"మీరిలా మాట్లాడితే ఏం చెప్పాలో తెలియటంలేదు."
"అకస్మాత్ గా నేను చనిపోతే ఎవ్వరూ బెంగపెట్టుకోకండి" అతి సహజంగా అంది శాంత.
"ఛా, అవేం మాటలొదినా?"
"ఏమిటో అలా ఆనిపిస్తోంది. చెప్పాను."
"మీ కేమయిందనీ, చావటానికి? ఇక్కడి కొచ్చాక మూడువంతులు నయమయింది."
రమేశుడి భరోసా చూసి చిరునవ్వు నవ్వింది శాంత.
"మృత్యు నిరీక్షణలో ఉన్నాను నేను" అంది మెల్లిగా.
"మీకు భ్రమ; అంతే."
"లేదు రమేష్! నాకు దాని అడుగుల చప్పుడు వినిపిస్తోంది. రోజురోజుకు కృంగిపోతున్నట్టు, మునిగిపోతున్నట్టు అనిపిస్తోంది. నేను చనిపోతే మీ అన్నయ్యను మరో పెళ్ళిచేసుకోమను. నువ్వు..."
"నేను వెళ్ళిపోతున్నాను" అంటూ కుర్చీని వెనక్కు తోసేసి అగ్నిపర్వతంలా నిప్పులు కురిపిస్తూ, గాలిదుమారంలా బయటికి వెళ్ళిపోయాడు.
మర్నాడు రమేశ్ హాస్పిటల్ కు రానేలేదు. భర్త, అత్తగారు వచ్చినప్పుడు శాంత:
"రమేశుడిని ఓ మారు పంపండి" అని చెప్పింది.
సుశీలమ్మగారు ఆశ్చర్యంతో.
"ఈ రోజు రానేలేదా" అన్నారు.
"లేదు."
"మీరేమైనా దెబ్బలాడుకున్నారా?" కృష్ణమూర్తి అడిగాడు.
"దెబ్బలాటాలేదు; ఏమీలేదు."
"వాడేమన్నా దురుసుగా మాట్లాడితే పట్టించుకోక." అని కృష్ణమూర్తి భార్యను ఓదార్చాడు.
"రమేష్ రేపు రాకపోతే, నేను మందు తాగను. అలాగని అతనితో చెప్పండి" అని భర్తతో చెప్పింది శాంత.
"నేను చెప్తాననుకో. కాని, వాడు రాకపోతే మేము బలవంతంగా పంపటానికి వీలుపడుతుందా. మందు తాగనని మాత్రం పట్టుపట్టకేం" అన్నాడు కృష్ణమూర్తి.
"అతడు రాకపోయినపుడుకదా; మీరు నా మాట చెప్పండి. తప్పక వస్తాడు" అంది శాంత ఆత్మ విశ్వాసంతో.
ఆమాటే నిజమయింది. మరునాడు రమేశ్ ధుమధుమలాడుతూ వార్డులోకి అడుగుపెట్టాడు.
"నిన్న రాలేదేం?"
"ఇలా బెదరించి నన్ను రప్పించుకోవటంవల్ల మీకు కలిగిన లాభం ఏమిటో అడగొచ్చా?"
శాంత నవ్వింది: "లాభమా! నువ్వు ఇక్కడికి రావటమే నాకు పెద్ధలాభం."
"మీరు పిచ్సిపిచ్సిగా వాగుతూండండి. నేనేమో వింటూ కూర్చుంటాను. నేనేం రాతిబొమ్మ ననుకున్నారా? మీ మాటల ప్రవాహానికి రాతిబొమ్మ కూడా కొట్టుకునిపోతుంది తెలుసా?"
"రమేశ్! నాకేమనిపిస్తుందో చెప్పనా? ప్రతీ మనిషి ఓ రాతిబొమ్మే. రాతిబొమ్మలు ఊపిరి పీల్చవు.మనం ఊపిరి పీలుస్తాం. అంతే తేడా వాటికీ మనకూ!"
రమేష్ రెచ్చిపోయి: "మనుషుల్ని రాతిబొమ్మ లతో పోల్చటం చాలా అన్యాయం వదినా! మనకు హృదయముందన్న విషయం మరిచిపోతున్నారు" అన్నాడు.
"హృదయమంటే ఏమిటో డాక్టరవబోతున్న నీకే నాకన్నా బాగా తెలిసిఉండాలి."
"మనకు అనుభవాలంటూ ఉండవా? సంతోష మయితే సంతోషిస్తాం; దుఃఖం కలిగితే ఏడుస్తాం. మనం అన్నిటినీ అనుభవిస్తాం; అవునా కాదా? మనుషులను రాతితో పోల్చే మీ మాటలను వెనక్కు తీసుకోండి వదినా!"
రమేశుడి ఉద్రేకాన్ని చూసి శాంత నవ్వింది.
"మాటల ప్రవాహం అన్నావుగా. అదే తీసుకో. రాతిబొమ్మ కూడా ప్రవాహంలో పడితే, తఃదిసి పోతుంది. గాలికీ, ఎండకు తగిలి క్రమంగా ఆరిపోతుంది; అలాగే మానవుల మనస్సుకూడా అంటున్నా. సుఖ-దుఃఖాలు ఎంతసేపుంటాయి. కాల ప్రవాహంలో అన్ని గాయాలూ మానిపోతాయి."
రమేశ్ వ్యంగ్యంగా:
"సరే; ఇంత వేదాంతం చెపుతున్నారే - ఈ మాటకు సరిగ్గా జవాబు చెప్పండి చూద్దాం. నన్నెందుకింత పట్టించుకుంటున్నారు? చెప్పండి మరి" అన్నాడు. ఈ దెబ్బతో వదినను ఓడించాననుకున్నాడు రమేశ్.
శాంత వాడిపోయిన మొహంలోకి చిరునవ్వు తొంగిచూసింది.
"దానికీ కారణముంది. అందులోనూ స్వార్ధమే ఉంది."
"స్వార్ధమా?"
"అవును. నా కో బిడ్డ పుట్టి ఉంటే, నీవైపు కన్నెత్తికూడా చూసేదాన్ని కాదేమో. మనసులో మమత పెరుకున్నప్పుడు దానిని ప్రవహింపచెయ్యక పోతే భరించలేం. ఆ బరువు దింపుకోవటం స్వార్ధం కాదా?"
శాంత నవ్వుతూ మాట్లాడినా, ఆమె కంఠం క్షీణంగా ధ్వనిస్తోంది.
"ఇహ మాట్లాడకండి వదినా! మీకు ఆయాస మవుతుంది."
"కళ్ళున్నంతవరకూ చూపు; నాలికున్నంతవరకూ మాట."
"మీరు ఇలా మాట్లాడితే నే నసలు రానే రాను. నేను రావాలనుంటే, మీరు ఇలా మాట్లాడటం మానెయ్యాలి."
"లేదులేరా. ఇహ ఇలా మాట్లాడనులే" అని భరోసా ఇచ్చింది శాంత.
ఏ దుర్ముహూర్తంలో 'కళ్ళున్నంతవరకూ చూపు, నాలికున్నంతవరకూ మాట' అని శాంత అన్నదో కాని, ఆ మాటే నిజమయింది.
రాత్రి పదిగంటల ప్రాంతంలో డాక్టరు ఆఖరి రౌండుకు వచ్సినప్పుడు శాంతవైపు చూసి:
"ఎలా ఉన్నారు?" అని అడిగారు.
శాంత మాట్లాడలేదు. ఊరికే కళ్ళప్పగించి డాక్టర్నే చూసింది. ఆమె కనురెప్పలు మూతపడగానే రెండు కన్నీటి బిందువులు ఆమె చెక్కిళ్ళమీదుగా రాలాయి. ఆమె పెదిమలు చలించాయి. కాని మాట బయటికి రాలేదు,
డాక్టరు దగ్గరగా వచ్చి ఆమె దుర్భల హస్తాన్ని చేతిలోకి తీసుకుని "ఎలా ఉన్నారు?" అన్నారు.
శాంత మాట్లాడలేదు. కన్నీళ్ళు ముత్యాలలా చెక్కిళ్ళమీద ప్రవహించసాగాయి.
మాట్లాడలేరా?"
తల అడ్డంగా తిప్పింది. డాక్టరు, నర్సు ఆమెవైపు తిరిగి "ఎప్పటినుండి ఇలా అయింది" అని అడిగారు.
"సాయంకాలం బాగానే మాట్లాడారు. బహుశా ఎనిమిది గంటల తరువాతనే ఇలా అయుండాలి" అంది నర్సు.
డాక్టరు మళ్ళీ శాంతను మాట్లాడించటానికి ప్రయత్నించారు. కళ్ళనుండి ప్రవహించే కన్నీరే లేకపోయినట్టయితే ఆమెను చెక్కబొమ్మ అని తేలిగ్గా చెప్పవచ్చును. ఆఖరికి డాక్టరుగారు తమ ప్రయత్నంలో విఫలులై వెళ్ళిపోయారు.
మరునాడు ఉదయం కాఫీ తెచ్చిన కృష్ణమూర్తికి ఈ వార్త పిడుగులా తగిలింది. కాఫీ గ్లాసులోకి పోసి "తాగు" అన్నాడు.
శాంత మాట్లాడలేదు.
"నేనే తాగిస్తాను" అంటూ కృష్ణమూర్తి కొద్దికొద్దిగా కాఫీ తాగించాడు.
"ఎలా ఉంది నీకు? ఊరికే ఏడవకు శాంతా! నీకు తొందర్లోనే నయమవుతుంది" అంటూ ఆమె కన్నీళ్ళను తుడిచాడు కృష్ణమూర్తి.
శాంత పెదవులు చలించాయి. కన్నీటి ప్రవాహం కట్టలు తెంచుకుంది.
"ఆమె మాట్లాడలేకపోతున్నారు" చెప్పారు పక్కమంచంమీదున్నావిడ.
"ఆఁ."
"నిన్నరాత్రి నుండి ఇలాగే ఉంది. అప్పటినుండి ఏడుస్తూనే ఉన్నారు."
"శాంతా! ఏమయిందో చెప్పవూ? గొంతు నొప్పిగా ఉందా....." గబగబా మెడికల్ కాలేజికి పరిగెత్తాడు కృష్ణమూర్తి.
కనిపించిన విద్యార్ధిని అడిగాడు: "ఫైనల్ ఇయర్ లోబి రమేశ్ ఎక్కడుంటారో తెలుసా?"
"తెలీదు."
ఇంకా కొంతమందిని అడిగాక కాని, రమేశ్ వుండే చోట. కనుక్కోలేకపోయాడు కృష్ణమూర్తి. ఆఖరికి రమేష్ కృష్ణరాజేంద్ర హాస్పిటల్ కు వెళ్ళాడని తెలిసింది. కృష్ణమూర్తి తమ్ముడిని వెతుక్కుంటూ పరుగుతీశాడు.
జనరల్ వార్డులో రోగి జబ్బు గురించిన చార్టు చూస్తూ నిల్చున్నాడు రమేశ్. రోగితో పరిహాసంగా మాట్లాడుతూ ఉండటంవల్ల అతడిమొహంమీద నవ్వు వెలుగుతోంది.
కృష్ణమూర్తి వార్డులోకి పరిగెత్తుకుంటూవచ్చి, "రమేష్! తొందరగా రా" అన్నాడు.
అన్నయ్య-మొహం హూసి రమేశుడి కాళ్ళూ, చేతులూ ఆడలేదు.
"ఏమయిందన్నయ్యా?" అనే రమేశుడి కంఠం లోని ఆర్ద్రతను గమనించి కృష్ణమూర్తి ధైర్యం తెచ్చుకున్నాడు.
"కంగారేం లేదు గాని, శాంతకు రాత్రినుండి మాట్లాడటానికి చేతకావటం లేదట. ఊరికే ఏడుస్తోంది. నువ్వోసారి వచ్చి పలకరించి చూడు" అన్నాడు కృష్ణమూర్తి.
రమేశ్ వెంటనే అన్నయ్యతో కలిసి హాస్పిటల్ కు వెళ్ళాడు.
అంతకుముందు రోజు శాంత అనిన "నాలికున్నంత వరకూ మాట" అనే వాక్యం అతడి చెవుల్లో గింగురు మంటోంది.
రమేషుడిని చూడగానే శాంత దుఃఖం మరింత ఎక్కువయింది.
"వదినా! మీకు ఏమవుతోంది చెప్పండి. నాతో కూడా మాట్లాడరా మీరు? మామీద కోపం కాదు కదా?" అంటూ ఎన్నో విధాలుగా పలకరించాడు రమేశ్.
వాటి కన్నీటికీ ఒక్కటే జవాబు-కన్నీరు.
రమేశ్, ఆస్పత్రి ప్రధాన వైద్యులను చూడటానికి వెళ్ళాడు. ఆమె లేజర్-వార్డులో ఉందని త్జేలిసి, బయట బెంచిమీద కూర్చున్నాడు. తను లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. బయటనే కూర్చుని నిమిష నిమిషానికి తలుపు వైపుకే చూస్తూ, ముళ్ళ మీద కూర్చున్నవాడిలా మహా ఆరాటపడిపోతున్నాడు.
ఆఖరికి బయటకు వచ్చిన నర్సును అడిగాడు:
"డాక్టరుగారు ఏం చేస్తున్నారు?"
"ఫోర్సెన్స్ కేసు అటెండ్ చేస్తున్నారు" అని చెప్పి, చకచకా వెళ్ళిపోయింది నర్సు.
లోపలనుండి వినబడుతున్న మూలుగు, ఏడుపు, అరుపులు వింటూ, బయట కూర్చున్నాడు రమేష్.
ఈవిధంగా లేబర్-వార్డుముందు కాచుక్కూర్చునేరోజుకోసం ఎన్నేళ్ళు ఎదురుచూశాడు తను!
ఆఖరికి ఆరోజు రానేలేదు.
ఒక్కసారి-పెళ్ళయిన పదేళ్ళ తరువాత, శాంత తల్లి కాబోయే సూచనలు కనబడినప్పుడు ఇంట్లో అందరూ సంతోషంతో పొంగిపోయారు.
అంతవరకూ ఇంట్లో అందరికీ "బిడ్డ" అయిన రమేశుడికి అప్పటినుండే తను పెద్ధవాడన్న భావం కలుగసాగింది.
కాని, రెండు నెలలకే తాము కన్న కలలన్నీ కల్లలయినపుడు ఇంట్లోనివారికి కలిగిన నిరాశమాత్రం ఎంతటిది!
ఆరోజు రమేశ్ శాంతను చూడటానికి వెళ్ళి నపుడు, ఆమెను అప్పుడే వార్డులోకి తెచ్చి పడుకోబెట్టారు.
తెల్లటి పక్కమీద అంతకన్నా తెల్లగా పాలిపోయిన శాంతను చూసినపుడు రమేషుడి హృదయం దుఃఖంతోనూ, జాలితోనూ నిండిపోయింది. అసలే బాధ పడుతున్న ఆమెను మరింత బాధపెట్టడం ఇష్టంలేక నవ్వుతూనే పలకరించాడు.
"ఎలా ఉన్నారు వదినా?"
"కులాసాగానే ఉన్నాను."
"ఇప్పటినుండి ఆరోగ్యం బాగా చూసుకోండి. ఇంకోమారు ఇలా కాకుండా......"
ఆ మాట విని శాంత వెక్కి వెక్కి ఏడ్చింది.
రమేశుడు కోపంగా, "వదినా! మీకు చాలా దురాశ" అన్నాడు.
"ఏం?"
"నాకన్నా మంచికొడుకు కావాలనుకోవటం దురాశ కాదా ఏం? నాలో మీకేం లోటు కనిపించింది చెప్పండి. చూడటానికి అందంగా లేనా? చదువు లేదా? మంచివాడిని కానా? చెప్పండి. మీరిలా ఏడిస్తే నామీద ఒట్టే."
