11
"ఎవరు , బాబూ!"
స్వరం వినిపించిన వైపు చూశాడు. ఆమె వయస్సు ఎంతో తెలియకుండా ఉంది. కాని ప్రౌడ వయస్సు దాటిందని ఉజ్జాయింపుగా , సరి పెట్టుకోవచ్చు. కాస్త పొట్టిగా , లావుగా , ఎర్రగా ఉందామె. కొద్దిగా తెల్ల వెంట్రుకలు, ముద్దమొహం. అందమైన పెద్ద కళ్ళు . వాటిలో ఏవో నిగూడ రహస్యాలు. చూడగానే ఈమె కేదో కొంత అంతర్యుద్దముంది అనిపించే లాంటి నిర్లిప్తభావాన్ని ప్రతిఫలింపజేస్తున్నాయి. సందేహం లేదు. ఆమె సౌందర్య వతి , ఇప్పుడే ఇలా ఉంటె వయసులో ఇంకెలా ఉండేదో?
"నాపేరు గిరిధారి! నవనీతకృష్ణ గారితో వచ్చాను."
'అలాగా! ఏడీ వాడు?" స్వరం కూడా విన సోంపుగానే ఉంది.
"లోపలికి వెళ్ళారు."
"మంచినీళ్ళు కావాలా?"
"ఇప్పించండి."
ఆమె తెచ్చి ఇచ్చింది. "మీరు.....?" గ్లాసందుకుంటూ అడగబోయి అర్ధోక్తిలో ఆగిపోయాడు.
"ఈ పిల్లల తండ్రి నాకు బావగారావుతారు. తల్లి పోయిన దగ్గరి నుంచీ నేనే వీళ్ళని పెంచాను. నేను వచ్చేనాటికి కృష్ణకు ఊహ తెలుస్తోంది. అపర్ణ ఇంకా చిన్న పిల్ల. అయన దాటిపోయాడు" అంటూ కళ్ళు చెంగుతో అడ్డుకుని తిరిగి అన్నది. "బాధ్యత నా నెత్తిని పడింది. చూస్తూ వదిలి వెళ్ళలేక పోయాను."
"ఏమిటీమె ఇలా చెబుతుంది తోలి పరిచయం లోనే" అనిపించింది. ఇంటి కెవరు వచ్చినా వారి దృష్టిలో తన హక్కునూ, స్థానాన్నీ బలపరుచుకొనేందుకా?
"మీకే ఉద్యోగమూ లేదుటగా? ఒంటరిగా ఇక్కడెందు కున్నట్టు , నాయనా? పెద్దదాన్ని ! ఈలా అడిగానని ఏమీ అనుకోకు."
ఆప్యాయంగా, చొరవగా ఎంత తేలిగ్గా అడిగేసింది!
తనను తోలి పరిచయంలోనే , కాదు , అసలు ఈ ఊరు వచ్చాక ముఖాముఖిగా ఈ ప్రశ్న అడిగిన తోలి వ్యక్తీ ఈమె. 'దయ ఉంచి నా విషయాలేమీ అడక్కండి! నా పేరు గిరిధారి! అంతకుమించి ఇంకేమీ చెప్పలేను.' పెదవుల దాకా వచ్చిన ఈ మాటలను అతను నోరు తెరిచి అనలేకపోయాడు. ఇంతలో నవనీత కృష్ణ అతని వెనకాలే అపర్ణ ప్రవేశించారు.
కాంతమ్మ గారు చప్పున గిరిధారి ఖాళీ చేసిన గ్లాసందుకుని వెళ్ళిపోయింది.
"మీరిద్దరూ పరిచయస్థులే! మిమ్మల్ని ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదు" అని గిరిధారి వంక తిరిగి , "నేను ఆలస్యం చేశానా?" అదే జరిగితే అందుకు సంజాయిషీ ఇచ్చుకోవలసింది నువ్వే, అపర్ణా" అన్నాడు.
అపర్ణ ఒక్కమారు చురుగ్గా అన్న వంక చూసింది. మరుక్షణంలో ప్రసన్న వదన అయి తన తామర తూండ్ల లాంటి చేతులెత్తి నమస్కరిస్తూ అతని కెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.
అతను చేతులు జోడించాడు.
నల్లగా, పొడుగ్గా కనిపించే అపర్ణ అందమైందే ననిపిస్తుంది. కురులకూ, కనుబొమలకూ మధ్య గల జాగా చాలా తక్కువ. కత్తుల్లాంటి కనుబొమలు. వాటి క్రింద చేపల్లాంటి నయనాలు. అవి ప్రసరించే దృష్టి ఎదుటి వారి మనస్తత్వాన్ని ఎక్స్ - రే తీస్తుందా అనిపిస్తుంది. ఆమె ఆకారం ఆమె కింకా పల్లె వాటు లే బాగుంటాయని పిస్తే , ఆమె కదలికలు, చూపులు , ముఖ భంగిమలు ఎంతో పెద్దరికాన్ని వ్యక్తం చేస్తాయి. అంత పెద్ద చీర ఆమె శరీరానికి కట్టుకున్నట్టు లేదు. చుట్టు కున్నట్టుగా ఉంది. తెల్లనిచీర మీద గోధుమ రంగు వలయాల అద్దకం. అవి రకరకాల సైజులు. ఆ చీరలో ఆమె నాగకన్యలా ఉంది.
"నా సంగీతం మిమ్మల్ని బాగా విసిగించింది." 'దాడి ప్రారంభించింది' అనుకున్నాడు. కాని ఆ స్వరం పాట పాడినట్లుగా, వీణ మీటినట్లుగా ఉంది. కొందరు మాట్లాడితే పాట పాడినట్లుందని వినటమే గాని స్వానుభవంతో ఇంతవరకూ ఎదురవలేదు.
"ఆ విషయం మాత్రం ఎత్తవద్దు. మీకు బాధ కలిగించాను నేను. ఇలా ప్రారంభిస్తే ఎన్ని మాటలైనా చాలవు."
"వద్దులెండి! మీరు రావటం చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా మంచివారని అన్నయ్య చాలా చెప్పాడు."
"ఇంత కొంచెం పరిచయంతో నన్నంత మంచివాడిని చేయటం కేవలం అయన మంచితనం. పైగా చూడక ముందే మిమ్మల్ని అవమానించాను."
"నన్నా విషయం ఎత్త వద్దని మీరే ఎత్తుతున్నారే?" అంటూనే కిలకిలా నవ్వింది అపర్ణ.
వెంటనే గిరిధారికి మాట దొరకలేదు. ఒక వెర్రి నవ్వు ప్రదర్శించి ఊరుకోబోయేటంతలో కృష్ణ అందుకున్నాడు.
"నే నెవరి నైనా సరే! ముఖం చూసి స్వభావం చెప్పేస్తా నంతే!"
"గోముఖవ్యాఘ్రాలూ , వయోముఖ విష కుంభాలూ -- ఇలాంటి మాటలు మీరు వినలేదా?"
ఈమారు కృష్ణ కన్నా ముందు అపర్ణ అందుకుంది.
"సరే, పోనివ్వండి! మిమ్మల్ని గురించి మేమింత త్వరగా ఒక నిర్ణయానికి వచ్చాం. మీరు మా గురించి నిదానంగా అంచనాలు వెయ్యండి! సరేనా?' అన్నదామె.
ఆమె ఆ విధంగా మాట్లాడటం గిరిధారి కానందాన్నిచ్చినా ఈమెతో మాటలు జాగ్రత్తగా తూచి వాడాలని తెలుసుకున్నాడు.
ఇందాక వాయిదా వేసిన వెర్రి నవ్వు ఇప్పుడు వాడక తప్పలేదతనికి.
"ఇప్పుడే వస్తాను" అంటూ లోనికి వెళ్ళిందామె.
"మీ నాన్నగారు పోయి ఎన్నాళ్ళు అయింది?"
"అయిదు సంవత్సరాలు.' తండ్రి చిత్రం వంక చూస్తూ అన్నాడు కృష్ణ.
"వ్యవసాయం పనులు మీరే చేయిస్తారా?"
"అవి చేయించడానికో సూపర్ వైజర్ ఉన్నాడు. నేనలా డైరెక్షన్స్ ఇస్తూ ఉంటానంతే! పంటల కాలంలో మాత్రం స్వయంగా కల్పించుకుంటాను. మిగిలిన కాలమంతా వాళ్ళ పై ఆధారపడి ఆ కాస్తలో అనుమానించినట్లు కనిపించటం మంచిది కాదంటుంది అపర్ణ!"
పేకముక్కలు పరిచినట్లు డిజైనున్న ట్రేలో మూడు కాఫీలు తెచ్చింది అపర్ణ. టేబుల్ పై పెట్టి అన్న కొకటి, అతని కొకటి స్వయంగా అందించింది.
"అవునండీ! మన శ్రద్దాసక్తులు మొదటి నుంచీ ఒక్క తీరుగా ఉంటె మనకూ, మనను బట్టి వాళ్ళకూ మర్యాద. ఒక ప్రత్యేకించిన సమయంలోనే మన జాగ్రత్తలు మనం కనపరిస్తే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు అంతకు ముందే పడతారు. ఏమంటారు?"
"తార్కికంగా మీరు చెప్పింది నిజమే! కాని వ్యాపారానికి బాగా వర్తిస్తుంది. వ్యవసాయం ఋతువుకు సంబంధించింది. ముందు కాలమేమో గాని ఇప్పటి వరకూ భూస్వాములు పంటల రోజుల్లో మాత్రమే జాగ్రత్త పడుతున్నారు."
.jpg)
మాట్లాడటాని కేమీ తోచనట్లు ఆమె తన గోళ్ళు పరిశీలించుకాసాగింది. కాలి బొటన వేలితో ఆమె నేలపై అర్ధ వృత్తాలు గీస్తుంటే కదిలే కుచ్చెళ్ల లో నాగుపాము మిలమిలలు స్పురించాయతనికి. ఈమెను చూస్తుంటే ఊరికే పాములు తలపు కోస్తున్నాయెందుకో!
ఇంతలో కాంతమ్మ గారు వచ్చి ట్రే, కప్పులూ తీసుకెళ్ళ బోతుంటే అపర్ణ అన్నది: "అదేమిటి , పిన్నీ రంగడు లేడూ?"
"బజారు కెళ్ళాడు."
"వచ్చాక తీస్తాడుగా!"
"ఎప్పటి కోస్తాడో ఏమో! అయినా ఇంతలో ఏమైందని?" అని సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళి పోయిందామే.
"మా పిన్ని పాతకాలపుది. అపర్ణకు అంతా సిస్టమేటిక్ గా ఉండాలి."
అపర్ణ అన్న వంక చూసి, 'ఇటువంటివి నేను సహించలేను. అందులో ఎవరైనా అతిదులున్నప్పుడు" అన్నది.
కాంతమ్మ గారు చిన్న వెండి ప్లేటులో వక్కపొడి తెచ్చింది. అది బల్ల మీద పెట్టి అపర్ణ కేసి తిరిగి "నీ దృష్టిలో ఇది నేరం కాదనుకుంటాను." అన్నది.
అపర్ణ ఆమెకేసి నవ్వుతూ చూసి 'నాకు నీవేది చేస్తే ఇష్టమో, ఏది చేస్తే అయిష్టమో నీకు బాగా తెలుసు, పిన్నీ! ఇంకేం చెప్పను?" అన్నది.
కాంతమ్మ గారి ముఖం క్షణకాలం రోషంతో మండిపోయింది. ఆ తరవాత తెచ్చి పెట్టుకున్న చిరునవ్వుతో గిరిధార వంక చూస్తూ , "ఏమి అనుకోకు, నాయనా! నేను పాత కాలపు దాన్ని! మా ఇంటి పని మేము చేసుకోవటం చిన్నతనంగా అనిపించదు నాకు! అపర్ణ నన్నిలా ఎప్పుడూ మండలిస్తూనే ఉంటుంది. మాకిది కొత్త కాదు" అన్నది.
"ఇందులో అనుకోవడాని కేముందండి!' అన్నాడతను. బయటి కలా అన్నాడే కాని అతనికీ వాతావరణం అస్తిమితంగానే ఉంది. సెలవు తీసుకుని వెళ్ళిపోవటాని కైనా సందర్భం మారాలి. ఆ అదను కోసం నిరీక్షిస్తున్నాడతను.
"పిన్నీ! కార్తీక మాసం పూర్తీ కావస్తోంది. వనభోజనాల మాటే మరిచి పోయాం మనం. మన తోటలో ఊరంతా పబ్బం గడుపుకుంటూ ఉంటె మనకా ముచ్చట తీరే రోజు మాత్రం వెనకడుగేస్తోంది."
"నిజమే. సరిగ్గా గుర్తు చేశావు? ఎప్పుడు వెళదామన్నయ్యా?"
"చెప్పనా! ఏం పిన్నీ, నా మాట ఖాయమేగా! అపర్ణా! చెప్పేస్తున్నాను. నేను చెప్పే రోజు కుదరకపోతే ఇంక నేను రానే రాను."
"చెప్పవయ్యా, స్వామీ!"
"వచ్చే ఆదివారం. ఒక్క స్నానాలూ, ఉదయం టీ వరకు మాత్రమే ఇంటి దగ్గర! తరవాత అంతా -- అంటే సాయంత్రం వరకూ తోటలోనే మకాం."
ఆడవాళ్ళిద్దరూ మాట్లాడలేదు.
