Previous Page Next Page 
చీకటి తొలగిన రాత్రి పేజి 6


    సముద్ర దగ్గిరకి రాగానే పిల్లలని ఇద్దరు బెస్తవాళ్ళకి అప్పచెప్పాం జాగ్రత్తగా స్నానం చేయించమని చూడమని, రామావతారం శాంతీ, ఇసుకలో కూర్చున్నారు. బీచి వడ్డంతా విదేశీ స్త్రీ, పురుషులతో నిండివుంది. కొంతమంది యీత కొడ్తున్నారు... స్విమ్మింగ్ అయి అలసిపోయి కొందరు, ఇసుకలో పడుకునిన సూర్యరశ్మితడి శరీరాలకి యింకించుకుంటున్నారు..... పిల్లలు ఒడ్డున గెంతుతూ ఆడుకుంటున్నారు. మరి కొంత మంది నీటిలో బంతి ఆట ఆడుతున్నారు. ఇద్దరిద్దరు బెస్తవాళ్ళు యీత రానివాళ్ళను చెరోచెయ్యి పుచ్చుకుని దూరంగా సముద్రంలోముంచి పైకి లాగుతున్నారు...
    ఎప్పుడూ నిండుగా వుండే పూరీ సముద్రపు ఒడ్డున అందంగా తీర్చిదిద్దడానికి  ప్రభుత్వం ఎందుకు పూనుకోదో నాకర్ధంకాదు. ఎంతోమంది విదేశీయులువచ్చి వచ్చిపోయే ఆ బీచి ఒడ్డున సరిఅయిన ఏర్పాటులు ఏమీలేవు. బట్టలు మార్చుకోడానికి, మరీఎండగా వున్నప్పుడు కూర్చోడానికి నీడవున్న ప్రదేశాలు, అలసి సొలసినవారికి చల్లని పానీయాలు లభ్యమయ్యే కాంటీన్ ఏర్పాటులు, విద్యుచ్చక్తి వగైరా సదుపాయాలెందుకు చేయరో? అక్కడక్కడ యీతచాపలు దడిలా కట్టారు బట్టలు మార్చుకోడానికి, నీడ కోసం, అవి చూసి విదేశీయులు ఎంత నవ్వుకుంటారోనన్న బాధన్నా లేదు మన ప్రభుత్వానికి! ఏ సదుపాయాలు లేకపోయినా పూరీ సముద్రం ప్రసిద్దిగాంచడానికి కారణం ఒక్కటే కనిపిస్తోంది నాకు. ఈస్టరన్ ఇండియాలో అంటే బీహార్, బెంగాలు, అస్సాం, వగైరా రాష్ట్రాలకంతటికీ దగ్గరగా సముద్రతీరం ఒరిస్సాలో పూరీలోనే వుండడంచేత, సముద్రం అంటే వెర్రెత్తిపోయే విదేశీయులందరూ సెలవలకి పూరీయే వస్తుంటారు. కలకత్తానుంచి ప్లేనులో భువనేశ్వర్ వచ్చి అక్కడనించి కారుల్లో వీకెండ్ కి పూరీ వెళ్ళే ఎందరో విదేశీయులను చూశాను. అందుకే భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో ఎందరెందరో విదేశీయులు కనిపిస్తారు. పూరి బీచ్ ని అందంగా తీర్చిదిద్ది ఇంకొన్ని వసతులు కల్పిస్తే ఇంకా అనేకమంది విదేశీయులని ఆకర్షిస్తుందనడానికి సందేహంలేదు.
    మీనాక్షినేను స్విమ్మింగ్ కి బయలుదేరాం.. మీనాక్షి ఏమాత్రం సంకోచం లేకుండా నెగిలిజీ విడిచేసి నీళ్ళవైపు పరిగెత్తింది. కాని మీనాక్షి ముందు వుత్త స్విమ్మింగ్ సూట్ తో నిల్చోవాలంటే నాకెందుకో సిగ్గని పించింది!
    శాంతి మాట్లాడకపోయినా ఆమె కళ్ళు నన్ను, మీనాక్షిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. శాంతి ముఖం అదోలా అయిందనిపించింది. మీనాక్షిని అడ్రస్ లోచూసి రామావతారానికి ఇదంతా అలవాటే గనుక ఏభావమూ కనపడలేదు అతనిలో...
    "డోంట్ గో టూ ఫార్ మీనా! "పరిగెడ్తున్న మీనాక్షి వెనుక కేకవేశాడు రామావతారం.
    "ఇట్సాల్ రైట్.. సిల్లీ.. మరీ చాదస్తం" అంది నవ్వుతూ నాతో.
    పేరుకి తగ్గట్టు చాపపిల్లలా చురుకుగా యీదుకుంటూ వెళ్ళిపోతుంది మీనాక్షి. చిన్నప్పుడు బాగా అలవాటున్నా ప్రస్తుతం అలవాటుపోయి మీనాక్షిని అందుకోలేకపోతున్నాను. ఓ అరగంట యీది నీళ్ళల్లో వెలకిలా పడుకునిన తేలసాగింది మీనాక్షి కాళ్ళు చేతులు ఆడిస్తూ....
    ఆ ఒడ్డునుంచి ఎంతదూరం వచ్చామో తెలియదు. అలసట అనిపించింది. కొన్ని గజాలదూరం యీదుకుంటూ వెడితే ఒడ్డు కనిపించేట్టుంది. మీనాక్షితో ఆ మాటే చెప్పాను. అనుకున్నట్టుగానే కొంతదూరం యీదేసరికి ఒడ్డు వచ్చింది. యీ ఒడ్డు అంతా నిర్మానుష్యంగా వుంది. బెస్తవాళ్ళ విరిగిపోయిన పడవలు, చిరిగినా వలలు మాత్రం వున్నాయి.
    ఆయాసంతో ఇద్దరం ఇసకలో వాలిపోయాం.
    "అబ్బ బావా! చాలాదూరం వచ్చేసినట్లున్నాంగదూ" అంది మీనాక్షి.
    "ఊ" అన్నాను మాట్లాడలేక, ఓ ఐదునిమిషాలు వుంటేగాని మాట్లాడలేకపోయాను. తరువాత కళ్ళువిప్పి చూశాను. మీనాక్షి తలక్రింద చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకుని పడుకుంది. తడిసిన ఆకుపచ్చ బికినీ ఆమె వంపుసొంపులని స్పష్టంగా చూపెడుతోంది. తెల్లగా నున్నగా మెరుస్తుంది శరీరం, ఆమె వంటిమీద నీటిబిందువులు ఎండకి తళతళ మెరుస్తున్నాయి. అలా మీనాక్షిని చూస్తోంటే ఎందుకో నా శరీరం చిన్నగా కంపించింది. ఆ క్షణంలో నామనసులో ఏ భావం వుందో చెప్పగలిగే మాటలేదు. తదేకంగా చూస్తున్న నేను హఠాత్తుగా మీనాక్షి కళ్ళు తెరవడంతో పట్టుబడ్డ దొంగలా తడబడి చూపు మరల్చుకున్నాను.
    "బావా?" అంది మీనాక్షి నా కళ్ళలోకి చూస్తూ, నేను అప్పుడే మీనాక్షిని చూస్తున్నట్టు అటు తిరిగాను...
    "అబ్బ! ఎన్ని ముత్యాలో" అన్నాను నవ్వుతూ.
    "ఏవి ఎక్కడ?...." హడావిడిగా ప్రక్కకి తిరిగి మోచెయ్యిమీద ఆనుకుని లేచింది మీనాక్షి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS