Previous Page Next Page 
ఆఖరి మజిలీ పేజి 6

 

    తెల్లవారు తుండగానే ఇంటి ముందు టాక్సీ ఆగేసరికి వీధిలోకి వెళ్ళింది ఇందిర.    
    పుల్ సూట్ లో ఉన్న ఆ వ్యక్తీ సూట్ కేసు చేత్తో పట్టుకుని లోపలికి వస్తూ "ఇందిరా! నేను రాజారావు ని" అన్నాడు.
    "ఓ రాజూ! నేను గుర్తు పట్టలేక పోయాను. రా! రా! ' అంటూ లోపలకు దారి తీసింది.
    సరాసరి పైకి తీసుకెళ్ళింది తండ్రి దగ్గరకు.
    మగతగా పడుకుని ఉన్న మాధనరావు గారు "మామయ్యా" అన్న పిలుపుతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశారు.
    రాజారావు అయన దగ్గరగా వెళ్ళి "మామయ్యా నేను -- రాజారావు ని" అన్నాడు.
    "రాజా! వచ్చావా! నా మాట మీద గౌరవం ఉంచి వచ్చావా నాయనా" అన్నారు నెమ్మదిగా.
    "మామయ్యా ! నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నీ మాట మీద కాక నాకేవరి మాట మీద గౌరవం ఉంటుంది."
    "రాజూ! పద! స్నానం చేద్దువు గాని" అంది ఇందిర.
    అప్పటికే ఇందిర కళ్ళు నీళ్ళతో నిండి పోయినయి.
    "మామయ్య పరిస్థితేమీ  బాగున్నట్టుగా లేదే" అన్నాడు రాజారావు ఇందిరను చూస్తూ.
    ఇందిర తల ఊపి కిందికి వెళ్ళిపోయింది. రాజారావు ఆమె ననుసరించాడు.
    తండ్రి పరిస్థితి ఏమీ బాగుండనందు వల్ల ఆ రోజు సెలవు పెట్టింది ఇందిర ఇందిర, నీరజ ఇద్దరూ చెరొక వైపూన కూర్చున్నారు.
    స్మృతి వస్తున్నప్పుడల్లా ఏదో అస్పష్టంగా మాట్లాడుతూ మళ్ళీ మగత లోకి జారిపోతున్నారు మాధవరావు గారు.
    రాజారావు కూడా దగ్గరే ఉన్నాడు. శేఖర్ కూడా అక్కడే ఉన్నాడు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆయనకు బాగా స్మృతి వచ్చింది రాజారావు ని దగ్గరకు పిలిచి పక్కలో కూర్చోబెట్టు కున్నారు స్వాధీన మున్న ఆ ఒక్క చేత్తో ఇందిర చెయ్యి తీసుకుని రాజారావు చేతిలో పెట్టబోయారు.
    జరగబోయేది ఊహిస్తూ ఇందిర గబుక్కున చెయ్యి లాగేసుకుంది. నీరజ చురుగ్గా ఇందిర కళ్ళలోకి చూసి గబుక్కున అవతలకు లాక్కుబోయింది.
    "ఇందూ! నీకేమైనా బుద్దుందా! ఈ సమయంలో కూడా నీకు పట్టుదలలేనా?" అంది కోపంగా.
    ఇందిర రెండు చేతుల్తో ముఖం కప్పుకుని భోరున ఏడవసాగింది. నెమ్మదిగా శేఖర్ వచ్చాడు వాళ్ళ దగ్గరకు.
    "ఇందిరగారూ! ఆయనకి వినపడుతూనే ఉంది. మీరిలా బాధపడుతుంటే ఈ సమయంలో అయన మనసెలా ఉంటుంది చెప్పండి."
    "ఇందూ! నా మాట విను. ఒక్క మాట -- పెళ్ళి చేసుకుంటాను -- అని అంటే అయన ఆత్మ శాంతి కలుగుతుంది. మొండిగా ప్రవర్తించకు. రా నే చెప్పిన మాట విను. బ్రతిమిలాడుతూ అంది నీరజ.
    ఇందిరా రండి ప్లీజ్! శేఖర్ కూడా అదే ధోరణి లో అనసాగాడు.
    "అసంభవం! నన్ను బలవంతం చెయ్యొద్దు దృడంగా అంది ఇందిర ఇంతలో రాజారావు ఇందిరా! రండి రండి" అని కేకలు పెట్టసాగాడు.
    అందరూ ఒక్క పరుగున మాధవరావు గారి దగ్గరకు వచ్చారు. ఇందిర ఆసలు నిలబడలేని దానిలా నీరజను ఆసరా చేసుకుని -- ఆమె రెండు భుజాలు గట్టిగా పట్టుకుని నిలబడింది.
    మాధవరావు గారు నెమ్మదిగా కళ్ళు తెరిచి నీరజ వంక ఆశగా చూశాడు. ఆయనకు మాట కూడా రావటం లేదు.
    నీరజ మనసు మంచులా కరిగిపోయింది. మరణ సమయంలో కూతురి నోటి నుంచి వెలువడే ఆ ఒక్క మాట కోసం అయన ప్రాణం శరీరాన్ని వదలకుండా వుంది. మినుకుమినుకుమనే ఆ దీపానికి నూనె ఏనాడో అయిపొయింది. కొడిగట్టబోతున్న ఆ దీపం -- కాస్త నూనె బొట్టు వేస్తె నిలబడుతుందేమోనన్న ఆశ నీరజ మనసులో లీలా మాత్రంగా మోలిచింది.
    "అంకుల్! ఇందిర పెళ్ళికి ఒప్పుకుంది. అంది దగ్గరగా వంగుతూ.
    మూసుకుపోతున్న ఆ కళ్ళు బలవంతంగా కొద్దిగా తెరుచుకున్నాయి. ఎండిపోయిన పెదవుల మీద చిరునవ్వు రావటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది.
    నెత్తి మీద పిడుగు పడిన దానిలా "లేదు డాడీ" లేదు! అసంభవం! నేను పెళ్ళి చేసుకోను. నేను పెళ్ళి చేసికొను" పిచ్చి పట్టినట్లు అరావసాగింది ఇందిర    నీరజ శేఖర్ ఇందిరను పొదివి పట్టుకున్నారు. ఆ స్థితిలో కూతుర్ని చూస్తూనే ఆ ముసలి ప్రాణం ఎగిరిపోయింది. తెరిచినా కళ్ళు తెరిచినట్టే ఉన్నాయి వాచ్చీ రాని నవ్వు పెదవుల మీద అట్లాగే ఉంది. శరీరాలతో ఏర్పరచుకున్న బాంధవ్యాలన్నీ వదిలించుకుని ఆత్మ పరమాత్మ లో కలిసిపోయింది.
    జరిగిందేమిటో తెలియక - తెలిసిన తర్వాత తట్టుకోలేక  - నీరజ , శేఖర్ చేతులలో ఒరిగిపోయింది ఇందిర.

                            *    *    *    *
    కాలప్రవాహం లో జరగవలసిన జరిగిపోగా పదిహేను రోజులు గడిచిపొయినాయి. రాజారావు స్వయంగా పూనుకుని మేనమామ కు దహన సంస్కారాలు జరిపించాడు. ఇందిర బొమ్మలా చూస్తుండటం తప్ప మాటా పలుకూ కూడా మర్చిపోయింది.
    శేఖర్ ప్రతిరోజూ వచ్చి ధైర్యం చెప్పి పోతున్నాడు. నీరజ సరేసరి ఒక్క క్షణం కూడా ఇందిరను వదలకుండా కనిపెట్టుకుని వుంది.
    ఆరోజు....
    ఇందిరను బయట చల్ల గాలిలోకి తీసుకొచ్చింది నీరజ.
    ఊరికి దూరంగా చిన్న కుటీరం లాంటి ఇల్లు. ఇంటి చుట్టూ ఎత్తయిన బలమైన గోడలు. లోపల అందమైన పూతోట-- రకరకాల పూలతో విరబూసిన ఆ తోటలో ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ఇంతలో రివ్వున గాలి వీచసాగింది. గేటు గాలికి టపటపకొట్టుకోసాగింది. చూస్తుండగానే చినుకులు పడసాగాయి. నీరజ గబగబా వెళ్ళి గేటు వేసి ఇందిరను తీసుకుని లోపలకు నడిచింది.
    ఉయ్యాలలో పాప ఏడవటం మొదలు పెట్టింది. ఇద్దరూ ఉయ్యాల దగ్గర కెళ్ళారు.
    "అమ్మా! వంటయిపోయింది. అన్నీ టేబుల్ మీద పెట్టాను. మా తమ్ముడికి జ్వరంగా ఉందిట. పోయి చూసి రేపు పొద్దునే వస్తాను" అని అడిగింది వంట మనిషి సుందరమ్మ.
    "వెళ్ళండి! కాని ఈ వానలో ఎట్లా పోతారు?" అంది ఇందిర. ఈ మాత్రపు దానికే మొక్క మొలుస్తానా? అయినా ఏం వాన? ఈ గాలికి వాన నిలబడుతుందా? వస్తానమ్మా?" సుందరమ్మ బయటకు వెళ్ళిపోయింది.
    "సుందరమ్మ గారూ! ఆగండి! గొడుగు తీసుకెళ్ళండి" "గొడుగు అందించి వచ్చింది. అప్పటికి నీరజ పాపకు పాలు పడుతున్నది. ఇందిర పాప దగ్గర కెళ్ళి చూస్తూ నిలబడ్డది. నీరజ కళ్ళు అశ్రువులు చిమ్మాయి.
    "ఇందూ! మా వారిని నువ్వు చూడలేదు కదూ"
    "లేదు" ఈ గొడవల్లో పడిపోయాం - చెప్పు! మీ వారెలా ఉంటారు -- అందంగా ఉంటారా ? తెలుపా, నలుపా " నవ్వుతూ అడిగింది ఇందిర.
    ఒక్క క్షణం ఆగి "అచ్చు ఈ పాప లాగే" అంది నిర్లిప్తంగా. నీరసంగా. ఇందిర ఉలిక్కి పడింది. ఒక్క ఉదుటన నీరజను పట్టుకుని.
    "అంటే----?" ఆశ్చర్యంగా అడిగింది.
    "ఇందూ! నా జీవితం నందన వనం లా ఉందనీ -- నేను సుఖ సంతోషాలతో హాయిగా ఉంటున్నాననీ నన్ను చూస్తె నీ కనిపిస్తున్నదా"
    ఇందిర ఆశ్చర్యంగా నీరజ కేసి చూసింది. నిజంగానే మట్టి బుర్ర తనది. తను గ్రహించనే లేదు. నీరజ -- అందానికి మారు పేరైన నీరజ నిపుణుడైన చిత్రకారుని చేతిలో వంపు సొంపులు నింపుకున్న అందమైన చిత్రంలా -- వసంతం లో వికసించిన తోలి పుష్పం లా - ఉండే నీరజ -- రుద్రాగ్ని జ్వాలలకు ఆహుతై పోయిన మన్మధుడు -- అందాలన్నీ తనతో తీసుకుపోగా , మిగిలిపోయిన నీర్జీవ కళేబరం లా వుంది.
    "అవును నీరూ! ఎందుకిలా అయిపోయావు? నీకళ్ళల్లో ఆ కాంతు లేమైనాయి-- ఈ గాజు కళ్ళల్లో ఆ విషాదమేమిటి?" బాధగా అడిగింది ఇందిర.
    "చెప్తాను విను. నీకు కాక ఎవరికి చెప్తాను ? ఎవరున్నారు నాకు?"
    నీరజ కళ్ళ ముందు కాలచక్రం వెనక్కు తిరిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS