దొరలు నానంద బాష్పాలొ - పొరలు దుఃఖ
బాష్పములొ గాని యవి గుర్తుపట్టలేము;
రాలుచున్నవి ఆమె నేత్రాలనుండి
బాలకుని ముద్దు చెక్కుటద్దాల మీద!
పొత్తులలోని బిడ్డనికి పుట్టియు పుట్టకముందె యెవ్వరో
క్రొత్తవి వజ్రపుం గవచకుండలముల్ గయిసేసినారు! మేల్
పుత్తడి తమ్మిమొగ్గ జిగిబుగ్గల ముద్దులు మూటగట్టు నీ
నెత్తురుకందు నెత్తుకొని నెచ్చెలి యెచ్చటి కేగుచున్నదో!
గాలితాకున జలతారు మేలిముసుగు
జాఱె నొక్కింత - అదిగో! చిన్నారిమోము!
పోల్చుకొన్నాములే! కుంతిభోజ పుత్త్రి
స్నిగ్ధ సుకుమారి ఆమె కుంతీకుమారి !!
కడువేగమ్మున చెంగుచెంగున తరంగాల్ పొంగ ఆ తోట వెం
బడి గంగానది పాఱుచున్నయది బ్రహ్మాండమ్ముగా - అల్లదే
బుడుతన్ చేతులలోన బట్టుకొని యా పూబోడియుంగూడ ని
య్యెడకే వచ్చుచునుండె గద్గదికతో నేమేమొ వాపోవుచున్!
"ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబోమున్ముందు మార్తాండు ర
మ్మని నే కోరగనేల? కోరితినిబో ఆతండు రానేల? వ
చ్చెనుబో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగానేల? ప
ట్టెనుబో పట్టి నొసంగనేల? అడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్.
ఏయెడ దాచుకొందు నిపు డీ కసిగందును? కన్నతండ్రి "చీ
చీ" యనకుండునే? పరిహసింపరె బంధువు? లాత్మగౌరవ
శ్రీ యిక దక్కునే? జనులు చేతులు చూపరె? దైవయోగమున్
ద్రోయగరాదు - ఈ శిశువుతో నొడిగట్టితి లోకనిందకున్.
ఈ విషాదాశ్రువులతోడ నింక నెంత
కాల మీ మేను మోతు? గంగాభవాని
కలుషహారిణి - ఈ తల్లి కడుపులోన
కలసిపోయెద నా కన్నకడుపుతోడ."
అనుచు పసివాని రొమ్ములో నదుముకొనుచు
కుంతి దిగినది నదిలోన - అంతలోన
పెట్టె కాబోలు పవన కంపిత తరంగ
మాలికా డోలికల తేలితేలి వచ్చు!
మందసము రాక గనెనేమొ - ముందు కిడిన
యడుగు వెనుకకు బెట్టి దుఃఖాశ్రుపూర్ణ
నాయనములలోన ఆశాకణాలు మెఱయ
ఆ దెసకె చూచు నామె కన్నార్పకుండ.
దూరదూరాల ప్రాణబంధువు విధాన
అంతకంతకు తనకు దాపగుచునున్న
పెట్టె పొడవును తన ముద్దుపట్టి పొడవు
చూచి తలయూచు మదినేమి తోచినదియొ?
ఆత్మహత్యయు శిశుహత్యా యనక గంగ
పాలు గానున్న యీ దీనురాలిమీద
భువనబంధునకే జాలి పుట్టెనేమొ!
పెట్టె నంపించి తెరువు చూపెట్టినాడు.
"ఇట్టులున్నది కాబోలు నీశ్వరేచ్చ"
యనుచు విభ్రాంతిమై దిక్కు లరసికొనుచు
సగము తడిసిన కోకతో మగువ, పెట్టె
దరికి జని మెల్లమెల్లగా దరికి తెచ్చి -
ఒత్తుగా పూలగుత్తుల నెత్తు పెట్టి -
పైచెఱగు చింపి మెత్తగా ప్రక్కపఱచి -
క్రొత్త నెత్తలిరాకుల గూర్చి పేర్చి -
ఒత్తుకొనకుండ చేతితో నొత్తిచూచి -
ఎట్టకేలకు దడదడ కొట్టుకొనెడి
గుండె బిగబట్టుకొని కళ్ళనిండ జూచి -
బాష్పముల సాము తడిసిన ప్రక్కమీద
చిట్టిబాబును బజ్జుండబెట్టె తల్లి.
చిన్ని పెదవుల ముత్యాలు చిందిపడగ
కలకలమటంచు నవ్వునేగాని, కన్న
యమ్మ కష్టము - తన యదృష్టమ్ముకూడ
నెఱుగ డింతయు నా యమాయికపు బిడ్డ.
చెదరు హృదయము రాయిచేసికొని పెట్టె
నలలలో త్రోయబోవును -వలపు నిలుప
లేక - చెయిరాక - సుతు కౌగలించి వెక్కి
వెక్కి యేడ్చును - కన్నీరు గ్రుక్కుకొనును.
"భోగభాగ్యాలతో తులతూగుచున్న
కుంతిభోజుని గారాబు కూతురునయి
కన్న నలుసుకు ఒక పట్టెడన్నమైన
పెట్టుకో నోచనైతి పాపిష్టిదాన.
నన్నతి పేర్మిమై గనెడి నా తల్లిదండ్రుల ప్రేమ యర్ధమౌ
చున్నది; నేడు బిడ్డ నిట నొంటరిగా విడిపోవ కాళ్ళు రా
కున్నవి; యేమి సేతు; కనియున్ గనలేని యభాగ్యురాల నే
నన్నివిధాల - కన్న కడుపన్నది కాంతలకింత తీపియే!
పెట్టియలోన నొత్తిగిలబెట్టి నినున్ నడిగంగలోనికిన్
నెట్టుచునుంటి తండ్రి! యిక నీకును నాకు ఋణంబుదీరె, మీ
దెట్టుల నున్నదో మన యదృష్టము! ఘోరము చేసినాను నా
పుట్టుక మాసిపోను! నినుబోలిన రత్నము నాకు దక్కునే !
పున్నమ చందమామ సరిపోయెడి నీ వరహాల మోము నే
నెన్నటికైన చూతునె! మఱే! దురదృష్టము గప్పికొన్న నా
కన్నుల కంతభాగ్యమును కల్గునె? ఏ యమయైన ఇంత నీ
కన్నము పెట్టి ఆయువిడినప్పటి మాటగదోయి నాయనా!
పాలబుగ్గల చిక్కదనాల తండ్రి !
వాలుగన్నుల చక్కదనాల తండ్రి!
మేలి నీలి ముంగురుల వరాల తండ్రి!
కాలుచెయి రాని తండ్రి! నా కన్నతండ్రి!
కన్నతండ్రి నవ్వుల పూలు గంపెడేసి -
చిన్నినాన్నకు కనులు చేరెడేసి -
చక్కనయ్యకు నెరికురుల్ జానెడేసి -
చిట్టిబాబు మై నిగనిగల్ పెట్టెడేసి -
బాలభానుని బోలు నా బాలు నీదు
గర్భమున నుంచుచుంటి గంగాభవాని!
వీనినే తల్లిచేతిలో నైన బెట్టి
మాట మన్నింపుమమ్మ! నమస్సులమ్మ!"
దిక్కులను జూచి భూదేవి దిక్కుచూచి
గంగదేస చూచి బిడ్డ మొగమ్ము చూచి -
సజల నయనాలతో ఒక్కసారి "కలువ
కంటి" తలయెత్తి బాలభాస్కరుని చూచె -
మరులు రేకెత్త బిడ్డను మరల మరల
నెత్తుకొనుచు పాలిండ్లపై నొత్తుకొనుచు
బుజ్జగింపుల మమకార ముజ్జగించి
పెట్టెలోపల నుంచి జోకొట్టె తల్లి.
ఆతపత్రమ్ము భంగి కంజాతపత్ర
మొండు బంగారుతండ్రిపై నెండ తగుల
కుండ సంధించి, ఆకులోనుండి ముద్దు
మూతిపై కట్టకడపటి ముద్దునుంచి.
"నన్ను విడిపోవుచుండె మా నాన్న" యనుచు
కరుణ గద్గద కంఠియై కంపమాన
హస్తములతోడ కాంక్ష లల్లాడ, కనులు
మూసికొని నీటిలోనికి ద్రోసె పెట్టె.
ఏటి కెరటాలలో పెట్టె యేగుచుండ
గట్టుపై నిల్చి అట్టె నిర్ఘాంతపోయి
నిశ్చల నిరీహ నీరస నిర్నిమేష
లోచనమ్ములతో కుంతి చూచుచుండె.
రాట్నసుందరి
రాటము మేళవించి, అనురాగము రాగము మాతృభూమిపై
పాటయి మ్రోగ నూల్ వడకు పావన భారత భాగ్యలక్ష్మి! నీ
పాటల పాణిపద్మములు భవ్యములయ్యెను - వేలు లక్షలున్
గోటులు నూరుకోట్లు గయికొమ్మివె ముద్దులబావ దీవనల్.
పసుపుంబూతల లేతపాదములకున్ బారాణి గీలించి, నె
న్నొసటం గుంకుమ దిద్ది, కజ్జలము కన్నుందోయి గైసేసి, క్రొం
గుసుమంబుల్ తలదాల్చి, రాట్నముకడన్ గూర్చున్న నీ మూర్తిలో
ప్రసరించెన్ జయభారతీ మధురశోభా భాగ్య సౌభాగ్యముల్!
పండెను దేవి! నా వలపుపంటలు; పింజలు పింజలైన యీ
గుండెయె యేకుగా వడకుకొంటివి; నా బ్రతుకెల్ల దారమై
కండెలుగట్టె నీదు చరఖాపయి; నే నొక చే రుమాలనై
యుండెద మెత్తగా పెదవు లొత్తుచు నీ వరహాలచేతిలో.
