నాటకం అయిపోయింది. అధ్యక్షులు నాటకం వేయించిన టీచరునీ, పాత్రలకు జీవంపోసి నటించిన బాలికలనూ మనఃపూర్వకంగా అభినందించారు. మీరను ప్రత్యేకంగా అభినందించారు.
కృష్ణయ్యగారు దారి పొడుగుతా మీర అభినయాన్ని మెచ్చుకుంటూనే ఉన్నారు. కమలమ్మ గారు వినలేక విసిగి,
"ఇహ చాలు వూరుకుందురూ నేర్పితే ఎవరైనా చేయగలరు. అదేం బ్రహ్మ విద్యా ఏమిటి? ఇప్పటినుండి ఇలా నాటకాల్లో వేయిస్తూ కూర్చోండి. రేపు చేసుకున్నవారు సుఖపడుతాడు అన్నారు. వెంటనే గోపాలం.
"అమ్మా నువ్వెప్పుడూ ఇంతే. చినపిల్ల నలా నిరుత్సాహపరుచవచ్చా? ఆ వయసు పిల్లలు అలా చలాకీగా ఉంటేనే ముచ్చటగా ఉంటుంది" అన్నాడు.
మీర కృతజ్ఞతతో గోపాలంవేపు చూసింది.
గోపాలం తన కోర్కె ప్రకారం మెడికల్ కాలేజీకి అప్లికేషన్ను పెట్టుకున్నాడు. ఇంటర్ వ్యూకి పిలుపు వచ్చింది. తరువాత సీటు దొరికింది. కృష్ణయ్యగారు కొడుకు ఉత్సాహంచూసి ఎలగైనా చదివించాలని నిశ్చయించుకున్నారు. అందరికన్నా ఎక్కువ ఆనందం మీరది. తను గొప్పగా చెప్పుకుంది. గోపాలం కాలేజీ లైబ్రరీ నుండి తెచ్చే పెద్ద పెద్ద పుస్తకాలను చూసి ఆశ్చర్యపోయేది మీర.
ఒక ఆదివారం మధ్యాహ్నం కమలమ్మగారు "మీరా, గోపాలాన్ని పిలు, టిఫిన్ తీసుకుంటాడు" అన్నారు.
నెమ్మదిగా గదిలోకి ప్రవేశించింది మీర. మెడమీద మ్యాప్ లాగా ఉన్న మనిషి బొమ్మ మీరని ఆకర్షించింది. ఇంతవరకు ఎప్పుడూ అలాటి బొమ్మను చూడలేదు. మీర నరాలు, ఎముకలు ఎత్తి కనిపిస్తున్నాయి ఆ బొమ్మలో. గోపలంన్ మంచంమీద పడుకొని నిద్రపోతున్నాడు.
"అన్నయ్యా!"
గోపాలం మేలుకొని, "ఏమిటమ్మా చీ" అన్నాడు.
"పెద్దమ్మ పిలుస్తోంది."
గోపాలం లేచి కూర్చొని, వళ్ళు విరుచుకొన్నాడు. టేబిల్ మీదున్న తెల్లటి మట్టితో చేసినట్టున్న వస్తువుమీద మీర దృష్టి నిలచింది.
"ఇదేమిటన్నయ్యా?"
"మనిషి తలకాయ"
"అంటే?...."
"అంటేనా....." అంటూ గోపాలం మంచం దిగి వచ్చాడు. మీర పొట్టిజడలాగి, తలని అటూ ఇటూ తిప్పి "ఇదే తలకాయంటే" అన్నాడు.
మీర గాబరాగా, "ఇది నా తలకాయా?" అంది.
"నీ తలకాయకాదే, మొద్దా ఎవరిదో పుర్రె. ఇపుడు చూడమ్మాయ్ మనతలపై భాగంలో జుత్తు, చర్మం, కళ్ళు, ముక్కు అన్నీ ఉన్నాయి. ఇదంతా మన వంటిపై పొర. ఇందులో రక్తం మాంసం ఉన్నాయి. వేలుకోసుకుంటే రక్తం వస్తుందా లేదా చీ"
"వస్తుందీ"
"దీనిలోపల ఎముక లున్నాయి. ఇపుడు నీ చెయ్యి గిల్లిదాన్నిఅదిమి చూడు. మృదువు అని పించేదే మాంసం. ఇంకాస్త గట్టిగా అదిమితే గట్టిగా తగులుతుందే అవే ఎముకలు. అలాగే ఇది మన తల పుర్రె."
"అలాగా!" మీర కుతూహలంతో వినసాగింది.
గోపాలం మీరను అద్దంముందు నుంచోపెట్టి మీర తలతో పోలుస్తూ.
"చూడు మీరా! ఇక్కడ రెండు కంతలున్నాయే అవే కళ్ళుండే స్థానం. ఇక్కడ ముక్కు, ఇక్కడ పెదవులు, ఇక్కడ పళ్ళు, ఇవి చెంపలూ" అంటూ వేలితో ప్రతి ఒక్కటీ చూపుతూ వివరించాడు. మీర ఆశ్చర్యంతో అడిగింది.
"నిజంగా మన మింత అసహ్యంగా ఉంటామా?"
"అవునమ్మా నువ్వు డాక్టర్ చదవు. మనిషి దేహం ఎంత చిత్రంగా ఉంటుందో నీకే తెలుస్తుంది. డాక్టరైతే ప్రజల జబ్బులు నయం చేయచ్చు. చేతినిండా డబ్బు వస్తుంది. నీకు డాక్టరవాలని లేదూ?"
"ఉందన్నయ్యా నేను తప్పకుండా దాక్టరవుతాను"
మొదట కేవలమూ గొప్పగా బ్రతకటానికే డాక్టరవాలనుకొంటున్న మీర, ఇప్పుడు శరీరపు చిత్రాలను తెలుసుకోగోరి డాక్టరవాలని ఆశించింది ఆమె కళ్ళలో, ఆశ కలగా నిలిచింది.
"అన్నయ్యా, అమ్మ పిలుస్తోంది" అన్న గోవిందు పిలుపుతో, గోపాలం బయటికి వెళ్ళి పోయాడు. మీర టేబిల్ మీదున్న పుర్రెను చేతుల్లోకి తీసుకొని, మృదువుగా నిమిరింది. నిమురుతూ, అప్పుడే తాను డాక్టరైనట్టూ, అందరి రోగాలు నయం చేస్తున్నట్టూ, చేతినిండా డబ్బు సంపాదించినట్టూ కలలు కనసాగింది.
"డాక్టరయితే ఎంత బాగుంటుంది" అని మెల్లగా తనకు తానే చెప్పుకుంది. ఆ పసి మనసులో గోపాలం చిత్రించిన చిత్రం బలంగా నాటుకుంది.
మీర పెరుగుతున్నకొలది, ఆ ఆశ కూడ పెరగసాగింది. గోపాలం తెస్తున్న పుస్తకాలను తీసుకొని, తన కర్ధంకని బొమ్మలను తదేకంగా చూస్తూ కూర్చొనేది. గోపాలానికి తీరికగా ఉన్నప్పుడు, "ఈ బొమ్మ ఏమిటన్నయ్యా?" అని అడిగేది. బాల్య సహజమైన మీర కుతూహలాన్ని గమనించి, గోపాలం చిరునవ్వు నవ్వి, మీరకు అర్ధమయ్యేలా వివరించి చెప్పేవాడు. డాక్టరవా లన్న ప్రబలమయిన కాంక్ష ఆ చిన్ని హృదయంలో ఈవిధంగా వేరులు నాటుకుంది.
గోపాలం ప్రతి సంవత్సరం మంచి మార్కులతో పాసయ్యేవాడు. అతడు ఎం.బి.బి. యస్. పాసయ్యేసరికి మీరా సిస్త్ ఫారం చదువుతూంది.
"అన్నయ్యా, ఇక్కడే డాక్టరవుతావు కదూ?" అన్నప్పుడు,
"అలాగేనమ్మా! నువ్వొక హాస్పిటలు కట్టించేయి" అని నవ్వాడు గోపాలం.
"అయితే ఇంకే వూరైనా వెళ్ళిపోతావా?"
"హవుస్ సర్జనుగా ఆరు నెలలు పని చేస్తాను. తరువాత చూద్దాం. బొంబాయిలో ఏదో ఖాళీ ఉందని రాశాడు నా ఫ్రెండు. అప్లికేషన్ పడేస్తాను. చూద్దాం ఏమవుతుందో."
గోపాలం దూరంగా వెళ్ళిపోతున్నాడంటే మీరకు దుఃఖం కలగటంలో ఆశ్చర్య మేమీలేదు. వయసులో తనకన్నా పెద్దయినా, మీర ఆశలకు ప్రోత్సాహమిస్తూ, అనవసరంగా విరుచుకపడే తల్లి దాడినుండి ఆమెను రక్షిస్తూ ఉండేవాడు గోపాలం. దుఃఖ సమయంలో, స్నేహితుడిలా వోదార్చేవాడు. అతడు దూరంగా వెళ్ళి పోతున్నాడంటే, ఆప్తుడిని దూరం చేసుకుంటున్నట్టుగా బాధపడింది మీర.
గోపాలం, కృష్ణ రాజేంద్ర ఆస్పత్రిలో హవుస్ సర్జనుగా పని చేయసాగాడు కృష్ణయ్యగారికేమో కొడుకు దూరంగా వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. గోవిందు, ఎం.ఏ. చదువుతున్నాడు. శ్రీహరి సీనియర్ బి.ఎస్.సి. చదువుతున్నాడు. శ్రీపాదు లోయర్ సెకెండరీలో (థర్డ్ ఫారం) రెండుమార్లు ఫేలయి, మీర హైస్కూలు మెట్లెక్కినా, తనింకా మిడ్ స్కూలు వదలలేదు. కమలమ్మగారికి తమ గారాలపట్టి శ్రీపాదు ఫేలవటమూ, మీర ఫస్ట్ క్లాసులో పాసవటమూ కంటకంగానే ఉంది.
మీర లోయర్ సెకండరీ మొదటిసారే పాపయినప్పుడు శ్రీపాదుపేలయ్యాడన్న బాధతో, మీర చదువు ఆపెయ్యాలని ఎన్నో విధాల ప్రయత్నించారు కమలమ్మగారు. కాని కృష్ణయ్యగారు పడనివ్వలేదు.
"ఆడవాళ్ళకు చదువెందుకూ? మీర ఇంకా చదివి ఎవర్నీ ఉద్దరించక్కర్లేదుగాని, కాస్త ఇంటిలో పనీ పాట నేర్చుకోనివ్వండి. వో సంబంధం చూసి పెళ్ళిచేసే మార్గం చూడండి."
"ఏదైనా సంబంధం దొరికేదాకా చదువు కోనీ."
"ఎంతకూ నా మాట వినరేం! ఇక దానికి కూడా ఫీజు కట్టాలా"
"ఇంతమందిని చదివిస్తున్నామా? దేవుడు ఎలాగో అలా జరిపిస్తాడులే."
"మీ కంతేలెండి. కడుపులో పుట్టిన బిడ్డల మీదకన్నా మీరమీదే ఎక్కువ ప్రేమ మీకు." అని కమలమ్మగారు దెప్పిపొడిచారు.
"నిజమేనే! నీ మాట ఒప్పుకుంటున్నా. తల్లీ తండ్రిలేని మీరంటే నా కిష్టమే. నేను కాకపోతే ఎవరున్నారు దానికి."
కమలమ్మగారి యుక్తి పారలేదు. కాని వదలటం ఇష్టంలేక మరో సలహా సూచించారు.
"ఏవో సంబంధం చెపుతాను వింటారా?" సీతమ్మగారి అన్న, బావమరిదిలేడూ, కొంచం నల్లగా ఉన్నాడుగానీ, మగాళ్ళకు రంగేమిటి, మీరను అతనికిచ్చి చేద్దాం. ఏమంటారు?"
