ఆలోచిస్తుంటే సుజాతకి విన్న మొన్న ఇంకా తనీ ఇంటికి ఉద్యోగానికి వచ్చినట్టనిపిస్తూంది. ఈ రెండేళ్ళలో ఎన్ని జరిగాయి! ఆఖరికి ఈ రోజుతనమీద యీ ఇంటి బాధ్యతే తనమీద పడుతుందని ఎన్నడన్నా అనుకుందా? ఏవిటీ అనుబంధం?
ఆలోచిస్తుంటే గతం అంతా గుర్తు వచ్చి యీ వర్తమానం నమ్మ శక్యం కావడంలేదు సుజాతకి.
ఇక్కడికి రాకపోయుంటే తనెలా వుండేది? ఇప్పటికీ ఇంకా ఉద్యోగాలకి వెతుక్కుంటూ పెళ్ళికన్నా నోచుకోకుండా నిర్లిప్తంగా, భారంగా, నిస్సారంగా రోజులు వెళ్ళదీస్తూండేదేమో! ఇక్కడికి వచ్చాక తన జీవిత గమనమే మారిపోయింది.
గత జీవితాన్ని నెమరు వేసుకుంటూ అలా మంచంమీద పడుకుని కళ్ళు మూసుకుంది సుజాత.
2
ఆ రోజు ఆఫీసు మెట్లు దిగుతూ అప్రయత్నంగా సుజాత నిట్టూర్చింది. ఆ నాటితో ఉద్యోగం సరి అనుకుంటే సుజాత మనసు బాధపడింది. మళ్ళీ ఉద్యోగాల వేట మొదలు! తనకి ఎవరిస్తారు! ఎన్నాళ్ళ బట్టో ప్రయత్నిస్తే ఈ 'లీవు వేకెన్సీ' ఉద్యోగం దొరికింది అదృష్టంవల్ల. ఈ ఉద్యోగం ధర్మమా అని ఈ నాలుగు నెలలు కాలక్షేపం అయిపోయింది హాయిగా.
ఇంక మళ్ళీ ఇంట్లో తిని కూర్చోవడం కాలక్షేపం లేక కొట్టుకోవడం, తనకోసం, తన పెళ్ళి కోసం తల్లిదండ్రులు పడే ఆరాటం, అవస్థలు అన్నీ చూస్తూ తనూ వాళ్ళతోపాటు ఆవేదన పడడం అన్నీ మొదలు ఇటు చదువో, ఉద్యోగమో, అటు పెళ్ళి సంసారమన్నా లేకుండా ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ ఓ ఇరవై మూడేళ్ళ ఆడపిల్ల కూర్చోడం అంటే ఎంత బాధ అనుభవిస్తేగానీ తెలియదు. రోజల్లా ఇంట్లో కూర్చుని కూర్చుని పిచ్చెత్తినట్లుంటుంది. అలా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి. భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంది. తలుచుకోడానికే భయంగా వుంటుంది. ఇలా ఎన్నాళ్ళు అన్న దిగులు ఆవరిస్తుంది.
ఈ రోజుల్లో బి.ఏ. ప్యాసయినా ఉద్యోగం దొరకడం యెంత గగనమవుతూంది! తనలాంటి బి.ఏలు లక్షమంది ఉన్నారు! ఏ సిఫార్సులు లేకుండా, లంచాలు పెట్టలేని తనలాంటివారికి ఉద్యోగం దొరకడం సుళువుకాదని గత రెండుమూడేళ్ళుగా అనుభవం చెప్పింది.
ఉద్యోగంలాగే తనలాంటి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావడమూ గగన కుసుమం అని యిప్పుడిప్పుడు బాగా అర్ధం అవుతూంది. పెద్ద అప్సరస కాకపోయినా, ఏ వంకా పెట్ట వీలు లేకపోయినా గత మూడు నాలుగేళ్ళుగా యెంత ప్రయత్నించినా పెళ్ళి కుదరలేదంటే, తనకి పెళ్ళికి కావల్సిన అర్హత యేదో లేదన్నమాట! ఆ యేదో ముందుగా తెలియకపోయినా మూడు నాలుగు సంబంధాలు తిరిగి వెళ్ళాక తల్లి తండ్రులకే కాక తనకీ అర్ధం అయింది. ఆ అర్హత వుండాల్సింది తనకి కాదు. తండ్రికి లేదు. అదీ వచ్చిన చిక్కు. ఆ అర్హత యెప్పుడో వస్తుందనేది కూడా అబద్దం! అంచేత యిప్పుడు కాదు మరో యిన్నాళ్ళు గడిచినా తనకి పెళ్ళి అవుతుందన్న ఆశ తనకీ, తల్లిదండ్రులకీ కూడా అడుగంటుతూంది!
భారంగా, దిగులుగా నడుస్తూ యిల్లు చేరింది సుజాత. జీతం తల్లిచేతిలో పెట్టి "అయిపోయింది, నా భోగం యివాళతో, నా ఆర్ధన యిదిగో" అంది పేలవంగా నవ్వుతూ.
కామాక్షమ్మ దిగులుగా కూతురివంక చూసింది, "మరోసారి ఆఫీసరుగారిని నెమ్మదిగా అడగకపోయావటే ఉద్యోగంలో వుంచమని వాళ్ళు తలుచుకుంటే నీకు ఉద్యోగమే యీయలేరా యేమిటి?" అంది అమాయకంగా.
సుజాత శుష్కహాసం చేసింది. "అలా యెవరికి పడితే వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళుమాత్రం యెలా యిస్తారమ్మా - పోస్టులేకపోతే వాళ్ళేం చేస్తారు?"
కామాక్షమ్మ నిట్టూర్చింది. "ఆడపిల్లవు. పెళ్ళిచేసి పంపలేక పోయినందుకు, యేదో ఉద్యోగం చేసుకుంటూ దాని బ్రతుకు అది బ్రతుకుంది అనుకుంటే ఆ ఆశాలేకుండా పోయింది. ఏమిటో రోజులు యిలా వున్నాయి" గొణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ.
సుజాత నెమ్మదిగా బట్టలు మార్చుకుని పక్కమీద పడుకుని ఆరోజు పేపరు తెరిచింది. పేపర్లో ముందు వాంటెడ్ కాలమ్స్ చూడడం సుజాతకి అలవాటే వాంటెడ్ కాలమ్స్ చూడడం తనకు నప్పే ఉద్యోగాలు యేమన్నావుంటే, వస్తుందన్న ఆశతో అప్లికేషన్లు పెట్టడం, పెట్టిన దగ్గిరనించి కనీసం ఇంటర్వ్యూకి అన్నా పిలుపురాదా అని ఆశగా యెదురు చూడడం, రోజులు గడిచిపోతూంటే నిరాశతో ఆశ వదిలేసుకోవడం - అలా అలవాటయిపోయింది సుజాతకు.
ఆరోజు అలా చూస్తుంటే ఒక ప్రకటన సుజాతని చటుక్కున ఆకర్షించింది. "-కావలెను. హైద్రాబాదులో ఓ లేడీ డాక్టరు దగ్గిర హౌస్ కీపర్, కమ్ ట్యూటర్ గా పనిచేయుటకు డిగ్రీవున్న అవివాహిత యువతి వెంటనే కావలెను. ఉచిత వసతి, బోజన సౌకర్యం, జీతం రెండొందలు యీయబడును. అర్హత గలవారు వెంటనే ఫోటోతో సహా దరఖాస్తు పెట్టవలెను."
ఆ ప్రకటన చదువుతూనే వుత్సాహంగా మంచంమీదనించి లేచి మరోసారి ఆరాటంగా చదివింది సుజాత. ఆ ప్రకటన సుజాతలో ఉత్సాహాన్ని ఉత్సుకతని రేపింది.
హౌస్ కీపర్, కమ్ ట్యూటర్ ఉద్యోగం! ఇదేదో క్రొత్తగావుంది మన దేశంలో యిలాంటి హౌస్ కీపర్లని యెవరు పెట్టుకుంటారు? బహుశా ఆవిడ డాక్టరుగనక ఇల్లు, వాకిలి చూసుకునే తీరికలేదు గాబోలు! పిల్లలున్నారు గాబోలు, ట్యూటర్ గా కూడా వుండాలన్నారు! నిజంగా ఈ ఉద్యోగం వస్తే యెంత బాగుంటుంది? హాయిగా యింటిపట్టున కూర్చునే ఉద్యోగం! రెండొందల జీతం! అదీ తిండి ఖర్చు అన్నీ వాళ్ళు భరించి?! ముందు అప్లికేషన్ వెంటనే పెట్టేయాలి! వచ్చేది మానేది తన అదృష్టం! తన ప్రయత్నం తను చెయ్యాలి.
