకుండా బాబిగాడి ప్రశ్నలన్నిటికీ తీరికగా సమాధాన మిస్తూ మధ్య మధ్య కళ్యాణి వంక చూస్తూ, యిప్పుడు ఆ కళ్ళలో ఒక రకమైన తృప్తి, ఆనందం వెలిగిపోవటం గమనించి 'ఎందుకో!' అనుకుంది కళ్యాణి. 'చూస్తుంటే యీ ప్రయాణం వల్ల పిల్లల కంటే యీయనే ఎక్కువగా సంబర పడిపోతున్నట్లు కనిపిస్తున్నారు.ఇంకా కుర్రతనం వదలలేదు. అనుకుంటూ పమిట చెంగును భుజం మీదకు లాగి కప్పుకుంది. వెంటనే తనలో తనే నవ్వుకుంది . కాంతారావు కుర్రతనాన్ని చూసి, ఆ సమయంలో తానెంతో పెద్ద ఆరిందా అయినట్లు భావించింది కళ్యాణి.
"ఎందుకలా నీలో నువ్వు నవ్వుకుంటావు?" పక్క వాళ్ళకు కూడా వినిపించనంత మెల్లగా అడిగేడు కాంతారావు కొంచెం ముందుకు వంగి.
కళ్యాణి మళ్ళీ నవ్వింది. మాట్లాడలేదు.
"ఎందుకలా నవ్వుతూ మురిపిస్తావు? అలా దూరంగా కూర్చో పొతే నా పక్కకు వచ్చి కూర్చో రాదూ?' అన్నాడు.
'అయన ఉన్నాడు. ఎలా రాను?' అన్నట్టు కాంతారావు పక్కనే ఉన్న ముసలాయనను చూపిస్తూ కళ్ళతోనే మాట్లాడింది కళ్యాణి.
'ఆ రిజర్వు చేసేవాడేవడో వట్టి వెధవ లాగున్నాడు. మొగుడూ పెళ్ళాలకి పక్క పక్క సీట్లు యివ్వకుండా ఎదురూ బొదురు సీట్లు యిచ్చేడు రాస్కెల్ ని చీల్చి పారెయ్యాలి. బుద్ది లేదు వాడికి.' విసుక్కున్నాడు కాంతారావు.
'ఈసారి మరింత మురిపిస్తున్నట్లుగా నవ్వింది కళ్యాణి. అతనికి కోపం వస్తే ఆమెకు ఎంతో ఆనందం.
"ఎందుకలా ఉలుకు వులుకున నవ్వుతావు? ఔన్లె నీకు నా పక్కన కూర్చోవటం యిష్టం లేదు: దూరంగా కూర్చుంటేనే నీకు సంతోషం. ఔను కదూ?" కసురుకున్నాడు కాంతారావు.
కళ్యాణి నవ్వాపి చుట్టూ వోసారి చూసింది. వెంటనే ఆతని చేతి మీద గిల్లి 'ఏమిటా అరుపులు? వాళ్ళంతా వింటే యేమనుకుంటారు.' అంది.
'కాంతారావు చెయ్యి వెనక్కు లాక్కున్నాడు మాట్లాడకుండా.
కళ్యాణి మళ్ళీ నవ్వింది.
కాంతారావు ముఖం పక్కుకు తిప్పుకుని వోరగా ఆమె వంక చూసేడు.
ఆమె తనవంకే చూస్తుండటం గమనించి వెంటనే అతను కూడా నవ్వేసేడు.
'ఇదో- ఎదురూ బోదురుగా కూర్చోవటం వల్ల లాభం యిదే! చక్కగా మన యిష్ట మిచ్చినట్లు- ఒకరి వంక ఒకరు చూచుకుంటూ ఎవరూ చూడకుండా దొంగ చాటుగా నవ్వుకోవచ్చు, తెలిసిందా?' అన్నది కళ్యాణి.
తెలిసింది అన్నాడు కాంతారావు తలూపుతూ. తల్లిదండ్రులలా తమని మర్చిపోయి మాట్లాడుకోవటం బొత్తిగా నచ్చలేదు పిల్లలకి.
'నాన్న నన్నేత్తుకో!' అంటూ కాంతారావు షర్టు పట్టుకుని గుంజేడు బాబిగాడు.
"అమ్మా! బాయీ....' అంటూ రాగం తీసింది పాప.
'ఆ ఫ్లాస్కు లోని వేన్నీళ్ళీటివ్వండి పాపకి పాలు కలపాలి."అంది కళ్యాణి యీ లోకంలోకి వస్తూ.
'ఉండరా బాబు ఎత్తుకుంటాను కాని చొక్కాని అలా పట్టుకుని గుంజకు అన్నాడు కాంతారావు.
కళ్యాణి పాలు కలిపే లోపల పాప ఫ్లాస్కు మూతని విసిరి అవతల పదేయ్యటం దాని నందుకున్న వో ముత్తైదువు ముసిముసి నవ్వులు నవ్వుతూ దానిని కళ్యాణి కివ్వటం, కళ్యాణి చేతిలోని మూతను తన కిమ్మని బాబిగాడు గట్టిగా ఏడవటం, 'బాయి బాయీ!' అంటూ పాప అంతకంటే గట్టిగా ఏడవటం మొదలైన వన్నీ వరుసగా జరిగినాయ్. ఎలాగో పిల్లలిద్దరినీ సర్దేసరికి ప్రాణం నీరసపడి పోయింది భార్య భర్తలిద్దరికీను. బాబిగాడి చేతికి ఒక అరటి పండు యిచ్చి వాడు ఏడుపు మన్పించేడు కాంతారావు.
పాప నోట్లో పాలపీక పెట్టి దాని నోరు నొక్కే సింది కళ్యాణి.
పిల్లల హడావుడి కి పెట్టిలోని వారందరి దృష్టి ఆ కుటుంబం మీదనే పడింది. పిల్లల ఏడుపులు, అల్లరి , వాళ్ళను సర్ది చెప్పటానికి ఆ దంపతుకు పడుతున్న అవస్థ అన్నీ చూసి సంతోషంగా నవ్వుకున్నారు వాళ్ళంతాను.
'పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం అంటే యిదే కాబోలు!' అనుకుంది ఉక్రోషంగా కళ్యాణి.
తమ సానుభూతి ని వ్యక్తం చెయ్యటానికా అన్నట్లు వాళ్ళతో సంభాషణ కూడా ప్రారంభించేరు కొందరు.
"ఎక్కణ్ణించి వస్తున్నారు? ఎండాకా వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? పిల్లవాడికి మూడో యేడు పడిందా? పిల్లదానికి ఎన్ని నెలలు?' వగైరా రైలు పెట్టి ప్రశ్నలన్నీ తుచ తప్పకుండా వేసి సమాధానాలు పొందేరు.
'పిల్లదానికి పోలమారుతుందమ్మాయి అలా కనుక పాలిచ్చేవంటే కాస్త తలయెత్తి పట్టూ -- అదీ ....అలా!' అంటూ తన పెద్దరికాన్ని కళ్యాణి మీద ప్రయోగించింది వో ముత్తైదువు.
'అబ్బాయిని గట్టిగా పట్టుకో నాయనా. కిటికీ లో నుండి తల బయటకు పెడ్తున్నాడు , జాగ్రత్త! ' అంటూ కాంతారావు కి సలహా యిచ్చేడు ఆమె భర్త.
'ఏమిటో యీ కాలం పిల్లలకి పుట్టిన రెండో రోజు నుంచే సీసా పాలు అలవాటు చేస్తున్నారు. మా రోజుల్లో యీ పిండి పాలు ఎరుగుదుమా ఏమన్నానా?' అంటూ మూతి తిప్పుకుంది ఒకావిడ.
"ఫేషన్లమ్మా ఫేషన్లు . పిల్లలకి పాలిస్తే అందం చెడిపోతుందని చదువుకున్న అమ్మాయిలు పాలివ్వటమే మానివేసేరు." అంటూ యింకోకామే అందుకుంది.
'ఆ మీదంతా చోద్యం గాని ఉంటె ఏ తల్లి మాత్రం పాలివ్వదు? నవమాసాలు మోసి కనగా లేనిది పాలివ్వ టానికి వెనకాడుతుందా? ఐనా ఈ కాలం పిల్లలకు మన బలాలేక్కడివిలే' అని వో నడి వయస్కురాలు వాళ్ళిద్దరికీ సర్ది చెప్పింది.
నిస్సంకోచంగా , నిర్మొహమాటంగా అంతమంది మగవాళ్ళ సమక్షంలో సాగిపోతున్న ఆ సంభాషణ విని బిక్క చచ్చిపోయింది కళ్యాణి.
ఆ క్షణం లో తానూ వో పెద్ద అపరాధి అయినట్లు ఆడవాళ్ళందరి చూపులు చురుకు చురుకు మంటూ తనని బాధిస్తుంటే ఏడుపొచ్చినంత పనయింది ఆమెకు.
'ఛీ' అడజాతే అంత! సున్నితమే తెలియదు. కాని మగవాళ్ళే నయం. సమయం సందర్భం చూసైనా ప్రవర్తిస్తారు.' అనుకుంది-- ఎప్పుడూ మగజాతిని తీవ్రంగా విమర్శించే కళ్యాణి.
ఆ పెట్టిలో ఉన్న ఆడవాళ్ళ అందరిలోనూ వయసులో చిన్నది , చూపులకు నాజూకైన కనిపిస్తున్నది కళ్యాణి ఒక్కతే. అందువల్ల ఆడవాళ్ళందరి దృష్టి ఎక్కువగా ఆమె మీదనే ఉంది. ఆమె కట్టు బొట్టూ అన్నింటిని నిశితంగా పరిశీలిస్తున్నారు ఏం వంక దొరుకుతుందా అని. చీరా, జాకెట్టు మంచిగానే వేసుకుంది. అలంకరణ కూడా ఎబ్బెట్టు గా యేమీ లేదు. చిన్న వయసు లోనే పిల్లల తల్లి కూడా అయింది. ఫరవాలేదు అనుకున్నారు.
