ఆ మాటలు విని, అంత ఏడుపు-మధ్యలోనూ చిరునవ్వు నవ్వింది.
"నువ్వొక బంగారు కొండవి" అంది.
"ఏడవనని మాటివ్వండి మరి నాకు"
"ఏడవనులేరా బాబూ."
"ఏడవటానికి మీకేమయిందేమిటి? మీ ప్రేమను మాకంతా పంచిపెట్టండి. దానికి మీ బిడ్డే కావాలని లేదు."
రమేశుడి మాటలతో తేరుకుంది శాంత.
కాని ఇప్పుడో?
మళ్ళీ తేరుకోగలదా? ఎందుకో రమేశుడికి అనుమానం వేసింది.
లోపలనుండి పసిబిడ్డా ఏడుపు విని, తన ఆలోచనలనుండి బయటపడి తలుపువైపుకు చూశాడు.
డాక్టర్ బయటకు రాగానే, రమేశ్:
"డాక్టర్! వదినకు మాటపడిపోయింది. మీరోమారు వచ్చి చూడండి" అన్నాడు.
డాక్టర్, శాంతను మళ్ళీ ఆమూలాగ్రంగా పరీక్షించారు. ఆమె బయటికి వెళ్ళగానే, తనూ ఆమెను అనుసరించి వెళ్ళాడు. ఆమె మోహంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది.
"ఆశ లేదా డాక్టర్" అన్నాడు రమేశ్ ఆదుర్దాతో.
"నాకూ కొంచెం అనుమానంగానే ఉంది. ఇప్పుడే ఏమీ చెప్పలేను. వెన్నెముకలో నీరు చేరింది. దాన్ని తీసెయ్యాలి. ఆమె అదృష్టమే ఆమెను కాపాడాలి" అని నిట్టూర్చి, గబగబా అక్కడినుండి వెళ్ళిపోయారు.
తన కళ్ళముందు ప్రపంచమంతా గిర్రున తిరిగినట్టనిపించింది రమేశుడికి. అలాగే గోడ ననుకుని నిల్చున్నాడు. ఒక్క నిమిషం డాక్టరు గారు చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకుని జీర్ణించుకోవడానికి ప్రయత్నించాడు. తరువాత నెమ్మదిగా తేరుకుని, లేని నవ్వు మొహంమీదికి తెచ్చుకుని, రంగస్థలం మీదకువెళ్ళే వటునిలా శాంత దగ్గరకు వచ్చాడు.
శాంత-మంచం పక్కనున్న కుర్చీమీద కూర్చున్న కృష్ణమూర్తి మౌనంగా తమ్ముడివైపు చూశాడు. రమేశ్ వదినక్కూడా వినిపించేలా :
"బలహీనతవల్ల ఇలా అయిందిట. కంగారు పడక్కర్లేదు. నయమవుతుందన్నారు" అన్నాడు.
ఆ మాటలు విని, శాంత విషాదంగా నవ్వింది.
కృష్ణమూర్తి ఆఫీసుకు టైమయిపోతోందని లేచాడు.
"నేను వెళ్ళనా శాంతా?"
శాంత తలూపింది.
"మళ్ళీ సాయంకాలం వస్తాను" అంటూ వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి.
రమేష్ శాంతను పలకరించటానికి పలు విధాల పయత్నించి విఫలుడయ్యాడు.
"ఆడవాళ్ళు ఎక్కువగా మాట్లాడటం మంచిది కాద"ని ఏ విష గడియలో అన్నాడో తను?
ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా ఊరులో లేని మాటకారి వదిన ఇప్పుడు మాట్లాడకుండా ఎలా ఉందో? ఆమె హృదయంలో ఎంతటి కల్లోలం బయల్దేరిందో ఎవరికి తెలుసు? ఎవరితో మాట్లాడకపోయినా, తన్ను చూడగానే ఎలాగయినా మాట్లాడగలుగుతుందని ఆశ పెట్టుకున్నాడే తను! తనాతో ఇహ వదిన మాట్లాడదా?
అతడి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. గద్గద కంఠస్వరంతో, "వదినా! మా కింత కఠినశిక్ష విధించకండి. మే మెవ్వరం ఏ తప్పూ చేయలేదు" అంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు.
పదిహేనురోజులు తనలోని బాధను ఎవరి తోనూ చెప్పుకోలేక మూగబాధ అనుభవించింది శాంత. తనను చూడటానికి వచ్చిన వారిని కనురెప్ప వేయకుండా దీనంగా చూసేది. వాళ్ళ సాంత్వన వచనాలు వినగానే ఆమె కళ్ళనుండి అశ్రు ప్రవాహం ప్రవహించేది. వాళ్ళు ఇక వెళ్ళిపోవాలని బయలుదేరగానే, తన దుర్భల హస్తాన్ని చాచి, వాళ్ళ చేతిని పట్టుకునేది.
కృష్ణమూర్తి, రమేశులకు ఆమె చేతి-పట్టునుండి విడిపించుకుని బయట పడటం అతి ప్రయాసగా ఉండేది.
పదిహేను రోజుల తరువాత ఆమె దృష్టి శూన్యమయిపోయింది. ఇంతవరకూ బయట ప్రపంచం, మనుష్యులను గుర్తించే జ్ఞానం ఉండేదామెకు. కాని, ఇప్పుడామె దృష్టి దిగంతాని కావల దాక్కున్న కాలదూతకోసం చూస్తున్నట్టుండేది.
ఆమె కళ్ళో?
వట్టి గాజు; సూర్యరశ్మిక్కూడా మెరవని గాజు.
ఆమె ఇప్పుడు జీవచ్చవం. ఎవరైనా తనను చూడవస్తే, సంతోషంలేదు. రాకపోతే దుఃఖమూ లేదు. సుఖ దుఃఖాలు, ఆకలి దప్పులు-వీటన్నిటి నుండి దూరమయిపోయింది.
చూడవచ్చినవాళ్ళు ఎన్నో విధాలుగా ఆమె గుణగణాలను పొగుడుతూ, కళ్ళనీరు పెట్టుకునే వారు.
శిలాప్రతిమ ముందు తల పగలకొట్టుకున్నట్టే వాళ్ళ కన్నీరు, దుఃఖం శాంతను తాకేదికాదు.
కృశించిన ఆమె చేతివేళ్లు మాత్రం అస్తమానం జడను విప్పుతూ, అల్లుతూ ఉండేవి. తన నుదురు, తల-వీటిని చేతితో నిమురుకుంటూ ఉండేది. అప్పుడప్పుడు పక్కనేఉన్న పేముకుర్చీమీద వేళ్ళతో కొట్టి శబ్దంచేసి, తనలో తానే నవ్వుకుంటూ ఉండేది.
ఒక విధమైన అపూర్వమైన ప్రశాంతి ఆమె మొహాన్ని ఆవరించింది.
కృష్ణమూర్తి, రమేశులకు పిచ్చిపట్టినట్లయింది.
ఆఖరికి డాక్టరుగారు శాంత-జబ్బుకు "మెరిల బైటిస్" అని పేరు పెట్టారు.
"ఆశేమీ లేదా డాక్టర్" అని రమేశుడు అడిగి నపుడు డాక్టర్ బదులేమీ చెప్పకుండా విషాదంగా నవ్వి, తల అడ్డంగా తిప్పి వెళ్ళిపోయారు.
శాంత - మంచం - పక్కనే అటూ, ఇటూ కుర్చీలు వేసుకుని కూర్చునేవారు కృష్ణమూర్తి, రమేశ్.
చేపట్టిన భర్తని, ఇన్నేళ్ళుగా తనను ప్రేమతో ఆదరించిన మరిదిని గుర్తించే శక్తిని కోల్పోయింది శాంత.
జీవితంమీదనున్న వ్యామోహమే ఆమె నింతవరకూ జీవించేట్టు చేసింది.
తనకు ఆకలిగా ఉందన్న విషయం కూడా ఆమెకు తెలిసేదికాదు. సుశీలమ్మగారే టైంప్రకారం ఆహారం ఇచ్చేవారు.
ఆమెకు చావటం అంటే ఇష్టం లేదేమో?
మృత్యువుతో పోరాడి పోరాడి అలసిపోయింది శాంత.
ఆరోజు పున్నమి, ఆ రాత్రి డాక్టరుగారు శాంతను పరీక్షించి, "ఈ రాత్రి గడవటం కష్టం. మీ రిక్కడే ఉండేటట్టయితే ఉండవచ్చు" అని చెప్పారు.
కూతురి అంతిమయాత్ర చూడటానికి శాంత-తల్లిదండ్రులు కూడా వచ్చారు.
స్పెషల్ వార్డు కనుక శాంత బంధువర్గమంతా సంకోచం లేకుండా రోదించింది.
వైద్యుల చికిత్సలన్నీ విఫలమయ్యాయి.
ఆరోజు పూర్ణిమ. కాని, శాంత ఆత్మీయుల కది అమావాస్య.
రాత్రి పది గంటల ప్రాంతంలో శాంత తన ఆత్మీయుల నందరినీ దుఃఖసముద్రంలో ముంచి తెలియని లోకానికి పయనమైపోయింది.
అపుడపుడూ అవ్యక్త వేదనతో ముకుళించుకుని పోయే ఆమె మొహం ఇపుడు ప్రశాంతంగా ఉంది.
ఆమె హృదయంలో ఎన్ని ఆశలు-ఆకాంక్షలు ఉండేవో-అన్నీ అనంత వాయువులో లీనమైపోయాయి.
"పునిస్త్రీ చావు; పుణ్యం చేసుకుంది" అంది ఆ భాగ్యంలేని ఓ స్త్రీ.
"జీవితంలో ఏమీ అనుభవించకుండానే వెళ్ళిపోయే పునిస్త్రీ చావు ఎలాంటిది!"
కృష్ణమూర్తి హృదయం విదీర్ణమయింది.
సుమారు నెల రోజులుగా హాస్పిటల్ కూ, ఇంటికీ ఆదుర్ద్గాగా తిరుగుతున్న అందర్నీ ఒక్కసారిగా నిర్లిఫ్తత ఆవరించింది.
మరుగుతున్న నీళ్ళను దింపగానే చల్లారిపోయినట్టు, వాళ్ళ మనస్సులో మరుగుతున్న ఆత్రుత, ఆవేదనకూడా ఒక్కసారిగా చప్పగా చల్లారిపోయాయి.
అస్తమానం ఇంట్లో వాళ్ళందరికీ "శాంత ఎలా ఉందో" అనే బెంగే ఉండేది.
కాలేజిలో పాఠం వింటూండగా రమేశుడికి 'వదిన ఎలా ఉన్నారో' అనిపించగానే, ఏదో కారణం కల్పించుకుని బయటకు వెళ్ళేవాడు.
కాని, ఇపుడు అందరి హృదయాలనూ స్మశాన మౌనం ఆవరించింది.
6

"ఈ అలవాటు ఎప్పటినుండి?"
"ఏదో చికాగ్గా ఉన్నపుడు మాత్రమే."
"సరే గానీ, ఇహ లే వెడదాం" అంటూ బలవంతాన రమేశుడిని బయలుదేర తీశాడు కాంతరాజ్.
పరీక్షలు ఇంకా పదిహేను రోజులన్నాయనగా రమేష్, తండ్రితో చెప్పాడు:
"ఈ మారు నేను పరీక్షకు వెళ్ళదలచుకోలేదు నాన్నా."
ఆ మాట విని శేషగిరిరావుగారు ఆశ్చర్యపడ్డారు.
"ఏం?"
"నే నింతవరకూ పుస్తకాలు తెరవనైనా తెరవలేదు. ఇప్పుడు పరీక్షకు చదివేంత ఏకాగ్రత కూడా నాకు లేదు. వెళ్ళినా నేను పాసవను."
"సంవత్సరమంతా వృధా కుదురా" అని ఇంకా ఆయనేమో చెప్పబోతుండగా కృష్ణమూర్తి కల్పించుకుని:
"అలాగే కానీ, వచ్చే సంవత్సరం వెడుదువుగానీ ఒక్క సంవత్సరమే కదా. పోతే పోతుంది" అన్నాడు.
రమేశ్ కృతజ్ఞతతో అన్నయ్యవైపు చూశాడు.
కాంతరాజ్ సుశీలమ్మగారికి ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు ఉన్న సంగతంతా వివరించాడు:
"మీరు కొద్దిరోజులపాటైనా అతడిని ఎక్కడికైనా పంపడం మంచిది. ఈ వాతావరణం నుండి తప్పుకుంటేనైనా, ఈ బాధను మరిచి మనిషిగా కాగలడేమో!"
