Previous Page Next Page 
జీవన వలయం పేజి 6

                                   

    "ఏమో, బాబూ? నాకు మాత్రం నచ్చలేదు."
    "ఏం? ఎందుకు నచ్చలేదు?"
    "ఎక్కడైనా ప్రేమించే భర్త ఉండగా ఆ స్త్రీ మరొకన్ని ప్రేమిస్తుందా?"
    "ఎందుకు ప్రేమించదు? లోకంలో అలాటి వారు చాల మంది ఉన్నారు."
    "లోకంలోనూ ఉన్నారు. బుచ్చిబాబు, చలం కథల లోనూ ఉన్నారు. అంతమాత్రాన అలాటి కథావస్తువు తీసుకోవటం నాకేం నచ్చలేదు."
    "అదే, ఎందుకు నచ్చలేదని అడుగుతున్నా."
    "కథల నేవి మానవులకు నీతిని బోధించాలి. లేదా కష్టాలను ఎదుర్కోవటం, వ్యక్తిత్వం, ఆత్మాభిమానం పెంపొందించేవిగా ఉండాలి. సహృదయతను నేర్పేవిగా ఉండాలి. అంతేకాని..."
    "ఆహా! నీవు చెప్పిన సుగుణా లన్నిటితో ఒక హీరోను సృష్టించి వ్రాశాననుకో అప్పుడు పాఠకులు వీడి కథలలో సహజత్వమే లేదు అంటూ వ్యాఖ్యానిస్తారు."
    "ఏం కాదు ఎంతో గొప్ప హృదయాలతో, అత్యున్నతంగా సృష్టించిన శరత్ పాత్రలకు మనం మెచ్చు కోవటం లేదా?"
    "కాని, శరత్ ను కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు, లతా."
    "నేను నమ్మను."
    "నీవు నమ్మకపోయినంత మాత్రాన నిజం అబద్ధం కాదు."
    "మీ రెప్పుడూ ఇలాగే మాట్లాడుతారు. నే వెళుతున్నా" అంటూ లేచింది లత.
    "అరె! నీకు అప్పుడే కోపం వచ్చింది. సరే, శరత్ నేమీ అననులే. కూర్చో." అంటూ చెయ్యి పట్టు కొన్నాడు రమాకాంత్.
    "రమాకాంత్!" బయటి నుండి పిలిచాడు మధు.
    "రండి, మధుబాబూ" అన్నాడు రమాకాంత్.
    మధు లోపలకు రావడం చూచి చేయి విదిలించుకు వెళ్ళబోయిన లతను గట్టిగా పట్టుకొన్నాడు రమాకాంత్.
    "మధుబాబూ, ఇదుగో మా శ్రీమతి" అంటూ పరిచయం చేశాడు రమాకాంత్. కోపం వచ్చినా సభ్యత కాదని మర్యాదగా నమస్కరించి లోపలకు వెళ్ళింది లత. మధు ఆనందంగా చేతులు జోడించాడు.
    "అందంలో మీకు పోటీయే" అన్నాడు నవ్వుతూ.    
    "కాని, మధుబాబూ, నా లాగ ఎక్కువ మాట్లాడదు. తూచి తూచి మాట్లాడటం ఆమె గొప్పతనం. చూడండి, ఆమె వచ్చి మూడు నెలలయింది. అయినా మీకు పరిచయం చేయలేదు. ఎందుకనుకొన్నారు? పరిచయాలు పెంచుకోవటం ఆమె కిష్టం లేదు. అలాగని సభ్యత తెలియదనుకొనేరు. ఎంతసేపూ తన పని, ఆ తర్వాత చదువు. పరీక్షల కెళ్ళే విద్యార్ధులకంటే ఎక్కువ కష్టపడి మరీ చదువుతుంది."
    మధు ఆసక్తిగా వింటున్నాడు.
    "ఆమె చదవని నవలలు, తెలియని రచయితలు చాలా అరుదు..."
    "ఇక ఆపి కాఫీ తీసుకోండి." లత ట్రే అక్కడ ఉంచి వెళ్ళిపోయింది,
    మధు నవ్వుతూ కప్పు చేతిలోకి తీసుకొని, "మీరింతకుముందు కూడా ఏదో కథల గురించే  మాటలాడుతున్నట్టున్నారు" అన్నాడు.
    "అవునండీ. నా కథను మా లత విమర్శిస్తూంది లెండి" అన్నాడు పెద్దగా నవ్వుతూ.
    "విమర్శ ఎప్పుడూ రచయితను పైకి తెస్తుంది."
    "అది ఒకప్పుడు కాని ఇప్పుడు రచయితలకు కూడా రికమండేషన్ కావాలండీ" అని మళ్ళీ నవ్వాడు రమాకాంత్.
    "అసలు సంగతి మరిచాను, రమాకాంత్ బాబూ. ఈ రోజు సునీత వ్రాసిన 'విడివడని బంధం' నాటకం ప్రదర్శన ఉంది. సాయంత్రం వస్తారా?"
    "నాకు ఈ రోజు వీలుపడదు. క్షమించాలి."
    "సరే. మరి నే వస్తాను" అంటూ లేచాడు మధు.
    రమాకాంత్ లేచి వంటింట్లోకి వెళ్ళాడు. లత చాలా హడావిడిగా వంట చేస్తూంది.
    "మధు డ్రామాకు రమ్మని పిలవటానికి వచ్చాడు."
    "....................."
    "నేను రానన్నాను."
    "..................."
    "ఎందుకని అడగవేం?"
    "అడగటం ఎందుకు? అదీ మీరే చెపుతారుగా?"
    "నువ్వు లేకుండా ఎలా వెళ్ళను చెప్పు" అంటూ కూర తరుగుతున్న లత పక్కనే కూర్చున్నాడు.
    "ఇది మరీ బాగుంది. మీరు వెళ్ళే ప్రతిచోటుకీ నేను వస్తున్నానా?"
    "ప్రతి చోటుకీ రాకపోయినా కొన్ని చోట్లకి రావలసిందే."
    "భార్య పక్కన లేకపోతే ఆమె మీద ప్రేమ లేదని ఎవరూ అనుకోరు గాని సాయంత్రం వెళ్ళండి."
    "మరి, నువ్వూ వస్తావా?"
    "ఉహుఁ."
    "అయితే నేనూ వెళ్ళను."
    "అదేం మాట! మధుబాబు మీ ప్రాణ స్నేహితుడు కాబోలు. వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? ఆయనే మనుకొంటాడు?"
    "ఏమీ అనుకోడు" అంటూ రెండు చేతులతో ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. యథాలాపంగా కూర్చున్న లత అతని ఒడిలో పడింది. రమాకాంత్ నవ్వటం మొదలుపెట్టి ఆమెను లేవనీయకుండా అలాగే పట్టుకొన్నాడు.
    "అబ్బబ్బ! మీతో వేగలేకుండా ఉన్నాను, బాబూ. చిన్న పిల్లల్లాగ ఎప్పుడూ వంట ఇంట్లో కూడా వెంటే ఉండి ఏమిటీ అల్లరి..." ఇక మాట్లాడే అవకాశం ఇవ్వలేదు రమాకాంత్.
    
                              *    *    *

    రెయిన్ బో థియేటరుకు మధు వెళ్ళేటప్పటికి మూడయింది. అసలు నాటకం ఏడు గంటలకు మొదలు. నాటకం వారంతా అక్కడక్కడ తిరుగుతున్నారు. పనివారంతా సాయంకాలానికి కావలసిన రీతిగా సీట్లు సర్దుతున్నారు. మధును చూసి ఒక పనివాడు కుర్చీ తెచ్చి గోడ పక్కగా వేశాడు. మధు కూర్చొని స్టేజివైపు చూసాడు. అప్పుడే స్టేజి పై నుండి దిగుతున్న సునీత అతన్ని ఆశ్చర్యంగా చూసి సమీపించి, "మీరు అప్పుడే వచ్చా రేమిటి!" అంది.
    "ఆ ప్రశ్నే నేను వేస్తే?" నవ్వుతూ అన్నాడు మధు.
    "సమాధానం చెబుతాను. స్టేజి ఆరెంజిమెంట్స్ చూడటానికి నన్నొక్కసారి రమ్మని డ్రామా వారు కబురు చేశారు. అందుకే వచ్చి చూసి వెళ్ళబోతున్నాను."
    "సరే, వెళదాం, పదండి" అంటూ తనూ లేచాడు.
    "మీ రింత త్వరగా వచ్చారేం? పైగా, హాలువాళ్ళు బయట వాళ్ళను రానివ్వటం లేదుగా!"
    "మీ స్నేహితుడినని చెప్పుకు వచ్చాలెండి."
    ఒక్కసారి చురుగ్గా అతని ముఖంలోకి చూసింది సునీత. బయటకు వచ్చిన తర్వాత హాల్లో కాంటీన్ కు దారి తీశాడు మధు.
    "వద్దు. నేను రాను." భయంగా అంది సునీత.
    "ఏం, భయమా? కలిసి కాఫీ త్రాగినంత మాత్రాన అపవిత్రురాలై పోరు లెండి."
    "కాదు... కాదు..... నన్ను క్షమించండి" నసుగుతూ అంది.
    "ఇదెక్కడి సభ్యత! మహా రచయిత్రులైన మీరు ఒక స్నేహితుని అభ్యర్ధన త్రోసిపుచ్చుతారా?"
    ఆమె మాట్లాడలేక దీనంగా అతని వంక చూసింది. ఆ తర్వాత అనుసరించింది అతడిని.
    కాఫీ సిప్ చేస్తూ మధు అన్నాడు:
    "మీ రేదో గబహ్రా పడుతున్నట్లు న్నారు క్షమించండి, మిమ్మల్ని ప్రెస్ చేసినందుకు."
    "అది కాదు, మధుబాబూ, నే నిలా మీతో కలిసి ఉండటం ఎవరైనా చూస్తే ..."
    "ఏమంటారు? స్నేహితుల మంటారు."
    "ఎలా అంటారు? ఇది భారత దేశం. నెనా అవివాహితను. స్త్రీని. ఏదైనా మాట వస్తే నా జీవితం.." ఇక మాట్లాడలేక ఆగింది.
    "ఓ... నే నంతదూరం ఆలోచించలేదు. మనుష్యుల మనస్తత్వాలు పసిగట్ట గల రచయిత్రుల మీరు. ఇలా భయపడతా రనుకోలేదు."
    "మనుష్యులతో నిండిన లోకం మనస్తత్వం కూడా తెలుసు రచయితలకు. ఏమైనా నేను ఆడదాన్ని అందులో దెబ్బ తిని ఉన్న దాన్ని." చటుక్కున నాలిక కరుచు కొంది ఎందుకన్నానా అని.
    "దెబ్బతినటమా?" అనుమానంగా చూశాడు.
    "ఏం లేదు లెండి..." అంటూండగానే, "బాబూ మేనేజరుగారు మిమ్ములను ఫోనులో పిలుస్తున్నారు" అని చెప్పాడు ఒక కుర్రవాడు వచ్చి. సునీతను కూర్చోమని మధు లేచి వెళ్ళాడు. మేనేజరు పిలవటమేమిటి? ఏ మేనేజరు? అనుకొంది సునీత. ఆ ప్రశ్నే కుర్రవాడి నడిగితే చెప్పాడు! "హాలు మేనేజరు గా రమ్మా మధుబాబుగారు హాలు యజమాని." ఆశ్చర్యపోయిన సునీతకు అప్పుడు అర్ధమయింది మధు హాల్లో తిరగటం, కాంటీన్ లోకి స్వతంత్రంగా రావటం అన్నీ, మధు తిరిగి వచ్చి, "రండి మిమ్ములను పంపిస్తాను" అని తీసుకువెళ్ళి కార్లో ఎక్కించి, "మీ ఇంటి దగ్గిర మిమ్ములను కలిసికోవడానికి ఏమైనా అభ్యంతరమా?" అని అడిగాడు.
    "అలాటిదేమీ లేదు" అని కొంచె మాగి, "ఈ థియేటర్ మీదని తెలియక..." అంది.
    "తెలిసినా వచ్చిన నష్టమేమీ లేదుగా? ఉంటాను" అంటూ చేయి ఊపాడు.
    డ్రైవరు కారు స్టార్ట్ చేశాడు.    
    నాటకం టైమ్ కు హాలంతా కిటకిటలాడిపోతూంది. పైనుండి హాలునంతా కలయజూసిన మధుమూర్తి ఈ నాటకానికి ఇంత జనం రావటానికి కారణం కథ వ్రాసిన రచయిత్రా? లేక డ్రామావారా? లేక ఇచ్చిన పబ్లిసిటీయా? అనుకొంటూ క్రిందికి వచ్చాడు. అప్పుడే హాల్లో నుంచి బయటకు వచ్చిన సునీత అటూ ఇటూ ఆద్గుర్దాగా చూస్తూంది.
    "ఎవరికోసం ఎదురు చూస్తున్నారు?" ఆమెను సమీపించి అడిగాడు మధు. ఉలిక్కిపడిన సునీత అతన్ని చూసి ధైర్యం తెచ్చుకొంది.
    "అన్నయ్యా, వదినా వస్తామన్నారు. ఇంతవరకూ రాలేదు."    
    "వారేమీ తప్పిపోరు లెండి. పాపాయిలు కాదుగా! మీరు వెళ్ళి కూర్చోండి." నవ్వుతూ అన్నాడు.
    "అది కాదండీ, రెండు సీట్లు ఖాళీ ఉంచితే అందరూ కూర్చోబోతున్నారు. చెప్పలేక విసుగేస్తూంది. ఉన్నారు ఉన్నారంటావు, ఎవరూ రారే అని అడుగుతున్నారు జనం."
    "అడగరు మరీ! పదండి, నేను చెపుతాను" అంటూండగానే "అరుగో, వచ్చేశారు" అంది ఆనందంగా. సునీత తన అన్న సురేష్ ను మధుమూర్తికి పరిచయం చేసింది.
    "మీ గురించి విన్నాను. కాని మిమ్ములను చూడటం ఇదే ప్రథమం. చాలా సంతోషంగా ఉంది" అన్నాడు. సురేష్ తర్వాత సునీతను చూసి "సునీ, ఆ రోజు మధుశ్రీ చిత్రం 'భిక్షుకి' చూసి తెగ మెచ్చుకున్నావే వారే వీరు" అన్నాడు.
    "నిజం?" కళ్ళు పెద్దవిచేస్తూ అడిగింది సునీత. ఆ కళ్ళలో ఏదో కాంతి, కవ్వించే చిలిపితనం కనిపించినాయి మధుకు. మొట్టమొదట సునీతను కలుసుకొన్నప్పుడు కూడా అతడు ఆ కళ్ళ సోయగాన్నే చాలాసేపు చూశాడు. మళ్ళీ ఈ రోజు అలాగే చూస్తూండగా "అయితే మీరు తెలుసు గాని మీ గురించి నా కేమీ తెలియదు" అంది. సురేష్ అతడిని తమ ఇంటికి మర్రోజు టీకి రమ్మని ఆహ్వానించాడు.
    ఆ రోజు నాటకం పూర్తి అయిన తర్వాత పలువురు ప్రముఖులు రచయిత్రిని అభినందించారు. రచనకు ఆమె ప్రత్యేక బహుమతి కూడా అందుకుంది. చాలా మంది ఆమెను మాట్లాడమని కోరారు. ఆమె భయపడుతూనే రెండు మాటలు మాట్లాడి కూర్చుంది. ఆ రాత్రి ఇంటికి వచ్చిన మధుకు మాటిమాటికి సునీత గుర్తు వస్తూంది. మొదటిసారి ఆమెను చూసినప్పుడు ఎంతో ధైర్యంగా మెలగగలదు, గుండె నిబ్బరం గలది అనుకొన్నాడు. కాని ఈ రోజు ఎంతో అమాయకంగా బెదిరే చూపులతో కనిపించిన సునీత ఆ సునీతకు విరుద్ధంగా ఉంది. ఇరవై సంవత్సరాల సునీత, ఆంద్ర ప్రజానీకానికంతా రచయిత్రిగా పరిచితురాలైన సునీత పెద్ద అందగత్తె ఏమీ కాదు. అయినా అమెది ఆకర్షణీయమైన విగ్రహం. పొగదేలిన ఆ కళ్ళలో చెప్పలేని అందం ఇమిడి ఉంది. చూచేవారికి అవి ప్రత్యేకంగా కనిపించటమే వాటి ప్రత్యేకత.
    
                                   *    *    *    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS