Previous Page Next Page 
అగ్ని పరీక్ష పేజి 6


    ఆ మరోసారి తరువాత ఎప్పుడూ తటస్థపడలేదు. ఎప్పుడన్నా ఏ వరండాలోనో మెట్లు మీదో ఎదురుపడితే రాజేష్ "హలోసార్" అనేవాడు. "ఓ,గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అంటూ మాటలు పెంచకుండా వెళ్ళిపోయేవాడు అతను. అలాంటి అతనితో స్నేహం ఎలా పెంచుకోవాలో అర్ధంకాక రాజేష్ కూడా మరి ప్రయత్నించలేదు. అతన్ని చూసి సీరియస్ టైపు మనిషని కలుపుకోలుతనం అతనికి లేదని అన్పించింది రాజేష్ చామన ఛాయ రంగులో, ఐదడుగుల పదంగుళాల ఎత్తు, ఎత్తుకి తగినలావు లేకుండా సన్నంగా కోల మొహం గుంటల కళ్ళు - లావు పెదాలు చూడగానే యింప్రసివ్ గా లేని అతన్ని చూసి అతని కంత టెక్కయినాకేమిటి మాట్లాడటానికి అన్పించి రాజేష్ కూడా పెద్దగా తరువాత అతనితో పరిచయం పెంచుకోలేదు.
    ఇన్నాళ్ళ తరువాత ఆ యింటికి యిల్లాలు వచ్చాక కళ వచ్చింది అనుకున్నాడు. ఇంత అందమైన భార్యవున్న అతని అదృష్టాన్ని మనసులో మెచ్చుకున్నాడు భార్య వచ్చినా కూడా అతను పెద్దగా బయట కన్పించేవాడుకాదు. ఆమె పాలవాడు వచ్చినప్పుడు, ఏ సంచో పట్టుకుని కూరలు కాబోలు కిందకి వెళ్ళినపుడు ఒకటి రెండుసార్లు కన్పించింది ఒకటి రెండు సార్లు అలా కన్పించాక మూడోసారి ఆమె మెట్లమీద కూరలు సంచితో కనపడినపుడు నేను మీ పక్కనుంటున్నా సుమా అన్నట్టు పలకరింపుగా నవ్వాడు రాజేష్ ఆమె కూడా రాజేష్ ని చూసి గుర్తించినట్టుగా కనిపించి కనిపించనట్టు మందహాసం చేసేది. అంతే, అంతకు మించిన పరిచయం ఆమెతోలేదు. ఆ కుటుంబంతో ఏమాత్రం పరిచయం లేకపోయినా గత రెండేళ్ళలో ఆ దంపతుల గురించి ఎంతో తెలిసినట్లనిపించింది రాజేష్ కి. రాజేష్ బెడ్ రూమ్ వాళ్ళ బెడ్ రూమ్ కామన్ గోడ బెడ్ రూముకి వున్న బాల్కనీలో నిల్చుంటే వాళ్ళ బెడ్ రూము బాల్కనీ కనిపిస్తుంది. మాటలు గట్టిగా మాట్లాడితే వినిపిస్తాయి. చాలా రాత్రులు భార్యాభర్తలు మాటలు గట్టిగా వినిపించేవి విషయం ఏమిటో స్పష్టంగా తెలియక పోయినా ఏదో ఘర్షణ పడ్తున్నారని ఎవరికన్నా తడ్తుంది. అతని గొంతు కఠినంగా, కర్కశంగా వుండేది. ఆమె ఎవరన్నా వింటారన్న భయంతోనేమో గొంతునొక్కుకుని మాట్లాడినా, మాటలు పదునుగా జవాబిస్తున్నట్లే అన్పించేది. ఒక్కోరోజు ఆమె గొంతుకాస్త గట్టిగానే వినిపించేది. ఏదో వాదన, ఘర్షణ సర్వసాధారణంగా వినిపించేవి కాని భార్యా భర్తలు యిద్దరూ కలిసి మెహతా వాళ్ళలా సరదాగా కల్సి తిరగడమూ కనపడలేదు రాజేష్ కి. ఒక రోజు ఎండాకాలం రాత్రి పదకొండు గంటలవేళ గదిలో వేడి భరించలేక నిద్ర పట్టక బాల్కనీలో కింద పరుపేసుకుని పడుకున్నాడు. గాలికూడా స్థంభించినట్లు అంతటా నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలోంచి పక్కింటి ఆమె బాధ అవమానం కోపం, దుఃఖం అన్నీ కలపోసిన గొంతుతో. "మీకీ అనుమాన రోగం తగ్గేవరకు మీరు సుఖపడలేరు నన్ను సుఖపడనీయరు ఛా.....రోజు రోజుకి మీతో బ్రతుకు నరకం అవుతూంది. ఎంత పాపంచేసుకుని మిమ్మల్ని కట్టుకున్నానో ఒక్క రోజు ప్రాణానికి సుఖంలేదు. పెళ్ళి రోజునించి కాల్చుకు తింటున్నారు. ఇంక యిదంతా భరించే ఓర్మి నాకు లేదు. ఏదో రోజు చావనైనా చస్తాను. ఇంట్లోంచి లేచన్నా పోతాను అంటూంది మాటలు స్పష్టంగా విన్పించి కుతూహలంగా లేచి కూర్చున్నాడు రాజేష్.
    "పో.......యిప్పుడే ఫో, ఎవడితో లేచిపోతావో ఫో కటువుగా అన్నాడు.
    అంతే మీలాంటి మొగుళ్ళున్న ఆడవాళ్ళు యింకెవడితోనో లేచిపోక ఏంచేస్తారు. అదీ చేతకాని పిరికి వాళ్ళు చస్తారు." కసిగా అంది ఆమె.
    "నీవు యింతకీ ఏం చెయ్యదలచావు - చస్తావా లేచిపోతావా?" హేళనగా ఎత్తిపొడిచాడు.
    "చద్దును, నా కళ్ళకి బంధంలా యీ పిల్ల పుట్టి వుండకపోతే ఈ కొంపలోంచి ఎప్పుడో పోదును."
    "దాన్ని తీసుకుఫో." ఏం ఆ రెండో మొగుడు పిల్లలని తేవద్దన్నాడా." హేళనగా కసిగా ఎత్తిపొడిచాడు.
    "ఛ....మీలాంటి వారితో మాట్లాడడం నాతప్పు మీలాంటి హీనులు సంస్కారహీనులతో మాటలేమిటి చెళ్ళున కొట్టినట్లు శబ్దం. నోర్ముయ్ ఊరుకుంటున్నాననా ఇష్టం వచ్చినట్లు పేలుతున్నావు. నోరు మూసుకుని పడివుండు లేదంటే ఈ క్షణమే ఇంట్లోంచిఫో.
    "మీ బెదిరింపులు ఆపండి ఫో.....అంటే పోయి రా అంటే రాడానికి నేనేం కుక్కని కాను మర్యాదగా మాట్లాడండి. "ఏడుస్తూ అరచింది ఆమె.
    "మర్యాద.....హా.....హా నీలాంటి దానికి మర్యాద" అతని విషపు నవ్వు.
    "ఛా....మీతో మాటలేమిటి-" ఆమె తిరస్కారంగా అంది ఆ తరువాత మాటలు వినపడలేదు. వింటున్న రాజేష్ ఏమిటి వీళ్ళిద్దరి మధ్య గొడవ లెందుకు వచ్చాయో. యీ మొద్దు వెధవ అనుమానంతో ఆమె హింసిస్తున్నాడు గాబోలు అందుకే ఆమె అంత విరక్తిగా మాట్లాడుతూంది. స్టుపిడ్ ఫెలో యింత అందమైన భార్యని వుంచుకొని, జీవితం ఎందుకిలా నరకం చేసుకుంటున్నాడు. తనకే అంత అందమైన భార్య వుంటే పూవుల్ల్లో పెట్టి ఆరాధించేవాడు పాపం ఆ యిల్లాలు ఏం చేస్తుంది భర్తపెట్టె హింస భరించలేక, కట్టుకున్న వాడిని వదిలిపోలేక, వుండలేక అవస్థపడుతున్నట్టుంది. ఎంత మోడర్న్ అయినా ఒక పిల్ల పుట్టాక భర్త వదిలిపోవడం ఈ దేశంలో ఆడదానికి కష్టమే సహించి వుందని యింత జులుము చలాయిస్తున్నట్టున్నాడు వెధవ.....వెధవ మొహంవీడూనూ-ఓనమాలు లేదు. సౌమ్యతాలేదు. ఆమొహంలో -మొహం సరే మనసూ వక్రంగా వుంది గాడిదకి. రాజేష్ కి ఆ క్షణంలో రావు అంటే అసహ్యం ఆమె అందాలి, సానుభూతి పుట్టుకొచ్చాయి. తరువాత ఆమె ఎదుట పడినప్పుడు అభిమానంగా చూసేవాడు ఎప్పుడూ వాడిన మొహంతో బతకక తప్పధన్నట్టుగా నిర్లిప్తంగా కనిపించే ఆ మొహంలో దైన్యం అతని గుండె తాకేది కాని కనీసం మాటలాడి పరిచయం పెంచుకుని సానుభూతి చూపే సాహసం కూడా చెయ్యలేకపోయాడు యిన్నాళ్ళూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS