Previous Page Next Page 
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 6


    చారుమతి అక్కడే నిలబడి తండ్రి పరిస్థితి చూసింది. దగ్గుతోపాటు ఆయాసం వస్తూంది. తెరిపి లేకుండా దగ్గుతున్నారు.
    "శంకరం రాలేదా కాలేజీనించి? సరే, నేను డాక్టరు శ్రీరామారావుగారిని పిలుచుకు వస్తాను" అని చేతిలో ఉన్న పుస్తకాలు టేబిల్ మీద పడవేసి వెళ్ళింది బయటికి.
    డాక్టరుతో ఇంటికి వచ్చేసరికి గంట పట్టింది. ఇంట్లో శంకరం, మాలతి, భగవతి అంతా వచ్చి ఉన్నారు.
    డాక్టరు సూర్యారావుని పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చాడు. "తగ్గిపోతుంది. లేకపోతే నాకు కబురుచెయ్యండి" అని వెళ్ళిపోయాడు.
    సూర్యారావు కొద్దిగా మగతగా కనిపించాడు. దగ్గుకూడా కొంచెం తగ్గింది.
    చుట్టూరా ఉన్న పిల్లల వాడిన ముఖాలు చూశాక గుర్తుకువచ్చింది శాంతమ్మకు, ఉదయం తొమ్మిది గంటలకు తిన్న అన్నమే, మళ్ళీ సాయంత్రం కాఫీనీళ్ళయినా తాగలేదని.
    "భానూ, కుంపటి వెలిగించు. కొద్దిగా బియ్యం పడేస్తాను" అంది.
    "నువ్వెందుకమ్మా నేను చేసేస్తాను వంట" అని భానుమతి లోపలికి వెళ్ళి వంటప్రయత్నం మొదలు పెట్టింది.
    ముసలమ్మ వణుక్కుంటూ కంబళీ కప్పుకుని మూలకూచుని కొడుకువైపే చూస్తూంది ఆందోళనగా. "మాయదారి రోగాలు!" గొణుక్కుంటూంది.
    భానుమతి అన్నం, ఊరగాయ, మజ్జిగ వేసి చెల్లెళ్ళకీ, తమ్ముడికీ భోజనం పెట్టింది. వాళ్ళు తింటూండగానే మళ్ళీ సూర్యారావు దగ్గు వినిపించింది. దగ్గుతోబాటు విపరీతమైన ఆయాసం. ఊపిరి అందనట్టు కష్టంమీద శ్వాస తీసుకుంటున్నాడు. గబగబా చేతులు కడుక్కుని వచ్చిన శంకరాన్ని, చారుమతిని చూపి, "బాబూ, డాక్టరుని పిలుచుకురారా ఈ బాధ భరించలేను" అన్నాడు.
    శంకరం చొక్కా మార్చుకుని, తొందరగా బయటికి వెళ్ళాడు. ఇంట్లో అంతా డాక్టరుకోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు.
    ఎదటి మనిషి విపరీతంగా బాధపడుతూంటే, నిస్సహాయంగా చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చోడమంత కష్టం, వ్యథ మరోటి ఉండదు. ఆ వ్యక్తికి ఎలాగో లా సహాయం చేసి బాధ నివారించాలని ఉంటుంది. ఏమీ చెయ్యలేము. బాధపడుతున్న వ్యక్తి దగ్గిర వాడయితే చూస్తున్నవాళ్ళకి మరీ యమయాతనగా ఉంటుంది. సూర్యారావు చుట్టూ మూగిన ఆత్మీయులకు ఇప్పుడు అలాగే ఉంది. అతను అతిగా ఆయాస పడుతూ విపరీతంగా దగ్గుతూ ఉంటే, నిస్సహాయులై నుంచున్నారు. వాళ్ళ గుండెలని ఎవరో పిండుతున్నట్లు ఉంది.
    శంకరం డాక్టరును తీసుకురావడానికి ముప్పావు గంట పట్టింది. ఆయన మళ్ళీ పరీక్షించాడు. ఈసారి ఓ ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇచ్చాడు. సూర్యారావుకు ఎదురుగా కూర్చున్నాడు.
    "ఎలా ఉందండీ, సూర్యారావుగారూ! ఏమైనా తగ్గినట్టు అనిపిస్తూందా? మత్తుగా ఉందా?" అని ప్రశ్నించాడు.
    "చాలా ఆయాసంగా ఉంది, డాక్టరుగారూ ఏమీ తగ్గలేదు" అన్నాడు సూర్యారావు.
    "తగ్గిపోతుందండీ, మీరు కొంచెం ఓపికపట్టాలి. ఇంజెక్షన్ ఇచ్చానుగా. తగ్గుతుంది." అతని మాటలలో ఓదార్పు, ధైర్యం కనిపించాయి అందరికీ.
    డాక్టరు తిరిగి స్టెతస్కోపుతో సూర్యారావు గుండెలు పరీక్షించాడు. నాడి చూశాడు.
    "శంకరం, అలా రావోయ్" అని బయటికి వెళుతూ పిలిచాడు.
    శంకరం తిరిగి లోపలికి వస్తూనే, చారుమతిని ప్రక్క గదిలోకి పిలిచి, "నాన్నను పెద్దాసుపత్రిలో చేరిపిస్తే మంచిదన్నారు డాక్టరుగారు. నేను వెంటనే వెళ్ళి బండి తీసుకువస్తాను. నువ్వు సిద్ధంగా ఉండు" అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు.
    చారుమతి అయోమయంలో పడింది. 'ఇప్పుడు ఆసుపత్రిలో చేర్చడం ఎందుకు? ఇంట్లో అమ్మతో, మామ్మతో ఏమని చెప్పడం?' అనుకుంది. ఏమీ తోచలేదు. నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళి రెండు దుప్పట్లూ, ఒక రగ్గూ, దిండూ తీసుకుని, తను చీర మార్చుకుంటూంటే, భానుమతి లోపలికి వచ్చి అడిగింది: "ఏం చెప్పారు డాక్టరు?"
    "పెద్దాసుపత్రిలో చేర్చమన్నారుట. నేనూ, శంకరం బండిలో నాన్నని తీసుకువెళతాం. మామ్మకి సాయంగా మాలతిని, భగవతిని ఇంట్లో ఉంచి, ఇంట్లో పని చూసుకుని నువూ, అమ్మా రండి" అంది.
    సూర్యారావు పరిస్థితిలో మార్పు ఏమీ లేదు. భానుమతీ, చారుమతీ లోపలే నిశ్శబ్దంగా నుంచుండి పోయారు. ఇద్దరి మనసులలో ఒకటే భయం.
    శంకరం బండి తెచ్చిన శబ్దం విని ఇద్దరూ ముందరి గదిలోకి వచ్చారు. శాంతమ్మ కంగారుగా అడిగింది: "బండి ఎందుకు, బాబూ?"
    "నాన్నని ఆస్పత్రికి తీసుకువెళ్ళాలమ్మా, డాక్టరు గారు చెప్పారు. అక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారు కదా!"    
    శంకరం మాట్లాడుతూనే తండ్రిని లేవదీశాడు. ఇంతలో చారుమతి, భానుమతి బండిలో పక్క పరిచి, దిండ్లు పెట్టారు.
    సూర్యారావు పైకి ఏమీ అనకపోయినా, తనని ఎక్కడికి తీసుకువెళుతున్నదీ గ్రహించాడు.
    "శాంతా! ఈమారు నేను వెనక్కి రానేమో అనిపిస్తూంది" అన్నాడు భార్యవైపు తిరిగి.
    "ఏమిటండీ ఆ మాటలు! క్షేమంగా మీరు ఇంటికి వస్తారు" అంది శాంతమ్మ, భర్త చెయ్యి పట్టుకుంటూ కాని ఆమె కళ్ళనిండా నీళ్ళు.
    "అమ్మా, వెళ్ళుతున్నానమ్మా" అన్నాడు సూర్యారావు, తల్లివైపు తిరిగి.
    ముసలమ్మ గబుక్కున లేచి ముందరికి వచ్చింది.
    "ఎక్కడికి తీసుకువెళుతున్నారే మీ నాన్నని?... బాబూ నన్ను అన్యాయం చెయ్యకురా! నా తలకొరివి పెట్టాలిరా!" అంటూ ఏడుపు మొదలుపెట్టింది.
    భానుమతి మామ్మని పట్టుకుని "అలా ఏడవకు, మామ్మా, నాన్నని రేపు తీసుకువచ్చేస్తారు" అని ఊరుకోబెట్టడానికి ప్రయత్నించింది.
    "అమ్మా, భానూ, వెళుతున్నాను. మాలతి, భగవతి దగ్గిరికి రండమ్మా" అంటూ పేరుపేరు వరసనా పిలిచాడు సూర్యారావు, అంత దగ్గులోను, ఆయాసంలోను. చారుమతి గుండె తరుక్కుపోయింది తండ్రిని చూస్తూ ఉంటే.
    బండి వెళ్ళిపోతూ ఉంటే తల్లీ, భార్యా, ముగ్గురు ఆడపిల్లలూ బయటే నిలబడిపోయారు, కనిపించి నంతవరకూ బండిని చూస్తూ.
    శంకరం పైవైపు, చారుమతి కిందివైపు కూర్చున్నారు. తండ్రిని బండిలో పడుకోబెడదామని ఎంత ప్రయత్నించినా వీలులేకపోయింది.
    "నేను పడుకోలేనమ్మా" అంటూ లేచి కూర్చునే వాడు సూర్యారావు. అతనికి పడుకుంటే ఎగశ్వాస వచ్చేది. ఊపిరి తీసుకోలేకపోయేవాడు. పిల్లలిద్దరు చెరోపక్క పట్టుకుంటే మధ్యన కూర్చుని ఆయాస పడుతున్నాడు సూర్యారావు. మధ్యమధ్య, "నా పని అయిపోయింది; తల్లీ", "నాపని అయిపోయింది బాబూ" అంటున్నాడు దీనంగా.
    రాత్రి పదిగంటలు దాటింది. చలికాలం. వీథిలో ఎవరూ నడవడంలేదు. రోడ్డుమీద నిశ్శబ్దం, బండి చక్రాల చప్పుడు ఏదో భయాన్ని కలిగిస్తున్నాయి. తండ్రి ఒంటిమీద రగ్గు సమంగా కప్పుతూ, దైవ ప్రార్ధన చేస్తూ కూర్చుంది చారుమతి.
    కాజువాలిటీ వార్డుకీ తీసుకువెళ్ళారు సూర్యారావుని. అక్కడ డాక్టర్లు ఎవరూ లేరు. ఒక హౌస్ సర్జన్ మాత్రం ఉన్నాడు. సూర్యారావు పేరూ అదీ రాసుకుని, అతను పరీక్షించడానికి దగ్గిరికి వచ్చేసరికి సూర్యారావుకి పెద్దగా దగ్గుతెర వచ్చింది. దగ్గు తగ్గగానే నోట్లోనించి నురగ రావటం కనిపించింది. నర్సు వచ్చి దూదిపెట్టి నురగ తుడిచి పారేసింది. హౌస్ సర్జన్ వెంటనే నర్సుని పిలిచి, "డాక్టరుని పిలుచుకురా" అని పంపాడు.
    శంకరం, చారుమతి తండ్రికి చెరొకవైపు భయంగా నుంచున్నారు. మధ్యమధ్య నోట్లోనించి నురగ వస్తూ ఉంటే చారుమతి దూదితో తుడుస్తూ నుంచుంది. సూర్యారావు 'నా పని అయిపోయింది' అన్నట్టు చేతులు తిప్పుతున్నాడు. శంకరం హఠాత్తుగా ఏమనుకున్నాడో, "చారూ, నువ్విక్కడ ఉండు. అమ్మని తీసుకువస్తాను" అని బయటికి పరిగెత్తాడు.
    శంకరం అలా బయటికి వెళ్ళగానే, డాక్టరు లోపలికి వచ్చాడు. చిన్నవాడైన ఆ డాక్టరుని చూసి చారుమతి మనసులో విసుక్కుంది. 'పెద్దవాడైతే బాగుండును, అన్నీ తెలుస్తాయి' అనుకుంది. డాక్టరు రాగానే సూర్యారావుని పరీక్షించి, ఇంజెక్షన్ ఇచ్చాడు. నర్సుని పిలిచి, "పేషెంట్ ని మగవాళ్ళ వార్డుకి తీసుకువెళ్ళి, ఆక్సిజన్ ఇవ్వాలి. వెంటనే ఏర్పాటు చెయ్యి" అన్నాడు. ఆ మాట వింటూనే కుప్పకూలిపోయింది చారుమతి.
    చారుమతి పరిస్థితి గ్రహించిన డాక్టరు దగ్గిరికి వచ్చి అడిగాడు: "ఈయన ఏమౌతారు మీకు?"
    "మా నాన్నగారు" అంది చారుమతి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ.
    "ధైర్యంగా ఉండాలి మీరు" అన్నాడు డాక్టరు, అనునయంగా.
    సూర్యారావుని మగవాళ్ళ వార్డుకి మారుస్తూ ఉంటే చారుమతి పక్కనే మౌనంగా నడిచాడు డాక్టరు. సూర్యారావుకి దగ్గు తగ్గుముఖం పట్టింది. ఆయాసం తగ్గింది. మగతగా పడుకున్నాడు. 'ఇంజెక్షన్ పనిచేసినట్టుగా ఉంది' అకుకుంది చారుమతి మనసులో. కొంచెం ధైర్యం వచ్చింది. డాక్టరు కూడా మంచివాడిలా ఉన్నాడు.
    వార్డులో ఎక్కడా ఖాళీ లేదు. ఒక పేషెంట్ ని బెడ్ ఖాళీ చెయ్యమంది నర్సు. ఆయన చెయ్యనన్నాడు.
    "ఇది ఎమర్జన్సీ కేసయ్యా. నువ్వు బెడ్ మీదినించి లేవాలి" అంది నర్సు విసుక్కుంటూ.
    "నాదీ ఎమర్జన్సీ కేసే! ఒకటే కడుపునొప్పి. మూడు రోజులనించీ కింద పడకుంటే, ఇవాళే ఇచ్చారు బెడ్" అన్నాడు పేషెంట్ కదలకుండా. మొండివాడులా ఉన్నాడు.    
    డాక్టరు ముందుకు వచ్చి "బెడ్ మీదినించి దిగు" అన్నాడు, శాసిస్తున్నట్టు. పేషెంట్ సణుగుకుంటూ దిగిపోయాడు.
    సూర్యారావుని బెడ్ మీద పడుకోబెట్టారు. ఆక్సిజన్ వచ్చింది. చారుమతి ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తూంది తండ్రిని. ఆయన ముఖంలో ఉదాసీనత, ఏదో మగత. ఆక్సిజన్ ఎక్కడంలేదు. డాక్టరు, నర్సు కంగారు పడుతున్నారు. డాక్టరు సూర్యారావుకి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఎక్కలేదు. డాక్టరు సూర్యారావుని పైకి ఎత్తి కుదిపాడు. మనిషిలో చలనం లేదు. నాడి చూసి పెదవి విరిచాడు.
    "ఇట్ యీజ్ ఓవర్" అంది ఆందోళనగా నర్సు. డాక్టరు వెనక్కి తిరిగాడు. నర్సు సూర్యారావు ముఖం మీద పూర్తిగా గుడ్డ కప్పేసి, వెనక్కి తిరిగి బెడ్ దిగనని మొరాయించిన పేషెంట్ ని అడిగింది: "నీదీ ఇంత ఎమర్జన్సీ కేసేనా?"
    చారుమతి కొయ్యబొమ్మలా నిలుచుంది. ఏమీ అర్ధంకానట్టు అయోమయంగా నుంచున్న చారుమతిని చూసి డాక్టరు, "మీరు ఇలా రండి" అని భుజంమీద చెయ్యి వేసి కుదిపి, తనవెంట తన రూములోకి తీసుకువెళ్ళాడు.
    దయ గల డాక్టరు కళ్ళు చూడగానే చారుమతికి దుఃఖం ముంచుకువచ్చింది. తలవంచుకు టేబిల్ మీద పట్టుకుని భోరుమని ఏడ్చింది. తెరలు తెరలుగా వస్తున్న ఏడుపు ఆగలేదు. ఆత్మీయుడైన వ్యక్తిలా డాక్టరు మౌనంగా కూర్చున్నాడు.
    శంకరం, శాంతమ్మ, భానుమతి వచ్చారు. సూర్యారావు ఇంక లేడని తెలుసుకున్న వారి హృదయాలు బద్ధలయ్యాయి.
    డాక్టరు శంకరం దగ్గిరికి వచ్చి, భుజంమీద తట్టుతూ, "ఊరుకో, శంకరం. అమ్మకి ధైర్యం చెప్పు" అన్నాడు. ఇరవై ఏళ్ళయినా నిండని శంకరం ఎంతగా తల్లికి ధైర్యం చెప్పగలడో డాక్టరుకీ తెలుసు. శంకరం డాక్టరు భుజం మీద వాలిపోయి ఏడ్చాడు.
    సూర్యారావు శవాన్ని అంత రాత్రివేళ ఇంటికి పంపడానికి వీల్లేదన్నారు. డాక్టరె అందరికీ ఓదార్పు మాటలు చెప్పి ఇంటికి పంపాడు. ముసలి తల్లి కొడుకు మరణవార్త విని గగ్గోలుగా ఏడ్చింది. డెబ్బై ఏళ్ల ముసలమ్మకి-కాటికి కాళ్ళు చాచుకుని మరణంకోసం ఎదురుచూస్తూన్నావిడికి-చెట్టంత కొడుకు మరణం పెద్ద అఘాతమయింది.
    టెలిగ్రాములు అంది రేవతి, గోపాలరావు, తక్కిన బంధువులు వచ్చారు. ఇల్లంతా శోకాలతో నిండిపోయింది.
    శంకరం జుత్తు తీయించేసుకుని, కొత్తకుండలో అగ్నిపట్టుకుని, తండ్రి శవంముందర బయలుదేరడం చూసిన శాంతమ్మ ముఖం తిరిగి పడిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS