Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 6


    చురచురా చూసింది అనూరాధ.
    "తాతకు కోపం అంటే మీరు కోపంగా చూస్తారేం?"
    ".........................."
    "మాట్లాడరేం? నిజంగా కోపం రాలేదు కదా?"
    "మీరే కదండీ అడ్డు తగలవద్దన్నారు."
    "అన్నావా? మరిచిపోయాను. ఆ తాతకు ఎన్నాళ్ళనుండో కాశీకి వెళ్ళాలని కోరిక."
    "పాపం!" అనూరాధ సానుభూతి.
    "ఎన్నాళ్ళుగానో ఉన్న కోరిక చివరికి నెరవేరింది. మొత్తంమీద తాత కాశీ వెళ్ళి వచ్చాడు. పాపం, ముసలాయన అంతదూరం వెళ్ళివచ్చాడు కదా అని ఊరి పెద్దలందరు పరామర్శించి వెళ్ళారు. అందరూ పోగానే పదిమంది కుర్రాళ్ళు వచ్చారు తాతను పలకరించడానికి."
    చటుక్కున నవ్వింది, ఇకముందు చెప్పబోయేదేమిటో తెలుసన్నట్లు.
    శ్రీనివాస్ కూడా నవ్వుతూ "పూర్తిగా వినండి. ఒక కుర్రాడు తాత దగ్గిరగా వచ్చి 'తాతా, కాశీకి వెడితే ఏదో వదిలిపెట్టి వస్తారుట కదా! నువ్వేం వదిలావు?' అని అడిగాడు. 'కోపం వదిలిపెట్టి వచ్చానురా, మనమడా' అన్నాడు అతి సౌమ్యంగా. రెండోవాడు 'తాతా, కాశీలో ఏం వదిలావు?' అని అడిగాడు. 'కోపంరా నాయనా' న్నాడు సామాన్యంగా. మరో కుర్రాడు మళ్ళీ అడిగాడు. 'కోపంరా అబ్బాయ్!' అన్నాడు గొంతుకలో కొద్దిగా తీక్షణతతో. ఇంకొకడు వచ్చి 'తాతా! తాతా! కాశీలో ఏం వదిలావు?' అని అడిగాడు. 'కోపంలా' అన్నాడు విసుగ్గా."
    తాత గొంతుకలో వినబడే అహంభావాలు తన గొంతుకలో కనబరుస్తున్నాడు శ్రీనివాస్. "ఇలా ఒక్కొక్కరే అడగసాగారు. చివరికి ఓ కుర్రాడు వచ్చి, 'తాతా, కాశీలో ఏం వదిలావు?' అని అడిగాడు. 'కోపం అని ఎన్నిసార్లు చెప్పాలిరా, వెధవా' అంటూ కోపంగా నాలుగు బాదాడు."
    పకపకా నవ్వింది అనూరాధ.
    "అమ్మయ్య! కోపం పోయింది కదా" అంటూ తనూ శ్రుతికలిపాడు ఆమె నవ్వులో.

                                  9

    లైబ్రరీ అంతా ఖాళీగా ఉంది. మూసివేయవలసిన టైమవుతూంటే, వేటి స్థానాల్లో ఆ పుస్తకాలు ఉంచి వెళ్లేందుకు సిద్ధపడసాగాడు శ్రీనివాస్. ఇంతలో హడావిడిగా లోపలకు వచ్చింది అనూరాధ, చేతిలో పుస్తకాల దొంతరతో. పుస్తకాలు సర్దుతున్న శ్రీనివాస్ వెనక్కి తిరిగి పలకరించాడు.
    "ఇవాళ్టికి మూసివేశారేమో అనుకున్నాను" అంది ఆమె.
    "లేదు. మీకోసమే తెరిచి ఉంచాను."
    పుస్తకాలు చేతికి అందిస్తూ, "ఇవాళ ఆఖరిరోజు. రేపయితే ఫైను కట్టాలి. అందుకే హడావిడిగా వచ్చాను."
    "మీరు కూడా ఫైనుకు వెనకాడితే ఎలా?"
    "ఫైను కట్టడానికి అభ్యంతరం లేదనుకోండి. అయినా ఫైను కట్టగలం కదా అని ఇంట్లో ఉంచుకుంటే ఎలా? ఇంకెవరైనా అడగచ్చు."
    పుస్తకాలు నోట్ చేసుకుంటూ, "ఇంకేమయినా తీసుకుంటారా?" అన్నాడు.
    "ఇవాళ వద్దులెండి. టైమయిపోయింది. తరవాత వస్తాను."
    "టైము కేమి ఫరవాలేదు. ఏవైనా కావాలంటే తీసుకోండి."
    "ఇవాళ వద్దులెండి" అంది అనూరాధ.
    ఆమెతోపాటు బయటికి వచ్చాడు శ్రీనివాస్.
    "రూమ్ కేనా వెళ్ళేది?" అడిగింది అనూరాధ.
    కొద్ది క్షణాలు ఆలోచించి, "బహుశః రూమ్ కే" అన్నాడు.
    "ఒకచోటికని ఆలోచన లేదన్నమాట!" అంది నవ్వుతూ. "మీరు డ్రైవ్ చేస్తారా?" అని అడిగింది.
    తల ఊగించాడు మౌనంగా.
    తాళంచెవులు అందించి ముందుగా ఆపి ఉన్న కారు ఎక్కింది.
    "మీరు ఒంటరిగా కారులో బయటికి వెళ్ళడం ఎప్పుడూ చూడలేదు" అన్నాడు కారు స్టార్టు చేస్తూ.
    "ఇవాళ మా నాన్న ఊర్లో లేరు. అన్నయ్యకు కారు అక్కర్లేదుట. మా నాన్నకు నేను డ్రైవ్ చెయ్యడం భయం. ఏదో నా గోల పడలేక నేర్చుకో నిచ్చారుగాని, నేను ఒంటరిగా వెళ్ళడానికి ఒప్పుకోరు. అమ్మా ఒప్పుకోదనుకోండి." నవ్వేసింది అనూరాధ.
    "అమ్మగారిని అయితే కాస్త డబాయించవచ్చు. ఇంటికే వెడతారా?"
    "కాదు. ఆ మెయిన్ రోడ్డుమీద ఓ బుక్ స్టోరు ఉంది కదూ? అక్కడికి వెడదాం."
    కొట్లోంచి శ్రీ రాజగోపాలాచారి రచించిన రామాయణం, భారతం కొని తెచ్చుకొంది.
    "ఇవి మా లైబ్రరీలోనూ ఉన్నాయి, తీసుకువెళ్ళవలిసింది" అన్నాడు శ్రీనివాస్ అవి చూచి.
    "అవుననుకోండి. స్వంతంగా కొనుక్కుందామని. ఈమధ్య ఉన్నట్లుండి ఓ కొత్త బుద్ధి పుట్టింది, ఇంట్లో స్వంత లైబ్రరీ మొదలుపెడదామని."
    "గుడ్ అయిడియా!"
    "మా నాన్న సలహా ఇచ్చారు. 'చదవాలనుకున్న ప్రతి పుస్తకం, కొనుక్కొన్న ప్రతి పుస్తకం చదివి దాచు. అలా చేస్తే నీకు తెలియకుండానే అయిదారు ఏళ్ళలో చిన్నసైజు లైబ్రరీ ఏర్పడుతుంది. అంతేగాని లైబ్రరీ పెట్టుకుందామని ఓ వంద పుస్తకాలు తెప్పించుకుంటే ఏది చదవాలో అర్ధంకాదు. చివరికి అన్ని పూర్తి చేసేటప్పటికి మొదటివి మరిచిపోతాం' అన్నారు. అందుకని స్వంత లైబ్రరీ ప్రారంభోత్సవం నిర్విఘ్నంగా కొనసాగాలని వీటితో ప్ర్రారంభిస్తున్నాను. అయితే ఇదివరకు కొన్నవి చాలా ఉన్నాయనుకోండి. అప్పుడీ ఆలోచన లేదు."
    "అయితే మా లైబ్రరీకి మీ దర్శనభాగ్యం కలగదన్నమాట!"
    "ఆ లైబ్రరీలా అన్ని పుస్తకాలు నేనెక్కడ పోగుచేయగలనండి! అక్కడ చదవవలసినవి అక్కడ ఉంటూనే ఉంటాయి. ఇంతకీ మీరు చదివారా ఇవి?"
    "ఆఁ."        
    "ఎలా ఉన్నాయి?"
    "చాలా బావున్నాయి. చక్కటి భాష. సరళశైలితో సామర్ధ్యం చూపే రచనలంటే నాకు చాలా ఇష్టం. అందుకే జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి కవిత్వం కూడా నాకు చాలా ఇష్టం."
    "కుంతి విలాసం చాలా బావుంది కదూ!"
    "అదొక్కటేనా? ఆయన రచనలన్నీ బావుంటాయి. కాని నేను కుంతి కుమారిని ఎక్కువ హర్షించలేకపోవడానికి కారణం, నాకు మహాభారతంలో పాత్రల మీద గౌరవం తక్కువ కావడమే."
    "ఎవరు శ్రీకృష్ణుడంటేనేనా? నేనూ అలాగే అంటాను. మా అమ్మ వింటే మాత్రం చెంపలు వాయించుకుంటేనేగాని ఒప్పుకోదు."
    నవ్వుతూ జవాబిచ్చాడు. "పెద్దవాళ్ళందరూ అంతే! నా వాదన ఎవరూ హర్షించరు. కాని కర్ణుడి కారెక్టర్ చదువుతూ ఉంటే నాకు మిగిలినవాటిమీద చాలా కోపం వస్తుంది. అతన్ని వంచించనివాళ్ళు ఉండరు. మనిషిలోని మంచి తనాన్ని ఎడ్వాంటేజ్ గా తీసుకోవడం విజ్ఞానుల లక్షణం కాదు."
    "కాకపోవచ్చు. అవన్ని ధర్మసంస్థాపనకోసం జరిగాయి."
    "మహాభారతయుద్ధం ధర్మసంస్థాపనార్ధమే కావచ్చు. శ్రీకృష్ణుడు అవతారపురుషుడే కావచ్చు. కాని ఒక నిరాయుధున్ని చంపడం అన్నది న్యాయసమ్మతమైనది కాదు."
    "మీకు ఆ పాత్ర అంటే ఎందుకింత అభిమానం?" అడిగింది ఆశ్చర్యంగా.
    "ఏమో? నాకే తెలియదు. నేను ఫోర్తుఫారమ్ చదివే రోజులలో కాబోలు మాకు కర్ణచరిత్ర నాన్ డిటెయిల్ గా ఉండేది. అందులో కర్ణుణ్ణి గురించి చదువు తూంటే ఎందుకో విపరీతంగా జాలివేసేది. అప్పుడు విమర్శనశక్తి తక్కువ. పెద్దయినాక చదువుతూంటే మనం ఎంతో విలవైనవిగా భావించి తలమీద పెట్టుకుని పూజించే ఇతిహాసాలతో ఎంత అన్యాయముందో అనిపిస్తుంది. కర్ణుడు ప్రతిఒక్కరిచేత వంచించబడ్డాడు. అన్ని హంగులతో ఉన్నవాడు అర్జునుడు. ఏమీ లేకుండా చివరిదాకా ఉన్నది కర్ణుడు. అందుకే ఆ పాత్ర అంటే ఎనలేని గౌరవం ఉంది. ఆ పాత్రంటే ఎంత గౌరవమిస్తానో, అందులో అర్ధభాగం కూడా కుంతికి ఇవ్వలేను."
    "మీ అభిమానపాత్ర తల్లి కదా! అదేమిటి?"
    "అందుకే గౌరవించలేకపోవడం. పుట్టిన ప్రతి ఒక్కరికి తానెవరో తెలుసుకునే అధికారం ఉంది. అతని జన్మరహస్యం దాచదలిచినప్పుడు బ్రతుకంతా దాచాలి. లేదా మొదటే తెలియజెప్పాలి. కాని యద్ధంముందు అంతా సరిగ్గా వెల్లడయింది. తల్లికి పుట్టిన ప్రతిపిల్లమీద సమానమయిన ప్రేమ ఉండాలి. అన్నిటికంటే కుంతి తీసుకున్న వరం చూడండి. అంతకంటే సంకుచిత మనస్తత్వం ఇంకొకటి ఉండదు. వరాల పేరుతో అయిదుగురిచేత వంచించబడ్డాడు కర్ణుడు."
    అతను చేస్తున్న ఆరోపణలు వింటూ ఆలోచిస్తూ ఉండిపోయింది. "నా వాదనంతా మీ అమ్మగారితో అనకండి. బొత్తిగా నాస్తికుణ్ణి అని అనుకుంటారు" అన్నాడు నవ్వుతూ.
    "నాస్తికుడంటే మీరు కాదు లెండి. వీటన్నిటినీ కలిపి అంతా మోసం అనేవాడు. మీరు కనిపించె పాత్రలను తర్కించి విమర్శన చేస్తున్నారు."
    ఇంటిముందు పోర్టికోలో కారు ఆపి, తాళంచెవులు అనూరాధకు అందిస్తూ, "మీ ఇల్లు.....మీ కారు....మీ తాళాలు"అన్నాడు వేంచెయ్యడన్న ధోరణిలో.
    "మీరు రూమ్ కే కాబోలు వెడతారు. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, మీ కభ్యంతరం లేకపోతే...."
    "వద్దులెండి. నేను షికారుగా నడిచి వెడతాను." నవ్వాడు.
    "ఏం భయమా?" అంది చిరుకోపంతో.
    "భయం దేనికి? నడవడం ఒంటికి మంచిది."
    సాయంకాలపు ప్రశాంతత చల్లదనాన్ని సేకరిస్తున్నది. చీకట్లు త్వరత్వరగా అలుముకుంటున్నాయి. రెండు జేబులలో చేతులు పెట్టుకుని నడుస్తున్నాడు, పరధ్యాన్నంగా పరిసరాలను పరికిస్తూ. ఎదురుగా వస్తున్న నల్లటి ఎంబాసిడర్ లో ఏదో పరిచయమున్న ముఖంలా కనపడేసరికి దృష్టి మరొకసారి సారించాడు. కారులో వెడుతున్న కృష్ణమూర్తిగారు శ్రీనివాస్ ని చూచి కారు ఆపమని, తను కూర్చున్న వైపు డోరు తెరిచి, చిరునవ్వుతో పకకరించారు శ్రీనివాస్ కొంచెం ఆశ్చర్యపోయి తేరుకునేలోగానే, "రావోయ్, మీ ఇంటిదగ్గిర డ్రాప్ చేస్తాను" అన్నారు.
    "ఎందుకండీ, మీ కనవసరంగా శ్రమ. మీరు ఇటు వెడుతున్నారు. మీకు ఔట్ ఆఫ్ వే అవుతుంది" అన్నాడు కొంచెం ఇబ్బందిగా.
    "కారుకు అవుట్ ఆఫ్ వే ఏమిటి? ఎటు వెడదమంటే అటే వెడుతుంది."
    ఆయన సమాధానానికి నవ్వి, కారు ఎక్కి ఆయన పక్కన కూర్చున్నాడు.
    "నడిచి వేడుతున్నావు. పనిచేసేది దగ్గిరలోనేనా?"
    "కాదండి. రాజశేఖరం గారి ఇంటినుండి వస్తున్నాను."
    "ఇంతకీ పనిచేసేది ఎక్కడ?"
    "లైబ్ర్రరీలో."
    "ఇక్కడికి దూరమేనే!"
    "ఆ .... కొంచెం దూరమే."
    "ఇప్పుడు నీకేమీ పని లేకపోతే కాసేపు మా ఇంటికి వెడదాం". అడిగారు 'ఏమంటావు?' అన్నట్లు.
    శ్రీనివాస్ కు కొంచెం ఇబ్బందిగా ఉంది. "పనేం లేదనుకోండి. అయినా ఇంకొకరోజు వస్తాను."
    "ఇంత మొహమాట పడతావేమిటయ్యా?" అన్నారు పెద్దగా నవ్వు డ్రైవర్ తో" ఇంటికి పోనివ్వు" అన్నారు.
    
                                  *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS