ఉదారుడైన ప్లీడరునీ, మంచితనం ఉట్టిపడే డాక్టరునీ తలుచుకుని 'లోకంలో మంచివాళ్ళు లేక పోలేదు' అనుకుంది. వాళ్ళిద్దరి ఎడల కృతజ్ఞతతో హృదయం నిండింది.
ఇంటి తలుపు చేరవేసి ఉంది. ఇంట్లో ఎక్కడా మనుష్యులు ఉన్న జాడ లేదు. నిశ్శబ్దంగా ఉంది. చారుమతి తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించగానే కింద ఒకకార్డు పడిఉండి కనిపించింది. 'పోస్టు మేన్ పడవేసి ఉంటాడు. ఇంట్లో ఎవరూ గమనించనట్టు లేదు' అనుకుంటూ కార్డు చేతిలోకి తీసుకుని చూసింది. అది తండ్రిపేర విజయనగరంనించి ఎవరో రాసిన ఉత్తరం.
"మ. రా. శ్రీ. మామయ్యకు,
నమస్కారములు. అక్కడ మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తాము. ఈ నెల మీ దగ్గిరనించి సొమ్ము రాలేదు. అమ్మా, నేనూ డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ ఏడాది ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్ష పాసైతే నాకు ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది. పై ఏడాదినించి మీకు కష్టం కలిగించము. ఇన్నాళ్ళూ మీరు సొమ్ము పంపి నాకు, అమ్మకు సహాయం చేసి నందుకు ఎంతో కృతజ్ఞులం వీలు చూసుకు డబ్బు పంప ప్రార్ధన. కష్టం కలిగిస్తున్నందుకు క్షమించండి. అమ్మ మీకు, అత్తకు, అమ్మమ్మకు నమస్కారాలు రాయమన్నది.
ఇట్లు,
గోపాల్ (బాబు)."
చారుమతి 'ఎవరీ గోపాల్' అని ఆలోచించింది. కాసేపటికి గుర్తుకువచ్చింది, నాలుగైదు నెలలకిందట తండ్రి "బి. శారదమ్మ, విజయనగరం" పేర డబ్బు పంపడం. తనే మనియార్డరు కట్టింది. తరవాత ఆ సంగతే మరిచిపోయింది. వీళ్ళకి ఇంకా తండ్రి పోయిన వార్త తెలియదు.
సొమ్ముకి ఇబ్బంది పడుతున్నామని రాశాడు. అయితే మాత్రం తను ఈ పరిస్థితులలో డబ్బు పంపగలదా?
"ప్లీడరుగారు ఎందుకు పిలిచారు? ఏమన్నారు?" అప్పుడే అటువైపు వచ్చిన భానుమతి చారుమతిని చూసి అడిగింది.
చారుమతి ప్లీడరుగారింట్లో జరిగిన సంభాషణా, డబ్బు ఇవ్వడం చెప్పి, భానుమతి చేతిలో డబ్బు ఉన్న కవరు ఉంచింది.
డబ్బు చూడగానే భానుమతి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"మన చుట్టాలలో శారదమ్మ అనే ఆవిణ్ణి నీకు తెలుసా?" చారుమతి అక్కని అడిగింది.
"నాకు తెలియదు. ఎవరావిడ?"
"మనకి అత్తవరస అవుతారు. విజయనగరంలో ఉన్నారు. ఆవిడకి ఒక కొడుకు ఉన్నాడు. ప్రతి నెల నాన్న ఆవిడికి కొంత డబ్బు పంపేవారు. నాన్న చనిపోయారని తెలియక ఆ అబ్బాయి డబ్బుకోసం ఉత్తరం రాశాడు" అంటూ కార్డు భానుమతికి ఇచ్చింది.
భాను కార్డు చదివి, "ఇప్పుడేం చేస్తావు?" అంది.
"ఏం చేస్తాం? మనం డబ్బు ఎలా పంపగలం? ప్లీడరుగారిచ్చిన వెయ్యి రూపాయలూ అప్పు తీర్చడానికి సరిపోతాయి. ఇంక మిగిలింది నా జీతమే కదా? ఆ డబ్బుతో మన తిండిఖర్చుకూడా ఎలా వెళుతుందా? అని భయపడుతున్నాను నేను. వీళ్ళకి ఉత్తరం రాసేస్తాను, నాన్న పోయారనీ, డబ్బు పంపలేమనీ."
భానుమతికి చెల్లెలు ఆలోచన నచ్చలేదు.
"చూడు, చారూ, మనం డబ్బుకి ఇబ్బందిపడుతున్నా, నాన్న వాళ్ళకి డబ్బు పంపేరంటే, వాళ్ళు మన కంటే ఎన్నో కష్టాలలో, దరిద్రంలో ఉండి ఉంటారు. మనం ఏదో మనకి చేతనైన సహాయం చేద్దాం. ఇంక ఆరునెలలు ఓపికపడితే గోపాల్ ఉద్యోగం సంపాదించుకుంటాడు అతనే తల్లిని పోషించుకుంటాడు."
చారుమతి మాట్లాడక ఊరుకుంది. తరవాత మెల్లిగా, "ఎలా పంపుతాం, భానక్కా, మనకే లేకపోతే!" అంది.
"ఉన్నదానిలోనే పంపుదాం. ప్లీడరుగారు ఎంతో సహాయం చేశారని మన హృదయాలు కృతజ్ఞతతో నిండిపోలేదూ? కష్టాలలో సహాయం చెయ్యడమే గొప్ప సాయం! నెలకి ఒక్క పది రూపాయలు పంపు! దానితో బియ్యమేనా కొనుక్కుంటారు."
ప్లీడరుగారి మాట ఎత్తగానే డాక్టరు మంచితనం కూడా గుర్తుకి వచ్చింది, చారుమతి ఇంక మాట్లాడ లేదు. మౌనంగా భానుమతికి అంగీకారం సూచించింది.
రాత్రి శంకరం చదువుకుంటూంటే చారుమతి దగ్గిరికి వెళ్ళి అడిగింది:
"ఆ డాక్టరు నీకు తెలుసా?"
"ఏ డాక్టరు?"
"ప్లీడరుగారి అబ్బాయి."
"ఓ ఆయనా! డాక్టరు గిరిధారి. నాకు అంత బాగా తెలియకపోయినా, కొద్ది పరిచయం ఉంది" అన్నాడు శంకరం.
చారుమతి మనస్సులోనే అనుకుంది 'గిరిధారి'.
"ఎందుకు అడుగుతున్నావ్?" శంకరం అడిగాడు.
"ఏం లేదు" అంటూ చారుమతి వెళ్ళి పడుకుంది.
9
కొత్త పంటలతో, గంగిరెద్దులతో, రంగురంగు బట్టలతో, పిండివంటలతో, పచ్చని చేమంతులతో సందడిగా సంక్రాంతి వచ్చి వెళ్ళింది. ఇంటి పెద్ద పోయిన దుఃఖంలో మునిగిన చారుమతి ఇంటివారికి ఆ ఏడు క్రాంతి కనిపించలేదు. లోకమంతా చీకటైనట్టు అనిపించింది.
కొత్త పెళ్ళికూతురైన పద్మకీ చీకటిగానే కనిపించింది పండుగ. అల్లుడు పండుగకి తమ ఇంటికి వస్తాడనీ, ఇంట్లో సందడిగా అల్లుడూ, కూతురూ తిరుగుతూ ఉంటే కన్నుల పండుగగా చూసుకుని ఆనందించవచ్చు ననీ ఎన్నో కలలు కంది వరలక్ష్మి. వియ్యపురాలు రాసిన చిన్న కార్డు ఆవిడ కలల నన్నిటినీ కల్లలుచేసింది. ఆవిడలో ఏదో దిగులు ఆవరించింది.
శ్రావణమాసంలో పద్మని మద్రాసు తీసుకువెళ్ళి లక్ష్మీపూజ చేయించలేదు. వారింట లక్ష్మీపూజ అచ్చిరాదన్నారు. పోనీ, దీపావళికి అల్లుణ్ణి పంపమంటే, ఆఫీసులో పని, సెలవు దొరకదని జవాబు. సంక్రాంతికి మాధవరావుని తప్పక రమ్మని పద్మ తండ్రి నారాయణ రావు గారు రాశారు. దానికీ వియ్యపురాలు కాంతమ్మే జవాబు రాసింది. పండగకి మూడు రోజుల ముందర వచ్చింది-అబ్బాయి ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళుతున్నాడు, కాకినాడకి రావడానికి వీలుపడదు అని.
కూతురు లేకుండా చూసి వరలక్ష్మి భర్త దగ్గిర కళ్ళనీళ్ళు పెట్టుకునేది. అమ్మాయి కాపరం ఎలా ఉంటుందో? ఒక్కగానొక్క కూతురికీ మంచి సంబంధం చూసి పెళ్ళి చేశాం అనుకుంటే, ఈ విపరీతమేమిటి? అబ్బాయి ఒక ఉత్తరం రాయడేం? అమ్మాయి అంటే ఇష్టం లేదా?- ఎన్నో భయాలు ఆవిడికి. పద్మ తండ్రి నారాయణరావుగారు లోపల భయపడ్డా, పైకి గంభీరంగా ఉండేవారు. భార్య కళ్ళనీళ్ళు పెట్టుకుంటే కసురుకునేవారు. "ఇప్పుడేం కొంప మునిగిందని ఏడుస్తావు? అది చదువుకుంటూంది కదా! చదువు అవగానే కాపరానికి తీసుకువెళతారు. అన్నీ చక్కబడతాయి. పద్మదగ్గిర మాత్రం పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. లేనిపోని భయాలు పెట్టుకుని మనసు పాడు చేసుకుంటుంది."
తల్లీ, తండ్రీ తన ఎదురుగా ఏమీ మాట్లాడక పోయినా, పద్మ అన్నీ ఊహించుకోగలదు. మాధవరావు మౌనానికి మనస్సు చివుక్కుమనేది. పైగా, చుట్టుపక్కల అమ్మాయిలు, స్నేహితులు భర్తపేరుతో అల్లరిపెడుతూ ఉంటే బాధపడేది పద్మ. ఏ ప్రేమ కథ చదివినా, సినిమాలో ఏ ప్రణయ ఘట్టం చూసినా మాధవరవు జ్ఞాపకం వచ్చేవాడు. అతని ఉనికి మరిచి పోయి చదువులో పడదామని ప్రయత్నించేది. కాని మెళ్ళో కొత్త తళుకు మాయని మంగళసూత్రాలు, నల్లపూసలు, కాళ్ళ మట్టెలు ప్రతిక్షణం "నీ కో భర్త ఉన్నాడు" అని ఎత్తి చెప్పేవి, అతనికోసం ఆత్రత తనకేనా? అతనికేం బాధ లేదా? - ఒక్క ఉత్తరం కూడా రాయని అతనిని తలుచుకుంటే ఎంతో కోపం వచ్చేది. తనే ఉత్తరం రాస్తే? - అనిపించేది ఒకసారి. భర్తకి భార్య రాయడంలో తప్పేముంది? కాని మళ్ళీ ఏదో పంతం వచ్చేది. అతనికి తను అక్కరలేకపోతే, తను ఉండగలదు అతనికి దూరంగా!
10
శంకరం పరీక్షలు అయిపోయాయి. మే నెలవచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. 'ఊరినిండా రకరకాలైన మామిడిపళ్ళు ఉన్నా, ఒక్క పండు తినే అదృష్టం లేదు' అనుకుంది చారుమతి. సూర్యారావు చనిపోయాక ఈ ఆరునెలలో ఎన్నో మార్పులు వచ్చాయి ఇంట్లో ప్లీడరుగా రిచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేశారు. దానితో అప్పూ లేదు, ఆస్తీ లేదు అన్నట్టు అయింది. మిగిలింది ప్రతి నెలా వచ్చే చారుమతి జీతం. రాబడి తగ్గడంతో ఇంట్లోవాళ్ళ సుఖాలూ తగ్గాయి. ఒక్క సారే కాఫీ తాగుతున్నారు. నీళ్ళమజ్జిగతో తృప్తి పడుతున్నారు. పొద్దుటిపూటే కూర చేస్తుంది భానుమతి. రాత్రి పచ్చడితో సరిపెడుతుంది.
'శంకరం పరీక్ష పాసై ఏదైనా ఉద్యోగం దొరికితే, కష్టాలు గట్టెక్కుతాయి. చెయ్యి ఆసరాగా ఉంటాడు. వచ్చే ఏడు మాలతి స్కూలు ఫైనల్ క్లాసులోకి వస్తుంది. అది ఆ పరీక్ష గట్టెక్కితే సగం కష్టాలు తీరినట్టే.' చారుమతి రోజూ రాత్రి నెమరు వేసుకునేది ఈ సంగతులే.
శాంతమ్మ భర్తవియోగంనించి ఇంకా కోలుకోలేదు. వంటింట్లో గడపమీద తల పెట్టుకు పడుకుని పాతరోజులు తలుచుకుని కుములుతూ ఉంటుంది.
ముసలమ్మ పూర్తిగా మంచం ఎక్కింది. ఆవిడికి ఒక రకంగా మతిస్తిమితం తప్పింది. "నాయనా, సూర్యం ఇలా రారా!" అంటూ చనిపోయిన కొడుకుని మధ్యరాత్రి పిలుస్తూ ఉంటుంది. ఆవిడికి మామిడిపళ్ళంటే ప్రీతి. "వీళ్ళంతా నన్ను మరిచిపోయారురా! ఒక్క మామిడిపండేనా ఇచ్చారేమో, చూడు! నువ్వేనా తెచ్చిపెట్టరా, సూర్యం" అని మామిడిపళ్ళకోసం కొడుకుని వెతుక్కుంటూ ఉంటుంది.
ఇంట్లో పిల్లలంతా స్తబ్దులుగా తయారయ్యారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, లేదా ఏదైనా పుస్తకం పట్టుకు కూర్చోడం. నలుగురూ కూర్చుని మాట్లాడుకోడం, నవ్వుకోడం మరిచిపోయారు వాళ్ళు. శంకరం మాత్రం ఉదయం భోజనం చేసి బయటికి వెళ్ళి రాత్రి చీకటిపడ్డాక ఇల్లు చేరతాడు. ఎక్కడ తిరుగుతాడో ఎవరికీ తెలియదు.
జూన్ మొదటి తారీఖు. ఉదయమనగా బయటికి వెళ్ళిన శంకరం రాత్రి పదకొండు గంటలైనా ఇంటికి తిరిగి రాలేదు. శాంతమ్మ కంగారుపడింది. భానుమతి వెళ్ళి నిద్రపోతున్న చారుమతిని లేపి, "శంకరం ఇంటికి రాలేదే!" అంది.
చారుమతి విసుక్కుంది. "అబ్బాయిగారు ఎక్కడ తిరుగుతున్నట్టు? ఆడవాళ్ళు ఒంటరిగా ఇంట్లో ఉన్నారనే ధ్యాసేనా లేదు" అంటూ బయటికి వచ్చింది. వీథులలో మంచాలు వేసుకుని చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళంతా నిద్రపోతున్నారు.
'ఎవరిని, ఏమని అడగను?' అనుకుని కాస్సేపు బయట నుంచుని లోపలికి వచ్చింది.
తల్లి పిలిచింది. "చారూ! శంకరం ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఇంటికి ఇంకా రాలేదేం?"
"ఎక్కడికి వెళతాడో నాకు చెప్పి వెళతాడా రోజూ? నేనుమాత్రం ఎక్కడికి వెళ్ళి వెతకను?"
"ఎలాగే, మరి?"
"ఎలాగేమిటి? అమ్మాయికాదు, చిన్నవాడు కాదు; మగవాడు. ఎక్కడికి వెళ్ళినా తిరిగి రాగలడు. నువ్వు పడుకో, అమ్మా ఎవరో స్నేహితులింట్లో ఉండిపోయి ఉంటాడు. పొద్దున్నే వచ్చేస్తాడు" అంటూ చారుమతి వెళ్ళి పడుకుంది.
పడుకుందన్న మాటేకాని నిద్ర పట్టలేదు. రాత్రి శాంతమ్మ, భానుమతి, చారుమతి జాగారం చేశారు.
తెల్లవారుతూఉండగానే భగవతిని రెండి ళ్ళవతల ఉన్న ఇంటికి పంపింది శాంతమ్మ. వారి అబ్బాయి కూడా కాలేజీలో చదువుతున్నాడు.
"అతనికి అన్న గురించి తెలియదుటమ్మా. నిన్న అసలు అన్నని చూడలేదుట నిన్న మధ్యాహ్నం పేపర్లో బి.ఎ. పరీక్షా ఫలితాలు వచ్చాయిట. అన్న నెంబరు ఇస్తే అతను పేపర్లో చూస్తాడుట" అంటూ భగవతి వచ్చి కబురు చెప్పింది.
చారుమతి శకుంతల నెంబరు ఇచ్చి, భగవతి కోసం చూస్తూ ఆతృతగా వీధిలోనే నుంచుంది.
"తెలుగు ఒక్కటే పాసయ్యాడుట. ఇంగ్లీషు, గ్రూపు తప్పాడుట" అంది భగవతి వచ్చి.
చారుమతి అక్కడే కుప్పకూలిపోయింది. ఏదో శంకరం పాసవుతాడు, సంపాదిస్తాడు, తమ దైన్యావస్థ తప్పుతుంది అనుకుంది. ఇప్పుడు అన్నీ తారుమారయ్యాయి. మళ్ళీ పరీక్ష, పరీక్ష ఫీజు, ఆరు నెలలు ఎదురుచూడటం!
నీరసంగా ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో అందరి ముఖాలలోను నిరాశ తొంగిచూస్తూంది.
"వెధవ పరీక్ష పోతే పోయింది. పిల్లాడు ఏమైపోయాడో? ముందు బాబు ఇంటికి వస్తే చాలు." కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కూచుంది శాంతమ్మ.
పది గంటలు అవుతూ ఉంటే, ముఖం వేలవేసుకు వచ్చాడు శంకరం. రాత్రి అంతా నిద్ర లేదేమో, ముఖమంతా పీక్కుపోయింది.
"ఎక్కడ తిరుగుతున్నావ్? అసలే నాన్న పోయిన బెంగతో మేం కుళ్ళుతూఉంటే, నువ్వు ఇంటికి రాకుండా మమ్మల్ని ఇంకొంచెం చంపు. రాత్రి ఎవ్వరికీ నిద్ర లేదు నీ వల్ల. బెంగపెట్టుకుపోయాం ఏమైపోయావో అని." చారుమతి శంకరాన్ని చూస్తూనే గట్టిగా మాట్లాడింది. పరీక్ష తప్పాడనే కోపంకూడా ఉంది ఆ కంఠంలో.
శంకరం ఏమీ మాట్లాడకుండా పెరట్లోకి వెళ్ళిపోయాడు. భానుమతి చెల్లెలికి దగ్గిరగా వచ్చి, "చారూ! నువ్వు శంకరాన్ని ఇంక ఏమీ అనకు. వాడు అసలే పరీక్ష పోయి సిగ్గుపడుతున్నాడు. నువ్వింక ఏదేనా అంటే బాధపడతాడు. నాన్న పోయిన బెంగతో పరీక్షకి చదవలేకపోయాడు. ఈమారు పాసై పోతాడులే" అంది.
చారుమతి ఇంకేం మాట్లాడలేదు.
"బాబూ, ఎక్కడికి వెళ్లావురా? రాత్రంతా ఎక్కడున్నావ్? పరీక్ష పోతే పోయింది. మళ్ళీ కట్టుకో వచ్చు. నువ్వు బాధపడకు, బాబూ" అంటూ గద్గద స్వరంతో తల్లి శంకరాన్ని అనునయించడం వినిపించింది లోపలినించి.
