7
సాయంత్రం మరీ ఒంటరితనం అని పిస్తోంది. గోపాలానికి.....శశిరేఖ వెళ్ళి పోయాక మాట్లాడడానికైనా ఎవ్వరూ లేరు. తనకి ఉన్న కొంచెంమంది స్నేహితులూ దూరంగా ఉన్నారు. అదీకాక వాళ్ళ సర్కిల్స్ వేరు.
కాఫీ తాగి బీచ్ కి బయలుదేరేడు. రామకృష్ణా మఠం దగ్గర ప్రశాంతంగా ఉంటుందని నడిచి అక్కడికే చేరుకున్నాడు. కొంచెం దూరంగా. ఎవ్వరూలేని చోటున కూర్చుని, తన జీవితాన్ని అవలోకనం చేసుకున్నాడు-
ఆ ప్రశాంతత తన నవజీవనపు ఆశలలో బాటు ఎంతో ఉపశమనం యిస్తోంది. అనంతం లాగ తూర్పుకి వినీల సముద్రం వ్యాపిస్తూ. మన సులోని చిన్నచిన్న ఆలోచనల్ని అణుమాత్రాలుగా చేసి ఉదాత్తమయిన ఉపన్యాసం ఇస్తూ న్నట్లు హోరు పెడుతోంది.
హఠాత్తుగా అతనికి జ్ఞాపకం వొచ్చింది. ఈరోజు దాకా పెళ్ళిమాట అతను కాని. శశి రేఖగాని బయటికి అనలేదు ఆని ఆ మాట అనకుండానే తాను ఆమే ఏనాడో వాగ్ధత్తులె పోయాడు. ఆమె తిరిగివొచ్చాక ఈ విషయం నిర్దారణగా చెప్పాలి. కనీసం ఆమె మనశ్శాంతి కోసం ఐనా.
చల్లగా గాలి వీస్తోంది.
అతని నరనరాలలోని ఆ వేగం కొంచెం తగ్గి మనస్సుకూడా శాంతించింది కొంతసేపు ఏ ఆలోచనా రాకుండా అలాగే కూర్చున్నాడు. సగం మగతలో ఎంతసేపో అతనికే తెలేదు....కుక్క అరుపు చెవిలో పరుషంగా ప్రమాదంగా పడే దాకా.
క్షణ మాత్రం అచేతనుడైపోయాడు గోపాలం - చీకటి చీకటి కోణాలనించి ఒక్క సారి మిరుమిట్లలోనికి వొచ్చినట్లయింది అతనికి.
కుక్క ఒక గజందూరంలో నిలబడి కర్కశంగా తన కళ్ళల్లోకి చూస్తూ అరుస్తోంది. గుండె ఝల్లుమంది.
"శమ్మీ-కమ్మీ-రోగ్!"
వసంత కుక్క వెనకాల పరిగెట్టినట్టుంది-ఎగఊపిరి వొస్తూన్నట్టుంది ఆమె గొంతుక.
శమ్మీని రెండుదెబ్బలు గట్టిగానే కొట్టింది వసంత. శమ్మీ శాంతించాక, "సారీ గోపాల్ - శమ్మీకి బుద్దిలేదు. నాపట్టు విడిపించుకుని మరీ వొచ్చింది గుంజుకుని..." అంటూ ఆమెకూడా ఇసుకలో కూర్చుంది.
"సరే వసంతా షికారువొచ్చావా?"
"ఆఁ....ప్రాణం విసిగిపోతూంది గోపాల్- సాలిటిరీ కన్ ఫెన్ మెంటులాగ ఉంది. సినిమాకి తప్ప వెళ్ళేందుకు లేదు తిరిగేందుకు బీచ్ తప్ప లేదు"
ఇవేళ గులాబి రంగు చీరా. సీవ్ లెస్ బ్లౌజూ వేసుకుంది వసంత. గులాబి రంగు చెప్పులు-పొట్టిగా వేసుకున్న రెండుజడలు.
నిర్వికారంగా ఆమెను కంటికొసతో పరీక్షించేడు. మొన్న చిన్నపిల్లలాగ కనిపించిన వసంత ఇవేళ యువతి ఐపోయింది.
"కలకత్తా వెళ్ళు- ఎమ్. ఏ చదూ-"'
గాయపడ్డట్టు చూసి, "నీకేం తెలీదోతెలిసి హృదయం లేకుండా మాట్లాడతావో నాకు తెలీదు గోపాల్!" అంది వసంత.
కొంచెం ఆశ్చర్యంగా, "ఏమన్నాను వసంతా?..... నాకేమీ తెలీదు..." అని తన మాటలు తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడు గోపాలం. ఎలాగ చూసినా తానన్నదానిలో తప్పు ఏమీ కనిపించలేదు అతనికి. ఆమె మాట్లాడకపోవడం చూసి, "అప్పటి చిన్నపిల్లవి కావు వసంతా. కాని, నీమాటలన్నీ ఆ రోజులకన్న మరీ మారిపోయాయి" అన్నాడు.
ఆమె తల ఎత్తి. "నిజం చెప్పు గోపాల్! శేఖర్ నీతో ఏమీ చెప్పలేదా?"
"దేని గురించి?"
"నన్ను గురించి - ఇక్కడి కెందుకొచ్చానో దాన్ని గురించి...."
"లేదు వసంతా-నాకేమీ తెలీదు"
కుక్క మెడమీద నెమ్మదిగా రాస్తూ "మొన్న గ్లాసు విసిరినప్పుడు ఏమనుకున్నావు నువ్వు?" అని అడిగింది వసంత.
"నీ పెంకితనం పోలేదనుకున్నాను. అమ్మాయి పెద్దపిల్ల ఐపోయినా, ఇంకా చిన్నతనం పోలే దనుకున్నాను."
నిట్టూర్చింది వసంత. అంత అందమైన నిట్టూర్పు ఉంటుందని అతననుకోలేదు......సీతాకొక చిలుక నిట్టూర్పు లాగ. క్షణమాత్రం అతనికి అనిపించింది. ఆమెని రెండు చేతుల్లోకీ తీసుకుని ఊరడించాలని. మరుక్షణం ఆమెకీ తనకీ మధ్య ఉన్న దూరాన్ని జ్ఞాపకం తెచ్చుకుని జ్ఞానం తెచ్చుకున్నాడు గోపాలం.
"నేను చిన్నపిల్లనికాదు గోపాలం- నీ పాత జ్ఞాపకాలకి వయస్సు రాలేదు అంతే...ఇప్పట్లో కలకత్తాగాని. మరెక్కడికిగాని వెళ్లేందుకు నాన్నగారి అనుమతి లేదు..."
అతను వింటున్నాడు.
"కలకత్తాలో చదువుతూంటే విశ్వాస్ అని ఫ్రెండ్ దొరికాడు-చెప్పేదా?-లేక ఇలాటి కథలు చెప్తూ నీ బంగారు మనసుని కల్మషంతో నింపుతున్నానా?"
"చెప్పు" అనాలని అనుకోకుండా అన్నాడు గోపాలం.
"ఆల్ రైట్ అక్కడ హాస్టల్ లో ఉంటూన్న విశ్వాస్ తో తరచు తిరిగేదాన్ని. అతను అక్కడ ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ - ఆ కట్ గ్లాస్ సెట్ లండన్ నుంచి నా కోసం తెచ్చినది అతనే."
"ఆ మాత్రం-"
"నిను-" క్రూరంగా, నిశితంగా అంది. ఆమె గొంతుక ఒక్కసారి పదునైన కత్తి అంచు లాగ ఐపోయింది. విశ్వాస్ అంటే క్రమంగా మరీ అభిమానం ఎక్కువైపోయింది. అతను హాస్టల్ కి రాకుండా వార్డెన్ కట్టడి చెయ్యడంతో అతనంటే మరీ అభిమానం వొచ్చేసింది, నా కోసం అతను ఏమైనా సరే చేసేవాడు...
"డిటైల్స్ అన్నీ వొద్దులే. చివరికి ఒకనాడు అతని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి అక్కడే వుండి పోయాను. ఆ అర్ధరాత్రి అతని ఫేమిలీ అనుకోకుండా వచ్చారు-"
ఆమె ఆగింది. వొంచిన తల ఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు గోపాలం, సూర్యాస్తమయ సమయం, ఎర్రటి కిరణాలు : ఆమె ముఖం అంతా ఎరుపు....బట్టలు ఎరుపు...
"హాస్టల్ కి వెళ్ళేను, రూమ్ ఖాళీచేసి వెళ్ళడానికి ఆరుగంటల టైము ఇచ్చింది వార్డెన్. కాలేజీ వొదిలి వెళ్ళకపోతే ఎక్స్సెల్ చేస్తానని చెప్పాడు ప్రిన్సిపాల్.
'ఒక స్నేహితురాలు రెండురోజులు ఉండనిచ్చింది, టికెట్ దొరికేదాకా, నాన్నగారికి వైరు ఇచ్చేను. అందుకే హఠాత్తుగా రావడం..."
"సారీ వసంతా - నాన్నగారికి తెలుసా?- ఐ మీన్ - వివరాలు..."
"ఆఁ... అన్ని వివరాలు వార్డెన్ తెలియ జేసింది."
వెయ్యి ఆలోచనలు వొంద దారుల్లో పరిగెడుతున్నాయి గోపాలం తలలో ఆమె తరంగాల వొంక చూస్తూ కూర్చుంది. దూరంగా వాలిన పక్షి వెనకాతల పరిగెట్టి ఆడుతోంది శమ్మీ.
చాలాసేపు అతనేం అనలేకపోయాడు. ఆ స్నిగ్ధ సౌందర్యం వెనకాల. ఆ పాలలాటి పాలభాగం వెనకాల ఇలాటి కథ ఉంటుందని అతను కలలోనైనా ఊహించలేకపోయాడు.
"ఇదంతా నాకెందుకు చెప్పేవు వసంతా?" అన్నాడు చివరికి కొంచెం తేరుకుని.
"నీ పవిత్రత చూసి కోపంవొచ్చి....అది ఇప్పుడు శేఖర్ ఈ మాటలు నీతో చెప్తాడు-వాడికి ప్రాణం నువ్వు. అది సహించలేక-"
సూర్యాస్తమయం ఐపోయింది. వెలుతురు క్రమంగా పలచబడుతోంది.
"ఒకమాట అడిగేదా వసంత?"
"అడుగు-"
"అతని - ఫేమిలీ విషయం నీకు ముందు తెలుసునా!"
ఆమెకళ్ళు కత్తుల్లాగ గుచ్చుకున్నాయి అతనికి. ఆవేశం ఆపుకుంటూ. నువ్వూ ధూర్తుడివే గోపాలం. నాకు కొంచెమూ ఆత్మగౌరవం లేదంటావా?"
ఆమె లేచి నిలబడింది. అతనూ లేచాడు.
"క్షమించు వసంతా - కొంత అర్ధంఐంది. క్షమించానని చెప్పు ఆవేదనతో అన్నాడు గోపాలం.
"క్షమించక చేసేది లేదులే....గుడ్ నైట్."
ఆమె పది అడుగులు వేసేదాకా అతను అడుగు కదల్పలేకపోయాడు.
త్వరత్వరగా ఆమెని కలుసుకుని, "ధూర్త త్వాన్ని క్షమించ వొద్దుగాని. మూర్ఖత్వాన్ని క్షమించగలవు వసంతా....ఆ మాత్రం పరిచయం ఉంది నాతో" అన్నాడు.
ఆమె ఆగకుండా రోడ్డుదాకా నడిచి," ఆల్ రైట్ - నీ నీతికీ, నా నీతికీ భేదం ఉంది....అందుకే నిన్ను క్షమించడం. గుడ్ నైట్" అంది.
"ఇంటిదాకా వొచ్చివెడతాను"
"థాంక్స్- కాని, ఏమీ బాధలేదు. నా శక్తి చాలకపోతే శమ్మీ అరుపుచాలు .... శ్రమ తీసుకోకు" అంది వసంత.
"నువ్వు నిజంగా క్షమిస్తే ఆ మాట అనవు" అన్నాడు.
ఆమెతో నిశ్శబ్దంగా నడిచి ఇల్లు చేరేడు.
"లో పలికి రా?" అంది వసంత. ఈ నడకతో ఆమె కోపం తీరినట్టుంది.
అత నీ జవాబు ఇచ్చేలోగానే వరండాలోకి వొచ్చి, వెంకటరామ్ గారు, "హల్లో గోపాల్! రా!... వసంతా! చీకటిపడేదాకా ఎక్కడికి వెళ్ళేవమ్మా?" అన్నారు.
"బీచ్ లో గోపాల్ కలిస్తే మాట్లాడుతూ ఆలస్యం ఐపోయింది నాన్నగారూ!" అని, వసంత కుక్క ని కట్టేసి, లోపలికి వెళ్ళిపోయింది.
"శేఖర్ లేడాఁడి?"
"అనకాపల్లి వెళ్ళేడు-ఉదయం. రా కూర్చో"
"వొద్దండీ-రేపు వొస్తాను"
"సరే-రేపు తప్పకుండా రా. శేఖర్ వెళ్ళి పోతాడు కూడా ఇంకో రెండురోజుల్లో చాలా మారిపోయావయ్యా! రేపు తప్పకుండా రా!"
గోపాలం "అలాగే నండీ!" అని, సెలవు తీసుకుని త్వరగా నడిచాడు.
8
మరునాడు శేఖర్ ని చూడ్డానికి సాయంత్రం వెళ్ళేసరికి వెంకట రామ్ లేరు. శేఖర్ ఆనం దంగా గోపాలాన్ని ఆహ్వానిస్తూ, "బ్రదర్? నీ కోసమే చూస్తున్నాను. ఇక్కడ ఉన్న పది రోజులూ నీతో మాటలాడ్డమే కుదర లేదు. ఇవేళ దాకా" అంటూ ఆహ్వానించేడు.
కేన్ కుర్చీలు గార్డెన్ లో వేసుకొని ఇద్దరూ కూర్చున్నారు. మేడమీద నించి పియానో విని పిస్తోంది.
"వసంతకి పియానో వొచ్చా?" అన్నాడు గోపాలం.
"రాదు, వాళ్ళ కట్ లో ఏదో రిసైటల్ ఐతే రికార్డు చేసింది, నాన్నగారికి వీణ అంటే ప్రేమ. ఆయన ఉండగా కుదరక, ఆయన లేనప్పుడు రికార్డర్ పెడుతూ ఉంటుంది" అన్నాడు.
"నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు?"
"మఠానికి ఆయన నాకు నోటీసు ఇచ్చేరు-వొచ్చే మీటింగ్ లో నన్ను డైరెక్టరుగా ఎన్నుకుంటారని-క్రమంగా వొదిలేస్తున్నారు వ్యవహారాలు."
"కంగ్రాట్యులేషన్స్"
"దేనికని? మెడమీద కాడి పడుతోన్నందుకా? అది సరికాని. నువ్వు కలకత్తా వొచ్చీకూడదూ? నీ క్వాలిఫికేషన్ తో ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం దొరక్కపోదు."
"థాంక్స్- ఇక్కడ ఏదీ కుదరకపోతే ఆ పనే చేస్తాను.....వొచ్చేవారం ట్యుటోరియల్ కాలేజీలో జాయిన్ అవుతున్నాను"
