8
అంతా అయిపోయింది. ఎర్రటి కుంకుమ బొట్టు లేని వెలవెలబోతున్న తల్లిముఖం చూసినప్పుడల్లా చారుమతి కళ్ళనీళ్ళు ఆపుకోలేక పోయేది. తండ్రి మరణం గుర్తుకువచ్చేది. కాని అన్ని ఆలోచనల మధ్య చారుమతికి ఎన్నో ప్రశ్నలు ఉదయించేవి తండ్రికి తెలుసు తను చచ్చిపోతానని. అందుకే పేరుపేరు వరసనా అందరినీ పిలిచి, "వెళుతున్నాను" అని చెప్పారు. "నా పని అయిపోయింది" అన్నారు. కాని చనిపోయేముందర, "ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఎలా నడుపుకు వస్తావు సంసారం?" అని ఒక్కసారి కూడా తల్లితో అనలేదు. ఎదిగిన ఆడపిల్లలికి పెళ్ళిళ్ళు కావాలి; శంకరం చదువు పూర్తి కావాలి-ఇలాంటి వ్యథలేమీ తండ్రికి ఉండేవి కావా? ఒక్క మాటకూడా అనలేదేం? తండ్రి తత్త్వం అర్ధం కాలేదు చారుమతికి. ఉన్నన్ని రోజులూ రాత్రీ పగలూ శ్రమించి డబ్బు సంపాదించే వారు సంసారంకోసం. పిల్లలిని ఎంతో ప్రేమగా, ఆదరంగా దగ్గిరికి తీసేవారు. ఇబ్బందిపడి వాళ్ళని చదివించేవారు. మరి, చనిపోయేముందు ఏ దిగులూ లేకుండా నిశ్చింతగా ఎలా పోయారు? ముప్పై ఏళ్ళు కాపరం చేసిన భార్యకాని, చిన్నతనంనించి పెంచిన తల్లికాని, ముద్దుల చిన్నకూతురు భగవతికాని జ్ఞాపకంరాలేదు. వాళ్ళని తలుచుకోనుకూడా తలుచుకోలేదు! 'ఏమిటో విచిత్రం!' అనుకుంది చారుమతి.

చారుమతికి ఇంట్లో ఏమీ తోచటంలేదు. ఏ పని చేస్తున్నా, ఎక్కడ కూచున్నా తండ్రి మరణం, తండ్రిని గురించిన ఆలోచనలే తలపుకి వస్తున్నాయి. 'అనవసరంగా సెలవు పొడిగించాను' అని విసుక్కుంది. తండ్రి చనిపోయి పదిహేను రోజులైంది. దినవారాలు అయిపోయాయి. పరామర్శకి, దినవారాలకి వచ్చిన బంధువులు వెళ్ళిపోయారు. ఇంట్లోనే అన్నాళ్ళూ ఉండిపోయిన శంకరం ఆ రోజు తిరిగి కాలేజీకి వెళ్ళాడు. మాలతిని, భగవతిని కూడా స్కూలుకి పంపింది భానుమతి. చారుమతిమాత్రం, "నే నిప్పుడు స్కూలుకి వెళ్ళి పాఠాలు చెప్పలేను" అంటూ ఇంకో వారం సెలవు పొడిగించింది.
ఇంట్లో కూచుంటే వెయ్యి సమస్యలు తల ఎత్తుతున్నాయి. ముఖ్యంగా ఆర్ధికమయిన ఇబ్బందులు తలుచుకుంటే భయం వేస్తూంది. ఇప్పుడే కొంచెం ఆర్ధికంగా ఒక గాడిలో పడ్డ తను సంసార పరిస్థితి మళ్ళీ తలకిందులయింది. తన జీతంతప్ప వేరు ఆధారం లేదు. నూరు రూపాయలేనా లేని ఆ జీతంతో ఏడుగురు బ్రతకాలి. ఎలా గడుస్తాయి రోజులు? నాలుగు నెలలలో శంకరం పరీక్షలు అయిపోతాయి. శంకరానికి ఉద్యోగం దొరికేదాకా తనే సంసారాన్ని నడపాలి. తండ్రి దినవారాలకి, బంధుసత్కారానికి బోలెడు డబ్బు ఖర్చు అయింది. రేవతి పెళ్ళి అప్పు అయిదు వందల రూపాయల బాకీ ఇంకా అలాగే ఉండిపోయింది. చారుమతికి తల బద్ధలవుతూంది. ఊరికే నులకమంచం మీద అటూ ఇటూ పొర్లుతూ, నిద్రకోసం ప్రయత్నించింది. మధ్యాహ్నం మూడుగంటలవుతూంటే మగతగా నిద్ర పడుతున్న చారుమతికి బయటినించి ఎవరో "అమ్మా" అని పిలుస్తున్నట్టు వినిపించింది. లేచి, "ఎవరూ?" అంటూ బయటికి వచ్చింది. ప్లీడరుగారి నౌకరు నూకరాజు నిలబడి ఉన్నాడు. తండ్రికోసం అప్పుడప్పుడు వచ్చేవాడు నూకరాజు.
"ఏం నూకరాజూ?"
"అయ్యగారు శంకరంబాబుగార్నికాని, మిమ్మల్ని కాని ఎంటబెట్టుకు రమ్మన్నారండీ."
"ఎందుకూ?" ఆశ్చర్యపోతూ అడిగింది చారుమతి.
"నాకు తెల్ధండీ."
"ఇప్పుడే రావాలా? శంకరం ఇంట్లో లేడు."
"మీరు రండి, అమ్మాయిగారూ" అన్నాడు నూకరాజు అక్కడే నిలబడి.
బయట మాటలు వినబడి, "ఎవరు వచ్చారూ?" అంటూ భానుమతి బయటికి వచ్చింది.
చారుమతి సంగతి వివరించి, "శంకరం వచ్చాక పంపిద్దాం" అంది లోపలికి వస్తూ.
"పోనీ, నూకరాజుతో వెళ్ళకూడదా? ఆయన ఎందుకు రమ్మన్నారో ఏమో?" అంది భానుమతి.
చారుమతి విసుక్కుంటూ, చీర మార్చుకుని బయలు దేరింది.
"నూకరాజూ, ప్లీడరుగా రివ్వాళ కోర్టుకి వెళ్ళలేదా?" దారిలో అడిగింది చారుమతి.
"లేదమ్మా ఆరి కియ్యాల ఒంట్లో నలతగా ఉండి, ఇంటోనే ఉండిపోనారు."
దారిలో అంతా ప్లీడరుగారి సుపుత్రుడు రాధాకృష్ణతోబాటు అతనితో తన విశాఖ ప్రయాణం జ్ఞాపకంవచ్చింది చారుమతికి. భయం వేసింది. కాని ప్లీడరుగారి మంచితనం గుర్తుకువచ్చి, తిరిగి ధైర్యం తెచ్చుకుంది. తండ్రి పోయిన రోజు ప్లీడరు గారు కొద్దిసేపు ఇంట్లో కూచుని, నాలుగు ముక్కలు పిల్లలతో మాట్లాడి వెళ్లారు. ఆయన పరోక్షంగా ఆరో జెంతో సహాయం చేశారు తమకు.
చారుమతి ప్లీడరుగారింట్లో మొదటిసారిగా అడుగుపెట్టింది. ఇల్లు చాలా పెద్దది. ఇంటి చుట్టూ మొక్కలు, ప్రహరీగోడ. ఇంట్లోకి అడుగు పెట్టగానే వరండాని ఆనుకుని ప్లీడరు లక్ష్మీపతిగారి కచేరీగది ఉంది. నూకరాజు తిన్నగా కచేరీగదిలోకి తీసుకువెళ్ళాడు. ఏదో పుస్తకం చదువుకుంటున్న ప్లీడరుగారు చారుమతిని చూడగానే, "రామ్మా, కూర్చో" అంటూ ఆదరంగా పిలిచి కుర్చీ చూపించారు. చారుమతి నమస్కారం చేసి కూర్చుంది.
"ఎలా ఉన్నారమ్మా అంతా? అమ్మ ఎలా ఉన్నారు?" కుశలప్రశ్నలు వేశారు ప్లీడరుగారు.
"అమ్మ ఇంకా కోలుకోలేదండీ. మామ్మ మరీ డీలా అయిపోయింది. మంచంలోనించి లేవటంలేదు" అంటూ పరిస్థితులు చెప్పింది చారుమతి.
"అమ్మకి, మామ్మకి మీరే ధైర్యం చెప్పాలి. చదువుకున్నదానివీ, ఉద్యోగం చేస్తున్నదానివీ ముఖ్యంగా నువ్వు ధైర్యంగా ఉండి ఇల్లు చూసుకోవాలి."
చారుమతి తల వంచుకుని వింటూ కూర్చుంది.
"మీ నాన్నంత నిజాయితీపరుణ్ణి, నెమ్మదస్తున్ని ఇంకొకరిని చూడలేదు నేను. ఆయన ఇలా అకస్మాత్తుగా పోవడం చాలా విచారకరం. ముఖ్యంగా ఆయన లేకపోవడం నా కెంతో కొరత."
తండ్రిని గురించిన ప్రశంసావాక్యాలు వింటూ కంట నీరు నింపుకుంది చారుమతి.
ప్లీడరుగారు డ్రాయరు తెరిచి, ఒక కవరు తీసి చారుమతిముందు పెడుతూ అన్నారు: "ఇది తీసుకో, అమ్మా. ఇందులో వెయ్యి రూపాయలు ఉన్నాయి. ఇది ఇచ్చి మీ నాన్న ఋణం తీర్చుకుంటున్నా ననుకోకు. ఏదో నా చేతనైన కొద్ది సాయం మీ కుటుంబానికి చెయ్యాలని ఇస్తున్నాను."
చారుమతి డబ్బు చూసి తడబడింది. ఆశించని డబ్బు, అనుకోకుండా లభ్యమైన ఆ సొమ్ము తీసుకోవాలంటే సంకోచం కలిగింది. చలనం లేకుండా కూర్చున్న చారుమతిని ప్లీడరుగారు తిరిగి హెచ్చరించారు. "తీసుకో, అమ్మా. గరర్నమెంటు ఉద్యోగమైతే ఏదో పింఛను అంటూ ఉంటుంది. మా ప్లీడరూ, గుమాస్తా ఉద్యోగాలకి ఆ పింఛను ఆశ లేదు. ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేకపోతున్నందుకు, వేరే ఏమీ సహాయం చెయ్యలేక పోతున్నందుకు విచారంగా ఉంది నాకు" అన్నారు.
ఆయనే తిరిగి, "నూకరాజూ, అమ్మాయిగారికి రిక్షా తీసుకురా" అంటూ బయటికి కేకవేశారు.
రిక్షా వచ్చిందని చెప్పాక, చారుమతి ప్లీడరుగారి దగ్గిర సెలవు తీసుకొని, సిగ్గుపడుతూ సొమ్ము ఉన్న కవరు చేతిలో పట్టుకు బయటికి వచ్చింది.
గేటు బయటికి వస్తూంటే, ఇంకో రిక్షా వచ్చి ఆగింది. అందులోనించి తెల్లకోటు వేసుకున్న డాక్టరు ఒకరు దిగారు. చారుమతి ఒక్కసారి అదిరిపడింది. తండ్రి పోయినప్పుడు తనపక్కనే నుంచున్న డాక్టరు! తనకి తోడునీడగా ఉన్న వ్యక్తి!
"నమస్కారమండీ" అన్నాడు డాక్టరు.
ప్రతి నమస్కారం చేసింది చారుమతి.
"ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మ బాగున్నారా? శంకరం కాలేజీకి వెడుతున్నాడా?" ప్రశ్నలు గుప్పించాడతను.
"ఏదో, అదె బాగండీ! శంకరం ఇవాళే కాలేజీకి వెళ్ళాడు."
డాక్టరు ఒక్క క్షణం నిశ్శబ్దంగా నుంచున్నాడు.
"ప్లీడరు గారికి ఒంట్లో బాగులేదుట కదా! చూడటానికి వెళుతున్నారా?" చారుమతి అడిగింది.
"ప్లీడరు గారిని చూడటమేమిటి? ఇది మా ఇల్లు. ప్లీడరుగారు మా నాన్నగారు."
చారుమతి ఆశ్చర్యపోయింది. ఏదో అనాలనుకుంది. కాని పెదవి కదిలి ఒక్క మాట రాలేదు.
"సరే, వస్తానండీ" అంటూ లోపలికి దారితీశాడతను.
చారుమతి ఒక్క క్షణం అతన్నే చూస్తూ నిలబడి, రిక్షా ఎక్కి కూర్చుంది. ఎంత ఆశ్చర్యం! ఇతను ప్లీడరుగారి రెండో అబ్బాయా? రాధాకృష్ణకీ, ఇతనికీ ఎంత వ్యత్యాసం? ఒక కొమ్మకి రెండు రకాల పువ్వులు ఉంటాయా? అన్నదమ్ముల స్వభావాలలో ఇంత తేడా ఉంటుందా? ఈయనకి ప్లీడరుగారి పోలిక వచ్చిందేమో! తండ్రి మంచితనమే కొడుకులోనూ కనిపిస్తూంది.
చారుమతి మనసులో డాక్టరు స్థిరంగా నిలిచి పోయాడు. దయ ఉట్టిపడుతున్న కళ్ళు; ఎంతో ఆప్యాయమైన మాట తీరు; మాట్లాడటంలో అత్మీయత. డాక్టరు రూపురేఖలలో అందం లేకపోయినా, అతని కళ్ళలో, మాటల్లో, మంచితనంలో, ఆప్యాయతలో ఎంతో అందం ఉంది.
రాధాకృష్ణతో డాక్టరుని పోల్చినకొద్ది డాక్టరు మీది గౌరవం పెరిగింది. అతని స్వభావాన్ని నిర్ణయించడానికి అతనితో తనకు గల పరిచయం కొద్దిపాటిదేనని చారుమతి మరిచిపోయింది.
'ఈయన పేరు ఏమిటి? శంకరానికి తెలిసే ఉండాలి. నాన్న చనిపోయినప్పుడు "శంకరం" అని పేరు పెట్టి పిలిచినట్టు గుర్తు' అనుకుంది చారుమతి.
